Skip to main content

వేగం, కచ్చితత్వమే..విజయ సాధనాలు..

దేశంలో మేనేజ్‌మెంట్ విద్యకు తలమానికంగా పరిగణించే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లలో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)కు యువతలో ఎంతో ఆదరణ ఉంది.. గతంతో పోల్చితే కొన్ని మార్పులతో సరికొత్త విధానంలో ఈ సారి క్యాట్‌ను నిర్వహించనున్నారు.. ఈ పరీక్షకు మరో ఎనిమిది వారాల సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి.. ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి..గత విజేతల సూచనలు, తదితర అంశాలపై విశ్లేషణ...

గతంలో క్యాట్ పరీక్షలో ఎక్కువ సంఖ్యలో స్లాట్లు ఉండేవి. కానీ ఈ సారి కేవలం రెండు రోజుల్లో ప్రతి రోజూ రెండు స్లాట్లలో పరీక్షను నిర్వహిస్తున్నారు. మొత్తం నాలుగు స్లాట్లలో పరీక్ష జరుగుతుంది. దాంతో గతంలో మాదిరిగా ప్రశ్నల పునరావృతం, నార్మలైజేషన్, స్కేలింగ్ వంటి ఇబ్బందులు ఈసారి తలెత్తకపోవచ్చు.

పెరిగిన ప్రశ్నలు-తగ్గిన సమయం:
గతంలో మాదిరిగానే ఈసారి కూడా రెండు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి. 1. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ 2. లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ. కాకపోతే ప్రశ్నల సంఖ్య, కేటాయించిన సమయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సవరించిన విధానం మేరకు ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. ఇందుకు కేటాయించిన సమయం 170 నిమిషాలు. గతంలో రెండు విభాగాల్లో కలిపి 60 ప్రశ్నలు వచ్చేవి (30 ప్రశ్నల చొప్పున). ఇందుకు సమయం 140 నిమిషాలు ఉండేది. అంటే ప్రశ్నల సంఖ్యను 60 నుంచి 100కు పెంచారు. అదనంగా 30 నిమిషాల సమయం కేటాయించారు. అంటే పెరిగిన ప్రశ్నల స్థాయిలో సమయాన్ని మాత్రం కేటాయించకపోడం గమనించాల్సిన కీలక అంశం. అంటే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అంతేకాకుండా గతంతో పోల్చితే వేగంగా, కచ్చితత్వంతో ప్రశ్నలను సాధించాల్సి ఉంటుంది. మెరుగైన స్కోర్ సాధనలో ఈ రెండు అంశాలే కీలకపాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు.

స్వేచ్ఛ-అదనంగా నెల:
గతంలో ప్రతి విభాగానికి నిర్దిష్ట సమయం అంటూ ఉండేది. కానీ తాజా మార్పుల నేపథ్యంలో అభ్యర్థులు తన ప్రాధాన్యం మేరకు ఏ విభాగాన్నైనా ఎంతసేపయినా చేయొచ్చు. ఈ అంశాన్ని తెలివిగా సద్వినియోగం చేసుకోవాలి. పట్టున్న అంశంలో ఎక్కువ స్కోర్ చేసేందుకు దీన్ని అవకాశంగా మలుచుకోవాలి. గత కొంత కాలం నుంచి క్యాట్ పరీక్షను అక్టోబర్‌లో నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఈసారి క్యాట్ నవంబర్‌లో జరుగుతుంది. అంటే ప్రిపరేషన్‌కు అదనంగా నెల రోజుల సమయం అందుబాటులోకి వచ్చింది.

