Skip to main content

అమెరికాలో ఉద్యోగ అవకాశాలు...

అమెరికా.. అవకాశాల స్వర్గం..! ప్రతిభావంతులను రారమ్మని ఆహ్వానించే దేశం..! అందునా భారతీయ యువత విద్య, ఉద్యోగాల స్వప్నం..! కానీ.. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చాక హెచ్-1బి వీసా క్యాప్‌పై పరిమితులు.. ఉన్నత విద్య కోసం వెళ్దామంటే ఆంక్షలు.. గ్రీన్‌కార్డ్ పొందాలంటే ఎన్నో అడ్డంకులు..! మన యువతను ఆందోళనకు గురిచేసిన ఇన్ని ప్రతికూల అంశాల మధ్య ఇటీవల తెచ్చిన రైజ్ (రిఫార్మింగ్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎకానమీ) చట్టంమాత్రం ఆశలు రేకెత్తిస్తోంది. అగ్రరాజ్యంలో చదువు, కొలువు స్వప్నంపై భరోసా ఇస్తోంది. ఈ నేపథ్యంలో విశ్లేషణ..!
గ్రీన్ కార్డ్ మంజూరులో లాటరీ పద్ధతికి స్వస్తి పలికి నైపుణ్యాల ఆధారంగా పాయింట్ల గణన చేపట్టడం రైజ్ చట్టం ఉద్దేశం. ఇది భారతీయులకు కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చట్టంలోని ఇంగ్లిష్ నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతన ఉద్యోగాలు, వయసు తదితర అంశాలకు పాయింట్లు నిబంధన ఎక్కువగా మన యువతకే అనుకూలమని భావిస్తున్నారు. కొందరు మాత్రం రైజ్ యాక్ట్ చీకటిలో వెలుగు రేఖ లాంటిది మాత్రమేనని.. ఎక్కువ ఆనందించడానికి ఆస్కారం లేదని పేర్కొంటున్నారు. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే చట్టబద్ధ వలసలను సగానికి సగం (10 లక్షల నుంచి 5 లక్షలకు) కుదించనున్నారనే అంశాన్ని ఉదాహరణగా చూపుతున్నారు.

నేపథ్యం...
ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమెరికాలోని స్వదేశీ నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో హెచ్-1బీ వీసాలపై నిబంధనలు విధించింది. దీని కారణంగా దేశానికి విదేశీ విద్యార్థుల ద్వారా లభిస్తున్న వందల కోట్ల ఆదాయం చేజారిపోతోందనే విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ఉన్న ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లో విదేశీయులకు వీసాలు మంజూరు చేసే పదుల సంఖ్యలోని సెక్షన్లకు సవరణలు చేస్తూ రైజ్ యాక్ట్‌ను రూపొందించింది.

లాటరీ బదులు పాయింట్ల విధానం...
ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లోని పలు సెక్షన్లకు మార్పు చేస్తూ రైజ్ యాక్ట్ రూపొందించారు. ఇప్పటివరకు లాటరీలో ఇచ్చే వీసా విధానానికి స్వస్తిపలికి.. పాయింట్ల పద్ధతిని ఆవిష్కరించారు. వయసు, విద్యార్హతలు, ఇంగ్లిష్ నైపుణ్యం, వేతన ప్యాకేజీ తదితర పలు అంశాల ఆధారంగా ఒక్కోదానికి నిర్దిష్ట పాయింట్లు కేటాయించారు. పొందాల్సిన కనీస పాయింట్లు.. మొత్తంగా రావాల్సిన కనీస పాయింట్లు కూడా నిర్దేశించారు. ఇలా మొత్తంగా పొందాల్సిన కనీస పాయింట్లు 30.

