Skip to main content

జాతీయ స్థాయిలో `పీహెచ్‌డీ` చేసేందుకు మార్గాలు...

దేశంలో పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతోంది. సబ్జెక్టు ఏదైనా.. పీహెచ్‌డీ పూర్తిచేస్తే.. హాట్ కేకన్నమాటే! పరిశోధన ఔత్సాహిక అభ్యర్థులకు అవకాశాలు కూడా అనేకం.
ఇటీవల కాలంలో ఆర్థికంగానూ ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు! అందుకే పీహెచ్‌డీ చేయాలని.. డాక్టరేట్ పట్టా అందుకోవాలని.. సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలనే ఉత్సాహం యువతలో పెరుగుతోంది!! అందుకుతగ్గట్టే పీహెచ్‌డీ విద్యార్థులకు ఇచ్చే జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లను ప్రభుత్వం పెంచింది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పీహెచ్‌డీ చేసేందుకు మార్గాలు.. అవసరమైన అర్హతలు.. పెరుగుతున్న ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం...

దేశం.. అభివృద్ధి పథంలో పయనించాలంటే.. సొంత పరిశోధనలు, ఆవిష్కరణలే ప్రధానం. కోర్ సెన్సైస్, టెక్నాలజీ, అగ్రికల్చర్ మొదలు.. సోషల్ సెన్సైస్ వరకు నాణ్యమైన పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలతో.. అనేక సామాజిక, ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవచ్చు. పరిశోధనలకు ఇప్పుడు ఎన్నో మార్గాలు యువతకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో దేశంలో రీసెర్చ్ ఎకో సిస్టమ్(పరిశోధనలకు అనుకూల వాతావరణం) పెరుగుతోంది. గతంలో రీసెర్చ్, పీహెచ్‌డీ అంటే ఏళ్ల తరబడి సమయం కేటాయించాలనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు యువత దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. పరిశోధనల వైపు అడుగులేయాలనే తాపత్రయం కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే పలు ప్రోత్సాహకాలు అందుబాటులోకి వస్తున్నాయి.

ఫెలోషిప్ మొత్తాల పెంపు:
పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులకు అందిస్తున్న ఫెలోషిప్ మొత్తాలను పెంచింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) సమయంలో ప్రస్తుతం ప్రతి నెల ఇస్తున్న రూ.25 వేలను రూ.31 వేలకు; సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(ఎస్‌ఆర్‌ఎఫ్) అభ్యర్థులకు అందిస్తున్న రూ.28 వేలను రూ.35 వేలకు పెంచింది. ఇది దేశంలో పరిశోధనల ఔత్సాహికులకు పెరుగుతున్న ప్రోత్సాహకాలకు నిదర్శనం. త్వరలో సోషల్ సెన్సైస్ విభాగంలోని రీసెర్చ్ ఫెలోషిప్‌లు కూడా పెంచే అవకాశముంది.

సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ :
  • శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు.. జాతీయస్థాయిలోని ప్రముఖ యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లలో పీహెచ్‌డీలో ప్రవేశం పొందేందుకు మార్గం.. సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్.
  • కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)లు సంయుక్తంగా నిర్వహించే పరీక్ష.. సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్.
  • లైఫ్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్; ఎర్త్, అట్మాస్ఫియరిక్ సెన్సైస్, ఓషియన్ అండ్ ప్లానెటరీ సెన్సైస్ తదితర విభాగాల్లో.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రీసెర్చ్ లేబొరేటరీల్లో పీహెచ్‌డీలో ప్రవేశం పొందేందుకు సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ మార్గం వేస్తుంది.
  • 55 శాతం మార్కులతో ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీఈ/బీటెక్/బీఫార్మసీ/ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: www.csirhrdg.res.in

సోషల్ సెన్సైస్‌లో పీహెచ్‌డీకి మార్గం.. యూజీసీ నెట్
  • లాంగ్వేజెస్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో పీహెచ్‌డీ చేసేందుకు ఉత్తమ మార్గం.. యూజీసీ-నెట్.
  • యూజీసీ నెట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సోషల్ సెన్సైస్ ఇన్‌స్టిట్యూట్స్, లాంగ్వేజ్ లేబొరేటరీస్, మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీలో ప్రవేశానికి అర్హత లభిస్తుంది.
  • ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షకు అర్హత సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత.
  • యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత సాధించి పీహెచ్‌డీలో ప్రవేశం పొందితే తొలుత జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్), ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(ఎస్‌ఆర్‌ఎఫ్) లభిస్తాయి.
  • ప్రస్తుతం యూజీసీ-నెట్-జూన్-2019 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
యూజీసీ నెట్ వెబ్‌సైట్: https://nta.ac.in www.ugcnetonline.in
 
