Skip to main content

ఎలక్ట్రిక్ వాహన రంగం... కొలువులతరంగం

ఎలక్ట్రిక్ వాహనాలు.. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవం! ఎందుకంటే.. ఒకవైపు సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాలతో కాలుష్యం పెరిగిపోతోంది. అదే సమయంలో వాహనాల సంఖ్యవిస్తరిస్తూ.. ఇంధన కొరత వెంటాడుతున్న వైనం. ఇలాంటి పరిస్థితుల్లో.. కాలుష్యం నుంచి విముక్తితోపాటు ఇంధన సమస్యకు పరిష్కారంగా తెరపైకి వస్తున్నవే... ఎలక్ట్రిక్ వాహనాలు! ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం.. యువతకు సరికొత్త ఉపాధి వేదికగా కూడా మారనుందని అంచనా.
 ఈ రంగం వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా రానున్న నాలుగైదేళ్లలోనే వేల సంఖ్యలో కొలువులు ఖాయం అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగం విస్తరణకు కారణాలు.. ఈ రంగం ద్వారా అందివచ్చే అవకాశాలు..అవసరమైన అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకుందాం...

ద్విచక్ర వాహనాలు, కార్లు.. నేడు ప్రజలకు తప్పనిసరి ప్రయాణ సాధనాలు. ప్రజా రవాణ రంగంలో బస్సులు సరేసరి! మరోవైపు లారీలు, ట్రాలీలు, ఆటోలు...కానీ.. వీటిద్వారా వెలువడుతున్న కాలుష్యం లెక్కించలేనంత!! ఈ సమస్యకు పరిష్కారంగా తెరపైకి వస్తున్నవే.. ఎలక్ట్రిక్ వెహికిల్స్.
ఎలాంటి కాలుష్యం లేకుండా.. రవాణా అవసరాలు తీర్చే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం.. ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా’ అనే విధానాన్ని రూపొందించింది. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్‌ను సిద్ధం చేసి.. 2020 నాటికి అయిదు నుంచి ఏడు మిలియన్ల ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపైకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2030 నాటికి భారత్‌లో 40శాతం మేర ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలో ఉంటాయని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. ఇంతలా విస్తరించనున్న ఎలక్ట్రిక్ వాహన రంగం యువతకు సరికొత్త అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నారు.

ఇప్పటికే రోడ్లపై ‘ఈవీ’లు..
మన దేశంలో ఇప్పటికే పలు ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పూనుకున్నాయి. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాల ద్వారా ఆర్ అండ్ డీలో నిమగ్నమయ్యాయి. ప్రజా రవాణ రంగం పరంగా చూస్తే.. ఎలక్ట్రిక్ బస్సులు రోడ్ల మీదికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ రానున్న మూడేళ్లలో వేయి ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌కే చెందిన మరో సంస్థ చైనా కంపెనీతో ఒప్పందం చేసుకుని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు 290 ఎలక్ట్రిక్ బస్‌లను అందించేందుకు సిద్ధమైంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. 2030 నాటికి అంతర్జాతీయ స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో భారత్ ఏడు శాతం వృద్ధి సాధించనుంది. మరోవైపు చైనా ఇప్పటికే యాభై శాతం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తూ.. 2025 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

అవకాశాలు ఎలా ?
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం పెరుగుతోంది. దాంతో ఈవీ రంగం క్రమేణా విస్తరిస్తోంది. ఈ రంగంలో ప్రొడక్ట్ ఆవిష్కరణకు మూలమైన డిజైనింగ్, తయారీ నుంచి సదరు ప్రొడక్ట్ రోడ్ మీదకి వచ్చాక చార్జింగ్ వరకు..వేల సంఖ్యలో అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఒక ఎలక్ట్రిక్ బస్ తయారీకి సగటున 12 నుంచి 15 మంది అవసరమవుతారని చెబు తున్నారు.

