Skip to main content

ఇంజనీరింగ్‌కు ఇవి తోడుంటేనే భవిత

ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాల అంతరంపై జాబ్ మార్కెట్ నిపుణులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
‘బాగా శ్రమించి, సీటు సంపాదించాం..’ అంటూ రిలాక్స్ అవకుండా కాలేజీలో చేరిన తొలిరోజు నుంచే నాలుగేళ్ల తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుంటూ ముందడుగు వేయాలని, ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలని, అప్పుడే కోరుకున్న కెరీర్ సొంతమవుతుందని...ఈ నేపథ్యంలో విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.

జాబ్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు సబ్జెక్టు నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్, సెల్ఫ్ మోటివేషన్, లీడర్‌షిప్, ప్రాబ్లం సాల్వింగ్ తదితర సాఫ్ట్‌స్కిల్స్ కూడా ముఖ్యమే. చదువుతున్న బ్రాంచ్‌కు సంబంధించి తరగతిగదిలో నేర్చుకున్న అంశాలు, వాటి అనువర్తనాలను సబ్జెక్టు నైపుణ్యాలుగా చెప్పుకోవచ్చు. వీటికి సాఫ్ట్‌స్కిల్స్ తోడైతేనే ఒక సంస్థలో ఉద్యోగిగా చేరేందుకు, తర్వాత కెరీర్ పరంగా దూసుకెళ్లేందుకు వీలవుతుంది. అందుకే విద్యార్థులు మొదట్నుంచే అకడమిక్ స్కిల్స్‌కు సమాంతరంగా సాఫ్ట్‌స్కిల్స్ పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలి.

నైపుణ్యాలు
1. కమ్యూనికేషన్ స్కిల్స్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సబ్జెక్టుల పరంగా ఎన్ని నైపుణ్యాలున్నా, వాటిని సరిగా వ్యక్తీకరించలేకపోతే ఫలితం శూన్యం. అందుకే కాలేజీలో చేరిన రోజు నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించు కోవడంపై దృష్టిసారించాలి. ప్రస్తుతం కమ్యూనికేషన్‌లో ఇంగ్లిష్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇంగ్లిష్ చానళ్లు వీక్షించడం, దినపత్రికలు, మ్యాగజైన్లు చదవడం ద్వారా భాషపై పట్టు సాధించొచ్చు. కాలేజీల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌లు కూడా ఉంటున్నాయి. వీటిని సమర్థంగా ఉపయోగించుకోవాలి. కాలేజీల్లో నిర్వహించే గ్రూప్ డిస్కషన్స్, యాక్టివిటీస్‌లోనూ పాల్గొనాలి. తోటి విద్యార్థులు, ఫ్యాకల్టీతో ఇంగ్లిష్‌లో సంభాషించేందుకు ప్రాధాన్యమివ్వాలి. రైటింగ్, ప్రెజెంటేషన్ స్కిల్స్ పెంచుకునే దిశగానూ విద్యార్థులు ప్రయత్నించాలి. ప్రొఫెషనల్ స్టడీస్‌లో మంచి అకడమిక్ రికార్డు సాధించడంలో ఈ రెండు స్కిల్స్ ముఖ్యం. కేస్ స్టడీలు రాయడం, ప్రాజెక్ట్ రిపోర్టులు రూపొందించడంలో రైటింగ్ స్కిల్స్ కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కమ్యూనికేషన్ నైపుణ్యాల్లో లాంగ్వేజ్ స్కిల్స్, ఎక్స్‌ప్రెషన్, నెగోషియేషన్, ప్రజెంటేషన్, ఇంటరాక్షన్ వంటివి ముఖ్యమైనవి. వీటిని పెంపొందించుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. విదేశాల్లో ఉన్నతవిద్య లేదా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ముందుగానే ఆయా దేశాల భాషలు నేర్చుకోవడం మంచిది. ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఉన్నతవిద్యకు జర్మనీని ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటారు. అందువల్ల ఆ దేశానికి వెళ్లాలనుకునే వారు జర్మన్ భాష నేర్చుకుంటే మంచిది.

