Skip to main content

విద్యార్థుల భవితను నిర్దేశించే.. స్కూల్ టీచర్!

నేటి బాలలైన రేపటి పౌరుల భవిష్యత్తును, తద్వారా దేశ గమనాన్ని నిర్ణయించేది ఉపాధ్యాయులే. ఉత్తమ గురువులే ఉత్తమమైన పౌరులను సమాజానికి అందిస్తారు. దేశ ప్రగతిలో విద్య పాత్ర ఎనలేనిది. విద్యార్థులకు విలువలతో కూడిన విద్య నేర్పి, సుశిక్షితులైన మానవ వనరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. గురు సాక్షాత్ పరబ్రహ్మ అని తరతరాలుగా నమ్ముతున్న మనదేశంలో టీచర్లకు గౌరవ మర్యాదలకు, అవకాశాలకు, ఆదాయానికి లోటు లేదు. వృత్తిపరమైన ఆత్మసంతృప్తి పొందడానికి ఆస్కారం ఉన్న ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు నేటి యువత ఆసక్తి చూపుతోంది.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవకాశాలు :
పాఠశాల ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడంతో టీచర్లకు డిమాండ్ పెరిగింది. దేశంలో లక్షలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వాలు టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుడుతున్నాయి. కొత్త ఉద్యోగాలను మంజూరు చేస్తున్నాయి. దీంతో డీఈడీ, బీఈడీ వంటి కోర్సులను పూర్తిచేసిన వారికి అవకాశాలు తలుపు తడుతున్నాయి. విద్యారంగం ప్రైవేట్ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అంతటా ప్రైవేట్ స్కూల్స్ వెలుస్తున్నాయి. పట్టణాల్లోనూ పేరొందిన కార్పొరేట్ పాఠశాలలు భారీ స్థాయిలో ఏర్పాటవుతున్నాయి. నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయులకు వీటిలో మంచి గిరాకీ ఉంది. ఇటీవలి కాలంలో టీచర్లకు వేతనాలు భారీగా పెరిగాయి. ఇతర రంగాలతో సమానంగా వేతనాలు అందుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో డీఈడీ, బీఈడీ కోర్సుల్లో చేరేవారి సంఖ్య అధికమవుతోంది. బోధనా రంగంలో కొలువులకు కొరత లేకపోవడం యువత దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఉపాధ్యాయ కోర్సులను చదివినవారు సొంతంగా పాఠశాలను స్థాపించుకోవచ్చు. మరికొందరికి ఉపాధి కల్పించవచ్చు.

టీచర్లు.. నిత్య విద్యార్థులు :
టీచర్‌గా వృత్తిలో రాణించాలంటే.. ప్రధానంగా సబ్జెక్ట్ పరిజ్ఞానం ఉండాలి. ఉపాధ్యాయులు అంటే బోధించేవారే కాదు.. నిత్య విద్యార్థులు కూడా. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి. విద్యార్థులందరినీ సమదృష్టితో చూసే పక్షపాత రహిత ధోరణి అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. విద్యార్థులకు ఆదర్శప్రాయులుగా మారి, వారి ఉన్నతికి తోడ్పాటునందించాలి.

అర్హతలు:
ఇంటర్మీయెట్, గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టేందుకు అవకాశం ఉంది. ఇంటర్ అర్హతతో ప్రవేశ పరీక్ష రాసి, డీఈడీ కోర్సు పూర్తిచేసిన వారు ప్రాథమిక తరగతులకు బోధించవచ్చు. ఇక గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రవేశ పరీక్ష రాసి, బీఈడీ కోర్సు చదివినవారు పదో తరగతి వరకు పాఠాలు చెప్పొచ్చు.

వేతనాలు:
ఉపాధ్యాయులకు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వేతనం అందుతుంది. సీనియారిటీని బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. కార్పొరేట్ పాఠశాలల్లో అధిక వేతనాలు ఉంటాయి. ప్రభుత్వ రంగంలోనూ ఆకర్షణీయమైన జీతం, ఇతర భత్యాలు పొందొచ్చు.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు :
  • ఉస్మానియా విశ్వవిద్యాలయం
    వెబ్‌సైట్:
    www.osmania.ac.in
  • ఇగ్నో-హైదరాబాద్
    వెబ్‌సైట్:
    rchyderabad.ignou.ac.in/
  • ఆంధ్ర మహిళా సభ
    వెబ్‌సైట్:
    andhramahilasabha.org.in/
  • మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    www.manuu.ac.in
  • ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
    వెబ్‌సైట్:
    www.nagarjunauniversity.ac.in
బోధనను నిరంతరం మెరుగుపర్చుకోవాలి!
శ్రీఇంజనీర్, డాక్టర్, లాయర్, సైంటిస్ట్... ఎవరైనా ఉపాధ్యాయుడి శిక్షణ నుంచి వచ్చినవారే. గురువు లేకుండా ఎంతటి వారైనా గొప్పవారు కాలేరు. తెల్లకాగితం లాంటి విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దేది గురువే. అంతటి బాధ్యతాయుతమైనది ఉపాధ్యాయ వృత్తి. దానికితోడు సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్‌కు ధీటుగా టీచింగ్ కెరీర్‌లో సంతృప్తి లభిస్తుంది. ఈ వృత్తిపై మక్కువ చూపే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో లక్షల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. జాబ్ సులువుగా ఉంటుందనో, సెలవులు ఎక్కువగా లభిస్తాయని భావించొద్దు. ఉపాధ్యాయులు సరికొత్త శాస్త్రీయ విధానాలతో బోధనను నిరంతరం మెరుగుపర్చుకోవాలి. టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. క్లాస్‌రూం మేనేజ్‌మెంట్, కంటెంట్ డెవలప్‌మెంట్ తదితర అంశాల్లో అధ్యయనం చేస్తుండాలి. ఉపాధ్యాయ వృత్తిని కేవలం జాబ్‌లా కాకుండా ఒక మిషన్‌లా భావించాల్ణి
- సీతామూర్తి, ప్రిన్సిపల్
సిల్వర్ ఓక్స్- ది స్కూల్ ఆఫ్ హైదరాబాద్
Published date : 21 Aug 2014 01:18PM

Photo Stories