Skip to main content

ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగాలకు ‘గేట్’వే

గేట్‌లో సాధించిన స్కోర్‌తో ఐఐటీలు/ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ వంటి కోర్సులు అభ్యసించొచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగాన్ని సాధించి అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలు గేట్-2014 స్కోర్ ఆధారంగా ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు..

గతంలో పబ్లిక్ సెక్టార్ కంపెనీలు.. వాటిల్లో ఉద్యోగాలకు వేర్వేరుగా ప్రత్యేక రాత పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టేవి. ఇందులో భాగంగా రాత పరీక్షతోపాటు అభ్యర్థుల ఆప్టిట్యూడ్, వ్యక్తిత్వం, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు వంటి అంశాల్లో ప్రతిభను పరీక్షించేవారు. ఇలా ప్రతి పీఎస్‌యూ సొంత ఎంపిక విధానాన్ని అనుసరించడం వల్ల అటు కంపెనీలు, ఇటు అభ్యర్థులు వ్యయప్రయాసలకు లోనయ్యేవారు. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి 2010 నుంచి ప్రభుత్వ రంగ కంపెనీలు గేట్‌లో వచ్చిన స్కోర్‌ను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. తుది ఎంపికలో గేట్ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు కల్పిస్తున్నాయి.

విజయం సాధించండిలా
ప్రాథమిక సూత్రాల అవగాహన కీలకం:
మిగతా ప్రవేశ పరీక్షల్లా కాకుండా గేట్ పరీక్షలో ప్రశ్నలు ఎక్కువ శాతం ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. అభ్యర్థి సంబంధిత సబ్జెక్టుల్లోని ప్రాథమిక భావనలను ఎలా అర్థం చేసుకున్నాడో తె లుసుకునేలా ప్రశ్నలు అడుగుతారు. గేట్ పరీక్షలో మొత్తం 100 మార్కులకు 65 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతోపాటు న్యూమరికల్ ప్రశ్నలు కూడా ఉంటాయి. న్యూమరికల్ ప్రశ్నలను ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టనున్నారు.

విద్యార్థుల అవగాహన లోపంతో లేదా సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల గుర్తించే తప్పు జవాబులను ముందుగానే ఊహించి ఆప్షన్స్‌లో పొందుపరచడం ఈ పరీక్షలో ప్రత్యేక అంశం. ఒక విద్యార్థి చేసే సామాన్య తప్పుల మూలంగా వచ్చిన జవాబు పొందుపరిచిన ఆప్షన్స్‌లో ఉండే అవకాశం చాలా ఎక్కువ. అందువల్ల ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఎటువంటి తప్పులు దొర్లకుండా మొట్టమొదటి ప్రయత్నంలోనే సరైన జవాబును పొందే విధంగా తగినంత ప్రాక్టీస్ చేయాలి.

2014 నుంచి గేట్ పూర్తిగా ఆన్‌లైన్ పరీక్షగా మారింది. అందువల్ల ముందుగా కొన్ని ఆన్‌లైన్ పరీక్షలు ప్రాక్టీస్ చేయడం మంచిది.

బట్టీ తరహా, జ్ఞాపకశక్తి ఆధారిత పరీక్షలకు గేట్ పరీక్షలో ప్రాధాన్యత చాలా తక్కువ. అందువల్ల సంబంధిత యూనిట్లలోని ప్రాథమిక భావనలు, ఫండమెంటల్స్‌తోపాటు విశ్లేషణాత్మక అధ్యయనం తప్పనిసరి.

గేట్‌లో ఉత్తీర్ణత కోసం ఇంజనీరింగ్ మూడో ఏడాది నుంచి ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకోవాలి.
గత 10-15 ఏళ్లుగా అడిగిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం వల్ల గేట్‌లో మంచి స్కోర్ సాధించవచ్చు.

అభ్యర్థులకు సూచనలు
ఈ కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవాళ్లు ముందుగా గేట్-2014కు దరఖాస్తు చేసుకోవాలి.
వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి కంపెనీలు నిర్దేశించిన వయసును మించకూడదు. ఓబీసీ (ఎన్‌సీఎల్)కు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
గేట్ అడ్మిట్ కార్డ్‌పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసేటప్పుడు స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో (500 కేబీ)ను సిద్ధంగా ఉంచుకోవాలి.
సంబంధిత వివరాలన్నీ పూర్తిచేశాక చివరలో ఉండే సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత యూనిక్ అప్లికేషన్ ఐడీ వస్తుంది.

