Skip to main content

ఐఐటీ ప్లేస్‌మెంట్లలో ‘ కోర్‌ ’ సంస్థల హవా...

జతిన్‌.. ఐఐటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. అదే రంగంలోని సంస్థల్లో ఉద్యోగం చేయాలని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకున్నాడు. కానీ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌కు వచ్చిన కంపెనీల్లో తన కోర్‌ బ్రాంచ్‌కు సంబంధించిన సంస్థలు తక్కువగా ఉండటంతో రాజీపడి నాన్‌–కోర్‌ కంపెనీలో చేరిపోయాడు. ఇది ఇతడి ఒక్కడి పరిస్థితే కాదు..! ఆఫర్స్‌ ఆశించిన స్థాయిలో లేక గతంలో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్‌ ఇంజనీరింగ్‌.. వంటి కోర్‌ బ్రాంచ్‌ల అభ్యర్థులు చాలామంది నాన్‌ కోర్‌ కంపెనీల్లో చేరిపోయారు.

ఈ ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఐఐటీల క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌లో కోర్‌ సెక్టార్‌ కంపెనీల హవా సాగుతుండటమే ఇందుకు కారణం అంటున్నారు.

ఏడాది ఐఐటీ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌లో కోర్‌ బ్రాంచ్‌ల సందడి నెలకొంది. ఇటీవలి ప్రీ ప్లేస్‌మెంట్‌ సీజన్‌లో ఎక్కువ శాతం కోర్‌ ఆఫర్సే లభించాయి. త్వరలో ప్రారంభం కానున్న ఫైనల్‌ ప్లేస్‌మెంట్‌ సీజన్‌లోనూ కోర్‌ బ్రాంచ్‌ల అభ్యర్థులకు అవకాశాలు భారీగానే ఉంటాయని భావిస్తున్నారు.

పీపీవోలే నిదర్శనం :
ఇంజనీరింగ్‌ అభ్యర్థులు అకడమిక్స్‌లో భాగంగా ఏదైనా ఒక సంస్థలో కొద్దికాలం ఇంటర్న్‌షిప్‌ చేస్తారు. ఈ సమయంలో ప్రతిభ చూపినవారికి పూర్తి స్థాయి ఉద్యోగం కల్పించేలా సంస్థలు ఇచ్చే అవకాశం.. ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ (పీపీవో). ఈ ఏడాది పీపీవో సీజన్‌ను గమనిస్తే.. అన్ని ఐఐటీల్లో ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, మైనింగ్‌ రంగం వంటి కోర్‌ సెక్టార్‌ కంపెనీలు ముందంజలో నిలిచాయి. గతేడాదితో పోల్చితే 30 శాతం అధికం గా ఈ కంపెనీల నుంచి అవకాశాలు లభించాయి. పరిశోధన– అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగంలోనూ ఆఫర్ల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఐఐటీ ముంబైలో.. ఆర్‌అండ్‌డీకి సంబం«ధించిన కోర్‌ కంపెనీలు చేపట్టిన పీపీవో డ్రైవ్‌లో మంచి వృద్ధి నమోదవడం విశేషం. మరోవైపు పీపీవోల అంగీకారంలో విద్యార్థుల దృక్పథంలోనూ మార్పు వస్తోంది. నాన్‌–కోర్‌ కంపెనీలు అధిక మొత్తంలో వేతనాలు ఇవ్వజూపినా కాదని, కోర్‌ సెక్టార్‌ ఉద్యోగాల వైపే ఎక్కువమంది మొగ్గు చూపుతుండటం గమనార్హం.

పీఎస్‌యూలు కూడా..
గేట్‌ స్కోర్‌ ఆధారంగా.. నియామకాలు చేపట్టే ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) ఇటీవల ఐఐటీల్లోనూ క్యాంపస్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నాయి. ఇవి సైతం కోర్‌ బ్రాంచ్‌ అభ్యర్థుల కోసమే అన్వేషిస్తున్నాయి. ఇందుకోసం త్వరలో మొదలుకానున్న తుది ప్లేస్‌మెంట్‌ సీజన్‌లో తమ ప్రొఫైల్స్‌కు సరితూగే విద్యార్థుల సమాచారాన్ని ఇన్‌స్టిట్యూట్ల నుంచి తెప్పించుకుంటున్నాయి. దీని ఆధారంగా ఫైనల్‌ ప్లేస్‌మెంట్ల సమయానికి ఇంటర్వూ్య ప్రక్రియకు అర్హులైన అభ్యర్థులను ముందుగానే గుర్తించే పనిలో పడ్డాయి.

స్టార్టప్స్‌ సైతం :
గతేడాది క్యాంపస్‌ డ్రైవ్స్‌ నుంచి నిషేధానికి గురై ఈ ఏడాది అనుమతి పొందిన స్టార్టప్‌ సంస్థలూ కోర్‌ బ్రాంచ్‌లవైపు మొగ్గుచూపుతున్నాయి. జొమాటో, పేటీఎం, పెప్పర్‌ ఫ్రై, ఓనిక్‌ వంటివి సీఎస్‌ఈ అభ్యర్థులకు గాలం వేస్తున్నాయి. సగటున రూ. పది లక్షల నుంచి రూ.ఇరవై లక్షల వరకు వార్షిక వేతనం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐఐటీలకే పరిమితం కాకుండా ప్రముఖ ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలోనూ డ్రైవ్స్‌ నిర్వహించి దాదాపు 10 వేల మంది టెక్నికల్‌ అభ్యర్థులను నియమించుకోనున్నాయి.

