Skip to main content

గేట్ స్కోర్ ఆధారంగా...పీఎస్‌యూల్లో కొలువులు

గేట్ స్కోర్ ఆధారంగా దేశంలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్ (పీఎస్‌యూ)ల్లో కొలువునూ సొంతం చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, ట్రైనీ ఇంజనీర్స్ వంటి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ఖాయం చేసుకోవచ్చు. గేట్-2018 స్కోర్‌తో ఆయా ఉద్యోగాల భర్తీకి పలు పీఎస్‌యూలు ప్రకటనలు విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ఆయా ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఎంత స్కోర్ సాధిస్తే ఇంటర్వ్యూ కాల్ ఆశించొచ్చు? గేట్‌కు వెయిటేజీ, పలు పీఎస్‌యూలు విడుదల చేసిన నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం...
రూ.లక్షల్లో వార్షిక వేతనంతో ఉద్యోగం.. 30 ఏళ్లకుపైగా సుస్థిర కెరీర్.. ఒక్కసారి కుదురుకుంటే ఉజ్వల భవిష్యత్ ఖాయం! పీఎస్‌యూలలో ఉద్యోగం అంటే.. యువతలో నెలకొన్న క్రేజ్ ఇది. అందుకే.. ఏటా గేట్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కారణం.. గత నాలుగేళ్లుగా గేట్ స్కోర్ ఆధారంగా పీఎస్‌యూలు నియామకాలు చేపడుతుండటమే! గేట్ స్కోర్‌తో పీఎస్‌యూ నియామకాలు చేపట్టే ట్రెండ్ 2012లో ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా లక్షల మంది అభ్యర్థులు గేట్ 2018కు దరఖాస్తు చేసుకుంటున్నారు, పీఎస్‌యూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
 
ఎంత స్కోర్ చేయాలి!
 గేట్ పరీక్షలో 65 ప్రశ్నలకు వంద మార్కులు కేటాయించారు. వాటిని వేయి స్కోర్‌కు స్కేలింగ్ జరుగుతుంది. పీఎస్‌యూలు మలిదశలో నిర్వహించే జీడీ/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలకు ఎంపికవ్వాలంటే.. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు గేట్ స్కోర్ 750 సాధించాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు గేట్ స్కోర్ 500  వరకు సాధిస్తే.. తదుపరి దశకు కాల్ లెటర్ అందుకునే అవకాశముంది.  
 
వెయిటేజీ ఆధారంగా తుది జాబితా...
గేట్ స్కోర్ ఆధారంగా పీఎస్‌యూలు జరిపే మలిదశ  రెండంచెల ఎంపిక ప్రక్రియలో.. అభ్యర్థులు  గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. మరికొన్ని సంస్థలు గ్రూప్ డిస్కషన్‌తోపాటు గ్రూప్ టాస్క్ అనే మరో ప్రత్యేక ఎంపిక ప్రక్రియను సైతం నిర్వహిస్తుండటం విశేషం. పీఎస్‌యూలు.. తుది జాబితాను ఖరారు చేసేందుకు ప్రధానంగా మూడు అంశాలకు వెయిటేజీ ఇస్తున్నాయి. అవి.. గేట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ. మొత్తం వంద మార్కులకు గణించే వెయిటేజీలో.. అధిక శాతం పీఎస్‌యూలు గేట్‌స్కోర్‌కు 75శాతం వెయిటేజీ; మలిదశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్‌లకు గరిష్టంగా పది శాతం; ఇంటర్వ్యూకు పదిహేను శాతం చొప్పున వెయిటేజీ కల్పిస్తున్నాయి. మరికొన్ని పీఎస్‌యూలు గేట్ స్కోర్‌కు 60 శాతం నుంచి 65 శాతం వెయిటేజీ ఇస్తూ.. మిగతా మొత్తాన్ని జీడీ/పీఐలకు కేటాయిస్తున్నాయి. అభ్యర్థులు ఆయా దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా.. వారు పొందిన వెయిటేజీని లెక్కిస్తారు. వెయిటేజీలో మంచి మార్కులు సొంతం చేసుకున్న వారు తుది జాబితాలో నిలిచి నియామకాలు ఖరారు చేసుకుంటారు. 
 
