Skip to main content

ఉజ్వల భవితకు వేదికలు.. గురుకులాలు

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంసెట్, సీఏ-సీపీటీ వంటి పరీక్షలకు శిక్షణను అందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాదిని వేస్తున్నాయి.
ప్రతిభావంతులకు చక్కని వేదికలైన ఈ గురుకులాల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి ఏపీఆర్‌జేసీ నోటిఫికేషన్ వెలువడింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిద్వారా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ. ఒకేషనల్ కోర్సులను అందిస్తున్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరు కాలేజీ మాత్రమే ఈఈటీ, సీజీడీటీ కోర్సులను అందిస్తోంది. కాలేజీల వారీగా గ్రూపుల వివరాలు..

కాలేజీల వివరాలు

కాలేజీల సంఖ్య

బాలురు జనరల్

04

బాలికలు జనరల్

02

కో ఎడ్యుకేషన్ జనరల్

01

బాలురు- మైనారిటీలు

02

బాలికలు -మైనారిటీలు

01

మొత్తం

10


రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కుల ప్రశ్నపత్రంలో ఎంచుకున్న గ్రూపును బట్టి మూడు సబ్జెక్ట్‌లలో పరీక్షను నిర్వహిస్తారు. ఇంగ్లిష్ పేపర్ అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. ఒక్కో సబ్జెక్ట్‌కు 50 ప్రశ్నలు చొప్పున 50 మార్కులుంటాయి. పరీక్ష సమయం: రెండున్నర గంటలు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి.

ఎవరేం చదవాలంటే?
ఎంపీసీ గ్రూప్‌ను ఎంచుకున్నవారు ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించాలి. బైపీసీ వారు ఇంగ్లిష్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, సీఈసీ/ ఎంఈసీ వారు ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులను చదవాలి. ఈఈటీ వారైతే ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సీజీడీటీ గ్రూపు ఎంచుకున్నవారు ఇంగ్లిష్, బయాలజీ, ఫిజికల్‌సైన్స్ సబ్జెక్టులను ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.

భవిష్యత్ లక్ష్యంగా:
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు నాణ్యమైన లేబొరేటరీలు, చక్కటి లైబ్రరీలు, విశాలమైన రీడింగ్ రూమ్‌లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అన్ని వసతులతో కూడిన ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కూడా ఉంటుం ది. విద్యార్థులను కేవలం ఇంటర్ విద్యకు పరిమితం చేయకుండా.. వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేలా మరెన్నో అనుబంధ కోర్సుల్లో శిక్షణ కూడా లభిస్తుంది. వాటిలో.. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంసెట్, జేఈఈ వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తారు. అదేవిధంగా ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులను సీఏ, ఐసీడబ్ల్యూఏ కోర్సుల్లో శిక్షణనిస్తారు. ఎంఈసీ, సీఈసీ విద్యార్థులకు సీపీటీ (ఇ్కఖీ) మాదిరి పరీక్షలను కూడా నిర్వహిస్తారు.

నోటిఫికేషన్ సమాచారం:
అర్హత:
10వ తరగతి మొదటి ప్రయత్నంలోనే మార్చి/ఏప్రిల్, 2015 పరీక్షలలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓసీ విద్యార్థులు 6 జీపీఏ, బీసీ/ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 5 జీపీఏ సాధించాలి. ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో అందరూ విద్యార్థులు 4 జీపీఏ సాధించి ఉండాలి. గతంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తుకు అనర్హులు.
  • దరఖాస్తు రుసుం: రూ. 150
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
  • దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 17, 2015.
  • రాత పరీక్ష తేదీ: మే 7, 2015.
  • వెబ్‌సైట్: aprs.cgg.gov.in

ప్రిపరేషన్:
  • గణితంలో అన్ని పాఠ్యాంశాల నుంచి సమాన సంఖ్యలో ప్రశ్నలు వస్తాయి కాబట్టి విద్యార్థులు ప్రతి పాఠ్యాంశంపై సమదృష్టి పెట్టాలి. సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు - ఛేదన రేఖలు, త్రికోణమితి, త్రికోణమితి - అనువర్తనాలు, క్షేత్రమితి, నిరూపక రేఖా గణితంపై పట్టు సాధించాలి. ఫిజిక్స్‌లో గణిత సంబంధ ప్రక్రియలు, సూత్రాలు, కారణ సంబంధిత ఫలితాలు, భౌతిక స్థిరాంకపు విలువపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. కెమిస్ట్రీ విభాగంలో ఫార్ములాలు, సమీకరణాలు, సిద్ధాంతాలు, ఉపయోగాలు, ఉదాహరణలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. కొత్త పాఠ్యపుస్తకం కృత్యాధార పద్ధతి ఆధారంగా రూపొందింది కాబట్టి విద్యార్థి ప్రయోగాలు, వాటి ఫలితాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది.
  • జీవశాస్త్రంలో అన్ని అంశాలను సమగ్రంగా చదవాలి. అందులోని భావనలను, విషయాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలి. కీలక భావనలు, సమీకరణాలు, పదజాలాన్ని నోట్స్‌గా రాసుకోవాలి. ఈ క్రమంలో ప్రతి పాఠ్యాంశం చివర్లో ఉన్న ముఖ్యాంశాలు, ఖాళీలు, బహుళైచ్ఛిక, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
  • సోషల్ స్టడీస్‌లో జాతీయవాద ఉద్యమాలు, సామ్రాజ్యవాదం, సమకాలీన ప్రపంచం, భారతదేశ సాంస్కృతిక వారసత్వం, భారత స్వాతంత్య్రోద్యమం, భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక, భౌతిక రూపురేఖలు, శీతోష్ణస్థితి తదితర అంశాలను చదవాలి. పుస్తకాల్లో ఇచ్చిన కీలక పదాలపై అవగాహన ఏర్పర్చుకోవాలి.
Published date : 10 Apr 2015 04:35PM

Photo Stories