Skip to main content

నైపుణ్యాలకు నవ్య పథం.. ఇంటర్న్‌షిప్!

సైద్ధాంతిక పరిజ్ఞానం విద్యార్థికి ఓ కొత్త అంశాన్ని పరిచయం చేస్తే, ప్రాక్టికల్ పరిజ్ఞానం ఆ అంశం లోతుపాతుల్ని ఒంటబట్టిస్తుంది! ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలకే పెద్దపీట. నియామకాల సందర్భంగా ఓ విద్యార్థి తరగతిగదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలను ఎంత వరకు క్షేత్రస్థాయిలో ఆచరించి చూపగలరనే దాన్ని పరిశ్రమలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు చదివేవారు కోరుకున్న కొలువు దక్కించుకునేందుకు ఇంటర్న్‌షిప్స్ కీలకమవుతున్నాయి. ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘‘ఎంహెచ్‌ఆర్‌డీ ఇంటర్న్‌షిప్ స్కీమ్’’ ప్రారంభించిన నేపథ్యంలో.. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఆవశ్యకత, ప్రయోజనాలపై ప్రత్యేక కథనం...

ఇంటర్న్‌షిప్స్.. క్యాంపస్‌లో ఉన్నప్పుడే పరిశ్రమల కార్యకలాపాలపై శిక్షణ, పని అనుభవాన్ని పొందడానికి తోడ్పాటును అందిస్తున్నాయి. విద్యార్థి దశలోనే ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందిస్తున్నాయి. ‘‘ఇటీవలి కాలంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు విద్యా ప్రాంగణాల్లోనే పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను మలిచే పనిలో నిమగ్నమవుతున్నాయి. ఇందులో భాగంగా టాప్ ఇంజనీరింగ్ క్యాంపస్‌లలోని ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. వారికి తమ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశమిస్తున్నాయి. ఆపై గ్రాడ్యుయేషన్ పూర్తయిందే తడవు ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నాయి’’ అంటున్నారు ట్రిపుల్ ఐటీ ప్లేస్‌మెంట్ హెడ్ టీవీ దేవీప్రసాద్. ఇంజనీరింగ్ విద్యార్థులకు.. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది.

ఎంహెచ్‌ఆర్‌డీ ఇంటర్న్‌షిప్ స్కీమ్-2014
ఇంటర్న్‌షిప్‌ను అకడమిక్ స్థాయిలో వివిధ కోర్సులకు అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో ‘ఎంహెచ్‌ఆర్‌డీ ఇంటర్న్‌షిప్ స్కీమ్-2014’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకానికి దేశ, విదేశాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థలో ఎడ్యుకేషన్, సోషల్ సెన్సైస్, సైన్స్, హ్యుమానిటీస్, మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, ఐసీటీ, లా కోర్సుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ కోర్సులు చేస్తున్న వారు అర్హులు. ఐఐటీ, ఐఐఎం, పరిశోధన/అభివృద్ధి సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు, భాషా విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు తదితరాల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ కాల వ్యవధి రెండు నెలలు, అవసరాన్ని బట్టి ఆరు నెలల వరకు పొడిగిస్తారు. ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసిన వారికి నెలకు రూ.10 వేల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. పథకం మొదటి బ్యాచ్ ఇంటర్న్‌షిప్ అక్టోబర్ 1న ప్రారంభమైంది. మిగిలిన బ్యాచ్‌లకు ఔత్సాహిక విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: mhrd.gov.in

ప్రముఖ సంస్థల్లో అవకాశాలు
బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, హెచ్‌ఏఎల్, ఇస్రో వంటి సంస్థలు ఇంటర్న్‌షిప్ అందిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో ఎల్ అండ్ టీ, టీసీఎస్, విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నాయి. వీటికోసం ఎప్పటికప్పుడు ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. వివిధ విభాగాల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను అందించడంలో డీఆర్‌డీవో, సీసీఎంబీ, ఐఐఆర్‌ఎస్, ఏఆర్‌సీఏ తదితర సంస్థలు ముందుంటున్నాయి. విద్యార్థులు నోటిఫికేషన్ వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకొని ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని అందుకోవచ్చు.