జెస్ట్‌తో ప్రతిష్టాత్మక రీసెర్చ్ ల్యాబ్స్:
  • దేశంలోని ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ ల్యాబ్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం జెస్ట్ (జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్) ద్వారా లభిస్తుంది.
  • ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్/న్యూరోసైన్స్/కంప్యుటేషనల్ బయాలజీ సబ్జెక్ట్‌లలో ఏటా జెస్ట్ నిర్వహిస్తారు.
  • జెస్ట్‌లో ప్రతిభ ద్వారా ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్, హోమీ బాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్, హరీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఐఐఎస్సీ-బెంగళూరు వంటి 29 రీసెర్చ్ కేంద్రాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో, అదేవిధంగా ఎంఎస్ బై రీసెర్చ్ వంటి ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం పొందొచ్చు.
వెబ్‌సైట్: www.jest.org.in

గేట్‌తో.. ఐఐటీలు, నిట్‌ల్లో:
  • గేట్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఇది బీటెక్ చదువుతున్న విద్యార్థులందరికీ సుపరిచితమైన పరీక్ష.
  • గేట్ స్కోర్ ఆధారంగా రాష్ట్రాల స్థాయిలోని వర్సిటీలతోపాటు దేశంలోనే టెక్నికల్ విద్యకు ప్రతిష్టాత్మకంగా భావించే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
  • కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి కూడా పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ విధానంలో ప్రవేశం పొందిన వారికి నాన్-గేట్ ఫెలోషిప్‌ల పేరుతో ఆర్థిక ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నాయి.

మేనేజ్‌మెంట్ రీసెర్చ్ : ఐఐఎం
  • మేనేజ్‌మెంట్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు సరైన వేదికలు దేశంలోని ప్రతిష్టాత్మక బీస్కూల్స్.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లు(ఐఐఎం క్యాంపస్‌లు).
  • ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ పేరుతో పీహెచ్‌డీకి సమానమైన ప్రోగ్రామ్స్‌లో ఐఐఎంలు ప్రవేశం కల్పిస్తున్నాయి.
  • క్యాట్, జీమ్యాట్ స్కోర్ ఆధారంగా వీటిలో అడుగు పెట్టొచ్చు.

పీఎంఆర్‌ఎఫ్... నెలకు రూ.70 వేలకు పైగా ఫెలోషిప్
  • ప్రతిభావంతులను పరిశోధనల వైపు ఆకర్షించేలా ప్రత్యేకంగా అమల్లోకి తెచ్చిన పథకమే.. ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్(పీఎంఆర్‌ఎఫ్).
  • పీఎంఆర్‌ఎఫ్ పొందిన ప్రతిభావంతులు పీహెచ్‌డీని ప్రతిష్టాత్మక ఐఐఎస్సీ, ఐఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
  • ఐఐటీలు, ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్, ఐఐఈఎస్‌టీ, నిట్‌లు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఐఐఐటీల్లో విద్యాసంస్థల్లో బీటెక్ చివరి సంవత్సరం అభ్యర్థులు మొదలు, ఎంటెక్, ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ఎనిమిది పాయింట్ల సీజీపీఏ పొందిన విద్యార్థులు అర్హులు. (లేదా)
  • దేశంలోని గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌లో నాలుగేళ్ల బీటెక్ ఫైనల్/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్/ఎంఎస్సీ, రెండేళ్ల ఎంఎస్సీ కోర్సుల్లో ఎనిమిది పాయింట్ల సీజీపీఏ పొందిన అభ్యర్థులు అర్హులు. వీరు గేట్‌లో 750 స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అర్హులైన అభ్యర్థులు తమ రీసెర్చ్ ప్రతిపాదన అంశాన్ని పీఎంఆర్‌ఎఫ్ ద్వారా తెలియజేయాలి. సెలక్షన్ కమిటీ స్క్రీనింగ్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తుంది.
  • పీఎంఆర్‌ఎఫ్ ప్రక్రియలో ఎంపికై ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.70 వేలు; మూడో ఏడాది నెలకు రూ.75 వేలు; నాలుగు, అయిదు సంవత్సరాల్లో నెలకు రూ.80 వేలు చొప్పున ఫెలోషిప్‌లను అందిస్తోంది.

