Skip to main content

అప్లికేషన్ అప్రోచ్‌తోనే గేట్ దాటగలం

గేట్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ /పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశంతోపాటు.. పీఎస్‌యూలలో ఎంట్రీలెవల్ రిక్రూట్‌మెంట్స్‌కు వేదికగా నిలిచే అద్భుత మార్గం.. ఈ క్రమంలో వేసే ప్రతి అడుగు కీలకమే.. ముఖ్యంగా పరీక్ష రోజున అనుసరించే వ్యూహాలే మన విజయంలో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయి.. అంతవరకూ సాగించిన ప్రిపరేషన్ ఒక ఎత్తై.. పరీక్ష రోజున అనుసరించే వ్యూహం మరో ఎత్తు.. ఈ వ్యూహాన్ని పకడ్బందీగా ఛేదిస్తేనే శ్రమకు ఫలితం దక్కడంతోపాటు.. ఉన్నత కెరీర్ బాటలు వేసుకోవచ్చు.. ఈ నేపథ్యంలో గేట్ పరీక్ష రోజున అనుసరించాల్సిన వ్యూహాలపై గత విజేతల సూచనలు..

ఈసీఈ
  • ఈ బ్రాంచ్‌లో మెరుగైన ర్యాంక్ సాధించాలంటే ఫార్ములాలన్నిటిపై పట్టు సాధించాలి.
  • ఇందులో ఫార్ములా, థియరీ బేస్డ్ ప్రశ్నలు ఉంటాయి. దాదాపు టెక్ట్స్ బుక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయని చెప్పొచ్చు.
  • మొత్తం 65 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులు కేటాయించారు. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి 10 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 15 మార్కులు కేటాయించారు. 1 మార్కు ప్రశ్నలు 25, 2 మార్కుల ప్రశ్నలు 30 ఉంటాయి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్‌కు 13 శాతం మార్కులు కేటాయించారు.
  • డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్స్, సిస్టమ్స్, కంట్రో ల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ డివెజైస్, కమ్యూనికేషన్ అంశాలు ముఖ్యమైనవి. పరీక్షలో ముందుగా ఈ అంశాల నుంచి వచ్చే ప్రశ్నలు ప్రయత్నించడం ఉత్తమం. ఎందుకంటే ఈ ప్రశ్నలు సులభంగా ఉంటాయి. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు సాధించవచ్చు.
  • రెండు మార్కుల ప్రశ్నలకు మూడు నిమిషాలు, ఒక మార్కు ప్రశ్నకు నిమిషం వరకు సమయాన్ని కేటాయించాలి.
  • సాధారణంగా ఈ బ్రాంచ్‌లో అడిగే ప్రశ్నలు సులభంగా ఉంటాయని చెప్పొచ్చు. ప్రాథమిక భావనలపై పట్టు ఉంటే ఈ ప్రశ్నలను సాధించవచ్చు.
  • గెస్సింగ్ వంటి వాటిని అన్వయించకుండా అవగాహన లేని ప్రశ్నలను వదిలివేయడం ఉత్తమం. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. దాంతో ర్యాంక్ ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువ.
  • సంబంధిత బ్రాంచ్ ప్రశ్నలతోపాటు నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ఆప్టిట్యూడ్ ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇందులో రాణించాలంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలపై అవగాహన ఉండాలి.
  • పరీక్షకు రెండు రోజుల ముందు వరకు కూడా ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఫార్ములాలను పక్కాగా ప్రిపేర్ కావాలి. రెండు-మూడు సార్లు పునశ్చరణ చేసుకోవాలి. అన్ని ఫార్ములాలు ఉండే ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకుని దాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
  • చివరి నెల రోజులు మాక్ టెస్ట్‌లు, గత ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
  • ఈ బ్రాంచ్‌కు సంబంధించి ప్రశ్నలు సులభంగా ఉంటాయి. కాబట్టి పరీక్షలో సమస్యను సాధించే క్రమంలో ఎక్కువ తప్పులు చేస్తుంటారు. అలాకాకుండా ప్రశ్నను పూర్తిగా చదివి, వచ్చిన సమాధానాన్ని ఇచ్చిన ఆప్షన్స్‌తో సరి చూసుకోవాలి.