పూర్తిచేసిన దరఖాస్తును ప్రింటవుట్ తీసుకుని దానిపై ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి. సంతకం కోసం ఉన్న ఖాళీలో సంతకం చేయాలి. ఈ ప్రింటవుట్ దరఖాస్తును ఇంటర్వ్యూ వరకు భద్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా గేట్‌కు దరఖాస్తు చేసుకున్నాక దాని ప్రింటవుట్ కూడా తీసుకుని భద్రపరచుకోవాలి. గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్/ఇంటర్వ్యూకు ఎంపికైతే గేట్ ప్రింటవుట్ దరఖాస్తు, అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్ తీసుకువెళ్లాలి.

దరఖాస్తు చేసుకునేటప్పుడు గేట్ దరఖాస్తులో ఏ వివరాలైతే (పేరు, పుట్టిన తేదీ, చిరునామా) నింపారో అవే వివరాలను సంబంధిత కంపెనీల దరఖాస్తులోనూ నింపాలి.

కొన్ని కంపెనీలు దరఖాస్తు రుసుం వసూలు చేస్తుండగా, మరికొన్ని ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు.
అభ్యర్థులు ఏడాది శిక్షణ తర్వాత కనీసం మూడేళ్లపాటు పనిచేస్తామనే హామీని కంపెనీకి ఇవ్వాలి. దీని ప్రకారం నిర్దేశించిన రుసుమును బాండ్ రూపంలో చెల్లించాలి.

అయా కంపెనీల్లో ఏ విభాగాల్లో అయితే నియామక ప్రకటనలు వెలువడ్డాయో అదే ఇంజనీరింగ్ బ్రాంచ్ పేపర్‌తో గేట్ రాయాలి.

కెరీర్
ఈ ప్రభుత్వ రంగ కంపెనీలన్నీ మంచి పని వాతావరణం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థి చదువుకున్న ఇంజనీరింగ్‌కు సంబంధించి విధులను నిర్వహించే అవకాశం ఈ ఉద్యోగాలలో లభిస్తుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేని స్థిరత్వం గల ఉద్యోగాలను ఈ కంపెనీలు అందిస్తున్నాయి.
{పవేశస్థాయిలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, ఇంజనీర్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ తదితర పేర్లతో అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ఆ తర్వాత పనితీరు అనుభ వాన్ని బట్టి అత్యుత్తమస్థాయికి చేరుకోవచ్చు.

ఎంపికైన అభ్యర్థులను ఆయా కంపెనీలు అప్రెంటీస్‌లుగా లేదా ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి. ఈ కాలంలో స్టైపెండ్ ఇస్తాయి. కొన్ని కంపెనీల్లో వసతి సౌకర్యం కూడా లభిస్తుంది. శిక్షణా కాలం కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది.

పీఎస్‌యూ కంపెనీలు వేతనాల విషయంలో కార్పొరేట్ కంపెనీలతో ఏ మాత్రం తీసిపోకుండా పోటీ పడుతున్నాయి. ముఖ్యమైన కంపెనీల్లో ప్రారంభ వేతనంగా ఏడాదికి సగటున ఏడు లక్షల రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయలు లభిస్తున్నాయి. చాలా పీఎస్‌యూలు మొదట అభ్యర్థులను కొంతకాలం శిక్షణకు నియమిస్తాయి. తర్వాత నిర్దిష్ట వేతనంతో శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తాయి.
పూర్తికాల ఉద్యోగులుగా ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని అలవెన్సులు, సౌకర్యాలు వర్తిస్తాయి.

2014 గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు కల్పిస్తున్న సంస్థలు
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
విభాగాలు.. అర్హత: మెకానికల్; సివిల్; ఎలక్ట్రికల్; ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్; ఇన్‌స్ట్రుమెంటేషన్:

అర్హత: జనరల్, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, సంబంధిత బ్రాంచ్‌తో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ నమోదుకు ప్రారంభ తేదీ: నవంబర్ 5, 2013
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 7, 2014
వెబ్‌సైట్: www.hpclcareers.com

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఎలక్ట్రికల్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీల కోసం పవర్‌గ్రిడ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది.
అర్హత: 65 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ (పవర్)/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ బ్రాంచ్‌తో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. సంబంధిత కోర్సులు ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులూ అర్హులే.

ఎంపిక విధానం: గేట్-2014 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈక్రమంలో గేట్ స్కోర్‌కు 85 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 3 శాతం, ఇంటర్వ్యూకు 12 శాతం వెయిటేజ్ ఉంటాయి.

శిక్షణ: ఎంపికైనవారికి ఏడాది శిక్షణ ఉంటుంది. దీన్ని పూర్తిచేసుకున్నవారిని ఇంజనీర్‌గా నియమిస్తారు.

