Skip to main content

చదువు ఉన్నతం..ఫీజులు నామమాత్రం..

సమున్నత సంస్థలో ఉన్నత విద్య అభ్యసించాలన్నది.. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క విద్యార్థి ఆశ, ఆశయం! కానీ, కోర్సుల ఫీజులు రూ.లక్షలు దాటుతూ ప్రతిభావంతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.
కోర్సుల్లో చేరేందుకు అన్ని అర్హతలున్నా ఫీజులు భారంతో వాటికి దూరమవుతున్నారు. అయితే ప్రతిభ ఉంటే ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తామంటూ వివిధ సంస్థలు భరోసా ఇస్తున్నాయి. నామ మాత్రపు ఫీజులతో కోర్సులు అందిస్తున్నాయి. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. ఆయా సంస్థలపై స్పెషల్ ఫోకస్...

ఐఐఎఫ్‌ఎం (భోపాల్)
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్‌ఎం)... ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఐఐఎఫ్‌ఎం.. పీజీ డిప్లొమా ఇన్ ఫారెస్ట్రీ మేనేజ్‌మెంట్, ఫెలో ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్, ఎంఫిల్ కోర్సులను అందిస్తోంది.

ఆర్థిక ప్రోత్సాహకాలు:
పీజీడీఎఫ్‌ఎం:
క్యాట్/ఎక్స్‌ఏటీ స్కోరు,పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు మొదటి సెమిస్టర్లో చూపిన ప్రతిభ ఆధారంగా నెలకు రూ.5 వేల మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తారు. ప్రతి బ్యాచ్‌లో 20 శాతం మందికి ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది.
ఎఫ్‌పీఎం: ఫెలో ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్‌లో చేరిన విద్యార్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.12 వేలు, తర్వాత రెండేళ్లు నెలకు రూ.14 వేలు స్కాలర్‌షిప్ అందిస్తారు. దీంతోపాటు ఏడాదికి రూ.20 వేలు చొప్పున కాంటింజెన్సీ గ్రాంట్ ఇస్తారు.
వెబ్‌సైట్: www.iifm.ac.in

ఐఐపీఎస్ (ముంబై)
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సెన్సైస్ (ముంబై)... పీజీ స్థాయిలో ఎంఏ/ఎంఎస్సీ ఎకనామిక్స్, ఎంఎస్ (బయో స్టాటిస్టిక్స్ అండ్ ఎపిడమాలజీ), మాస్టర్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్ కోర్సులు అందిస్తోంది. ఇందులో ఎం.ఫిల్, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ కోర్సులు కూడా ఉన్నాయి. ఏ కోర్సులో చేరినప్పటికీ ఇన్‌స్టిట్యూట్ మెరిట్ స్కాలర్‌షిప్ లభిస్తుంది. పీజీ కోర్సులకు నెలకు రూ.5 వేలు, ఎం.ఫిల్‌కు నెలకు రూ.6 వేలు చెల్లిస్తారు. పీహెచ్‌డీ అభ్యర్థులకు యూజీసీ ఫెలోషిప్స్ లభిస్తాయి.
వెబ్‌సైట్: www.iipsindia.org

ఐఎస్‌ఎం-ధన్‌బాద్
ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్... మైనింగ్ కోర్సుల బోధనలో ప్రముఖ సంస్థ. మొదట్లో మైనింగ్ కోర్సులకే పరిమితమైనప్పటికీ, ప్రస్తుతం బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులను కూడా ఆఫర్ చేస్తోంది. మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్స్, మెరిట్ కమ్ మీన్స్ ఫ్రీషిప్ పేరిట అన్ని కోర్సుల విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు ఇస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఎస్సీ టెక్ విద్యార్థులకు నెలకు రూ.5 వేల ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ అందిస్తోంది. దీంతోపాటు మొదటి సంవత్సరం చూపిన ప్రతిభ ఆధారంగా రెండో ఏడాది నుంచి ఏటా రూ.20 వేల మెంటార్‌షిప్‌ను ఆఫర్ చేస్తోంది. బీటెక్ నుంచి పీహెచ్‌డీ వరకు ప్రతి కోర్సులో 25 శాతం మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్ పేరుతో ఫీజు మొత్తం నుంచి మినహాయింపు ఇవ్వడమే కాకుండా నెలకు రూ.800 స్కాలర్‌షిప్ ఇస్తున్నారు. మెరిట్ కమ్ మీన్స్ ఫ్రీషిప్ పేరిట ప్రతి కోర్సులో పది శాతం మంది ప్రతిభావంతులకు మొత్తం ఫీజు రాయితీ లభిస్తుంది. విద్యార్థినులకు ప్రత్యేకంగా బుధ్వంతి మృగ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ స్కాలర్‌షిప్ సదుపాయం కల్పిస్తోంది. దీనికింద ప్రతి కోర్సులో పది శాతం మందికి ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
వెబ్‌సైట్: www.ismdhanbad.ac.in