2. టీమ్ లీడింగ్ స్కిల్స్
ఓ సమర్థుడైన నాయకుడే ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేయగలడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, బృందాన్ని ముందుకు నడిపిస్తూ పనిచేసే చోట శభాష్ అనిపించుకోగలడు. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల ఎంపికలో టీమ్ లీడింగ్ స్కిల్స్ కీలకంగా మారాయి. అందుకే విద్యార్థులు కాలేజీలో ఉన్నప్పుడే వీటిని పెంపొందించుకోవాలి. దీనికోసం కళాశాలల్లో నిర్వహించే గ్రూప్ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలి. టెక్ ఫెస్ట్స్, కల్చరల్ ఫెస్ట్స్, స్పోర్ట్స్ కాంపిటేషన్స్, సెమినార్లు, బృంద చర్చలు వంటివాటిలో పాల్గొనడం ద్వారా టీమ్ లీడింగ్ స్కిల్స్ పెంపొందించుకోవచ్చు. అలా కాకుండా బిడియంతో వెనకవెనకే ఉండిపోతే ఉన్నత కెరీర్ ఎండమావే అవుతుంది.

3. సృజనాత్మక ఆలోచన
ప్రస్తుతం కంపెనీలు.. తమ ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించి, సరికొత్త ఉత్పత్తులు, సేవలకు ఊపిరి పోయాలని గట్టిగా కోరుకుంటున్నాయి. అప్పుడే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ముందు వరసలో స్థానం లభిస్తుందని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే రిక్రూటర్లు.. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థి ఆలోచనా తీరును పరీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇంజనీరింగ్ విద్యార్థులు బట్టీ పద్ధతికి స్వస్తి చెప్పి, బేసిక్ కాన్సెప్టుల ఆధారంగా అన్వయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ కొత్త ఆలోచనలను బయటకు తీయాలి. ఆ ఆలోచనల్లో పదునెంత అనేదాన్ని తోటి విద్యార్థులు, ఫ్యాకల్టీ సహాయంతో తెలుసుకోవాలి. ఎందుకు? ఏమిటి? ఎలా? ఎప్పుడు?.. ఈ ప్రశ్నలే కొత్త ఆలోచనకు పునాది. ఏమో.. ఆ ఐడియానే మీ జీవితాన్నే మార్చేయొచ్చు! వెంచర్ క్యాపిటలిస్టులు క్యూ కట్టే పరిస్థితీ రావొచ్చు.

4. సమస్య పరిష్కార నైపుణ్యాలు
కంపెనీలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కాలు చూపే ఉద్యోగులను స్పెషల్ ప్యాకేజీలతో సన్మానిస్తున్నాయి. వయసులో చిన్న అయినా సరే సీఈవో సీట్లో సైతం కూర్చోబెట్టేందుకు వెనకాడటం లేదు. ఇలాంటి చురుకైన మానవ వనరుల కోసం రిక్రూటర్లు కాలేజీ క్యాంపస్‌ల్లో అన్వేషిస్తున్నారు. ఇంటర్వ్యూల సమయంలో అప్పటికప్పుడు ఏదైనా ఒక సమస్య ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమని అడుగుతున్నారు. ఈ సమయంలో అధిక శాతం మంది విద్యార్థులు చేతులెత్తేస్తున్నారు. అందుకే ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఎప్పటికప్పుడు తమ బ్రాంచ్‌కు సంబంధించి కొత్త పరిణామాలను తెలుసుకుంటూ అప్‌డేటెడ్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆయా అంశాలకు సంబంధించి వివిధ సమస్యలకు తనదైన పరిష్కారాన్ని చూపగలిగే నేర్పును సొంతం చేసుకునేందుకు ప్రయత్నించాలి. పజిళ్లు సాధించడం, మైండ్ మ్యాపింగ్ వంటివి మెదడుకు పదును పెడతాయి.

5. ఉద్వేగ ప్రజ్ఞ (ఈఐ)
తోటి ఉద్యోగులు, ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించగలిగే ప్రవర్తన; వినియోగదారుల ఉద్వేగాలను అర్థం చేసుకుంటూ, కంపెనీల వ్యూహాలకు పదునుపెట్టే నేర్పు; ఒత్తిడిని చిత్తుచేస్తూ నిలబడి డెడ్‌లైన్ లోపు ప్రాజెక్టును పూర్తిచేయగలిగే సత్తా.. ఇలాంటి లక్షణాలున్న విద్యార్థులకు కంపెనీలు రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. అందుకే విద్యార్థులు కాలేజీ దశలోనే ఈ నైపుణ్యాలను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఓ అధ్యయనం ప్రకారం కళాశాలల నుంచి బయటకు వస్తున్న వారిలో 77 శాతం మందిలో ఉద్వేగ ప్రజ్ఞ (ఈఐ) లేనట్లు తేలింది. నెగిటివ్ ఆలోచనలు మానుకోవడం, ఇతరులపట్ల సహానుభూతితో వ్యవహరించడం, ఎదుటివారు చెప్పే మాటలకు విలువ ఇవ్వడం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఈఐను పెంచేవే.

