Skip to main content

జేఈఈ మెయిన్ - 2016 పరీక్ష విధివిధానాలు

ఎంట్రన్స్ ఒకటేనా? లేదా ఈసారి కూడా రెండు పరీక్షలు రాయాలా? ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉంటుందా? ఉండదా? గత కొన్ని నెలలుగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలపై విద్యార్థులను వేధిస్తున్న సందేహాలు. ఇప్పుడు అన్నిటికి స్పష్టత వచ్చింది. 2016లో ప్రవేశాలకు కూడా గత ఏడాది విధానాన్నే అనుసరించనున్నారు. అయితే గతంలో మెయిన్ నుంచి లక్షన్నర మందినే అడ్వాన్‌‌సడ్‌కు ఎంపిక చేస్తుండగా ఈ ఏడాది ఆ సంఖ్యను మరో యాభై వేలకు పెంచి మొత్తం రెండు లక్షల మందిని అడ్వాన్‌‌సడ్‌కు ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు జేఈఈ మెయిన్-2016 ప్రకటన విడుదలైంది. ఈ నేపథ్యంలో మెయిన్ పరీక్ష వివరాలు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణ..
ఐఐటీల బాటలో తొలి దశ జేఈఈ-మెయిన్
దేశంలోని 31 ఎన్‌ఐటీలు, 18 ట్రిపుల్ ఐటీలు; మరో 18 కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్ (జీఎఫ్‌టీఐ)లలో ప్రవేశానికి తొలి మెట్టు జేఈఈ మెయిన్. ఇందులో విజయం సాధిస్తే ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశంతోపాటు, ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావచ్చు. అందుకే ఏటా జేఈఈ మెయిన్ ఔత్సాహికుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది దేశవ్యాప్తంగా 13.57 లక్షల మంది హాజరుకాగా.. తెలుగు రాష్ట్రాల నుంచే 1.22 లక్షల మంది విద్యార్థులుండటమే ఇందుకు నిదర్శనం.

ఇంటర్ వెయిటేజీ యథాతథం
జేఈఈ-మెయిన్ తుది ర్యాంకుల రూపకల్పనలో ఈసారి కూడా ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ యథాతథంగా ఉండనుంది. దీని ప్రకారం మెయిన్‌లో పొందిన మార్కులకు 60 శాతం, ఇంటర్ గ్రూప్ సబ్జెక్ట్‌లలో పొందిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. వీటి ఆధారంగా అర్హుల జాబితా రూపొందిస్తారు. ఈసారి అడ్వాన్‌‌సడ్‌కు అభ్యర్థుల సంఖ్యను పెంచడం వల్ల అడ్వాన్‌‌సడ్ పరీక్ష రాసే విద్యార్థులతోపాటు మెయిన్ స్కోర్లు, ర్యాంకుల ఆధారంగా నిర్వహించే ప్రవేశాల్లో పాల్గొనేందుకు కూడా అదనంగా 50 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.

ఒకే పేపర్.. రెండు విధానాలు
జేఈఈ-మెయిన్ పరీక్ష ఒక పేపర్‌గా రెండు విధానాల్లో (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) ఉంటుంది. ప్రతి పేపర్‌లో మూడు విభాగాలు (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల సంఖ్య, మార్కుల విధానం ఏటా మారుతోంది. గత ఏడాది ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ మూడు విభాగాల నుంచి 30 చొప్పున 90 ప్రశ్నలతో 360 మార్కులకు ఈ పరీక్షను నిర్వహించారు.

ఆర్కిటెక్చర్ కోర్సులకు పేపర్-2
మెయిన్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేకంగా పేపర్-2 నిర్వహిస్తారు.

అన్నిటికీ ప్రాధాన్యం
జేఈఈ-మెయిన్ సిలబస్, ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ రెండు సంవత్సరాల సిలబస్‌కు సమప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ సాగించాలి. గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు-అంశాలు, వెయిటేజీలే ఇందుకు నిదర్శనం. గత ఏడాది ఆయా విభాగాల్లో ఇంటర్మీడియెట్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల నుంచి అడిగిన ప్రశ్నల సంఖ్య

విభాగం

ఫస్ట్ ఇయర్

సెకండ్ ఇయర్

మొత్తం

కెమిస్ట్రీ

10

20

30

మ్యాథమెటిక్స్

16

14

30

ఫిజిక్స్

13

17

30

మొత్తం

39

51

90


ప్రిపరేషన్ ఇలా..
వ్యూహం.. విభిన్నం
విద్యార్థుల ప్రిపరేషన్ కూడా విభిన్నంగా ఉండాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్‌లో కాన్సెప్ట్‌లు, బేసిక్స్‌పై లోతైన అవగాహన పెంచుకోవాలి. తదుపరి దశ అడ్వాన్స్‌డ్ కోసం అప్లికేషన్ ఆధారిత సమస్యలను వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోనూ కాన్సెప్ట్స్, అప్లికేషన్ ఆధారిత ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్జెక్టుల వారీగా కొన్ని ముఖ్యమైన అంశాలు..

