Skip to main content

బీటెక్ తర్వాత క్యాట్ లేక గేట్ ఏది చేయాలి.. ఈ సమాచారం మీ కోసమే..!

బీటెక్ పూర్తవ్వబోతోందా..! మరి ఆ తర్వాత లక్ష్యం ఏమిటి.. గేట్పై గురిపెట్టాలనుకుంటున్నారా.. లేదా క్యాట్లో సత్తా చాటాలనే ఆలోచన ఉందా..?!

అసలు ఈ రెండింట్లో దేనికి హాజరవ్వాలో తేల్చుకోలేకపోతున్నారా..! త్వరలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకోనున్న విద్యార్థులకు ఉపయోగపడేలా క్యాట్ లేదా గేట్లో దేన్ని ఎంచుకోవాలి.. ఎవరికి ఏది బెటర్... క్యాట్, గేట్లలో ఏది తేలిక.. ఏది కఠినం..? క్యాట్ సానుకూలతలు–ప్రతికూలతలు.. గేట్ సానుకూలతలు–ప్రతికూలతలపై ప్రత్యేక కథనం..

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కు ఉన్నత విద్య పరంగా ప్రముఖంగా అందుబాటులో ఉన్న మార్గాలు... గేట్, క్యాట్. క్యాట్తో ఎంబీఏ, గేట్తో ఎంటెక్లో చేరొచ్చు. బీటెక్ అర్హత తో క్యాట్, గేట్లకు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ రెండు పరీక్షల స్వభావం భిన్నంగా ఉంటుంది. వీటిద్వారా చేరే కోర్సులు, కెరీర్లు పూర్తి విభిన్నం. కాబట్టి ఈ రెండింట్లో ఒకదాన్ని ఎంచుకొనే ముందు అభ్యర్థులు స్వీయ ఆసక్తి, పరీక్ష ల స్వభావం, భవిష్యత్ లక్ష్యాలు, కెరీర్ అవకాశాల గురించి పూర్తిగా తెలుసుకొని ఒక నిర్ణయానికి రావాలి. ఈ విషయం లో వ్యక్తిగతంగా ఒక నిర్ణయానికి రాలేని విద్యార్థులు ప్రొఫెస ర్లు, సీనియర్ల సలహాలు తీసుకొని ముందుకెళ్లడం లాభిస్తుంది.

గేట్....
బీటెక్ అనంతరం ఇంజనీరింగ్లో ఉన్నత విద్య కోర్సు ఎంటెక్లో చేరాలనుకునే అభ్యర్థులు గేట్కు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ సబ్జెక్టులు, సాంకేతికతలపై ఆసక్తి ఉన్నవారు గేట్ రాయడం లాభిస్తుంది. ఇంజనీరింగ్ విభాగంలో కెరీర్ పరంగా కుదురుకునేందుకు కొంత సమయం పడుతుంది. సహనంతో కష్టపడిన వారికి ఎంటెక్ అనంతరం సుస్థిర కెరీర్ సొంతమవుతుందని చెప్పొచ్చు. ఎంటెక్తో యూజీసీ–నెట్ ఆధారంగా పీహెచ్డీలో ప్రవేశం పొందితే ఫెలోషిప్ లభిస్తుంది. తద్వారా బోధన, పరిశోధనల రంగంలో రాణించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇందులో ఎవర్గ్రీన్గా నిలవాలంటే.. నిరంతర అధ్యయ నంతోపాటు తాజా ఆవిష్కరణలు, ఫలితాలు, ప్రభావాలపై అవగాహనతో మెలగాలి.

క్యాట్......
మేనేజ్మెంట్ ఉన్నత విద్యలో ప్రవేశం కల్పించే పరీక్ష.. క్యాట్! కెరీర్, నాలెడ్జ్, నైపుణ్యాల పరంగా ఇంజనీరింగ్+ ఎంబీఏ కాంబినేషన్ కార్పొరేట్ ప్రపంచంలో ఉత్తమంగా నిలుస్తోంది. మేనేజ్మెంట్ విద్యను అభ్యసించిన ఇంజనీర్లు కార్పొరేట్ కంపెనీల్లో వేగంగా ఉన్నత స్థానాలకు చేరుతున్నారు. కేవలం ఇంజనీరింగ్ నేపథ్యం మాత్రమే ఉన్నవారితో పోల్చితే ఇంజనీరింగ్+ఎంబీఏ అర్హత కలిగిన వారి వేతనాలు కూడా అధికంగా ఉంటున్నాయి. దీంతో బీటెక్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో క్యాట్ను లక్ష్యంగా ఎంచుకుంటున్నారు.

పరీక్ష స్వరూపాలు..
గేట్ను 100 మార్కులకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 65 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు. పేపర్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు,న్యూమరికల్ ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతారు. పరీక్ష పరంగా జనరల్ ఆప్టిట్యూడ్కు 15 శాతం, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కు 15, సబ్జెక్టు పేపర్(సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టు)కు 70 శాతం వెయిటేజీ ఉంటుంది.
» క్యాట్ను 300 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రంలో వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రెహెన్షన్(వీఏఆర్సీ), డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్(డీఐఎల్ఆర్), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (క్యూఏ) విభాగాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.