50 రోజులకు పైగా:
క్యాట్ పరీక్షకు ఎనిమిది వారాలు అందే దాదాపు 50 రోజులకు పైగా సమయం మిగిలి ఉంటుంది. ఈ సమయంలో చదవడం, ప్రాక్టీస్ చేయడం, ప్రిపరేషన్‌తీరు విశ్లేషణ వంటి అంశాలకు ప్రాముఖ్యతనివ్వాలి. అదే సమయంలో ఆయా అంశాలకు సంబంధించిన ప్రాథమిక భావనలపై గట్టి పట్టు సాధించాలి. ఎందుకంటే క్యాట్ పరీక్ష సరళిని పరిశీలిస్తే.. ప్రశ్నలన్నీ దాదాపుగా ప్రాథమిక భావనలపైనే ఉంటున్నాయి. అంతేకాకుండా బలాలు, బలహీనతలను విశ్లేషించుకోవాలి. పట్టులేని అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ప్రయోజనకరం. ఇందులో మెరుగైన స్కోర్ చేయకున్నా ప్రశ్నల సరళి, ప్రిపరేషన్ తీరుపై ఒక అంచనా వస్తుంది. తదనుగుణంగా ప్రిపరేషన్ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవచ్చు.

ఏయే అంశాలకు:
గతా ప్రశ్నపత్రాల ఆధారంగా క్యాట్‌లో ఏయే అంశాలకు ప్రాధాన్యత లభిస్తుందనే విషయంలో స్పష్టత వస్తుంది. అయితే ప్రస్తుత విధానంలో ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని ప్రశ్నలను సాధించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో మోడ్రన్ మ్యాథమెటిక్స్‌ను విస్మరించకూడదు. ఎందుకంటే సులువైనవి అనే ఉద్దేశంతో అర్థమెటిక్, ఆల్జీబ్రా అంశాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అయితే ఈ అంశాల నుంచి ప్రశ్నలు తక్కువగా వస్తాయనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మొత్తంగా స్కోరింగ్ ప్రభావితం కావచ్చు.

విభాగాల వారీగా:
నిర్దిష్ట ప్రణాళిక, ఆచరణ ఉంటే క్యాట్‌లో విజయం సాధించడం సులభమే. విభాగాల వారీగా మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మంచిది. తద్వారా ఆయా విభాగాల్లోని అంశాల్లో మీ ప్రిపరేషన్ తీరు ఏవిధంగా ఉందో తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

చివరి నెల:
చివరి నెల పూర్తిగా పునశ్చరణకు కేటాయించాలి. కొత్తగా ఎటువంటి టాపిక్ చదవకపోవడమే మంచిది. ఈ సమయంలో పునశ్చరణను వారాలు, రోజుల వారీగా విభజించుకోవాలి. ఒకే అంశ ంపై ఎక్కువ సమయం వెచ్చించడం కంటే అన్ని అంశాలకు ప్రాధాన్యతనివ్వడం ప్రయోజనకరం. అంతేకాకుండా ప్రిపరేషన్ తీరును విశ్లేషించుకోవాలి. ఇందుకోసం మాక్ టెస్ట్‌లను ఉపయోగించుకోవాలి. వీటి ఫలితాలను విశ్లేషించుకోవడానికి కూడా తగిన సమయం కేటాయించాలి. స్కోరింగ్, బలాలు, వేగం, సాధించిన విధానం, ప్రశ్నల సరళి వంటి అంశాలాధారంగా మాక్ టెస్ట్ ఫలితాలను విశ్లేషించుకోవాలి.

సాధించే విధంగా:
క్యాట్ పరీక్షలో ప్రశ్న ఏవిధంగా వచ్చినా దాన్ని సాధించే విధంగా సిద్ధం కావాలి. ఇటువంటి పరీక్షల్లో ఒక సారి ఇచ్చిన ప్రశ్ననే కోణాన్ని మార్చి భిన్నంగా అడుగుతారు. కాబట్టి ప్రాథమిక భావనలపై పట్టు ఉంటే ప్రశ్న ఏ కోణంలో వచ్చినా సాధించవచ్చు. కనీసం రోజుకు నాలుగు గంటలు చదవాలి. ఏ విభాగానికి ఎక్కువ సమయం కేటాయించామనేది దాని కంటే అన్ని విభాగాల ప్రిపరేషన్‌కు సమయం సమంగా ఉండేలా చూసుకోవాలి.