ఐజీఐడీఆర్ (ముంబై)
ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ (ఐజీఐడీఆర్)... ఎకనామిక్స్ కోర్సుల్లో ప్రతిభావంతులను తీర్చిదిద్దేందుకు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలకొల్పిన సంస్థ. ఇందులో ఎంఎస్సీ ఎకనామిక్స్, డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఎంఫిల్/పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సెమిస్టర్‌కు రూ.12 వేలు ఫీజుండే ఎంఎస్సీ కోర్సులో చేరిన విద్యార్థులకు నీడ్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ లభిస్తాయి. అదే విధంగా రెండో ఏడాది నుంచి పార్ట్‌టైం విధానంలో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌లుగా పనిచేసే అవకాశముంది. దీనికి కొంత పారితోషికం ఉంటుంది. ఎంఫిల్/పీహెచ్‌డీలో చేరిన వారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.17 వేల స్టైఫండ్ ఉంటుంది. ఎంఫిల్ తర్వాత పీహెచ్‌డీలో ప్రవేశం లభిస్తే మూడో ఏడాది నుంచి నెలకు రూ.26 వేల స్టైఫండ్ లభిస్తుంది.
వెబ్‌సైట్: www.igidr.ac.in

నైపర్
ఫార్మాస్యూటికల్ రంగానికి ఉన్నత మానవ వనరులను అందించేందుకు ఏర్పడిన సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్). ఎస్‌ఏఎస్ నగర్ (మొహాలి), అహ్మదాబాద్, గువహటి, హజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలిలోని నైపర్ క్యాంపస్‌లు ఎంఫార్మసీ, ఎంటెక్ ఫార్మసీ, ఎంబీఏ (ఫార్మాస్యూటికల్) వంటి కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో చేరిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తాలు ఫీజులకు దాదాపు సమానంగా ఉండటంతో విద్యార్థులకు ఉచిత విద్య లభిస్తోందని చెప్పొచ్చు.
స్కాలర్‌షిప్: ఎంబీఏ మినహా ఇతర కోర్సుల్లో చేరిన అభ్యర్థులకు నెలకు రూ.8 వేల స్టైఫండ్ చెల్లిస్తారు. అయితే అభ్యర్థుల సీజీపీఏ ప్రతి సెమిస్టర్‌లో ఆరుకు తగ్గకుండా ఉండాలి.
వెబ్‌సైట్: www.niper.gov.in

ఐఐఎస్‌ఈఆర్
సైన్స్ రంగంలో ప్రతిభావంతులను తీర్చిదిద్దేందుకు ఏర్పడిన సంస్థ.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్). భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి క్యాంపస్‌ల్లో కోర్సులు అందిస్తోంది.
  • బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సు విద్యార్థులకు ఇన్‌స్పైర్ లేదా కేవైపీవై స్కీం ద్వారా నెలకు రూ.5 వేల స్కాలర్‌షిప్ లభిస్తుంది.
  • ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ అభ్యర్థులకు స్పెషలైజేషన్ల ఆధారంగా ఫీజులు నామమాత్రంగా (రూ.10 వేలు-రూ.25 వేలు) ఉంటాయి.
  • బయలాజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్ తదితర విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు యూజీసీ జేఆర్‌ఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి.
వెబ్‌సైట్: www.iiseradmission.in

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ)... కోల్‌కతా. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, తేజ్‌పూర్ క్యాంపస్‌ల ద్వారా బ్యాచిలర్ డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు కోర్సులను అందిస్తోంది. వీటికి స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి.
  • స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశించిన విద్యార్థులకు నెలకు రూ.3 వేల స్కాలర్‌షిప్. పీజీ స్థాయిలో కంప్యూటర్ సైన్స్, క్వాలిటీ-రిలయబిలిటీ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ విద్యార్థులకు నెలకు రూ.8 వేలు, ఇతర పీజీ విద్యార్థులకు నెలకు రూ.5 వేలు చొప్పున స్టైఫండ్ ఉంటుంది. పీజీ డిప్లొమా విద్యార్థులకు నెలకు రూ. 2 వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. పీహెచ్‌డీ అభ్యర్థులకు యూజీసీ నిబంధనల ప్రకారం జేఆర్‌ఎఫ్‌లు లభిస్తాయి.
వెబ్‌సైట్: www.isical.ac.in

