Skip to main content

ప్రముఖ ప్రొఫెసర్ల లెక్చర్‌‌స @NPTEL

మన దేశంలో యూనివర్సిటీలు/కళాశాలల్లో ప్రధాన సమస్య నిష్ణాతులైన ఫ్యాకల్టీ లేకపోవడం. దీంతో సరైన బోధన లభించక సబ్జెక్టుపై విద్యార్థులు పట్టు సాధించలేక పోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ.. ఐఐటీలు, ఐఐఎస్సీతో కలిసి ఎన్‌పీటీఈఎల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా కూర్చున్న చోట నుంచే ఐఐటీల ప్రొఫెసర్లు, ప్రముఖ శాస్త్రవేత్తలు చెప్పే వీడియో పాఠాలను చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్‌పీటీఈఎల్ కోర్సులు, ప్రయోజనాలు...
ఎన్‌పీటీఈఎల్ అంటే?
నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్‌కు సంక్షిప్త నామం ఎన్‌పీటీఈఎల్. ఏడు ఐఐటీలు (బాంబే, ఢిల్లీ, గువహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ), బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) సంయుక్తంగా ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థుల కోసం అందిస్తున్న ఆన్‌లైన్ వీడియో లెక్చర్లు, సర్టిఫికేషన్ కోర్సుల సమాహారమే ఎన్‌పీటీఈఎల్. ఇందులో ఈ-లెర్నింగ్ ద్వారా ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థుల కోసం మెటీరియల్, ఆన్‌లైన్ వీడియోలను అందుబాటులో ఉంచారు.

ఉపయోగాలేంటి?
భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయ అభివృద్ధి సాధించడానికి నాణ్యమైన ఇంజనీరింగ్, సైన్స్ విద్య చాలా అవసరం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐఐటీల నుంచి ఏటా చాలా మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సేవలందిస్తున్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పుల దృష్ట్యా వేగంగా అభివృద్ధి సాధించాలంటే మరింత మంది నాణ్యమైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అవసరం. కానీ చాలా ఇంజనీరింగ్ కాలేజీలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని, అనుభవం లేని వారిని లెక్చరర్లుగా నియమించుకుంటున్నాయి. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఈ లోటు పూడ్చడానికే ఎన్‌పీటీఈఎల్ ఆవిర్భవించింది. ఐఐటీలతోపాటు, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల్లోని అధ్యాపకుల లెక్చర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులతో పాటు బోధన వృత్తిలో ఉన్నవారికి ఈ కోర్సులు చాలా ఉపయోగకరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు నైపుణ్యాలు పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కూడా పోటీ ప్రపంచంలో మరింత రాణించడానికి అదనపు స్కిల్స్ పొందొచ్చు.

ఉచితంగానే వీడియోలు..
ఎన్‌పీటీఈఎల్‌లో ఆన్‌లైన్ వీడియో తరగతులు ఉచితంగా లభిస్తాయి. ప్రస్తుతం ఇందులో ఎన్నో వీడియో లెక్చర్స్, మరెన్నో వెబ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నిర్ణీత వ్యవధిలో కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఆయా విద్యా సంస్థలు అందించే సర్టిఫికెట్లు కూడా పొందొచ్చు. ఈ సర్టిఫికెట్లు పొందినవారికి పరిశ్రమలు, కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యతనిస్తున్నాయి.

ఎన్‌పీటీఈఎల్‌లో ఉన్న కోర్సులు
ఎన్‌పీటీఈఎల్ ద్వారా ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అట్మాస్ఫియరిక్ సైన్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిజైన్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్, మేనేజ్‌మెంట్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్, మైనింగ్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ, ఓషియన్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, బేసిక్ కోర్సులు (సెమిస్టర్ 1, 2), మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మొదలైనవి.

వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఎన్‌పీటీఈఎల్ అందించే వీడియో లెక్చర్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా సంబంధిత వెబ్‌సైట్‌లో రిజిస్టరై, లాగిన్ కావాలి. ఆ తర్వాత ఫైర్‌ఫాక్స్, ఐఈ-8, సఫారీ లాంటి బ్రౌజర్ల ద్వారా కావాల్సిన సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం లేనివారికి క్లాసులకు సంబంధించిన డీవీడీలు లభిస్తాయి. ఒక్కో డీవీడీ ఖరీదు రూ. 200. ఒక డీవీడీలో 35 నుంచి 40 లెక్చర్లు ఉంటాయి.

వెబ్‌సైట్: www.nptel.ac.in/
Published date : 28 Jul 2016 04:18PM

Photo Stories