గ్రూప్ డిస్కషన్ ఇలా...
 గ్రూప్ డిస్కషన్ పరంగా ఐదు నుంచి పది మంది అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పరచి వారికి ఏదైనా ఒక అంశం ఇచ్చి చర్చించమని అడుగుతారు. ఈ ప్రక్రియ మొత్తం అరగంట నుంచి గంట వ్యవధిలో ఉంటుంది. ఒక్కో అభ్యర్థికి సగటున అయిదు నిమిషాలు సమయం లభించే అవకాశముంది. ఈ సమయంలోనే అభ్యర్థులు సదరు అంశంపై తమ అభిప్రాయాలు తెలియజేయడం.. బృందంలోని ఇతర సభ్యులు పేర్కొన్న అభిప్రాయాలపైనా స్పందించడం.. అంతిమంగా తమ నిర్ణయం లేదా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడం వంటివి చేయాల్సి ఉంటుంది.
 
గ్రూప్ టాస్క్ : 
ఇటీవల కాలంలో కొన్ని ప్రముఖ పీఎస్‌యూలు అనుసరిస్తున్న మరో విధానం.. గ్రూప్ టాస్క్. ఇందులో ఏదైనా ఒక రియల్ టైం ప్రాబ్లమ్‌ను ఇచ్చి.. అభ్యర్థులు ఒక బృందంగా దానికి పరిష్కారం చూపమని  అడుగుతున్నారు. ఇవి.. సదరు అభ్యర్థుల అకడమిక్ డొమైన్‌కు సంబంధించిన సమస్యలై ఉంటున్నాయి.
 
ఇంటర్వ్యూ.. పర్సనల్ + టెక్నికల్ : 
మలిదశలోని ఇంటర్వ్యూల్లో పీఎస్‌యూలు అభ్యర్థులను రెండు కోణాల్లో పరీక్షిస్తాయి. అవి వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ నాలెడ్జ్. సాంకేతిక నైపుణ్యం పరంగా బీటెక్‌లో చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, మినీ ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్ వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్? అందుకు కారణాలు? దానిద్వారా భవిష్యత్తులో సాధించాలనుకుంటున్న లక్ష్యాలు? అందుకు సదరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా ఉపయోగపడుతుంది? వంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 
 
గేట్ దరఖాస్తు సమయంలోనే...
ఇప్పటికే కొన్ని పీఎస్‌యూలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. మరికొన్ని అదే బాటలో నడుస్తున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు గేట్ అడ్మిట్ కార్డ్ ఆధారంగా వాటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గేట్ దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తమకు పీఎస్‌యూ ఉద్యోగాలకు ఆసక్తి ఉందో? లేదో? తెలియజేయాల్సి ఉంటుంది.  పీఎస్‌యూల్లో జాబ్‌కు ఆసక్తి ఉందని పేర్కొన్న అభ్యర్థుల స్కోర్‌ను మాత్రమే మలిదశ ఎంపిక ప్రక్రియ(గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ)కు పరిగణనలోకి తీసుకుంటాయి. వారికే ఇంటర్వ్యూ కాల్ పంపిస్తాయి. కాబట్టి గేట్ అప్లికేషన్ సమయంలోనే పీఎస్‌యూ ఔత్సాహిక అభ్యర్థులు సంబంధిత కాలమ్‌ను పూర్తి చేయడం తప్పనిసరి. అలాగే పీఎస్‌యూ కొలువు కోరుకునే వారు గేట్ ప్రిపరేషన్‌తోపాటు సమాంతరంగా పీఎస్‌యూల ఎంపిక ప్రక్రియపైనా స్పష్టత ఏర్పరచుకోవాలి. పీఎస్‌యూ నోటిఫికేషన్లు సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విడుదలవుతాయి. మరికొన్ని పీఎస్‌యూలు  జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. 
 