ఐఐఐటీ–హెచ్‌కు.. యాపిల్‌ రాక!
ఐ–ఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌.. తొలిసారి భారత్‌లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనుంది. ఐఐఐటీ–హెచ్‌ దీనికి వేదిక కానుంది. ఇక్కడ డిసెంబర్‌లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ మొదలు కానున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్‌ నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు మంచి ఆఫర్స్‌ లభించే అవకాశం ఉన్నట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి. క్యాంపస్‌ రిక్రూట్‌ మెంట్స్‌ ఈసారి ఆశాజనకంగా ఉంటాయని చెప్పడానికి దీనినో ఉదాహరణగా పేర్కొనవచ్చు.

బి–స్కూల్స్‌లోనూ అదే తీరు...
మేనేజ్‌మెంట్‌ విద్యకు పేరుగాంచిన ఐఐఎంలు, ఇతర బి–స్కూల్స్‌లోనూ విద్యార్థులూ డొమైన్‌ ఆధారిత కంపెనీలకే ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. తాజాగా వీటిలో నమోదైన సమ్మర్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ (ఎస్‌పీవో) గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి.. ఐఐఎంలతో పాటు, ఎండీఐ, ఐటీఎం, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి ప్రముఖ బి–స్కూల్స్‌లో సమ్మర్‌ ప్లేస్‌మెంట్స్‌ 90 శాతంపైగా నమోదయ్యాయి. రెండు నెలల సమ్మర్‌ ఇంటర్న్‌ ట్రైనీలకు కనిష్టంగా రూ.లక్ష, గరిష్టంగా రూ. 2 లక్షలను స్టయిఫండ్‌గా అందించడం.. బి–స్కూల్స్‌లోనూ ఈ ఏడాది క్యాంపస్‌ డ్రైవ్స్‌ ఆశాజనకంగా ఉంటాయనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.

మరోవైపు బి–స్కూల్స్‌ ఎస్‌పీఓల విషయంలోనూ డొమైన్‌ సంబంధిత కంపెనీలే అధికంగా ఉండటం గమనార్హం. ప్రధానంగా బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్, ఎఫ్‌ఎంసీజీ సంస్థల హవా కనిపించింది.

ఐఐటీ పీపీవో విశేషాలు...

  • ∙ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గతేడాది కంటే 40 శాతం అధికంగా కోర్‌ సెక్టార్‌లో పీపీవోలు.
  • ఐఐటీ గువహటిలో ఈ సంఖ్య 30 శాతం.
  • ఐఐటీ ఢిల్లీలో అత్యధికంగా 80 శాతం పీపీవోలు కోర్‌ సెక్టార్‌ నుంచే వచ్చాయి.
  • ఐఐటీ ముంబైలో ఆర్‌అండ్‌డీ పీపీవోల్లో 80 శాతం వృద్ధి.
  • ∙బి స్కూల్స్‌లో ఎస్‌పీవోల పరంగా 19 ఆఫర్లతో ముందంజలో ఐఐఎం–ఎ.
  • ∙బి స్కూల్స్‌ ఎస్‌పీవోల్లో హెచ్‌ఆర్, ఫైనాన్స్‌ అభ్యర్థులకు ప్రాధాన్యం.
  • ∙తాము కోరుకున్న రంగాలవైపే ఆసక్తి చూపుతున్న విద్యార్థులు.
  • ∙కోర్‌ నైపుణ్యాలున్న అభ్యర్థుల కోసం ఇప్పటినుంచే అన్వేషణ ప్రారంభించిన పీఎస్‌యూలు.
  • ∙ఐఐటీ–ఖరగ్‌పూర్, ముంబైలలో క్యాంపస్‌ డ్రైవ్స్‌ నిర్వహించనున్న 100 పీఎస్‌యూలు.
  • ∙ఐఐటీల్లో మాన్యుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పెట్రోలియం సంస్థల నియామక సందడి.
  • ఐఐఎంలలో ఎఫ్‌ఎంసీజీ, కన్సల్టింగ్, బీఎఫ్‌ఎస్‌ఐ సెగ్మెంట్‌ సంస్థల హవా.
  • ఐఐఎంలలో కనిష్టంగా రూ. లక్ష, గరిష్టంగా రూ.రెండు లక్షలతో ఎస్‌పీవోలు.
  • ఐఐటీల్లో సగటున రూ.లక్షతో పీపీవోలు.

ప్రాధాన్యం పెరుగుతోంది...
ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ పరంగా కోర్‌ సెక్టార్స్‌కు ప్రాధాన్యం పెరుగుతున్నది వాస్తవమే. సంస్థలు ఎలక్ట్రికల్, మెకానికల్‌ తదితర కోర్‌ బ్రాంచ్‌ల విద్యార్థులకు అవకాశాలు ఇస్తున్నాయి. కోర్‌ నైపుణ్యాలకు అప్‌డేటెడ్‌ స్కిల్స్‌ తోడైతే క్యాంపస్‌లోనే కొలువు ఖాయం.
– ప్రొఫెసర్‌. బి.వెంకటేశం, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌–ఐఐటీ–హెచ్‌

‘సాఫ్ట్‌’ అభ్యర్థులకు ఆ నైపుణ్యాలు కీలకం :
సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొలువులు కోరుకునే సీఎస్‌ఈ, ఐటీ విద్యార్థులు తమ డొమైన్‌ నాలెడ్జ్‌తో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్, మెషిన్‌ లెర్నింగ్, ఐవోటీలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అప్పుడు పోటీలో ముందంజలో నిలిచే అవకాశాలు మెరుగవుతాయి.
–టీవీ దేవీప్రసాద్, ప్లేస్‌మెంట్‌ హెడ్, ఐఐఐటీ–హెచ్‌

Published date : 17 Nov 2017 05:11PM

Photo Stories