త్వరలో మే 2019 ఎంపిక ప్రక్రియ:
పీఎంఆర్‌ఎఫ్ పరిధిలో విద్యార్థులను ఎంపిక చేసేందుకు మే, 2019 సెషన్‌కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ త్వరలో మొదలు కానుంది.
వెబ్‌సైట్: https://may2019.pmrf.in

పీహెచ్‌డీ మార్గాలు.. ముఖ్యాంశాలు
  • సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ ద్వారా సెన్సైస్విభాగంలో పీహెచ్‌డీలో ప్రవేశం.
  • యూజీసీ-నెట్ ద్వారా ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, లాంగ్వేజెస్‌ల్లో పరిశోధనలు చేయొచ్చు.
  • జెస్ట్ స్కోర్ ఆధారంగా ఎస్ అండ్ టీ విభాగంలో ప్రతిష్టాత్మక రీసెర్చ్ ల్యాబ్స్‌లో అడుగు పెట్టే అవకాశం.
  • గేట్ ఉత్తీర్ణతతో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలో ప్రవేశం లభిస్తుంది.
  • పీఎంఆర్‌ఎఫ్ స్కీమ్ ద్వారా భారీ ఫెలోషిప్‌తో ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ పూర్తిచేయొచ్చు.

పీహెచ్‌డీ అభ్యర్థులు.. ప్రోత్సాహకాలు
  • ఎస్ అండ్ టీ విభాగంలో నెలకు రూ.31 వేల జేఆర్‌ఎఫ్; నెలకు రూ.35 వేల ఎస్‌ఆర్‌ఎఫ్.
  • సోషల్ సెన్సైస్, లాంగ్వేజెస్ తదితర విభాగాల్లో జేఆర్‌ఎఫ్ నెలకు రూ.25 వేలు; ఎస్‌ఆర్‌ఎఫ్ నెలకు రూ. 28 వేల ఫెలోషిప్.
  • వీటితోపాటు ఏటా నిర్ణీత మొత్తంలో కాంటింజెన్సీ గ్రాంట్, రీసెర్చ్ చేసేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు.
  • పీఎంఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే అయిదేళ్ల వ్యవధిలో రూ.70వేలతో ప్రారంభ ఫెలోషిప్. చివరి ఏడాదికి రూ.80 వేల ఫెలోషిప్.

పీహెచ్‌డీ.. కెరీర్ ఉజ్వలం
  • సీఎస్‌ఐఆర్, ఇక్రిశాట్, ఐఐసీటీ, ఐసీఏఆర్, ఎన్‌జీఐఆర్‌ఐ, తదితర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లో జూనియర్ సైంటిస్ట్‌లుగా అవకాశం లభిస్తుంది.
  • అధ్యాపక వృత్తిలో అవకాశం. నిర్ణీత నిష్పత్తితో పీహెచ్‌డీ ఫ్యాకల్టీ ఉండాలనే నిబంధన అమలు నేపథ్యంలో భారీ వేతనాలతో పెరుగుతున్న అవకాశాలు.
  • ప్రైవేటు సంస్థల ఆర్ అండ్ డీ విభాగాల్లో సైంటిస్ట్‌లుగా ప్రారంభంలోనే నెలకు రూ.2 లక్షల వేతనంతో కెరీర్ ప్రారంభించొచ్చు.
  • స్వీయ రీసెర్చ్ ఔత్సాహికులకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఏడాదికి రూ.లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు రీసెర్చ్ గ్రాంట్, నెలకు రూ.55 వేల ఫెలోషిప్, ఇతర రీసెర్చ్ ఖర్చుల నిమిత్తం ఓవర్‌హెడ్స్ పేరుతో ఏడాదికి రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకాలు.

రీసెర్చ్.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు సోపానం
రీసెర్చ్, అందుకోసం పీహెచ్‌డీ చేయడం వల్ల డాక్టరేట్ పట్టా లభించడమే కాకుండా.. సదరు అభ్యర్థులకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దృక్పథం కూడా అలవడుతుంది. పరిశోధనల క్రమంలో సమస్యలను పరిష్కరించేటప్పుడు కొత్త ఆవిష్కరణలు సహజం. ఇవి మార్కెట్ అవసరాలను తీర్చగలవని భావిస్తే.. సొంతంగా తామే సంస్థలను ఏర్పాటు చేసే వీలుంటుంది. ఇటీవల కాలంలో రీసెర్చ్ ఔత్సాహికులకు ఎన్నో ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే ఈ దిశగా దృష్టిసారిస్తే ఉజ్వల భవిష్యత్తు ఖాయం.
- ప్రొఫెసర్ వి.వెంకటరమణ, వైస్ చైర్మన్, టీఎస్‌సీహెచ్‌ఈ.
Published date : 26 Feb 2019 05:48PM

Photo Stories