గేట్ 2018 వివరాలు...
 గేట్ దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 05, 2017.
 గేట్-2018 పరీక్ష తేదీలు: 2018, ఫిబ్రవరి 3, 4, 10, 11
 పరీక్ష వ్యవధి: 3 గంటలు.
 పరీక్ష ఫలితాలు: మార్చి 17, 2018.
 పూర్తి వివరాలు  వెబ్‌సైట్‌లో చూడొచ్చు
 వెబ్‌సైట్: https://gate.iitg.ac.in
 
గేట్-2018.. పీఎస్‌యూ నోటిఫికేషన్లు :
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ
అర్హత: బీటెక్(మెకానికల్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
గరిష్ట వయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు జనవరి 1, 2018 నాటికి 25ఏళ్లు. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు. 
ఎంపిక విధానం: గేట్‌లో మెకానికల్ పేపర్‌లో పొందిన స్కోర్ ఆధారంగా దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ఎంపికైన వారిని తొలి ఏడాది మేనేజ్‌మెంట్ ట్రైనీ హోదాలో నియమిస్తారు. ఈ సమయంలో  ఏడాదికి దాదాపు రూ. 14 లక్షల వేతనం లభిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 5, 2018 నుంచి ఫిబ్రవరి 2, 2018
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.bharatpetroleum.com
 
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
 ఓఎన్‌జీసీగా సుపరిచితమైన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ గేట్-2018 స్కోర్ ఆధారంగా మెకానికల్, సివిల్, పెట్రోలియం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ పేరుతో నియామకాలు చేపడుతుంది.
వీటికి నోటిఫికేషన్ 2018 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వెలువడుతుంది. అభ్యర్థులు ఆయా విభాగాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు గేట్ స్కోర్ తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులు జనవరి 1, 2018 నాటికి 30 ఏళ్లలోపు వయసుండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: గేట్ స్కోర్, అకడమిక్ అర్హతల ఆధారంగా అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. గేట్ స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ, అకడమిక్ అర్హతలకు 25 మార్కుల వెయిటేజీ, ఇంటర్వ్యూకు 15 మార్కుల వెయిటేజీ ఇచ్చి తుది జాబితా రూపొందిస్తారు. ఎంపికైన వారికి 24,900-50,500 శ్రేణిలో వేతన స్కేల్ ఇస్తారు.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.ongcindia.com
 
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
ఈ సంస్థ కూడా గేట్ స్కోర్ ఆధారంగా ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం- జనవరి 4, 2018న నోటిఫికేషన్ వెలువడుతుంది. సంబంధిత బ్రాంచ్‌లతో బీటెక్‌లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు గేట్ స్కోర్ తప్పనిసరి. ఔత్సాహిక అభ్యర్థులు సంస్థ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల అర్హతలకు అనుగుణంగా షార్ట్‌లిస్ట్ రూపొందిస్తారు. వీరికి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా రూపొందిస్తారు. గేట్ స్కోర్‌కు 85 శాతం; గ్రూప్ డిస్కషన్‌లో ప్రతిభకు మూడు శాతం; పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రదర్శన స్థాయికి 12 శాతం వెయిటేజీ ఇస్తారు.
గరిష్ట వయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులు డిసెంబర్ 31, 2017 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు మినహాయింపు లభిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 5, 2018 నుంచి జనవరి 31, 2018 వరకు
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.powergridindia.com
 