2030 నాటికి లభించే కొలువులు..
  • ఆర్ అండ్ డీ సైంటిస్ట్స్: ఎలక్ట్రిక్ వాహనం రూపొందించే విష యంలో రీసెర్చ్ పరంగా ఉన్నత స్థాయి హోదాగా ఆర్ అండ్ డీ సైంటిస్ట్‌ను పేర్కొనొచ్చు.
  • కెమికల్ ఇంజనీర్స్/కెమిస్ట్స్: ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే బ్యా టరీల తయారీకి సంబంధించిన విధులు నిర్వహిస్తారు.
  • ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్: ఒక కొత్త ప్రొడక్ట్‌ను డిజైన్ చేయడం, డెవలప్ చేయడం వంటి విభాగాల్లో ఎలక్ట్రానిక్ ఇంజనీర్లదే కీలక పాత్ర.
  • ఇండస్ట్రియల్ ఇంజనీర్స్: ప్రొడక్ట్ డిజైన్ ఆమోదం పొందాక.. దాన్ని తయారీ చేసే క్రమంలో క్షేత్ర స్థాయిలో విధుల నిర్వహణ, మెటీరియల్, మ్యాన్ పవర్ అనుసంధానం వంటి విషయాల్లో కీలకంగా నిలుస్తున్నారు.
  • మెకానికల్ ఇంజనీర్స్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ మెకానికల్ ఇంజనీర్ల సేవలు కీలకమే! ఎందుకంటే.. క్యాడ్ ఆధారంగా ఒక ప్రొడక్ట్‌ను డిజైన్ చేయడంలో ఎలక్ట్రానిక్ ఇంజనీర్లకు, మెకానికల్ ఇంజనీర్ల సహకారం తప్పనిసరి.
  • సాఫ్ట్‌వేర్ డెవలపర్స్: ఆధునిక టెక్నాలజీతో రూపొందుతున్న వాహనాలన్నీ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ ఆధారితంగానే ఉంటున్నాయి. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికిల్స్ కూడా సాఫ్ట్‌వేర్ ఆధారంగా పని చేయనున్నాయి. ముఖ్యంగా ప్రయాణ సమయంలో చార్జింగ్ స్థాయి? ఎప్పుడు ఛార్జింగ్ చేయాలి? తదితరాలు కనిపించేలా ఆన్‌బోర్డ్ కంప్యూటర్లను ఎలక్ట్రిక్ వాహనాల్లో పొందుపరుస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్‌ను రూపొందించేం దుకు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అవసరం ఏర్పడుతోంది.
ఏ విభాగంలో.. ఎవరికి కొలువు:
ఎలక్ట్రిక్ వాహన రంగంలో పట్టుకొచ్చే ఉద్యోగాలకు సంబంధించి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్, ఆపై స్థాయి అభ్యర్థులను సంస్థలు నియమించుకుంటున్నాయి. పరిశోధనలకు సంబంధించి మాత్రం పీహెచ్‌డీ ఉంటేనే స్వాగతం పలుకుతున్నాయి.

క్షేత్ర స్థాయి విభాగాల్లో!
ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో డిజైన్ , ఆర్ అండ్ డీతోపాటు ప్రొడక్ట్ తయారీకి సంబంధించిన మరెన్నో విభాగాల్లో కొలువులు లభించనున్నాయి. అవి..
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ అసెంబ్లర్స్, -ఎల క్ట్రోమెకానికల్ ఎక్విప్‌మెంట్ అసెంబ్లర్స్, -ఇంజన్ అండ్ అదర్ మెషీన్ అసెంబ్లర్స్, -టీ మ్ అసెంబ్లర్స్, -కంప్యూటర్ కంట్రోల్డ్ మెషీన్ టూల్ ఆపరేటర్స్, -మెషినిస్ట్స్, -ఇండస్ట్రి యల్ ప్రొడక్షన్ సూపర్‌వైజ ర్స్/మేనేజర్స్.
అర్హతలు: ఈ విభాగాల్లో డిప్లొమా స్థాయి విద్యార్హతలు న్న వారికి అవకాశాలు లభి స్తాయి.

ఆఫ్టర్ సేల్స్:
తయారీలోనే కాకుం డా.. ఎలక్ట్రిక్ వాహనా లను విక్రయించిన తర్వాత.. సదరు ప్రొడక్ట్ సర్వీసింగ్‌కు సంబంధించి కూడా పలు విభాగాల్లోనూ పలు ఉద్యోగాలు లభించనున్నాయి. అవి..-ఆటోమోటివ్ సర్వీస్ టెక్నీషియన్స్ అండ్ మెకానిక్స్, -ఎలక్ట్రిక్ పవర్ లైన్ ఇన్‌స్టాలర్స్ అండ్ రిపెయిరర్స్, -ఎలక్ట్రిషియన్స్, -చార్జింగ్ వర్కర్స్.
అర్హతలు: ఈ విభాగాల్లో ఐటీఐ లేదా సంబంధిత విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్నవారు అర్హులు

కస్టమర్ సర్వీస్ విభాగం:
ఎలక్ట్రిక్ వెహికిల్‌ను కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులకు సేవలందించే క్రమంలో సంప్రదాయ కొలువులు కూడా లభించనున్నాయి. అవి..-రిటెయిల్ సేల్స్ పర్సన్స్,-కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్,-షో రూం మేనేజర్స్.
అర్హతలు:ఈ విభాగాల్లో సంప్రదాయ డిగ్రీ అర్హత ఉండి, సర్వీస్ ఓరియెంటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారు సరితూగుతారు.