డీఆర్‌డీవో: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో).. ఏటా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తోంది. సంస్థకు చెందిన ప్రాజెక్టు కార్యకలాపాల్లో పాల్గొనేలా చేసి ప్రాక్టికల్ పరిజ్ఞానం అందిస్తోంది. విద్యార్థుల అర్హతలు, అవసరాలకు అనుగుణంగా సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న లేబొరేటరీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం పొందొచ్చు. సాధారణ సమయంతోపాటు వేసవిలోనూ ప్రత్యేక ఇంటర్న్‌షిప్ ప్రవేశాలు కల్పిస్తోంది.
వెబ్‌సైట్: www.drdo.gov.in

సీసీఎంబీ: సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ).. విద్యార్థులకు ఏటా వేసవిలో ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తుంది. విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల్లో సైన్స్ బ్రాంచ్‌ల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. పరిశోధన వాతావరణం వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ ఇంటర్న్‌షిప్ దోహదం చేస్తుంది. విద్యార్థులకు సీసీఎంబీ సైంటిస్టులు మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు.
వెబ్‌సైట్: www.ccmb.res.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్:
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అనుబంధ విభాగమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్‌ఎస్).. విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్, ఇంటర్న్‌షిప్‌లకు వీలు కల్పిస్తోంది. విద్యార్థులకు ఐఐఆర్‌ఎస్ ఫ్యాకల్టీ సభ్యులు గైడ్/సూపర్‌వైజర్‌గా వ్యవహరిస్తారు. ఎంఎస్సీ, ఎంఎస్సీ (టెక్), ఎంఈ, ఎంటెక్, ఎంఫిల్, ఎంసీఏ తదితర కోర్సులు చేస్తున్న విద్యార్థులు రీసెర్చ్ ప్రాజెక్టు చేపట్టే అవకాశాన్ని ఐఐఆర్‌ఎస్ కల్పిస్తోంది. వేసవి శిక్షణ అవకాశాన్ని సంస్థ ఉద్యోగ సంబంధీకులతో పాటు ఐఐటీ, బిట్స్ పిలానీ, ఐఐఎస్సీ, నిట్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు.
వెబ్‌సైట్: www.iirs.gov.in

ఏఆర్‌సీఐ: ఇంటర్నేషనల్ అడ్వాన్‌‌సడ్ రీసెర్‌‌చ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ).. పూర్తికాల సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులో ఉంచుతోంది. ఏటా వేసవి సెలవుల్లో (మే నుంచి జూన్ చివరి వరకు) ఈ శిక్షణ ఉంటుంది. ప్రారంభంలో విద్యార్థులను బ్యాచ్‌కు 6-8 మంది ఉండేలా ఐదారు బ్యాచ్‌లుగా విభజిస్తారు. వీరికి వారం పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీని తర్వాత ఒక్కో విద్యార్థిని ఒక్కో శాస్త్రవేత్త పరిధిలో ఉంచుతారు. ఈ శాస్త్రవేత్త పర్యవేక్షణలో విద్యార్థి ఓ చిన్న ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంటుంది. చివర్లో దీనికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాలి. వీటిని పరిగణనలోకి తీసుకుని ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. ఎంటెక్/ఎంఈ/ఎంఎస్సీ మొదటి ఏడాది పూర్తిచేసిన వారు, బీటెక్/బీఈ రెండు, మూడో ఏడాది విద్యార్థులు వేసవి శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
వెబ్‌సైట్: www.arci.res.in

ఇంటర్న్‌షిప్‌తో ప్రాక్టికల్ స్కిల్స్
‘‘విద్యార్థులు తరగతి గదిలో కేవలం అకడమిక్స్ అంశాలను మాత్రమే నేర్చుకుంటారు. వీటికి సంబంధించిన ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో మాత్రమే పొందగలరు. ముఖ్యంగా సాంకేతిక కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఉన్నత కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ప్రాక్టికల్ పరిజ్ఞానమే దిక్సూచి. ఇటీవలి కాలంలో బహుళజాతి సంస్థలు.. ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి, ఉచితంగా ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. తర్వాత ప్లేస్‌మెంట్స్ పొందడానికి తోడ్పాటునందిస్తున్నాయి. ఎంహెచ్‌ఆర్‌డీ ప్రకటించిన ఇంటర్న్‌షిప్ పథకం విద్యార్థులను ప్రోత్సహించేదిగా ఉంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు నిర్ణీత కాల వ్యవధిలో ముఖ్యంగా వేసవిలో ఇంటర్న్‌షిప్‌ను అందిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకొని కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు’’
డాక్టర్ బి.సుధీర్ ప్రేమ్‌కుమార్,
మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్, జేఎన్‌టీయూహెచ్
Published date : 17 Oct 2014 03:41PM

Photo Stories