    -చైతన్య,గేట్ 7వ ర్యాంకర్.
మెకానికల్
ముఖ్యమైన అంశాలు: థర్మోడైనమిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, హీట్ ట్రాన్స్‌ఫర్‌ను ముఖ్యమైన టాపిక్స్. ఈ అంశాల నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని అంశాలను చదవాలి.
  • గేట్‌లో మొత్తం 65 ప్రశ్నలు ఉంటాయి. ఇవి కాన్సెప్ట్ ఆధారితం.
  • వెంటనే సమాధానాలను గుర్తించకుండా ప్రశ్నలన్నీ ఒక్కసారి పూర్తిగా చదివిన తర్వాత జవాబు కోసం ప్రయత్నించాలి.
  • ఒక మార్కులు ప్రశ్నలు ఫార్ములా బేస్డ్‌గా, రెండు మార్కుల ప్రశ్నలు అప్లికేషన్ ఆధారితం.
  • ఆప్టిట్యూడ్, మ్యాథ్స్ అంశాల ప్రశ్నలతో పరీక్షను ప్రారంభించడం మంచిది. ఎందుకంటే వీటిల్లో మంచి స్కోర్ చేయవచ్చు. అంతేకాకుండా ఇవి సులభంగా ఉండడంతోపాటు 30 నిమిషాల్లోనే 10 ప్రశ్నలను సాధించవచ్చు.
  • ప్రశ్నను బట్టి సమయాన్ని నిర్దేశించుకోవాలి. సాధారణంగా ఒక మార్కు ప్రశ్నకు నిమిషం, రెండు మార్కుల ప్రశ్నకు మూడు నిమిషాల వరకు సమయాన్ని కేటాయించాలి.
  • సాధారణంగా విద్యార్థులు ప్రశ్నను పూర్తిగా చదవకుండానే సొల్యూషన్‌కు ఉపక్రమిస్తుంటారు. అలా చేయడం వల్ల ప్రశ్నలో ఉండే తార్కికతను అవగాహన చేసుకోవడంలో విఫలమవుతుంటారు. దాంతో ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ కరెక్ట్‌గా అనిపిస్తాయి. కాబట్టి ప్రశ్నను పూర్తిగా చదివి అందులోని లాజిక్‌ను అవగాహన చేసుకుంటూ సొల్యూషన్ కోసం ప్రయత్నించాలి.
  • పరీక్షకు నెల రోజు ముందు గత ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
  • చివరి రెండు రోజులు బాగా అవగాహన ఉన్న అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. మిగతా అంశాలను ఒక్కసారి పరిశీలించాలి.
    -పి. కుమార్.
సివిల్
  • ముఖ్యమైన అంశాలు-జియోటెక్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. వీటికి వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది.
  • మొత్తం 65 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులు కేటాయించారు. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి 10 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 15 మార్కులు కేటాయించారు. 1 మార్కు ప్రశ్నలు 25, 2 మార్కుల ప్రశ్నలు 30 ఉంటాయి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్‌కు 13 శాతం మార్కులు కేటాయించారు.
  • మల్టిపుల్ చాయిస్, న్యూమరికల్ ఆన్సర్ తరహా ప్రశ్నలు ఉంటాయి.
  • అప్లికేషన్, ఫార్ములా బేస్డ్ ప్రశ్నలు ఉంటాయి. అధిక శాతం ఫార్ములా బేస్డ్ ప్రశ్నలు అడుగుతారు. దాదాపు 30 శాతం మేరకు అప్లికేషన్ ప్రశ్నలు ఉంటాయి.
  • అప్లికేషన్ ప్రశ్నలలో మెరుగైన ప్రతిభను చూపితేనే మంచి ర్యాంకును సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫార్ములా బేస్డ్ ప్రశ్నలు దాదాపు అందరూ సాధించే విధంగా ఉంటాయి. కాబట్టి అప్లికేషన్ ప్రశ్నలపై అధికంగా దృష్టి సారించాలి.
