Skip to main content

డిమాండింగ్ ‘కంటెంట్ మార్కెటింగ్ జాబ్స్’ ఇవే...

వ్యాపార వృద్ధికి కోట్లు వెచ్చించినా.. సరైన కంటెంట్ మార్కెటింగ్ విభాగం లేకపోతే లక్ష్యాలను అందుకోవడం కష్టమే! దీన్ని గుర్తించే ప్రస్తుతం కంపెనీలన్నీ కంటెంట్ మార్కెటింగ్ విభాగాలను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాయి.
 కంటెంట్ మార్కెటింగ్ జాబ్ ప్రొఫైల్‌కు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. అసలు కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏమిటి.. డిమాండ్‌కు కారణాలేమిటి.. కోర్సులు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం...

కంటెంట్ మార్కెటింగ్‌ను స్థూలంగా సరికొత్త మార్కెటింగ్ విధానంగా పేర్కొనవచ్చు! లక్షిత వినియోగదారులను, వీక్షకులను ఆకర్షించేలా, కొనసాగించేలా కంటెంట్‌ను క్రియేట్ చేయడం, చేరవేయడం(టార్గెట్ ఆడియెన్స్‌కు).. కంటెంట్ మార్కెటింగ్‌లో ప్రధాన విధులు. వ్యాపారం ఏదైనా వినియోగదారులకు చేరితేనే అది విజయం సాధించినట్లు లెక్క! ప్రస్తుతం సేవలను అందించేవారు, సేవలను పొందేవారనే తేడాలేకుండా అంతాడిజిటల్ ప్రపంచంపై ఆధారపడుతున్నారు. ఏం కావాలన్నా.. దేని గురించి తెలుసుకోవాలన్నా..ఇంటర్నెట్ కీలకంగా మారింది. దీంతో సంప్రదాయ మార్కెటింగ్ పద్ధతులకు కాలం చెల్లి.. సరికొత్తగా ఆన్‌లైన్ కంటెంట్ మార్కెటింగ్ విధానం ఆవిష్కృతమైంది. కంటెంట్ లేదా డిజిటల్ మార్కెటర్‌గా రాణించాలంటే.. కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు, అభిరుచులు, ఇష్టాలు తప్పనిసరి. కంటెంట్ మార్కెటింగ్‌కు ప్రస్తుతం బ్లాగ్స్, వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, కేస్ స్టడీస్, ఇ-బుక్స్, వైట్ పేపర్స్, చెక్ లిస్టులు, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టులు, గిఫ్టులు టాప్‌లో ఉన్నాయి.

ఇష్టంతోనే రాణింపు :
కంటెంట్ మార్కెటింగ్‌లో కంటెంట్ క్రియేషన్‌ది కీలక భూమిక. కాబట్టి కంటెంట్ మార్కెటర్‌కి కంటెంట్ రైటింగ్‌పై అమితమైన ఇష్టం ఉండాలి. అప్పుడే సదరు కంటెంట్ వీక్షకులను ఆకట్టుకుంటుంది. కంటెంట్‌ను పూర్తి ప్రామాణికతలతో రూపొందించగలిగినప్పుడు మాత్రమే కంటెంట్ రైటర్లు విజయవంతం అవుతారు. కంటెంట్ రైటింగ్ ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు అభ్యర్థులు కింది అంశాలను పరిశీలించడం లాభిస్తుంది.
అవి...
  • రాయడానికి ఇష్టపడే అంశాలు ఏవి ?
  • ఎప్పుడూ రాయని అంశాలు ఏమిటి ?
  • వేటిని రాయడానికి ఇష్టపడరు?! తదితర అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
ఎడిటింగ్ ‘ఐ’ : 
 ప్రతి కంటెంట్ మార్కెటర్‌కు ఎడిటింగ్‌పై పట్టుండాలి. ఎడిటింగ్ స్కిల్స్ అనేవి కేవలం గ్రామర్, అక్షర దోషాలు సరిదిద్దేందుకే పరిమితం కాదు. ఉదాహరణకు ఒక బ్లాగ్ పోస్టును క్రియేట్ చేస్తుంటే..వినియోగదారులు సదరు కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించబోతున్నారనే దృష్టితో కంటెంట్‌ను ఎడిట్ చేయాలి. కాపీ రైటర్లు కంటెంట్ రాయడం పూర్తి చేసిన తర్వాత తిరిగి దాన్ని ఆసాంతం చదవాలి. సబ్ హెడింగ్స్, బుల్లెట్ పాయింట్లు, పేరాగ్రాఫ్‌ల విభజన తదితరాలతోపాటు ఇమేజ్‌లను యాడ్ చేసి కాపీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి.
 
 సహానుభూతి :
 కంటెంట్ మార్కెటర్లు లక్షిత వినియోగదారులు, వీక్షకుల భావాలు, ఆలోచనలు, ఇష్టాల పట్ల సహానుభూతిని కలిగుండాలి. ఈ లక్షణాన్ని పెంపొందించుకుంటే.. వినియోగదారులు ఏయే అంశాల పట్ల ఆసక్తి చూపుతారు? దేన్ని చూడగానే క్లిక్ చేస్తారు? అనే అంశాలను సులభంగా పసిగట్టగలుగుతారు. కాబట్టి కంటెంట్ మార్కెటర్ల సక్సెస్‌లో సహానుభూతి కీలకంగా నిలుస్తుందని చెప్పొచ్చు.
 
