Skip to main content

హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలో తరుచుగా అడిగే ప్రశ్నలు...

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నిర్ణయాత్మక దశ.. హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ! చాలా మంది అభ్యర్థులు టెక్నికల్ రౌండ్‌లో ప్రతిభ చూపినా ఈ రౌండ్‌లో సరిగా సమాధానాలు చెప్పలేక అవకాశాలు కోల్పోతున్నారు. అందువల్ల హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలో తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలో తెలుసుకుందాం..
మీ గురించి చెప్పండి.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు సర్వసాధారణంగా ఇలాంటి ప్రశ్న ఎదురవుతుంది. ఇది చాలా తేలిక ప్రశ్నే అనిపించినా అత్యంత క్లిష్టమైందిగా గుర్తించాలి. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్న క్రమంలో మీరు ఏ అంశాలను ప్రస్తావిస్తారో వాటి ఆధారంగానే తదుపరి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ‘మీ గురించి చెప్పండి’ అని ఇంటర్వ్యూయర్ అడిగితే ముందుగా మీ పేరు చెప్పి.. తర్వాత మీ అర్హతలు, నైపుణ్యాలు, అనుభవం, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, హాబీస్ గురించి ప్రస్తావించాలి. ఇంటర్వ్యూయర్ మీ పేరును ప్రస్తావిస్తూ ‘ర మేష్.. మీ గురించి చెప్పండి’ అన్నప్పుడు మళ్లీ ‘నా పేరు రమేష్’ అని ప్రారంభించడం సరికాదు. ఇంటర్వ్యూ చేస్తున్న సంస్థ ప్రతినిధి మీలో ఏయే నైపుణ్యాలు, అర్హతలు ఉండాలని కోరుకుంటున్నారో సంబంధిత అంశాలనే ప్రస్తావించడం మేలు. కుటుంబ, వ్యక్తిగత విషయాలు చెప్పకపోవడం మంచిది. మీ గురించి మీరు చెబుతున్నదంతా సహజంగా మనసులోంచి వస్తున్నట్లు ఉండాలి. రిహార్సల్‌లా ఉండకూడదు.
 
మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేయాలో చెప్పండి?
ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలంటే మీరు సదరు కంపెనీ గురించి, ఆ కంపెనీ ఉత్పత్తుల గురించి లోతుగా అధ్యయనం చేసుండాలి. సంస్థ అవసరాలేంటో ముందే తెలుసుకొని ఉండాలి. సెలక్ట్ అయితే మీకు కంపెనీ ఆఫర్ చేసే జాబ్ ప్రొఫైల్‌కు మీ స్కిల్స్ ఎలా సరిపోతాయో వివరించాలి. ఉదాహరణకు మీకు ఆఫర్ చేసే జాబ్ ప్రొఫైల్ ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ అయితే సీఎస్‌ఈ సబ్జెక్టులపై ఉన్న పట్టు, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, మ్యాథమెటికల్ స్కిల్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి చేసిన ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్స్, ఆప్టిట్యూడ్, యాటిట్యూడ్.. ఇలా అన్ని విషయాలూ ఇంటర్వ్యూయర్‌కు చెప్పి, మెప్పించగలగాలి.
 
మీ కెరీర్ లక్ష్యాలు ఏంటి?
ప్రస్తుతం నా లక్ష్యం నా చదువుకు, నైపుణ్యాలకు తగ్గ మంచి పేరున్న సంస్థలో ఉద్యోగం సంపాదించడమని చెప్పాలి. అలాగే ఫ్రెషర్‌ను కాబట్టి పని నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉన్న కంపెనీలో చేరాలనుకుంటున్నట్లు తెలియజేయాలి. తన సబ్జెక్టు పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా అన్వయించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు కూడా చెప్పొచ్చు. దీర్ఘకాలిక లక్ష్యం విషయానికొస్తే టాప్ కంపెనీలో లీడర్‌షిప్ స్థాయికి చేరుకోవడం, సవాళ్లతో కూడిన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించి నా కుటుంబం గర్వపడేలా చేయడం అని వివరించాలి. అయితే అది అత్యంత సహజంగా, సందర్భానికి తగ్గట్టు ఉండాలి. మీ దృక్పథం ఫలితాన్ని ఆశించడం కన్నా పని మీద దృష్టి పెట్టే వ్యక్తిలా ఉండాలి. అంతేకాని కెరీర్ గోల్ అనగానే ఒక ప్రాజెక్ట్ పూర్తికాగానే ప్రమోషన్ ఆశించే, వేతన పెంపు గురించి అడిగే ఉద్యోగిలా ఉండకూడదు. ఎందుకంటే పని కన్నా ఫలితంపైనే ఎక్కువ ఆసక్తి ఉండే వ్యక్తి త్వరగా నిరాశ చెందుతాడన్నది ఇంటర్వ్యూయర్‌కు తెలియని విషయం కాదు. అందువల్ల కెరీర్ గోల్ ఏంటి? అని అడిగితే నింపాదిగా పరిణతి చెందిన వ్యక్తిలా ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యే విషయాలనే ప్రస్తావించాలి.
 