ఏది క్లిష్టం?!..
గేట్ ప్రాథమికంగా ఇంజనీరింగ్ సబ్జెక్టులపై అభ్యర్థి పట్టును పరీక్షించేదిగా ఉంటుంది. గేట్లోనూ జనరల్ ఆప్టిట్యూడ్ విభాగం ఉన్నప్పటికీ.. వెయిటేజీ పరంగా ఇంజనీరింగ్ అంశాలే కీలకంగా నిలుస్తాయి. కాబట్టి ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో పట్టున్న అభ్యర్థులకు గేట్లో విజయావకాశాలు ఎక్కువని చెప్పొచ్చు. క్యాట్లో అభ్యర్థుల్లోని సూక్ష్మ పరిశీలన, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ అనాలిసిస్ స్కిల్స్, రీజనింగ్ తదితర నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇంగ్లిష్, ఆప్టిట్యూడ్లపై పట్టున్న అభ్యర్థులకు క్యాట్ సులభంగా ఉంటుంది. మొత్తంగా పేపర్ స్వరూపం, క్లిష్టత, పోటీలను పరిగణలోకి తీసుకుంటే.. గేట్తో పోల్చితే క్యాట్లో విజయం సాధించడం కొంత క్లిష్టమని చెప్పొచ్చు.

ఎవరికి ఏది బెటర్...
ఎంటెక్/ఎంబీఏ ఎంపిక విషయంలో ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులు స్పష్టతతో ముందుకెళ్లాలి. ఒకటి ఎక్కువ, రెండోది తక్కువ అనే భావనను విడనాడి...అంశాల వారీగా స్వీయ పరిశీలన ద్వారా ఒక నిర్ణయానికి రావాలి.

గేట్.. డొమైన్(స్పెషలైజేషన్)లో పట్టున్న విద్యార్థులకు గేట్ సరైన ఎంపిక. జీపీఏ 7.5 శాతం అంతకంటే ఎక్కువ ఉన్నవారిని అకడెమిక్గా ప్రతిభావంతులుగా గుర్తించొచ్చు. వీరికి ఎంటెక్ చక్కగా సరిపోతుంది.
» సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్టు వర్క్లో ప్రతిభ చూపిన వారు గేట్ వైపు అడుగేయవచ్చు. జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లలో ఎంటెక్ ప్రవేశాల సమయంలో పైఅంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.

క్యాట్.. కల్చరల్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితరాల్లో ముందు వరుసలో ఉన్నవారు క్యాట్ను ఎంచుకోవచ్చు. ఎందు కంటే.. ఐఐఎంలు, ఇతర బిజినెస్ స్కూల్స్ ప్రవేశాల సమ యంలో ఆయా అంశాలకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి.
» ఐఐఎంల ఎంపిక ప్రక్రియలో క్యాట్ స్కోరుతోపాటు వర్క్ ఎక్స్పీరియెన్స్ను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి కనీసం ఒకటి నుంచి రెండేళ్ల పని అనుభవంతో క్యాట్కు హాజరవడం లాభిస్తుంది.

గేట్ సానుకూలతలు..

  • స్వీయ డొమైన్లో నైపుణ్యాలను పెంచుకోవచ్చు.
  • పరిశోధన, సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థానాలను అందుకోవచ్చు.
  • గేట్ స్కోరు ద్వారా ఓఎన్జీసీ, ఎన్టీపీసీఎల్, హెచ్పీసీఎల్, బెల్, డీఆర్డీవో తదితర పీఎస్యూల్లో కొలువులను దక్కించుకోవచ్చు.
  • పీహెచ్డీ చేసేందుకు అవకాశం దక్కుతుంది.
  • పీజీఈసెట్, ఐఈఎస్ తదితరాలకు అవసరమైన సన్నద్ధత లభిస్తుంది.
  • నెల నెలా స్టైపెండ్ లభిస్తుంది.
  • ఐఐఎస్సీ, ఐఐటీ, నిట్లలో చదివే అవకాశం దక్కుతుంది.
ప్రతికూలతలు..
  • కెరీర్లో స్థిరపడేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
  • ప్రారంభంలో తక్కువ వేతనాలు లభిస్తాయి.
  • నిరంతరం అధ్యయనం, స్కిల్స్ పెంపొందించుకోవడం తప్పనిసరి.
క్యాట్ సానుకూలతలు..
  • కెరీర్లో త్వరగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది.
  • స్వయం ఉపాధి దిశగా వ్యాపార నిర్వహణా నైపుణ్యాలు పెంచుకోవచ్చు.
  • అన్ని రంగాల్లో అవకాశాలు సొంతం చేసుకునే వీలుంది.
  • ఐఐఎంలు, ఇతర టాప్ బిజినెస్ స్కూల్స్లో చదివే అవకాశం చిక్కుతుంది.
  • గూగుల్, ఫేస్బుక్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీల్లో స్థిరపడేందుకు మార్గం సుగమం అవుతుంది.
ప్రతికూలతలు..
  • పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది.
  • అప్పటి వరకు చదివిన అకడెమిక్ అంశాలకు భిన్నమైన దారిలో వెళ్లాల్సి ఉంటుంది.
  • రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ వంటి కొత్త అంశాలపై పట్టు పెంచుకోవడం తప్పనిసరి.
Published date : 14 May 2020 04:09PM

Photo Stories