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
ఈ సంస్థ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో గేట్ స్కోర్ ఆధారంగా ఇంజనీరింగ్ ట్రైనీ పోస్ట్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఔత్సాహిక అభ్యర్థులు గేట్ స్కోర్‌తోపాటు సంబంధిత బ్రాంచ్‌లలో 60 శాతం(ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. గరిష్ట వయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులు జూన్ 30, 2018 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యుడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు లభిస్తుంది. వచ్చిన దరఖాస్తులు, అభ్యర్థులు పొందిన గేట్ స్కోర్, బీటెక్ ఉత్తీర్ణత శాతం ఆధారంగా షార్ట్‌లిస్ట్ రూపొందిస్తారు. వీరికి మలి దశలో గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు ఆయా విభాగాల్లో ట్రైనీ ఇంజనీర్స్‌గా నియమిస్తారు. ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో దాదాపు. రూ. 10.8 లక్షల వార్షిక వేతన లభిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 12, 2018 నుంచి ఫిబ్రవరి 12, 2018 వరకు.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.hindustanpetroleum.com
 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్... ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్ పోస్ట్‌ల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. సంబంధిత బ్రాంచ్‌లతో బీటెక్‌లో 65 శాతం మార్కులతో(ఎస్‌సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 55శాతం) ఉత్తీర్ణత సాధించాలి. గేట్ స్కోర్ తప్పనిసరి. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అకడమిక్ అర్హతలు, గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి తొలుత ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు.
గరిష్ట వయో పరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు జూన్ 30, 2018 నాటికి 26 ఏళ్లుగా నిర్ణయించింది. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 5, 2018 నుంచి ఫిబ్రవరి 11, 2018 వరకు.
 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.iocl.com
 
 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
 ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, మైనింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్‌ల భర్తీ షెడ్యూల్ విడుదల చేసింది. బీటెక్‌లో సంబంధిత బ్రాంచ్‌లలో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
గరిష్ట వయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులు జనవరి 31, 2018 నాటికి 27 ఏళ్లలోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు లభిస్తుంది. అకడమిక్ అర్హతలు, గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఎన్‌టీపీసీ మరో విడతలో ఆన్‌లైన్ విధానంలో ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. అందులోనూ ఉత్తీర్ణత సాధించిన వారికి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. గేట్ స్కోర్‌కు 85 శాతం వెయిటేజీ, గ్రూప్ డిస్కషన్‌కు 5శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూకు 5శాతం వెయిటేజీ ఇచ్చి తుదిజాబితా రూపొందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 24,900-50,500 శ్రేణిలో వేతన స్కేల్ అమలు చేస్తారు. ఔత్సాహిక అభ్యర్థులు జనవరి 10, 2018 నుంచి జనవరి 31, 2018 వరకు ఎన్‌టీపీసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.ntpccareers.net
 
 గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
 గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. గేట్‌స్కోర్ ఆధారంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ పోస్ట్‌ల భర్తీకి జనవరి, 2018లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఔత్సాహిక అభ్యర్థులు సంబంధిత బ్రాంచ్‌లలో 65 శాతం(ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులు 60 శాతం) మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. గరిష్ట వయోపరిమితి: జనవరి 20, 2018 నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 28ఏళ్లలోపు వయసుండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు మినహాయింపు ఉంటుంది. అకడమిక్ అర్హతలు, గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి వారికి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నియమిస్తారు. ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ప్రారంభ వేతన శ్రేణి 24,900-50,500గా ఉంటుంది.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.gailonline.com
 
వైజాగ్ స్టీల్ కార్పొరేషన్
వైజాగ్ స్టీల్ కార్పొరేషన్ సంస్థ మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో గేట్ స్కోర్ ఆధారంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. దీనికి సంబంధించి నోటిషికేష్ ఫిబ్రవరి 2018లో వెలువడనుంది. గేట్-2018 స్కోర్‌తోపాటు సంబంధిత బ్రాంచ్‌లలో బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. షార్ట్ లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా రూపొందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు జూనియర్ మేనేజర్ హోదాలో శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులకు రూ.7.6 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.vizagsteel.com
 
మజ్‌గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్
మజ్‌గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్... మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో గేట్ స్కోర్ ఆధారంగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్లను భర్తీ చేయనుంది. అభ్యర్థులు గేట్ స్కోర్‌తోపాటు 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌లతో బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి. గరిష్ట వయోపరిమితి: ఫిబ్రవరి 7, 2018 నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 27 ఏళ్లలోపు వయసుండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా రూపొందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో రూ.7.19 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 8, 2018 నుంచి ఫిబ్రవరి 7, 2018 వరకు.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.mazdock.com
Published date : 03 Oct 2017 06:01PM

Photo Stories