Skip to main content

గేట్ గెలుపుతో...భవితకు ఎన్నోదారులు

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్ట్‌)లో అర్హత సాధించిన విద్యార్థులు కేవలం ఎంటెక్/ఎంఈ వంటి ఉన్నత విద్యావకాశాలకే పరిమితం కాకుండా.. మరెన్నో దారులు ఎంచుకోవచ్చు.
గేట్ ఉత్తీర్ణులు ఉన్నత విద్య, పీఎస్‌యూల్లో ఉద్యోగం, ఎంఎన్‌సీల్లో కొలువు, పలు విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్, జేఆర్‌ఎఫ్ సొంతం చేసుకునే అవకాశం... ఇలా తమకు నచ్చే, నప్పే మార్గాన్ని ఎంచుకోవాలి. విద్యార్థులు తమ ముందున్న అవకాశాలను జాగ్రత్తగా విశ్లేషించుకొని, భవిష్యత్ కెరీర్‌ను నిర్దేశించే నిర్ణయాన్ని తీసుకోవాలి. అత్యంత కీలకమైన ఈ దశలో గేట్ అర్హులకు ఉన్న దారులేంటో చూద్దాం..

గ‌మ‌నిక‌: గేట్ స్కోర్ ఫలితాలు వెలువడిన తేదీ నుంచి 3ఏళ్లపాటు పరిగణనలో ఉంటుంది.

ఎంటెక్/ఎంఈ/పీహెచ్‌డీ:
  1. వాస్తవానికి గేట్ అనేది ఐఐటీలు, ఐఐఎస్సీ, నిట్‌లు, ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ఎంటెక్/ఎంఈ, పీహెచ్‌డీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. గేట్ స్కోర్ ద్వారా ఎంటెక్/ఎంఈ, పీహెచ్‌డీల్లోకి ప్రవేశం కల్పించే ఇన్‌స్టిట్యూట్స్ ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇస్తాయి. ఆయా విద్యా సంస్థల అడ్మిషన్ ప్రక్రియకు అనుగుణంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  2. గేట్ స్కోరుతో టాప్ ర్యాంకింగ్ విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ), బెంగళూరులో చేరే చక్కటి అవకాశం లభిస్తుంది. పోటీ తీవ్రత దృష్ట్యా ఐఐఎస్సీలో చేరాలంటే టాప్ స్కోర్ తప్పనిసరి. ఐఐఎస్సీ తర్వాత విద్యార్థులు ఐఐటీలు.. ఆ తర్వాత ఎన్‌ఐటీలను ప్రాధాన్య క్రమంగా ఎంచుకుంటున్నారు. వీటితోపాటు డీమ్డ్ యూనివర్సిటీలూ, ఆయా రాష్ట్రాల్లోని క్యాంపస్ కాలేజీలు విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయా సంస్థలో ఎంటెక్, ఎంఈ, ఎంఎస్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు. కొన్ని విద్యాసంస్థలు నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశాలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ పీహెచ్ కోర్సులతో తక్కువ కాలంలోనే పీహెచ్‌డీను పూర్తి చేసుకోవచ్చు.
  3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లు నిర్వహిస్తున్న టెక్నికల్ ఎంబీఏ కోర్సుల్లో చేరడానికి కూడా గేట్ స్కోరే ప్రామాణికంగా మారింది. ఐఐఎంల్లో ఫెల్‌షిప్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌పీఎం) కోర్సులకూ గేట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నారు.
  4. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు కూడా గేట్ స్కోరు ఉపయోగపడుతుంది. సింగపూర్, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లోని పలు యూనివర్సిటీలు గేట్‌లో మంచి స్కోరు పొందిన వారికి స్వాగతం పలుకుతున్నాయి.

స్కాలర్‌షిప్స్/అసిస్టెంట్‌షిప్స్ :
  • గేట్‌లో ఉత్తమ ప్రతిభ ద్వారా ఆయా ఇన్‌స్టిట్యూట్స్‌లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు స్కాలర్‌షిప్/అసిస్టెంట్‌షిప్ అందుకోవచ్చు. ఎంహెచ్‌ఆర్‌డీ మార్గనిర్దేశకాలు, ఆయా ఇన్‌స్టిట్యూట్ నిబంధనల మేరకు గేట్‌లో ప్రతిభకు 70శాతం వెయిటేజీ; ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • సాధారణంగా పీజీలో చేరే విద్యార్థులకు నెలకు రూ.12400 అందుతుంది. గేట్ స్కోర్ ద్వారా సీఎస్‌ఐఆర్ లేబొరేటరీల్లో జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్ కోసం కూడా అభ్యర్థులు ప్రయత్నించొచ్చు.

