Skip to main content

హ్యాకర్లకు చెక్ పెట్టే.. ఐటీ సెక్యూరిటీ

సమాచార సాంకేతిక (ఐటీ) పరిజ్ఞానం రాకతో అన్ని రంగాల్లో కంప్యూటర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్‌లైన్‌లోనే అన్ని లావాదేవీలు జరుగు తున్నాయి. అదే సమయంలో సమాచార చోరు లు (హ్యాకర్లు) తమ హస్తలాఘవం చూపుతు న్నారు. కంప్యూటర్లలోని విలువైన డేటాను తస్కరిస్తున్నారు. దీనివల్ల కంపెనీలు నష్ట పోతున్నాయి. కోలుకోలేని విధంగా దెబ్బతింటు న్నాయి. కొన్నిసార్లు దేశభద్రతకు సంబంధించిన కీలక సమాచారం కూడా శత్రుదేశాలకు చేరి పోతోంది. ఇది ఆందోళనకరమైన పరిణామం. ఈ నేపథ్యంలో హ్యాకర్ల బారినుంచి కంప్యూటర్లను రక్షించేందుకు ఐటీ సెక్యూరిటీ నిపుణుల వినియో గం పెరిగింది. ఐటీ సెక్యూరిటీ ఉద్యోగాలకు, ఉపాధికి ఢోకా లేని కెరీర్‌గా మారింది.కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లోని కంప్యూటర్లు ఎక్కువగా హ్యాకర్ల బారిన పడుతున్నాయి. ఇటీవలి కాలంలో అన్ని రంగాల్లోనూ ఈ బెడద అధికమైంది.

కేసుల విచారణలో సాయం:
కంప్యూటర్లలోకి నకిలీ సాఫ్ట్‌వేర్‌లను, వైరస్‌లను పంపి, సమాచారాన్ని తస్కరించి, సొమ్ము చేసుకుంటున్న ముఠాలు ఉన్నాయి. ఏది ఎలాంటి సాఫ్ట్‌వేరో తెలియని పరిస్థితి. ఇదంతా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోంది. హ్యాకర్ల పంజాకు గురైన ఎన్నో సంస్థలు ఐటీ సెక్యూరిటీ నిపుణులను నియమించుకుంటున్నాయి. ప్రమాద తీవ్రత అందరికీ తెలియడంతో అన్ని రంగాల్లో వీరి నియామకం జరుగుతోంది. ఐటీ సెక్యూరిటీ లో మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి.. కంప్యూటర్ హ్యాకింగ్‌కు గురైతే అందుకు కారణాన్ని గుర్తించడం. రెండోది.. ఎక్కడి నుంచి హ్యాకింగ్ జరిగిందో గుర్తించడం. మూడోది.. నకిలీ సాఫ్ట్‌వేర్‌ను, వైరస్‌లను తొలగించి, మరోసారి హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఈ మూడు దశల్లో పనిచేయాల్సి ఉంటుంది. వీరి ప్రధాన బాధ్యత ఆన్‌లైన్ మోసాలను అరికట్టడం. అంతేకాకుండా సెక్యూరిటీ కంప్యూటర్ అప్లికేషన్లను రూపొందించాలి. ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన కేసుల విచారణకు దర్యాప్తు సంస్థలు ఐటీ సెక్యూరిటీ నిపుణుల సాయం తీసుకుంటున్నాయి. నేరస్థులను చట్టం ముందు నిలబెట్టేందుకు వీరి సేవలు అవసరమవుతున్నాయి.

అర్హతలు: మనదేశంలో అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో ఐటీ సెక్యూరిటీపై ఎలాంటి కోర్సులు లేవు. అయితే, బీసీఏ, బీటెక్ కోర్సుల్లో భాగంగా ఐటీ సెక్యూరిటీని ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలంటే ఇది సరిపోదు. బీటెక్ పూర్తిచేసిన వారు ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) కోర్సు చేస్తే మంచి అవకాశాలుంటాయి.

వేతనాలు: ఐటీ సెక్యూరిటీ నిపుణులకు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం అందుతుంది. నైపుణ్యాలను పెంచుకుంటే నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు పొందొచ్చు. ఎంసీఏ, బీటెక్ చేస్తే ఇంకా ఎక్కువ వేతనం లభిస్తుంది.

ఐటీ సెక్యూరిటీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  • ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    www.ignou.ac.in
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
    వెబ్‌సైట్:
    www.iisecurity.in
  • ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ-కాంచీపురం
    వెబ్‌సైట్:
    www.srmuniv.ac.in
  • అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ
    వెబ్‌సైట్:
    www.imt.edu
ఐటీ సెక్టార్‌లో వన్నెతగ్గని కెరీర్
‘‘ఐటీ రంగంలో వన్నెతగ్గని కోర్సుగా ఐటీ సెక్యూరిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆన్‌లైన్ మార్కెటింగ్, ఇంటర్నెట్ వినియోగం ఎంతగా వ్యాప్తిచెందితే.. ఈ రంగంలో అంతగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఐటీ దిగ్గజాల నుంచి సాధారణ వస్త్రదుకాణం వరకూ అంతటా కంప్యూటర్ వినియోగం పెరిగింది. ఆన్‌లైన్‌లో వ్యాపార లావాదేవీలు మరింత విస్తృతమవు తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణుల అవసరం నానాటికీ పెరుగుతుంది. టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటే అవకాశాలకు కొదవ ఉండదు. సాఫ్ట్‌వేర్ సంస్థలూ ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరుగుతున్న కొద్దీ నకిలీ కార్డులను అదుపు చేసేందుకు ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం పెరిగింది. మార్కెట్‌లో ఎంతో డిమాండ్ ఉన్న ఈ కోర్సుతో ఉపాధి, సంతృప్తి రెండూ లభిస్తాయి. వేతనం విషయానికొస్తే ప్రారంభంలో నెలకు రూ.15వేల వరకు అందుకోవచ్చు. అనుభవం, నైపుణ్యాలు పెంచుకుంటే అధిక వేతనాలు పొందొచ్చు.
- శివకుమార్,
జనరల్ మేనేజర్, జూమ్ టెక్నాలజీస్
Published date : 24 Jul 2014 12:12PM

Photo Stories