Skip to main content

ఉజ్వలమైన కెరీర్‌కు.. క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్

దేశవిదేశాల్లో దినదిన ప్రవర్థమానమవుతున్న రంగం.. అడ్వర్‌టైజింగ్. నేటి మార్కెటింగ్ యుగంలో ప్రతి వస్తువుకూ ప్రచారం అవసరమే. అందుకే ప్రకటనల రంగం అభివృద్ధి పథంలో సాగుతోంది. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం క్లయింట్లు అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీని ఆశ్రయిస్తుంటారు. ఇక్కడ క్లయింట్లకు, ప్రకటన సంస్థకు మధ్య వారధిగా పనిచేసే నిపుణులుంటారు. వారే.. క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్లు. ఏజెన్సీకి వీరు వెన్నెముక లాంటివారు. క్లయింట్ల అవసరాలు, ఆకాంక్షలను తెలుసుకొని ఏజెన్సీకి తెలియజేస్తారు. సంస్థ వ్యాపార కార్యకలాపాలు, మనుగడ వీరి సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీల సంఖ్య పెరుగుతుండడంతో క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్లకు కూడా డిమాండ్ అధికమవుతోంది. ప్రకటనలు, ప్రచారంపై ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలోకి నిరభ్యంతరంగా ప్రవేశించొచ్చు. ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.

ప్రతిరోజూ నూతన అనుభూతి: క్లయింట్ సర్వీసింగ్ నిపుణులకు ప్రకటన సంస్థలతోపాటు కార్పొరేట్ ఆర్గనైజేషన్లు, వస్తూత్పత్తుల సంస్థలు, టీవీ చానళ్లలోనూ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అడ్వర్‌టైజింగ్‌తో ముడిపడి ఉన్న ప్రతి రంగంలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. సర్వీసింగ్ మేనేజర్లు నేరుగా క్లయింట్లతో మాట్లాడాల్సి ఉంటుంది. వారి అవసరాలకు అనుగుణంగా ప్రకటనలు రూపొందించడం, ప్రచారం చేసిపెట్టడం వంటి బాధ్యతలను పర్యవేక్షించాలి. కస్లమర్ల ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించాలి. సంస్థ వ్యాపారాన్ని పెంచేది క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్లే. ఇందులో ప్రతిరోజూ కొత్తగానే ఉంటుందని, విసుగుదల రాదని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు.

నైపుణ్యాలు: క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్లు తీవ్ర ఒత్తిళ్ల మధ్య కూడా కష్టపడి పనిచేయగలగాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ స్పిరిట్ తప్పనిసరిగా ఉండాలి. బిజినెస్ సెన్స్ అవసరం. ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ పెంచుకోవాలి. టైమింగ్‌‌సతో నిమిత్తం లేకుండా పగలు, రాత్రి ఎప్పుడైనా పనిచేసే సామర్థ్యం ఉండాలి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కచ్చితంగా కాపాడుకోవాలి.

అర్హతలు: గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అడ్వర్‌టైజింగ్/మార్కెటింగ్‌లో డిప్లొమా కోర్సు చదివి, క్లయింట్ సర్వీసింగ్ రంగంలో అడుగుపెట్టొచ్చు. మాస్ కమ్యూనికేషన్/ఎంబీఏ కోర్సులు చదివినవారు సైతం ఇందులో రాణించొచ్చు.

వేతనాలు: పనిచేస్తున్న అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీ స్థాయిని బట్టి జీతభత్యాలు ఉంటాయి. ఎంబీఏ పూర్తిచేసి, ఈ రంగంలో కొంత అనుభవం సంపాదిస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు పొందొచ్చు. మేనేజ్‌మెంట్ ట్రైనీకి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వేతనం అందుతుంది. అకౌంట్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.18 వేల నుంచి రూ.20 వేలు, సీనియర్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, అకౌంట్ మేనేజర్‌కు రూ.26 వేల నుంచి రూ.34 వేలు, అకౌంట్ డెరైక్టర్‌కు ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షలు, మేనేజ్‌మెంట్ సూపర్‌వైజర్‌కు ఏడాదికి రూ.12 లక్షలు, క్లయింట్ సర్వీసింగ్ డెరైక్టర్‌కు రూ.11 లక్షల నుంచి రూ. 17 లక్షల దాకా వేతనాలు ఉంటాయి.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
    వెబ్‌సైట్:
      www.uohyd.ac.in
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-ఢిల్లీ
    వెబ్‌సైట్:
      www.iimc.nic.in
  • జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్
    వెబ్‌సైట్:
      www.xaviercomm.org
  • జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్.
    వెబ్‌సైట్:
    jbims.edu/
Published date : 17 Oct 2014 01:09PM

Photo Stories