  • పరీక్షలో ప్రశ్నలు వరుసక్రమంలో వస్తుంటాయి. వాటిని అదే క్రమంలో సాధిస్తూ వెళ్లడం మంచిది.
  • ఏదైనా ప్రశ్న దగ్గర సందేహం వస్తే.. ఆ ప్రశ్నను స్కిప్ చేస్తూ మరొక ప్రశ్నకు వెళ్లడం ఉత్తమం. ఎందుకంటే అదే ప్రశ్నను సాధిస్తూ ఉంటే సమయం వృథా తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు.
  • ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరి చూసుకునే క్రమంలో వదిలివేసిన ప్రశ్నలకు సమాధానం కోసం ప్రయత్నించడం ఉత్తమం.
  • అవగాహన లేని ప్రశ్నలను వదిలివేయడం ఉత్తమం. ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి గెస్సింగ్ వంటివి పనికి రావు.
  • సాధారణంగా అభ్యర్థులు పరీక్షలో చేసే తప్పు.. ప్రాబ్లమ్‌ను సాధించిన తర్వాత వచ్చిన సొల్యూషన్‌ను ఇచ్చిన కండిషన్ మేరకు అన్వయించడంలో విఫలమవుతుంటారు. కాబట్టి ఈ అంశానికి ప్రాధాన్యతిస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మంచిది.
  • పరీక్షకు రెండు రోజుల ముందు నుంచి చదవడం తగ్గిస్తూ రిలాక్స్‌డ్‌గా ఉండడానికి ప్రయత్నించాలి.
  • పరీక్షకు పది రోజుల ముందు వరకు సాధ్యమైనన్నీ మాక్ టెస్ట్‌లకు హాజరు కావాలి. పునశ్చరణకు ప్రాధాన్యతనివ్వాలి. ఫార్ములాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా చదివిన అంశాలను త్వరగా స్ఫురణకు తెచ్చుకోవచ్చు. ఈ సమయంలో ఎటువంటి కొత్త అంశాలను చదవడం వంటివి చేయకూడదు. ఎందుకంటే ఇదివరకు చదివిన అంశాలకు ఇవి అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
    -అభినవ్, ఐఐఎస్‌సీ-బెంగళూరు.
ఈఈఈ
  • ముఖ్యమైన అంశాలు-సర్క్యూట్స్, నెట్‌వర్క్ అనాలిసిస్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్స్.
  • మొత్తం 65 ప్రశ్నలు ఇస్తారు. ఇవన్నీ కాన్సెప్ట్ బేస్డ్‌గా ఉంటాయి. కాబట్టి ప్రాథమిక భావనలపై పట్టు ఉంటే వీటిని సులభంగానే సాధించవచ్చు.
  • ముందుగా ఒక మార్కు ప్రశ్నలతో పరీక్షను ప్రారంభించాలి.
  • ప్రశ్నను బట్టి సమయాన్ని కేటాయించుకోవాలి.
  • మొదట తెలిసిన ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించి.. చివర్లో తెలియని ప్రశ్నలను ప్రయత్నించాలి. తెలియని ప్రశ్నల విషయంలో గెస్సింగ్ వంటి వాటిని ఉపయోగించవద్దు.
  • చాలా కీలకమైన విషయం.. గేట్ అనేది టైమ్ మేనేజ్‌మెంట్ పరీక్ష కాదు. కచ్చితత్వానికి పరీక్ష. కాబట్టి తెలిసిన ప్రశ్నలను కచ్చితత్వంతో సాధిస్తేనే మెరుగైన ర్యాంకును సాంతం చేసుకోవచ్చు.
  • ఈ బ్రాంచ్‌లో అడిగే ప్రశ్నలు సులభంగా అనిపిస్తాయి. కానీ వాటిల్లో ట్విస్ట్ ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ఈ అంశాన్ని గుర్తించకుండా సమాధానాన్ని సాధించడం కోసం ప్రయత్నిస్తుంటారు. అలా కాకుండా ప్రశ్నను పూర్తిగా చదివి అవగాహన చేసుకున్న తర్వాతే సొల్యూషన్ కోసం ప్రయత్నించాలి.