ఫిజిక్స్
మెయిన్ సిలబస్ ప్రకారం మొత్తం 20 చాప్టర్లుగా ఉండే ఫిజిక్స్‌లో వర్క్, ఎనర్జీ అండ్ పవర్; ఎలక్ట్రో స్టాటిక్స్; కరెంట్ ఎలక్ట్రిసిటీ; వేవ్ ఆప్టిక్స్; రే ఆప్టిక్స్ వెయిటేజీ పరంగా ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్న చాప్టర్లు. అంతేకాకుండా సులువుగా ఉండే పాఠ్యాంశాలు కూడా ఇవే. వీటిలో పట్టు సాధిస్తే 40 శాతం మార్కులు సులువుగా సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్; సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్ ఇతర ముఖ్య చాప్టర్లు. వీటిలో పట్టు సాధించాలంటే బేసిక్ ఫార్ములాలు, సిద్ధాంతాలపై అవగాహన పొందడంతోపాటు నిరంతరం ప్రాక్టీస్ చేయాలి.

మ్యాథమెటిక్స్
మెయిన్ సిలబస్ ప్రకారం మొత్తం 16 చాప్టర్లు ఉండగా.. ప్రతి చాప్టర్‌ను ప్రధానంగానే భావించాలి. కారణం ఒక చాప్టర్‌కు మరో చాప్టర్‌తో అనుసంధానం ఉంటుంది. ఏదైనా ఒక చాప్టర్‌ను విస్మరిద్దామనుకుంటే దానికి కొనసాగింపుగా ఉండే తదుపరి చాప్టర్లలోని అంశాలు నేర్చుకోవడం కష్టమవుతుంది. 3-డి జామెట్రీ; కో ఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్‌కు కొంచెం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వీటితోపాటు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్ అంశాలను కనీసం ఒక్కసారైనా పూర్తి చేసే విధంగా ప్రిపరేషన్ సాగించాలి.

కెమిస్ట్రీ
మిగతా విభాగాలతో పోల్చితే అధిక స్కోర్‌కు అవకాశం కల్పించే విభాగం కెమిస్ట్రీ. మొత్తం 28 చాప్టర్లలో అధికశాతం కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్, బ్రేకింగ్‌ల మూలాలుగా ఉంటాయి. దీనికి అనుగుణంగా మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డీహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి.

జేఈఈ మెయిన్-2016లో మెరవాలంటే..
ఇంటర్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ
విద్యార్థులు ఇంటర్మీడియెట్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ నెలాఖరుకు మెయిన్ సిలబస్, ఇంటర్ రెండేళ్ల సిలబస్‌లో ఉన్న ఉమ్మడి అంశాలను పూర్తి చేయాలి. జనవరిలో మెయిన్ సిలబస్‌లో ఉండి, ఇంటర్‌లో లేని అంశాలపై దృష్టి పెట్టాలి. ఫిబ్రవరి నుంచి పూర్తిగా ఇంటర్ పరీక్షల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. మార్చి చివరి వారంలో ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత మెయిన్ పరీక్షపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. అప్పటికే తాము రాసుకున్న సొంత నోట్స్, షార్ట్ కట్ ఫార్ములాల ఆధారంగా రివిజన్ చేయాలి. ఆ సమయంలో కొత్త అంశాలు (అంటే అప్పటి వరకు చదవని, విస్మరించిన అంశాలు) చదవడం ఏ మాత్రం సరికాదు.

టైం మేనేజ్‌మెంట్
ఇంటర్మీడియెట్ అకడమిక్ తరగతుల సమయాన్ని మినహాయిస్తే అందుబాటులో ఉండే సమయంలో కనీసం ఆరు నుంచి ఏడు గంటలు మెయిన్, ఇంటర్మీడియెట్ అంశాల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. రోజూ ప్రతి సబ్జెక్ట్ చదివే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. చదివేటప్పుడే ముఖ్యమైన అంశాలతో నోట్స్ రాసుకోవడంతోపాటు ఫార్ములాలు, సిద్ధాంతాలు ఉండేలా చూసుకోవాలి. ఇది రివిజన్ సమయంలో బాగా ఉపకరిస్తుంది. ఇలా ఇప్పటి నుంచే రోజూ వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ సాగిస్తూ కనీసం 150 మార్కులు లక్ష్యంగా కృషి చేస్తే ‘కటాఫ్ రేంజ్’లో నిలిచే అవకాశాలు మెరుగవుతాయి.