నెగిటివ్ మార్కింగ్:
కొత్త విధానంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కచ్చితత్వం కీలక పాత్రను పోషిస్తుంది. నార్మలైజేషన్ పద్ధతిలో సులువైన ప్రశ్నకు తప్పు చేస్తే నెగిటివ్ మార్కింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

    Bavitha
  • చివరి ఎనిమిది వారాలు బలహీనంగా ఉన్న అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షకు ఏడాది సమయం ఉన్నా, ఒక రోజు మిగిలి ఉన్నా.. పట్టు లేని అంశాలపై దృష్టి సారించడం మంచిది. సాధ్యమైనంత వరకు ఆ అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష తేదీని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం సమయం తక్కువగా ఉంది. కాబట్టి ప్రస్తుత ప్రిపరేషన్ స్థాయిని రెండింతలు చేయాలి.
  • క్యాట్ అన్ని విభాగాలు కీలకమైనవే. ఏదో ఒక విభాగం ప్రత్యేకం అని చెప్పాలేం. అడిగే ప్రశ్నలు కూడా అందరూ భావిస్తున్నట్లుగా మరీ క్లిష్టంగా ఉండవు. ఆయా అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా సులభమైన ప్రశ్నలు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే సాధించడం ప్రయోజనకరం. ఏవైనా ప్రశ్నలు మిగిలి ఉంటే వాటిని చివరగా ప్రయత్నించాలి.
  • క్యాట్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో మాక్ టెస్ట్‌లు ఎక్కువ ప్రయోజనంగా ఉంటాయి. ఎందుకంటే మన ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవడానికి మాక్ టెస్ట్‌లకు మించిన సాధనం మరొకటి లేదు. తద్వారా ఏయే అంశాల్లో మెరుగవ్వాలో అనే విషయంపై స్పష్టత వస్తుంది. పరీక్ష రాసిన ప్రతి సారి ఫలితాలను విశ్లేషించుకోవాలి. ఏ ప్రశ్నను ప్రయత్నించలేదు, ఏ ప్రశ్నకు తప్పు సమాధానం ఇచ్చారు, ఎందుకు తప్పు సమాధానం గుర్తించారు వంటి అంశాల ప్రాతిపదికగా మాక్ టెస్ట్‌ల ఫలితాలను మూల్యాంకనం చేసుకోవాలి. ఆ ప్రశ్నలు ఏ అంశాలకు సంబంధించినవో గుర్తించి.. వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అప్పుడే మెరుగైన స్కోర్ సాధించవచ్చు.
  • గతంలో విభాగాల వారీగా నిర్దిష్ట సమయం ఉండేది. కానీ ప్రస్తుతం ఈ నిబంధనను సవరించారు. కాబట్టి మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ద్వారా మాత్రమే క్యాట్‌లో ఏవిధంగా సమయపాలన పాటించవచ్చు అనే అంశంపై స్పష్టత వస్తుంది. ఈ విషయంలో మాక్ టెస్ట్‌లను ప్రామాణికంగా తీసుకోవడం మేలు.
  • క్యాట్ నిర్వహణలో తీసుకువచ్చిన నూతన మార్పులు ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో నేను పరీక్ష రాసినప్పుడు ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్ ప్రశ్నలను నిర్దిష్ట సమయం కంటే ముందే పూర్తి చేశాను. కానీ మ్యాథమెటిక్స్ విభాగంలో అన్ని ప్రశ్నలను ప్రయత్నించడానికి సమయం సరిపోలేదు. సవరించిన నిబంధనల మేరకు మీ ప్రాధాన్యత మేరకు విభాగాల వారీగా సమయాన్ని కేటాయించుకునే స్వేచ్ఛ లభిస్తుంది. కాకపోతే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ స్వేచ్ఛ కొంత కఠినమైంది. ఎందుకంటే పెరిగిన ప్రశ్నలతో చూస్తే కేటాయించిన సమయం తక్కువ. కాబట్టి ప్రశ్నల ఎంపికలో తెలివిగా వ్యవహరించాలి.
  • ప్రిపరేషన్‌లో కానీ, పరీక్షలో కానీ మెరుగైన స్కోర్ ఏ విధంగా సాధించాలి? అనే అంశంపైనే మన ధ్యాసంతా ఉండాలి. దానికనుగుణంగా వ్యూహాలు రూపొందించుకోవాలి. అప్పుడే మంచి పర్సంటైల్ సాధ్యమవుతుంది.