వేతనాలు: శిక్షణలో రూ. 24900- రూ 50500 వరకు పేస్కేల్ ఉంటుంది. దాదాపుగా శిక్షణలో ఏడాదికి 7,65,000 రూపాయలు, శిక్షణ తర్వాత ఏడాదికి 13.4 లక్షల రూపాయలు పే ప్యాకేజ్ ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జనవరి మొదటి వారం, 2014
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి రెండోవారం, 2014
జీడీ/ఇంటర్వ్యూ: ఏప్రిల్/మే 2014
వెబ్‌సైట్: www.powergridindia.com.

ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్
ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
ట్రైనీ ఇంజనీర్:ఎలక్ట్రికల్(130); సివిల్(25); మెకానికల్ (25).
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌తో బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా బీటెక్ ఉత్తీర్ణత.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జనవరి 7, 2014
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 21, 2014
వెబ్‌సైట్: www.nhpcindia.com/career.htm

మజగావ్ డాక్ లిమిటెడ్
మజగావ్ డాక్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్(టెక్నికల్) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెక్నికల్): మెకానికల్ (24 పోస్టులు); ఎలక్ట్రికల్ (14 పోస్టులు); ఎలక్ట్రానిక్స్ (7 పోస్టులు).
అర్హత: 60 శాతం మార్కులతో మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ సంబంధిత బ్రాంచ్‌ల్లో బీటెక్ ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే.
వేతన శ్రేణి: రూ 16,400 - రూ 40,500
వార్షిక వేతనం: ఏడాదికి కనీసం 5.25 ల క్షల రూపాయల నుంచి గరిష్టంగా 12.9 లక్షల రూపాయల వరకు.
ఎంపిక విధానం: గేట్-2014లో స్కోర్ ఆధారంగా అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలుస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 15, 2013
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 29, 2013
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 18, 2014
వెబ్‌సైట్: www.mazagondock.gov.in

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
విభాగాలు:
ఆఫీసర్స్/ఇంజనీర్స్: కెమికల్(పెట్రోకెమికల్స్/పాలిమర్); సివిల్; కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ; ఎలక్ట్రికల్; ఇన్‌స్ట్రుమెంటేషన్; మెకానికల్.
అసిస్టెంట్ ఆఫీసర్స్/అసిస్టెంట్ ఇంజనీర్స్: కెమికల్ (పెట్రో కెమికల్, పాలిమర్); సివిల్; ఎలక్ట్రికల్; ఇన్‌స్ట్రుమెంటేషన్; మెకానికల్; మెట్లర్జికల్.
అర్హత: జనరల్, ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్థులు 65 శాతం (ఎస్సీ/ఎస్టీ, శారీరక వికలాంగులకు 55 శాతం) మార్కులతో సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. అభ్యర్థులు పై రెండు పోస్టు ల్లో ఏదో ఒకదానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వేతన శ్రేణి-ఆఫీసర్స్/ఇంజనీర్స్: నెలకు రూ.24,900తోపాటు ఇతర అలవెన్సులు. వార్షిక వేతనం రూ. 10.50 లక్షల రూపాయలు.
వేతన శ్రేణి-అసిస్టెంట్ ఆఫీసర్స్/అసిస్టెంట్ ఇంజనీర్స్: నెలకు రూ. 20,600 బేసిక్ పేతోపాటు ఇతర అలవెన్సులు. వార్షిక వేతనం ఏడు లక్షల రూపాయలు.
ఎంపిక: గేట్-2014 స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ:డిసెంబర్18, 2013
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 2, 2014
వెబ్‌సైట్: www.iocl.com.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మెకానికల్, కెమికల్ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ ర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 20, 2013
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31, 2014
వెబ్‌సైట్: www.bpclcareers.in

ఎన్‌టీపీసీ లిమిటెడ్
పోస్టు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇంజనీర్
విభాగాలు: ఎలక్ట్రికల్; మెకానికల్; సివిల్; ఇన్‌స్ట్రుమెంటేషన్; ఎలక్ట్రానిక్స్.
అర్హత: 65 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్ తో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే.
ఎంపిక విధానం: గేట్-2014 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీడీలో, ఇంటర్వ్యూల్లో నిర్దేశిత మార్కులు సాధించాలి.
వేతన శ్రేణి: రూ.24,900- రూ.50,500 వరకు. ఏడాది శిక్ష ణలో నెలకు రూ. 24,900 బేసిక్ పే ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి నెలకు రూ.25,650 బేసిక్ పే అందిస్తారు.వీటికి అదనంగా ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంపిక విధానం: గేట్ -2014 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 20, 2013
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 18, 2014
వెబ్‌సైట్: www.ntpccareers.net.
Published date : 20 Sep 2013 03:40PM

Photo Stories