టీఐఎస్‌ఎస్ (టిస్)
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్)... ముంబైలోని ప్రధాన క్యాంపస్‌తోపాటు హైదరాబాద్, తుల్జాపూర్‌లలో బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచి ఇంటిగ్రేటెడ్ పీజీ, పీహెచ్‌డీ వరకు పలు కోర్సులను అందిస్తోంది. మెరిట్ కమ్ మీన్ బేస్ట్ విధానంలో అన్ని కోర్సుల్లో అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫెలోషిప్ సదుపాయం కల్పిస్తోంది.
  • కోర్సులకు సంబంధించి సోషల్ వర్క్ విభాగంలో కనిష్టంగా నెలకు రూ. 300, గరిష్టంగా రూ.20 వేల స్కాలర్‌షిప్ లభిస్తుంది.
  • హెచ్‌ఆర్‌ఎం అండ్ లేబర్ రిలేషన్స్‌లో కనిష్టంగా రూ.12 వేలు, గరిష్టంగా రూ.15 వేల వార్షిక స్కాలర్‌షిప్ లభిస్తుంది.
ఫ్రీ ట్యూషన్‌షిప్ పథకం: స్కాలర్‌షిప్‌లతోపాటు టిస్‌లో ఫ్రీ ట్యూషన్ షిప్ పేరుతో ట్యూషన్ ఫీజు మొత్తం మినహాయింపు పొందే అవకాశం లభిస్తోంది. మొత్తం 25 స్కాలర్‌షిప్స్ లభిస్తాయి.
వెబ్‌సైట్: www.tiss.edu

ట్రిపుల్ ఐటీ- హైదరాబాద్
ట్రిపుల్ ఐటీ (హైదరాబాద్) ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులు అందించడంలో కొద్ది కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఇక్కడ బీటెక్ నుంచి పీహెచ్‌డీ వరకు కోర్సుల్లో చేరిన ప్రతిభావంతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తోంది. బీటెక్ స్థాయిలో ప్రభుత్వం అందించే ప్రతిభా పురస్కారాలు లభిస్తాయి. ఎంటెక్ స్థాయిలో ఇన్‌స్టిట్యూట్ వివిధ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. అవి..
  • ఎంఎస్ బై రీసెర్‌‌చ, పీహెచ్‌డీ కోర్సుల్లో ఫుల్ ఇన్‌స్టిట్యూట్ ఫెలోషిప్ పేరుతో ట్యూషన్ ఫీజు మొత్తం నుంచి మినహాయింపునివ్వడంతోపాటు నెలకు రూ.4,500 స్టైఫండ్ అందిస్తోంది.
  • ఎంటెక్ కంప్యుటేషనల్ లింగ్విస్టిక్ కోర్సు విద్యార్థులకు పార్షియల్ ఇన్‌స్టిట్యూట్ ఫెలోషిప్ స్కీంను అమలు చేస్తోంది.
  • ఇన్‌స్టిట్యూట్ స్కాలర్‌షిప్‌లు, గేట్ స్కాలర్‌షిప్‌లు లభించే విద్యార్థులు ప్రతి వారం 20 గంటలు చొప్పున రీసెర్చ్ ల్యాబ్‌ల్లో పనిచేయాలి. సెలవు రోజుల్లో వారానికి 40 గంటలు చొప్పున పనిచేయాలి.
    వెబ్‌సైట్: www.iiit.ac.in
ప్రతిభ ఉంటే ప్రోత్సాహకాలు ఎన్నో
ఏదైనా ఉన్నత విద్యాసంస్థలో చేరాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులు అక్కడి ఫీజులను చూసి, ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇప్పుడు అనేక ఉన్నత విద్యా సంస్థలు పలు స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి. ఆయా సంస్థల్లో అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్స్ గురించి తెలుసుకోవాలి. ఒకసారి కోర్సులో చేరిన తర్వాత స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులు... ఆయా కోర్సుల్లో ప్రతిభ కనబరుస్తుంటే కోర్సు ఆసాంతం ఆర్థిక సహాయం లభిస్తుంది.
- డాక్టర్ బసిరెడ్డి సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్, ఐజీఐడీఆర్-ముంబై.


ఆర్థిక సదుపాయాలు అనేకం
ప్రముఖ సంస్థల్లో విద్యాభ్యాసం అంటే ఖర్చుతో కూడుకున్న పని అనే భావనను తొలుత విడిచిపెట్టాలి. ఫీజులతోపాటు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో అందుబాటులో ఉన్న ఆర్థిక సహాయం సదుపాయాల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు దేశంలో ఎన్నో ఇన్‌స్టిట్యూట్‌ల్లో మెరిట్ కమ్ మీన్ బేస్డ్ స్కాలర్‌షిప్ సదుపాయాలు లభిస్తున్నాయి.
- ప్రొఫెసర్ కె.కమలాకర్, డీన్, ఐఐఐటీ-హెచ్.


సద్వినియోగం చేసుకోవాలి
ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిభావంతులైన యువతకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ఛారిటీ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఇన్‌స్టిట్యూట్‌లు స్కాలర్‌షిప్స్‌ను అందిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
- ప్రొఫెసర్ పి.కృష్ణమూర్తి, ఐఐపీఎస్.
Published date : 23 Jul 2015 05:44PM

Photo Stories