 రీసెర్చ్ :
 కంటెంట్ మార్కెటర్లు రీసెర్చ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించగలుగుతారు. ఉదాహరణకు ఒక ఆర్టికల్ రైటింగ్‌లో స్పేస్ సమస్య వల్ల పూర్తి స్థాయిలో వివరాలను అందించలేకుంటే.. సదరు సమాచారానికి సంబంధించిన ఎక్స్‌టర్నల్ లింక్‌ను పేర్కొనాలి. సరైన రీసెర్చ్ చేసినప్పుడు మాత్రమే కంటెంట్ మార్కెటర్లు ఈ విధంగా వ్యవహరించగలుగుతారు.
 
 ఎస్‌ఈవో, ఇన్‌బౌండ్ :
 సెర్చ్ ఇంజన్స్‌లో కంటెంట్ కనిపించాలన్నా.. హయ్యర్ ర్యాంకులు సొంతం చేసుకోవాలన్నా.. సెర్చ్ ఇంజిన్ ఆపరేషన్, ఇన్‌బౌండ్ మార్కెటింగ్ నైపుణ్యాలు తప్పనిసరి. కాబట్టి కంటెంట్ మార్కెటర్లుగా మారాలనుకొనే వారు ముందుగా ఈ నైపుణ్యాలపై దృష్టిపెట్టాలి. కంటెంట్ రాయడం, మీటా డిస్క్రిప్షన్స్, మీటా ట్యాగ్స్, హెడ్డింగ్స్, యూనిక్ యూఆర్‌ఎల్‌లపై దృష్టిపెట్టాలి.
 
 సోషల్ మీడియా సెర్చర్ :
 కంటెంట్ మార్కెటర్లుగా కిల్లింగ్ కంటెంట్‌ను క్రియేట్ చేయడం ఎంత ముఖ్యమో... దాన్ని ఎక్కువ మందికి చేరవేయడమూ అంతే ప్రధానం. ఇక్కడే సోషల్ మీడియా నైపుణ్యాలు కీలకంగా మారతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంటెంట్ మార్కెటింగ్ ఔత్సాహికులు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడంపై దృష్టిపెట్టాలి. ఎప్పటికప్పుడు పోస్టులు, వీడియోలు పెడుతూ ఫాలోవర్స్‌ను ఆకర్షించాలి. క్రమం తప్పకుండా రియల్ టైమ్‌లో ఫాలోవర్స్‌తో సంభాషిస్తూ.. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. వారు చెప్పేవాటిలో ప్రాధానాంశాలను గుర్తించగలిగే నేర్పును సొంతం చేసుకోవాలి.
 
 కోర్సులు :
 గూగుల్ డిజిటల్ గ్యారేజ్ :

 ఉచితంగా కంటెంట్ మార్కెటింగ్ కోర్సులను పూర్తి చేయాలనుకొనేవారికి గూగుల్ డిజిటల్ గ్యారేజ్ చక్కటి వేదిక. ఈ కోర్సులను‘గ్రో విత్ గూగుల్’ థీమ్‌లో భాగంగా అందిస్తున్నారు. ఇందులో మొత్తం 26 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోరుకున్న కోర్సును, వీలైన సమయంలో పూర్తి చేసే అవకాశాన్ని గూగుల్ డిజిటల్ డ్రైవ్ అందిస్తోంది. నచ్చిన కోర్సును ముందుగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ కూడా లభిస్తుంది.
 వెబ్‌సైట్: learndigital.withgoogle.com
 
 హబ్‌స్పాట్ కంటెంట్ మార్కెటింగ్:
 పముఖ సాఫ్ట్‌వేర్ డెవలపర్ హబ్‌స్పాట్ ఉచిత ఆన్‌లైన్ కంటెంట్ మార్కెటింగ్ సర్టిఫికేషన్‌ను అందిస్తోంది. ఈ కోర్సులో మొత్తం 12 పాఠ్యాంశాలు ఉంటాయి. దీన్ని పూర్తి చేసిన వారికి కంటెంట్ క్రియేషన్‌పై పూర్తి స్థాయి పట్టు లభిస్తుంది. స్ట్రాటజిక్ కంటెంట్ మార్కెటర్‌గా రాణించేందుకు వీలుంటుంది.
 వెబ్‌సైట్: academy.hubspot.com
 
 కోర్సెరా :
 యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రూపొందించిన స్ట్రాటజీ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్ కోర్సు ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ కోర్సులో వినియోగదారులను ఎలా ఆకర్షిస్తారు, ప్రకటనలను సోషల్ మీడియాలో ఎలా వైరల్ చేస్తారనే విషయాలను వీడియోల రూపంలో చూపిస్తారు. దీంతోపాటు సోషల్ మీడియా మార్కెటింగ్, బ్రాండ్ అండ్ కంటెంట్ మార్కెటింగ్, కంటెంట్, అడ్వర్టయిజింగ్ అండ్ సోషల్ ఐఎంసీ, డిజిటల్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
 వెబ్‌సైట్: www.coursera.org
 
 ఉడెమీ :
 కంటెంట్ రైటింగ్ సర్టిఫికేషన్‌ను అందిస్తోంది. ఈ కోర్సులో కాపీ రైటింగ్, ఎస్‌ఈవో రైటింగ్, బ్లాగ్ పోస్ట్ రైటింగ్ తదితరాల గురించి నేర్చుకుంటారు. దీంతోపాటు కంటెంట్ రైటింగ్ కోర్ కాన్సెప్టులు, టార్గెట్ ఆడియెన్స్‌ను గుర్తించడం, కంటెంట్ రైటింగ్ నైపుణ్యాలు, వెబ్‌సైట్ లేదా బ్లాగ్ ట్రాఫిక్‌ను పెంపొందించడంపై దృష్టిపెడతారు.
 వెబ్‌సైట్: www.udemy.com
Published date : 27 Jan 2020 02:15PM

Photo Stories