Skip to main content

ఆటోమొబైల్.. అవకాశాలు అపారం

భారత దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న రంగం.. ఆటోమొబైల్. దేశంలో సుస్థిర ప్రభుత్వం, విదేశీ పెట్టుబడులకు సాదర స్వాగతం నేపథ్యంలో.. ప్రపంచం దృష్టి భారత్‌పై పడింది. విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు మన దేశంలోని మానవ వనరులు, మార్కెట్ డిమాండ్ దృష్యా తమ కార్యకలాపాలకు భారత్‌ను కేంద్రంగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో డిజైనింగ్ నుంచి ప్రారంభించి రిపేరింగ్ వరకూ.. ఆటోమొబైల్ రంగంలోని అనేక విభాగాల్లో ఇంజనీర్లకు ఉద్యోగాలు లభించే అవకాశముంది. నగరంలో వివిధ కళాశాలలు డిప్లొమా, బీటెక్, ఎంటెక్ స్థాయిలో ఆటోమొబైల్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. ఆయా కోర్సులు పూర్తిచేసిన వారికి ఉన్న కెరీర్ అవకాశాలపై ఫోకస్...

మార్కెట్‌లో మనమే టాప్
ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలో మన దేశం అతిపెద్ద త్రిచక్ర వాహన మార్కెట్. ద్విచక్ర వాహన విక్రయాల్లో రెండోది, ట్రాక్టర్ విక్రయాల్లో నాలుగో స్థానం. బస్ అండ్ ట్రక్, క మర్షియల్ వెహికల్ మార్కెట్‌లో ఐదోది. కార్ల విక్రయాల్లో పదోస్థానంలో ఉంది. ఇంతపెద్ద మార్కెట్ కావడం వల్లనే.. ప్రపంచంలో ప్రముఖ వాహన కంపెనీలన్నీ భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ప్రస్తుతం 16 మిలియన్ల ద్విచక్ర వాహనాల తయారీకి అనువైన పరిస్థితులు ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. ఆటోమొబైల్ రంగంలో దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 80 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) అంచనా.

విభాగాలు.. ఉద్యోగాలు
ఆటోమొబైల్‌లో న్యూ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, క్వాలిటీ అస్యూరెన్స్, ఆపరేషన్స్, టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ - సేల్స్, సర్వీసెస్, ఫైనాన్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఐటీ, స్ట్రాటజీ తదితర విభాగాలుంటాయి. వీటిలో ఆయా అర్హతల ఆధారంగా అవకాశాలు పొందొచ్చు. ఐటీఐ, డిప్లొమా స్థాయిలో.. ఆటోమొైబె ల్ టెక్నీషియన్, కార్, బైక్ మెకానిక్స్, డీజిల్ మెకానిక్స్, సేల్స్ పర్సన్, సేల్స్ మేనేజర్, ఆటోమొబైల్ డిజైనర్స్, పెయింట్ స్పెషలిస్ట్, ఎనలిటికల్ నిపుణులుగా పని చేయొచ్చు. ఇవేకాకుండా ఇంజనీరింగ్ డ్రాయింగ్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, మెటలర్జీ, మెటీరియల్, మెషీన్ డ్రాయింగ్, ఆటోమోటివ్ ఇంజన్స్, డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎయిర్ కండీషనింగ్, అప్లికేషన్స్, సర్వీస్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉంటాయి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్, పీజీ పూర్తిచేసి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో పట్టు ఉన్నవారు డిజైన్ ఇంజనీర్(వీల్స్ అండ్ బ్రేక్స్, వెహికల్ ఇంటిగ్రేషన్ అండ్ లే అవుట్), టెస్ట్ ఇంజనీర్, ప్రాజెక్టు మేనేజర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, ఇంజన్ డెవలపర్, సీనియర్ అనలిస్ట్, మెటలర్జీ అనలిస్ట్‌గా విధులు నిర్వర్తించవచ్చు. మన దేశంలో ప్రధానమైన వాహన కంపెనీలు.. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మారుతి సుజికి ఇండియా లిమిటెడ్, హుందాయ్, హిందుస్థాన్ మోటార్స్, టీవీఎస్ మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోర్డ్ మోటార్ కంపెనీ, అశోక్ లేలాండ్, జనరల్ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బజాజ్ ఆటో లిమిటెడ్, హోండా మోటార్, హీరో మొదలైనవి. వీటన్నింటిలోనూ ఆటోమొబైల్ నిపుణులకు మంచి అవకాశాలు ఉన్నాయి.