కాలేజీలో వ్యవహరించండిలా..
  • మెంటారింగ్ సెల్స్: ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలలు ప్రత్యేకంగా మెంటారింగ్ సెల్స్‌ను అందుబాటులో ఉంచుతున్నాయి. సబ్జెక్టు పరంగా లేదా ఇతర దేనికి సంబంధించి అయినా సందేహాలుంటే వీటిద్వారా విద్యార్థులు నివృత్తి చేసుకోవచ్చు. మెంటార్లలో ఎక్కువ మంది సీనియర్లు ఉండటం వల్ల విద్యార్థులు నిస్సంకోచంగా తమ సందేహాలను నివృత్తి చేసుకొని, ముందడుగు వేయొచ్చు.
  • పాక్టికల్ నైపుణ్యాలు: ఇంజనీరింగ్ విద్యార్థులు కేవలం తరగతి గది పాఠాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రాధాన్యమివ్వాలి. విద్యార్థి జీవితాన్ని శాసించేది ఇవేనన్న విషయాన్ని మరవకూడదు. ఏ విషయాన్నయినా ప్రాక్టికల్ దృక్పథంతో అధ్యయనం చేయాలి. దీనికి ల్యాబ్ సెషన్స్‌ను సమర్థంగా ఉపయోగించుకోవాలి. తరగతిగదిలో చదివిన అంశాలకు సంబంధించి క్షేత్ర స్థాయి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఇంటర్న్‌షిప్‌లను ఉపయోగించుకోవాలి. ఫేక్, కాపీ-పేస్ట్ ప్రాజెక్టుల జోలికి పోకుండా నిబద్ధతతో ప్రాజెక్టు వర్క్ చేయాలి.
  • సెల్ఫ్ లెర్నింగ్: ఇంటర్మీడియెట్ అంటే అంతా స్పూన్ ఫీడింగే. ఇంజనీరింగ్‌లో అలాంటి పరిస్థితి ఉండదు. ప్రత్యేక శ్రద్ధతో స్వీయ అభ్యసనం కొనసాగిస్తేనే సక్సెస్ సొంతమవుతుంది. దీన్ని గుర్తించి విద్యార్థులు కాలేజీలో చేరిన తొలిరోజు నుంచే ఈ దిశగా అడుగులేయాలి. చొరవతో లెక్చరర్లు, సీనియర్ల సహాయం తీసుకోవడం; డిజిటల్ లైబ్రరీ, లేబొరేటరీలు, సబ్జెక్టు క్లబ్బులు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను సమర్థంగా ఉపయోగించుకుంటూ రడీ టు జాబ్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. కేవలం తమ బ్రాంచ్‌కు సంబంధించి జ్ఞాన సముపార్జనకే పరిమితం కాకుండా తమ డొమైన్ ఏరియాలోని ఇతర సబ్జెక్టులపైనా అవగాహన పెంపొందించుకోవడం (Multi disciplinary learning) కూడా కెరీర్ పరంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల కోర్ సబ్జెక్టుల పరిధికి మించి, కొత్త అంశాలను తెలుసుకునేందుకు వీలవుతుంది. భవిష్యత్తులో విధి నిర్వహణలో వివిధ విభాగాలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మల్టీడిసిప్లినరీ నైపుణ్యాలు ఉపయోగపడతాయి.
  • ఆన్‌లైన్ లెర్నింగ్: ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్‌లైన్ లెర్నింగ్.. అప్‌డేటెడ్ నాలెడ్జ్ పెంచుకునేందుకు అద్భుత మార్గం.. Massively Open Online Courses (MOOCs). దీనిద్వారా చాలా సరళంగా, సబ్జెక్టు నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. కొన్ని మూక్స్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థల కోర్సులు పూర్తిచేస్తే, ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కూడా లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం కూడా SWAYAM పేరుతో మూక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఐఐటీ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల ఫ్యాకల్టీ రూపొందించిన కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి. పరిశ్రమల అవసరాలకు తగిన స్కిల్స్ పెంపొందించుకునేందుకు ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం మంచి వేదిక.
ఓ అధ్యయనం ప్రకారం 2020 నాటికి డిమాండింగ్ జాబ్ ప్రొఫైల్స్
  • డేటా ఆర్కిటెక్ట్
  • సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టు
  • కంప్యూటర్ విజన్ ఇంజనీర్
  • ఎంబెడెడ్ సిస్టమ్ ప్రోగ్రామర్
  • డేటా సైంటిస్ట్
  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్
  • 3డీ ప్రింటింగ్ టెక్నీషియన్
  • సస్టయినబిలిటీ ఇంటిగ్రేషన్ ఎక్స్‌పర్ట్
  • వైర్‌లెస్ నెట్‌వర్క్ స్పెషలిస్టు
  • ఆటోమొబైల్ అనలిటిక్స్ ఇంజనీర్
కొత్తగా ఇంజనీరింగ్‌లో ప్రవేశించాలనుకునే వారు వీటికి అనుగుణంగా నైపుణ్యాలకు పదునుపెట్టుకోవాలి.