జేఈఈ మెయిన్-2015, 2014 అధికారిక కటాఫ్ స్కోర్లు

విభాగం

2015

2014

కామన్ మెరిట్ లిస్ట్

105

115

ఓబీసీ

70

74

ఎస్‌సీ

50

53

ఎస్‌టీ

44

47


మెయిన్ ద్వారా సీట్లు భర్తీ చేసే ఇన్‌స్టిట్యూట్‌లు - సీట్ల సంఖ్య

ఇన్‌స్టిట్యూట్‌లు

సంఖ్య

సీట్లు

ఎన్‌ఐటీలు

31

17,920

ట్రిపుల్ ఐటీలు

18

2,228

ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు

18

3,920

మొత్తం

67

24,068


గమనిక: ఎన్‌ఐటీల్లోని సీట్లలో 50 శాతం సీట్లను సదరు నిట్ ఏర్పాటై ఉన్న రాష్ట్ర విద్యార్థులకు హోం స్టేట్ కోటా కింద కేటాయిస్తారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ విద్యార్థులకు నిట్ వరంగల్‌లో 370 (మొత్తం సీట్లు 740); నిట్ తాడేపల్లిగూడెంలో 240 (మొత్తం సీట్లు 480) సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు హోం స్టేట్ కోటాలో రిజర్వేషన్ ఉంటుంది.

కాన్సెప్ట్స్, అప్లికేషన్స్, ప్రాక్టీస్
మెయిన్‌లో విజయానికి మూడు ముఖ్యమైన సూత్రాలు అనుసరించాలి. అవి కాన్సెప్ట్ ఆధారిత అధ్యయనం, అప్లికేషన్ నాలెడ్జ్, వీటిని ఆధారం చేసుకుంటూ నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇంటర్ సిలబస్ అంతా సీబీఎస్‌ఈ స్థాయిలోనే ఉంది కాబట్టి జేఈఈ కోసం ప్రత్యేకంగా చదవాల్సిన అంశాలు చాలా తక్కువ. దీన్ని అనుకూలంగా మలచుకోవాలి. ఇంటర్ సిలబస్‌లోని అంశాలను చదువుతున్నప్పుడే వాటిని కాన్సెప్ట్ ఆధారితంగా, అప్లికేషన్ దృక్పథంతో అధ్యయనం చేస్తే జేఈఈ మెయిన్‌కు కూడా ప్రిపరేషన్ సరిపోతుంది. అదే విధంగా సెల్ఫ్ ప్రాక్టీస్, మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్‌లు కూడా మెయిన్‌లో విజయ సోపానాలు.
- వాకచర్ల ప్రమోద్, జేఈఈ-మెయిన్ 2015 టాపర్

150 మార్కులు లక్ష్యంగా పెట్టుకుంటే..
జేఈఈ మెయిన్ అభ్యర్థులు 150 మార్కులు లక్ష్యంగా పెట్టుకుని కృషి చేయాలి. అప్పుడే పరీక్షలో నెగెటివ్ మార్కింగ్‌కు గురైనా కటాఫ్ రేంజ్‌లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రిపరేషన్ పరంగా కేవలం రీడింగ్‌కే పరిమితం కాకుండా వీలైనంత మేర ప్రాక్టీస్ చేయాలి. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్స్, డి-బ్లాక్ ఎలిమెంట్స్ వంటి వాటిని నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్‌కు ఉపకరిస్తుంది. ఇక ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో అధిక శాతం అంశాలు ఇంటర్ రిలేటెడ్‌గా ఉంటాయి. కాబట్టి వాటిలో క్లిష్టంగా ఉన్న వాటిని ఛాయిస్ కోణంలో వదిలేద్దాం అనే భావన సరికాదు. తదుపరి పాఠ్యాంశాల్లో రాణింపుపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. జేఈఈ మెయిన్ ఔత్సాహిక అభ్యర్థులు డిసెంబర్ చివరికి జేఈఈ సిలబస్ పూర్తి చేసుకునే విధంగా ప్లాన్ రూపొందించుకోవడం మేలు.
- డి.కె.ఝా, డెరైక్టర్, విజన్40 ఐఐటీ అకాడమీ, ఆథర్-అరిహంత్ పబ్లికేషన్స్

జేఈఈ మెయిన్ - 2016 సమాచారం
  • అర్హత: బీటెక్ కోర్సు ఔత్సాహికులు 45 శాతం మార్కులతో; బీఆర్క్, బీప్లానింగ్ ఔత్సాహికులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. (రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు ఉంటుంది). 2014, 2015లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసినవారు; 2016లో చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • వయో పరిమితి: అక్టోబర్ 1, 1991 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులు అక్టోబర్ 1, 1986 తర్వాత జన్మించి ఉండాలి.
  • గరిష్ట పరిమితి: జేఈఈ-మెయిన్‌కు గరిష్టంగా మూడుసార్లు హాజరు కావచ్చు.
  • దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 1, 2015
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31, 2015

పరీక్ష తేదీలు:
  • ఆఫ్‌లైన్ పరీక్ష: ఏప్రిల్ 3
  • ఆన్‌లైన్ పరీక్ష: ఏప్రిల్ 9, ఏప్రిల్ 10
  • వెబ్‌సైట్: www.jeemain.nic.in
Published date : 26 Nov 2015 05:51PM

Photo Stories