నగరం.. అవకాశాల నిలయం
2016 నాటికి ఆటోమొబైల్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాల్లోకి 145 బిలియన్ల అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా వచ్చే అవకాశం ఉంది. దీంతో 25 మిలియన్ల ఉద్యోగావకాశాలు వస్తాయని డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ అంచనా. నగరంలో టూ వీలర్, ఫోర్ వీలర్, కమర్షియల్ వెహికల్ షోరూమ్స్, సేల్స్ అండ్ సర్వీసెస్ సెంటర్స్, ఫైనాన్స్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో పనిచేసేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఆటోమొబైల్ కోర్సు పూర్తి చేస్తే కొలువు గ్యారంటీ అంటున్నారు మాసాబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ కె.రాములు. గతంతో పోల్చితే ప్రస్తుతం ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుల సీట్లన్నీ భర్తీ అవుతున్నాయని తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌లలో సంబంధిత విభాగాల్లో డిప్లొమా కోర్సులు చేసిన వారికి ఎంతో డిమాండ్ ఉందన్నారు. అటోమొబైల్ కంపెనీలో టెక్నికల్ విభాగమే కాకుండా.. ఎంబీఏ, సీఏ, సైన్స్, ఆర్ట్స్ గ్రూపుల వారికీ అర్హత, అనుభవాన్ని బట్టి అవకాశాలుంటాయి.

కోర్సులు, విద్యా సంస్థలు
నగరంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆటోమొబైల్, డీజిల్ మెకానిక్‌లలో డిప్లొమా కోర్సులు, ఒకేషనల్, గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదోతరగతి అర్హతతో ఐటీఐ, పాలిసెట్ ర్యాంకుతో పాలిటెక్నిక్ డిప్లొమాల్లో ప్రవేశం పొందొచ్చు. బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌కు ఇంటర్మీడియెట్ ఎంపీసీ పూర్తిచేసి ఎంసెట్(ఇంజనీరింగ్)లో ర్యాంకు సాధించాలి. వెహికల్ డిజైనింగ్, ఇంటీరియర్ విభాగాల్లో నిఫ్ట్ (www.nift.ac.in ), నిడ్ (www.nid.edu ) వంటి జాతీయస్థాయి విద్యా సంస్థలు డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ కోర్సులు అందజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సెట్విన్‌లు కూడా వివిధ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

వేతనాలు
ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసినవారికి ప్రారంభ వేతనం నెలకు రూ.12 వేలు ఉంటుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి నెలకు రూ.20,000 వరకు అందుకోవచ్చు. ఆటోమొబైల్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులకు మ్యానుఫ్యాక్చరింగ్, డిజైనింగ్ విభాగాల్లో వార్షిక వేతనం రూ. 3 లక్షల వరకు ఉంటుంది.

కోర్సులో చేరితే కొలువు వచ్చినట్లే
‘‘ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వాహన రంగానికి సంబంధించి వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు ఎవరూ ఖాళీగా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. వర్క్‌షాప్స్, అప్రెంటీస్‌షిప్‌తో కంపెనీలకు అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంచుకోవాలి. ఆటోమొబైల్ నిపుణులకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఐటీఐ మెకానికల్ రెండేళ్లు, ఐటీఐ డీజిల్ ఏడాది కోర్సు చేశాక ఇన్‌స్ట్రక్టర్ కోర్సు పూర్తిచేసి ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా వెళ్లొచ్చు. వివిధ వర్క్‌షాప్స్‌లో పనిచేయొచ్చు. రైల్వే, ఆర్టీసీ, బీహెచ్‌ఈఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో వెహికల్ మెయింటెనెన్స్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి. కోర్సుతోపాటు డ్రైవింగ్‌లో కూడా శిక్షణ ఉంటే డ్రె ైవర్లుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో చేరొచ్చు. డిప్లొమా తర్వాత టెక్నికల్ కోర్సులు పూర్తిచేయగలిగితే ఎగ్జిక్యూటివ్ స్థాయి వరకూ ఎదిగే వీలున్న రంగం.. ఆటోమొబైల్’’
ఎం.జె.విజయరాజు, ట్రైనింగ్ ఆఫీసర్,
అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఏటీఐ), హైదరాబాద్
Published date : 23 Sep 2014 05:04PM

Photo Stories