ఐఐటీల బాట పడుతున్న సంస్థలు:
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు.. ఇంజనీర్ స్థాయి ఉద్యోగాల కోసం ఐఐటీల్లో క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది టాటా మోటార్స్, మెర్సిడెజ్ బెంజ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి తదితర సంస్థలు ఐఐటీల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా వేయి మంది బీటెక్ అభ్యర్థులను ఎలక్ట్రిక్ వాహన తయారీ విభాగాల్లో ఆఫర్లు ఇచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య 30 శాతం ఎక్కువ కావడం ఈ రంగంలో పెరుగుతున్న మానవ వనరుల డిమాండ్‌కు నిదర్శనమని చెప్పొచ్చు.

నైపుణ్యాల కొరత :
ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో ఇంజనీర్స్ స్థాయిలో ప్రస్తుతం దేశంలో అయిదు వేల మంది అవసరముంది. అయితే సరిపడ నైపుణ్యాలున్న వారి సంఖ్య మాత్రం వేయిలోపే ఉంది. రానున్న రెండేళ్లలో ఈ డిమాండ్ పదిహేను వేలకు చేరుకోనుంది అంచనా. కాబట్టి అకడమిక్ స్థాయిలోనే నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకుంటే ఈ రంగంలో ఉజ్వల అవకాశాలు లభిస్తాయని ప్రముఖ స్టాఫింగ్ సంస్థ టీమ్‌లీజ్ కోఫౌండర్ రీతూపర్ణ చక్రవర్తి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగ అవసరాలకు తగ్గట్టు సంస్థలు కోర్ సబ్జెక్టులపై పట్టున్న వారిని నియమించుకొని.. ఆ తర్వాత తమ సంస్థల్లోని సొంత శిక్షణ కేంద్రాల ద్వారా నైపుణ్యాలు కల్పిస్తున్నాయి.

కొత్త కోర్సులు, రీసెర్చ్ దిశగా ఐఐటీలు:
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, నైపుణ్యాల ఆవశ్యకతను పరిగణనలోకి తీసుకున్న ఐఐటీలు.. వీటికి సంబంధించి కొత్త కోర్సులు, రీసెర్చ్ కార్యకలాపాల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఐఐటీ ఢిల్లీ వచ్చే ఏడాది నుంచి ఈ విభాగంలో ఎంటెక్ ప్రోగ్రామ్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. అదే విధంగా ఐఐటీ మండి, చెన్నైలు పలు ప్రైవేటు సంస్థలతో కలిసి రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

వేతనాలు ఇలా..
  • రీసెర్చ్ స్థాయిలో నెలకు రూ.లక్ష వరకు వేతనం అందుకునే అవకాశం.
  • ప్రొడక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ విభాగంలో ఇంజనీర్ల స్థాయిలో నెలకు రూ.40వేల నుంచి రూ.70 వేల వరకు జీతం పొందొచ్చు.
  • సూపర్‌వైజరీ స్థాయిలో నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది.
  • కస్టమర్ సర్వీస్ విభాగంలోనూ ఇదే స్థాయిలో వేతనాలు.

ఉద్యోగార్ధులకు సరికొత్త అవకాశం..

 ఎలక్ట్రిక్ వాహన రంగం ఉద్యోగా ర్థులకు సరికొత్త అవకాశం. ప్రధానంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగా ల్లో ఉత్తమ అవకాశాలు లభించనున్నాయి. అదే విధంగా బ్లూ కాలర్ జాబ్స్ కూడా అందుకునే వీలుంది. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ 19 మిలియన్ల ఉద్యోగాలు కల్పిస్తోంది. వీటి స్థానంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రావడం వల్ల కొన్ని ఉద్యోగాలు కోల్పోయే ఆస్కారం ఉన్నప్పటికీ.. సరికొత్త కొలువులు అందబాటులోకి వచ్చే వీలుంది. కాబట్టి విద్యార్థులు నైపుణ్యాలు సొంతం చేసుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
   - అలోక్ రే, అసిస్టెంట్ డెరైక్టర్, ఆపరేషన్స్(ఎస్‌ఎంఈవీ)
Published date : 15 Oct 2018 06:24PM

Photo Stories