  • పరీక్షకు నెల రోజుల ముందు వరకు కాన్సెప్ట్స్‌ను క్షుణ్నంగా ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్నీ మాక్ టెస్ట్ లు, ప్రాక్టీస్ టెస్ట్‌లను రాయాలి. ఇంజనీరింగ్ ఎ లక్ట్రో మాగ్నటిక్ సబ్జెక్ట్‌తోసహా 100 శాతం సిలబస్‌ను కవర్ చేసే విధంగా ప్రిపరేషన్ సాగించాలి.
  • పరీక్షకు రెండు రోజుల ముందు వరకు కూడా కాన్సెప్ట్‌ను ప్రాక్టీస్ చేయడంతోపాటు పునశ్చరణ చేసుకోవాలి. దాంతోపాటు చక్కటి నిద్ర కూడా అవసరం.
    -చక్రధర్, ఐఐటీ-బాంబే.
సీఎస్‌ఈ
  • ముఖ్యమైన అంశాలు-డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, డేటా స్ట్రక్చర్స్, కంప్యూటర్ నెట్‌వర్క్స్, డిజైన్ అండ్ అనాలిసిస్.
  • మొత్తం 65 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలను ఒకసారి చదవడం మంచిది.
  • మొదట తెలిసిన ప్రశ్నలకు సమాధానం గుర్తిస్తూ.. చివర్లో అవగాహనలేని ప్రశ్నలపై దృష్టి సారించడం మేలు.
  • ప్రతి ప్రశ్నకు మూడు నిమిషాలకు మించి సమయం కేటాయించవద్దు.
  • నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి తెలియని ప్రశ్నల విషయంలో గెస్సింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
  • ఈ బ్రాంచ్‌కు సంబంధించి ట్రికిగా ఉండే ప్రశ్నల విషయంలో సాధారణంగా విద్యార్థులు తప్పులు చేస్తుంటారు. ప్రశ్నను పూర్తిగా చదవకుండా అసమ్షెన్ చేయడం, సొలూష్యన్ సాధించడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి అటువంటి ప్రశ్నల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  • పరీక్షకు నెల రోజు ముందు వరకు డిస్కషన్ చేస్తూ చదవడం వల్ల ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఎటువంటి కొత్త టాపిక్‌ను ప్రిపేర్‌కాకపోవడం మంచిది. అంతవరకు ఏయే అంశాలపై ప్రిపరేషన్ సాగించారో వాటికే పరిమితమవ్వాలి.
  • పరీక్షకు రెండు రోజుల ముందు వరకు ఫార్ములాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
  • పరీక్ష ముందు రోజు రిలాక్స్ కావడానికి ప్రాధాన్యతినివ్వాలి. చక్కటి నిద్రను అస్వాదించాలి.
    -ఆదిత్య,ఐఐఎస్‌సీ-బెంగళూరు.
పరీక్ష రోజున తీసుకెళ్లాల్సినవి:
Bavitha
  • అడ్మిట్ కార్డ్
  • దరఖాస్తులో పేర్కొన్న ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డు
గుర్తుంచుకోవాల్సినవి:
  • గేట్‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. అభ్యర్థి లాగిన్ అవ్వగానే నిర్థేశించిన విధంగా ప్రశ్నలు వస్తాయి. ఇవి అభ్యర్థి ఎంచుకున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి లేదా అన్ని ఒకేసారి కనిపిస్తాయి. మౌస్ లేదా కీబోర్డ్ ఉపయోగిస్తూ సమాధానాలను ఇవ్వాల్సి ఉంటుంది.
  • మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ద్వారా టైమ్ మేనేజ్‌మెంట్ కూడా అలవడుతుంది. ఎంత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం చేయగలుగుతున్నారో తెలుస్తుంది. తద్వారా మరింత వేగంగా సమాధానం ఇచ్చే విధంగా ప్రిపరేషన్ సాగించవచ్చు.
Published date : 10 Jan 2014 03:52PM

Photo Stories