    Bavitha
  • క్యాట్ పరీక్షలో విజయానికి వేగం, కచ్చితత్వం అనే అంశాలు కీలక సాధనాలు. చివరి ఎనిమిది వారాలు సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ క్రమంలో సులభమైన ప్రశ్నలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. నూతన విధానంలో ఈ సామర్థ్యం నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చు. ముఖ్యమైనవి అని భావించే అంశాలు, ప్రశ్నలపై అధికంగా దృష్టి సారించాలి. వారానికి కనీసం రెండు మాక్ టెస్ట్‌లకైనా హాజరు కావాలి. పరీక్షలో చివర్లో చేద్దామనే ఉద్దేశంతో చాలా ప్రశ్నలను వదిలేయవడం సమంజసం కాదు. అన్నిటి కంటే రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగం చాలా కీలకమైంది. కాబట్టి ఇందులో మెరుగైన స్కోర్ సాధించేందుకు వీలుగా రీడింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి.
  • నూతన విధానంలో క్యాట్‌ను నిర్వహిస్తున్నారు. కాబట్టి రెండు విభాగాల్లో కటాఫ్‌ను చేరుకోవడం ప్రధానం. అయితే అదే సమయంలో పట్టు ఉన్న విభాగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది.
  • మాక్ టెస్ట్‌లనేవి చాలా కీలకం. కాకపోతే వీటికి సంబంధించి.. సాధించిన, సాధించని ప్రశ్నల విషయంలో ఎన్నో అంశాలను గమనించాల్సి ఉంటుంది. సాధించని ప్రశ్నల విషయానికొస్తే.. వాటికి సంబంధించిన కొత్త భావనలను నేర్చుకోవాలి. సాధించిన వాటి విషయంలో.. ఉదాహరణకు ఒక కఠినమైన ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించడానికి నాలుగు నిమిషాల పడితే.. ఆ అంశంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గమనించాలి. దాన్ని నిమిషంలో సాధించేలా ప్రిపరేషన్‌ను సాగించాలి.
  • నూతన విధానంలో మొదటి సారి క్యాట్‌ను నిర్వహిస్తున్నారు. కాబట్టి పరీక్షలో పాటించాల్సిన సమయపాలనపై ఒక అంచనాకు రావడానికి మాక్ టెస్ట్‌లే మెరుగైన మార్గం. కాకపోతే క్యాట్ పరీక్ష ఎప్పుడూ అభ్యర్థులను ఆలోచనకు, ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి సిద్ధంగా ఉండడం మంచిది.
  • అభ్యర్థులు తమకు పట్టు ఉన్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశాన్ని ఈ నూతన విధానం కల్పిస్తుంది. కాబట్టి మెరుగైన స్కోర్ సాధించడంలో ఈ అంశం కీలకపాత్ర పోషించవచ్చు.
  • ఎప్పుడు టాప్ స్కోర్ సాధించాలనే లక్ష్యంతో ఉండాలి. మాక్ టెస్ట్‌లు కీలకమే. కాకపోతే వాటి ఫలితాలతో నిరుత్సాహం చెందకూడదు. వాటిని నేర్చుకోవడానికి ఒక మంచి మాధ్యమంగా మాత్రమే భావించాలి. వాటి ఆధారంగా ప్రిపరేషన్ స్థాయి పెంచుకోవాలి. అప్పుడే మెరుగైన స్కోర్ సాధ్యమవుతుంది.
Published date : 26 Sep 2014 12:00PM

Photo Stories