స్వీయ అభ్యసనకు ప్రాధాన్యమివ్వాలి
ఇంజనీరింగ్‌లో చేరిన తొలిరోజే విద్యార్థులు.. ‘‘మనం ఎందుకు ఈ కోర్సులో చేరాం? మన లక్ష్యాలు ఏమిటి? వాటిని చేరుకోవాలంటే ఏం చేయాలి?’’ వంటి ప్రశ్నలు వేసుకోవాలి. అప్పుడే ప్రయాణించాల్సిన మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. లేదంటే అంతా గందరగోళమే. విద్యార్థులు సెల్ఫ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి. తమ బ్రాంచ్‌కు సంబంధించి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. ఇంటర్న్‌షిప్స్, మినీ ప్రాజెక్టులు, సర్టిఫికేషన్స్ చాలా ముఖ్యమైనవి. వీటిని చిత్తశుద్ధితో పూర్తిచేయాలి. భవిష్యత్ కెరీర్ దృష్ట్యా బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు సంబంధించి షార్ట్‌టర్మ్ సర్టిఫికేషన్స్ ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరం. అదే విధంగా విద్యార్థులు ఆయా బ్రాంచ్‌లకు సంబంధించిన అప్లికేషన్స్ సబ్జెక్టుల సర్టిఫికేషన్స్‌పై దృష్టిసారించాలి. దీనికోసం మూక్స్ కోర్సులను ఉపయోగించుకోవాలి. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్)లో ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలా అన్ని అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకున్నప్పుడే బెస్ట్ ఇంజనీర్ కల సాకారమవుతుంది.
- డా. ఎన్.ఎల్.ఎన్.రెడ్డి, హెడ్-ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్, సీబీఐటీ.

నాలెడ్జ్ షేరింగ్‌తోనే..
నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో ముఖ్యమైంది స్టడీ ప్లాన్. సెమిస్టర్ వారీగా ప్లాన్ రూపొందించుకొని, దాన్ని పక్కాగా అనుసరించాలి. చివరి నిమిషంలో ‘ఆల్ ఇన్ వన్’ పుస్తకాలు చదివి, పరీక్షలు రాయడం వల్ల మార్కులు వస్తాయేమోగానీ, నాలెడ్జ్ రాదు. సబ్జెక్టుకు రెండు, మూడు టెక్స్ట్‌బుక్‌లు రిఫర్ చేయడం మేలు. మన దేశ ఆథర్స్‌తోపాటు విదేశీ ఆథర్స్ పుస్తకాలు చదవడం వల్ల ఎౌఛ్చ ఞ్ఛటటఞ్ఛఛ్టిజీఠ్ఛి అలవడుతుంది. ఇంటర్మీడియెట్‌లో మాదిరి ఇండివిడ్యువల్ లెర్నింగ్ కాకుండా ఇంజనీరింగ్‌లో గ్రూప్ లెర్నింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి. నాలెడ్జ్ షేరింగ్ విజయానికి చాలా ముఖ్యమైంది. థియరీకి ప్రాక్టికల్ పరిజ్ఞానం తోడైతేనే లెర్నింగ్ సంపూర్ణమవుతుందని గుర్తించి.., ల్యాబ్‌లు, ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలి. ఏ బ్రాంచ్ విద్యార్థులైనా సీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందించుకోవడం ముఖ్యం. సివిల్, మెకానికల్ విద్యార్థులు దీనిపై దృష్టిసారించకపోవడం వల్ల చివర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకడమిక్ స్కిల్స్‌కు సమాంతరంగా సాఫ్ట్‌స్కిల్‌కు కూడా విద్యార్థులు ప్రాధాన్యమివ్వాలి.
- ప్రొఫెసర్ వి.ఉమామహేశ్వరరావు,
ప్లేస్‌మెంట్ ఆఫీసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఓయూ).
Published date : 11 May 2018 05:27PM

Photo Stories