ఇంగ్లిష్ నైపుణ్యం :
ఇంగ్లిష్ భాష నైపుణ్యాన్ని పరీక్షించేందుకు టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ లేదా అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ నిర్వహించే ఇతర లాంగ్వేజ్ పరీక్షల స్కోర్లు ఆధారంగా గరిష్టంగా 12 పాయింట్లు కేటాయిస్తారు. 60 శాతంలోపు పాయింట్లు/ బ్యాండ్స్ పొందితే రైజ్ యాక్ట్ పరిధిలో ఎలాంటి పాయింట్లు లభించవు. 60 నుంచి 80 శాతం మధ్యలో స్కోర్ పొందితే 6; 80 నుంచి 90 శాతం మధ్యలో 10 పాయింట్లు; 90 శాతం కంటే ఎక్కువ స్కోర్ సొంతం చేసుకుంటే 11 పాయింట్లు, నూటికి నూరు శాతం స్కోర్ సాధిస్తే 12 పాయింట్లు లభిస్తాయి.

వేతనం ఆధారంగా..
అన్నిటికంటే ముఖ్యమైనది వేతన ఆధారితంగా కేటాయించిన పాయింట్లు. ఇప్పుడు ఒక విభాగంలో అమెరికాలో ఇస్తున్న సగటు వేతనానికి అదనంగా ఎంత ఎక్కువ వేతనం ఇస్తే అంత ఎక్కువగా పాయింట్లు కేటాయిస్తారు. ప్రస్తుత సగటు వేతనానికి 300 శాతం ఎక్కువ ఇస్తే 13; 150 శాతం ఎక్కువ ఇస్తే 5 పాయింట్లు కేటాయిస్తారు.

కనీసం 30 :
విభాగాలు.. కేటాయించిన పాయింట్లపరంగా.. దరఖాస్తుదారులు కనీసం 30 పాయింట్లు సొంతం చేసుకుంటేనే దరఖాస్తుకు అనుమతి లభిస్తుంది. ఈ విధానం మనకు కలిసొచ్చేదిగా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

సానుకూల అంశాలివే...
వయసు:
22 నుంచి 25 ఏళ్ల మధ్యలో వారికి ఎనిమిది పాయింట్లు; 26 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండే వారికి పది పాయింట్లు కేటాయించడం.
భారతీయ అభ్యర్థులు పీజీ పూర్తి చేశాకే హెచ్-1బికి దరఖాస్తుకు ఉపక్రమిస్తారు. అప్పటికి వారి వయసు 23 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది.

విద్యార్హతలు: స్టెమ్ విభాగంలో అమెరికాలో పీజీ చేసిన వారికి ఎనిమిది, ఇతర దేశాల్లో పీజీ చేసిన వారికి ఏడు పాయింట్లు కేటాయించడం మరో సానుకూలాంశం. చాలామంది విద్యార్థులు అమెరికాలోనే పీజీ చేసి అక్కడే ఉద్యోగం కోసం యత్నించి హెచ్-1బికి దరఖాస్తు చేసుకుంటారు. కాబట్టి ఈ విభాగంలో ఎనిమిది పాయింట్లు దక్కడం ఖాయం.

ఇంగ్లిష్ నైపుణ్యం: మన విద్యార్థులు టోఫెల్, ఐఈఎల్‌టీఎస్‌లో మంచి పాయింట్లు, బ్యాండ్స్ పొందే విధంగా శిక్షణ తీసుకొని సత్ఫలితాలు సాధిస్తున్నారు. దీంతో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి కేటాయించే పాయింట్ల విషయంలోనూ మన వాళ్లు ముందంజలో నిలిచే అవకాశాలున్నాయి.

దరఖాస్తు ప్రక్రియ ఇలా...
రైజ్ యాక్ట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో ముందుగా అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తు, అర్హతల ఆధారంగా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌లోని స్క్రీనింగ్ కమిటీ పాయింట్లు కేటాయిస్తుంది.