 మీ హాబీలేంటి?
 ఈ ప్రశ్నకు కూడా నిజాయతీగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు మీ హాబీగా పేర్కొన్న అంశంపై లోతైన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఏ అంశాన్నైతే హాబీగా పేర్కొన్నారో దాని గురించి సమగ్రంగా తెలుసుకొని వెళ్లాలి. దీనిపై ఎలాంటి అనుకోని  ప్రశ్న అడిగినా ఎంతో కొంత సమాధానం చెప్పాలి. హాబీ అంటే ఆసక్తి ఉండే వ్యాపకం. అలాంటి హాబీ గురించే సరైన అవగాహన లేకపోతే అభ్యర్థిలో లెర్నింగ్ అప్రోచ్ లేదని ఇంటర్వ్యూయర్ భావించే ప్రమాదముంది. అందువల్ల హాబీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉదాహరణకు..
 1. బ్రౌజింగ్ ఇంటర్నెట్   
 2. బ్లాగింగ్         
 3. లిజనింగ్ టు మ్యూజిక్ 
 4. వాచింగ్ ద ఫిల్మ్స్  
 5. చాటింగ్ విత్ ఫ్రెండ్స్ 
 6. రీడింగ్ న్యూస్ పేపర్స్
  7. రీడింగ్ బుక్స్
 
 మా కంపెనీ గురించి చెప్పండి?
 ఈ ప్రశ్న కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ హెచ్‌ఆర్ రౌండ్‌లో సర్వసాధారణంగా అడుగుతున్నారు. అందువల్ల సంస్థ ప్రొఫైల్ గురించి తెలుసుకొని వెళ్లడం మంచిది. ఉదాహరణకు మిమ్మల్ని టీసీఎస్ కంపెనీ ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తూ మా కంపెనీ గురించి చెప్పండి అని అడిగితే ‘టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. దీన్ని 1968లో ఏర్పాటు చేశారు. వ్యవస్థాపకుడు జేఆర్‌డీ టాటా. ప్రస్తుత చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. టీసీఎస్.. ఐటీ, ఔట్ సోర్సింగ్; బిజినెస్ కన్సల్టింగ్ వంటి సేవలు అందిస్తోంది. సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది’ అని చెప్పొచ్చు. సదరు కంపెనీ గురించి ఇలాంటి ప్రాథమిక అంశాలైనా కనీసం తడబడకుండా చెప్పాలనేది నిపుణుల సూచన.
 
 ఎంత వేతనాన్ని ఆశిస్తున్నారు?
 ఈ ప్రశ్న ఎదురైనప్పుడు చాలా నింపాదిగా స్పందించాలి. నాకు వేతనం ముఖ్యం కాదని, నేర్చుకోవడానికే ప్రాధాన్యమిస్తానని చెప్పాలి. ‘నేను ఫ్రెషర్‌ను కాబట్టి పని నేర్చుకునే అవకాశం కల్పించే సంస్థలో చేరాలనుకుంటున్నాను. పరిజ్ఞానం, పని అనుభవం, నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం ముఖ్యమని భావిస్తున్నాను. శాలరీ గురించి నాకు పట్టింపులేదు. కంపెనీ నిబంధనలు, నా చదువు, సామర్థ్యానికి తగ్గ వేతనం ఇస్తారని భావిస్తున్నాను’ అని సమాధానం చెప్పడం సముచితం.
 
పైన పేర్కొన్న ప్రశ్నలతోపాటు మరికొన్ని ప్రశ్నలు హెచ్‌ఆర్ రౌండ్‌లో ఎదురయ్యే అవకాశముంది. అవి..
 Q. మీ పేరుకు అర్థం ఏమిటి
 Q. మీ బలాలు, బలహీనతలేంటి?
 Q. మా కంపెనీలో ఎందుకు చేరాలని అనుకుంటున్నారు?
 Q. హార్డ్‌వర్క్, స్మార్ట్‌వర్క్‌కు తేడా ఏంటి?
 Q. మిమ్మల్ని ఎంపిక చేస్తే కంపెనీలో ఎంతకాలం పనిచేస్తారు?
 Q. ఉన్నత చదువుకు వెళ్లాలనే ఆలోచన లేదా?
 Q. నైట్ షిప్ట్‌ల్లో పనిచేయడం ఇష్టమేనా?
 Q. దేశంలో, విదేశంలో ఎక్కడైనా పనిచేసేందుకు అంగీకారమేనా?
 Q. మీకు ప్రేరణ కలిగించే అంశాలేంటి?
 
  ఎంబీఏ విద్యార్థులకు ఎదురయ్యే ప్రశ్నలు...
 Q. ఎంబీఏ చేయాలని ఎందుకు అనుకున్నారు?
 Q. ఎంబీఏ తర్వాత మీ లక్ష్యాలేంటి?
 Q. మీ జీవిత లక్ష్యాలకు ఎంబీఏ చదువు ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి?
 Q. మీరు ఇదే బీస్కూల్లో చేరడానికి కారణమేంటి?
 Q. మీ స్పెషలైజేషన్ ఏంటి? దాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
 
 దృష్టిసారించాల్సిన ఇతర అంశాలు...
  •  కరెంట్ అఫైర్స్ 
  • పాలిటిక్స్
  • ఎకనామిక్స్ 
  • బిజినెస్
  • సోషల్ ఈవెంట్స్ 
  • ఎన్విరాన్‌మెంట్.
Published date : 17 Oct 2017 05:18PM

Photo Stories