పీఎస్‌యూ కొలువు :
  • గేట్‌తో ఉన్నత చదువులు, ఉపకారవేతనాలు, పరిశోధనలు.. వంటి బహుముఖ ప్రయోజనాలెన్నో ఉన్నా.. ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో ఉద్యోగం పొందడం అభ్యర్థుల మొదటి ప్రాధాన్యంగా మారింది. ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత కూడా పీఎస్‌యూల్లో జాబ్ సాధనే లక్ష్యంగా గేట్‌కు హాజరవుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు.
  • బీహెచ్‌ఈఎల్, గెయిల్, హెచ్‌ఏఎల్, ఐవోసీఎల్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, వంటి మహారత్న, నవరత్న, మినీరత్న హోదా ఉన్న పీఎస్‌యూలు గేట్ ర్యాంకు ప్రాతిపదికనే ఎంట్రీ లెవల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నాయి. 2012 నుంచి పీఎస్‌యూలు గేట్ స్కోరు ఆధారంగా నియామకాలు చేపట్టడం ప్రారంభించాయి. వీటి సంఖ్య ప్రస్తుతం 30కి పైగానే ఉంది.
  • పీఎస్‌యూలు గేట్ పరీక్ష తేదీ కంటే ముందుగానే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. అభ్యర్థులు వీటికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఒక్కో పీఎస్‌యూ.. కేటగిరీల ఆధారంగా, కటాఫ్ మార్కులు నిర్ణయించి ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నాయి. ఈ కటాఫ్ మార్కులు పీఎస్‌యూలను బట్టి మారుతూ ఉంటాయి. కనీస కటాఫ్‌ను ప్రకటించే సమయంలో 1:5 లేదా1:7 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఆ మేరకు ప్రకటిస్తున్నాయి. అంటే.. ఒక్కో ఖాళీకి అయిదుగురు లేదా ఏడుగురు అభ్యర్థులను మలి దశ ఎంపిక ప్రక్రియకు పిలుస్తున్నాయి.
  • పిఎస్‌యూల్లో గేట్ ర్యాంకుతో నిర్వహించే ఎంపిక ప్రక్రియ ఆయా పీఎస్‌యూల విధానాల మేరకు ఉంటుంది. అధికశాతం పీఎస్‌యూలు జీడీ, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇంటర్వ్యూలో వ్యక్తిగత వివరాలు మొదలు కంపెనీపై అవగాహన, సమకాలీన అంశాల పరిజ్ఞానం, టెక్నికల్ స్కిల్స్.. ఇలా అన్ని కోణాల్లో ప్రశ్నలు అడుగుతారు.
  • ఇంజనీరింగ్ అనంతరం రాసే గేట్ ద్వారా అభ్యర్థులు చిన్నవయసులోనే పీఎస్‌యూలో ఎంట్రీ లెవల్ ఆఫీసర్ ఉద్యోగం దక్కించుకోవచ్చు. అలానే ఆకర్షణీయమైన వేతనాలు అందుకోవచ్చు.

ఎంఎన్‌సీలలోనూ..

 గేట్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని  నియమించుకునేందుకు బహుళ జాతి సంస్థలు(ఎంఎన్‌సీ)లు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఆయా సంస్థల్లో రీసెర్చ్, డెవలప్‌మెంట్ విభాగంలో వీరిని నియమించుకుంటున్నాయి.  అడ్వాన్స్‌డ్ మైక్రో డివెసైస్(ఏఎండీ), ఏడీ(అనలాగ్ డివెసైస్), గూగుల్, నోకియా, ఒరాకిల్, సీమెన్స్, తోషిబా, ఫేస్‌బుక్, అమెజాన్, రోబోట్ బోష్ లాంటి.. సుమారు 28 పెద్దసంస్థలు మెరికల్లాంటి అభ్యర్థుల అన్వేషణకు గేట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
Published date : 22 Mar 2018 06:08PM

Photo Stories