ఇద్దరు అభ్యర్థులకు ఒకే పాయింట్లు వస్తే...
కేటాయింపు ప్రక్రియ సమయంలో ఇద్దరు అభ్యర్థులకు ఒకే సంఖ్యలో పాయింట్లు లభించి టై అయితే.. వారినుంచి ఒకరిని ఎంపిక చేసేందుకు అనుసరించాల్సిన విధానాన్ని కూడా రైజ్ యాక్ట్‌లో పొందుపర్చారు.
ఇద్దరు అభ్యర్థుల్లో ఎక్కువ విద్యార్హతలున్న వ్యక్తికి ప్రాధాన్యం ఇస్తారు.
సమాన ఒకే విద్యార్హతలుంటే ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ విషయంలోనూ ఒకే విధమైన పాయింట్లు పొందితే వయసును పరిగణనలోకి తీసుకుని 25 ఏళ్ల వయసుకు దగ్గరగా ఉన్న అభ్యర్థిని ఎంపిక చేస్తారు.

ఏడాది వరకు అవకాశం...
ఒకసారి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థికి వెంటనే వీసా మంజూరు కాకున్నా.. ఆ దరఖాస్తు ఏడాది పాటు (పన్నెండు నెలలు) గుర్తింపులో ఉంటుంది. నిర్దేశిత పన్నెండు నెలల వ్యవధిలో ఎలాంటి అవకాశం రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కనీస వేతన నిబంధనే ఇబ్బందికరం :
పాయింట్లపరంగా మన దేశస్థులు ముందంజలో నిలిచే అవకాశం ఉన్నా.. పాయింట్ల కేటగిరీల్లో వేతనాలకు కేటాయించిన పాయింట్లు నిబంధన మన అభ్యర్థులకు ఇబ్బందిగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైజ్ యాక్ట్ ప్రకారం- కనీసం 1.3 లక్షల డాలర్లకు సమానమైన వేతనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలోని పలు సంస్థల్లో పని చేస్తున్న భారత యువత పొందుతున్న వేతనం సగటున 80 నుంచి 90 వేల డాలర్ల మధ్య ఉంటోంది. ఇలాంటి పరిస్థితిలో ఒక్కసారిగా కనీస వేతనాన్ని 1.3 లక్షల డాలర్లకు పెంచడం కంపెనీలకు కొంత ఇబ్బందిఅనే వాదన వినిపిస్తోంది.

అయిదేళ్ల వరకు ప్రభుత్వ సదుపాయాలకు స్వస్తి :
ఇప్పటివరకు అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు (విద్య, సామాజిక భదత్ర తదితర) లభించేవి. రైజ్ యాక్ట్ ప్రకారం- మొదటి అయిదేళ్లు విదేశీ అభ్యర్థులకు ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించవు. దీంతో వృద్ధులైన తల్లిదండ్రులను డిపెండెంట్ వీసాతో తీసుకెళ్లేవారు ఆర్థికంగా కొంత భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అయిదేళ్ల తర్వాత అభ్యర్థి పౌరసత్వాన్ని పొడిగిస్తే.. అన్ని పథకాలకు అర్హులవుతారు.

అకడమిక్ అర్హతలకు పాయింట్లు...
యూఎస్‌లో పీహెచ్‌డీకి 13
ఇతర దేశాల్లో పీహెచ్‌డీకి 10
స్టెమ్ విభాగంలో అమెరికాలో పీజీకి 8
ఇతర దేశాల్లో పీజీకి 7
అమెరికాలో బ్యాచిలర్ డిగ్రీకి 6
ఇతర దేశాల్లో పూర్తి చేస్తే 5
అమెరికాలో హై స్కూల్ డిప్లొమాకు 1
విదేశాల్లో హై స్కూల్ డిప్లొమాకు 1

వయసులవారీగా..
18-21 ఏళ్లవారికి 6
22-25 ఏళ్లవారికి 8
26-30 ఏళ్లవారికి 10
31-35 ఏళ్లవారికి 8
36-40 ఏళ్లవారికి 6
41-45 ఏళ్లవారికి 4
46-50 ఏళ్లవారికి 2
50 ఏళ్ల పైబడినవారికి పాయింట్లు ఉండవు.
Published date : 28 Aug 2017 01:43PM

Photo Stories