Skip to main content

ఉన్నత విద్యకు ప్రమాణాల భరోసా!

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది.. ఎన్నో ఆలోచనలు, మరెన్నో లక్ష్యాలు వెరసి.. చక్కని భవిష్యత్‌కు ఆరంభంగా నిలిచే సమయం ముంగిట నిలిచింది.. పలు కోర్సులు.. వివిధ కాలేజీలు.. ఇలా విద్యార్థుల ముందు ఎన్నో అవకాశాలు.. ఇటువంటి సందర్భంలో అందరూ దాదాపు కెరీర్ దృష్టికోణంలో ఆలోచిస్తుంటారు.. అయితే వాటన్నిటికంటే ముందు ఆయా కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లకు సంబంధిత ఏజెన్సీల గుర్తింపు ఉందా? వాటిలో చేరడం ద్వారా చేసిన కోర్సులకు విలువ ఉంటుందా? అనే అంశాలను బేరీజు వేసుకోవాలి.. ఎందుకంటే చిన్నవిగా అనిపించే ఈ అంశాలే భవిష్యత్‌లో ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.. కాబట్టి ఈ దిశగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై విశ్లేషణ...

దేశంలో ఎన్నో కాలేజీలు, మరెన్నో కోర్సులు. వీటిని నిరంతరం పర్యవేక్షించడం, సంబంధిత ప్రమాణాలు పాటించేలా తనిఖీలు నిర్వహించడం వంటి వ్యవహారాల కోసం కొన్ని సంస్థలు పని చేస్తుంటాయి. ఇవి ఆయా కాలేజీలు, అవి ఆఫర్ చేసే కోర్సుల స్థితిగతులను వెల్లడించడానికి రికగ్నిషన్, అఫిలియేషన్, అక్రెడిటేషన్ వంటి పేర్లతో గుర్తింపునిస్తుంటాయి. తద్వారా వాటి స్థాయి ఏమిటో తెలుసుకోవచ్చు. దాంతో కోర్సు లేదా కాలేజీ ఎంపికకు సంబంధించి ఒక నిర్ణయానికి రావచ్చు. అంతేకాకుండా ఉద్యోగం/ఉన్నత విద్య వంటి అంశాల్లో నిశ్చింతగా ముందుకు వెళ్లొచ్చు.

లక్ష్యం ఒక్కటే:
రికగ్నిషన్, అఫిలియేషన్, అక్రెడిటేషన్..పేర్లు వేర్వేరుగా ఉన్నా.. వాటి అంతిమ లక్ష్యం విద్యా ప్రమాణాలను పెంపొందించడమే. కనీస అర్హతలు కలిగిన విద్యా సంస్థలకు ఇచ్చే గుర్తింపుని ‘రికగ్నిషన్’ అంటారు. కళాశాల స్థాయి విద్యా సంస్థలు సాధారణంగా యూనివర్శిటీలకు అనుబంధంగా ఉంటాయి. దానినే ‘అఫిలియేషన్’ అని పిలుస్తారు. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే కాలేజీలు. ఒక ఇన్‌స్టిట్యూట్ అందిస్తున్న విద్య నాణ్యతను అంచనావేయడానికి సంబంధిత ఏజెన్సీలు నిర్వహించే ప్రక్రియనే ‘అక్రెడిటేషన్’ అంటారు.

కీలక అంశం:
కాలేజీ ఎంపికలో అన్నింటికంటే ప్రధానమైన అంశం అక్రెడిటేషన్. విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన చదువును అందేలా చూడటమే అక్రెడిటేషన్ ప్రధాన ఉద్దేశం. అక్రెడిటేషన్ ఏజెన్సీలు నిర్దేశించిన ప్రమాణాల మేరకు సౌకర్యాలు ఉంటే సదరు కాలేజీకి అక్రెడిటేషన్ హోదాను ఇస్తాయి. ఇందుకోసం మౌలిక సౌకర్యాలు, ఫ్యాకల్టీ, ఉత్తీర్ణత శాతం, ప్లేస్‌మెంట్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. కాలేజీకి ఇచ్చే అక్రెడిటేషన్‌ను బట్టి ఆ ఇన్‌స్టిట్యూషన్ స్థాయిని చెప్పొచ్చు. అంతేకాకుండా ఆ ఇన్‌స్టిట్యూట్‌లలోని సౌకర్యాలను తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దేశంలోని అక్రెడిటేషన్ ఏజెన్సీల వివరాలు..

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ):
దేశంలో ఏ యూనివర్సిటీకైనా యూజీసీ గుర్తింపు తప్పనిసరి. యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి పర్యవేక్షణ, సమన్వయం, నిర్దేశిత ప్రమాణాలను పాటించేలా చూసే ఉద్దేశంతో యూజీసీని స్థాపించారు. దేశంలో ఉన్నత విద్యలో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్ విద్యనందిస్తున్న అన్ని విద్యా సంస్థలు యూజీసీ పరిధిలోకే వస్తాయి. ఈ సంస్థలన్నీ టీచర్ల నియామకం, వారి విద్యార్హతలు, మౌలిక వసతులు, ప్రవేశ ప్రక్రియ.. ఇలా అన్ని విషయాలలో యూజీసీ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. తదనుగుణంగా యూజీసీ విద్యా సంస్థలకు గుర్తింపునిస్తుంది. అంతేకాకుండా యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించడం, సమన్వయపరచడం, యూనివర్సిటీలలో బోధన, పరీక్షలు, పరిశోధనలకు సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలను నిర్ణయించడం, కాలేజ్, యూనివర్సిటీలకు నిధులను విడుదల చేయడం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం వంటివి యూజీసీ ఇతర విధులు. గతంలో దూరవిద్యా విధానంలో కోర్సులను నిర్వహించే విద్యా సంస్థలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం తదితర అంశాలను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డెక్) పర్యవేక్షించేది. కానీ మారిన విధానం మేరకు డెక్ అధికారాలన్నీ యూజీసీకి సంక్రమించాయి. దీంతో దూర విద్యకు సంబంధించి విధివిధానాలను యూజీసీకి చెందిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (డీఈబీ) పర్యవేక్షిస్తుంది.
వివరాలకు: www.ugc.ac.in

నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్):
దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల పనితీరును మూల్యాంకనం చేసే ఉద్దేశంతో నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్)ను యూజీసీ ఏర్పాటు చేసింది. అసెస్‌మెంట్, అక్రెడిటేషన్, రేటింగ్స్ మూడు రకాల వ్యవహారాలను నాక్ చేపడుతుంది. స్వీయ అధ్యయనం లేదా నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ఒక ఇన్‌స్టిట్యూట్ పనితీరును అంచనా వేయడమే అసెస్‌మెంట్. ఒక ఇన్‌స్టిట్యూట్‌కు నాక్ ఇచ్చే సర్టిఫికేషన్‌నే అక్రెడిటేషన్‌గా చెప్పొచ్చు. క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ పద్ధతి (సీజీపీఏ) ఆధారంగా నాక్ విద్యా సంస్థలకు నాలుగు రకాల గ్రేడులను మంజూరు చేస్తుంది. గతంలో అసెస్‌మెంట్, అక్రెడిటేషన్ ప్రక్రియలు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు స్వచ్ఛందంగా నిర్వహించుకునేవి. కానీ ప్రస్తుతం కాలేజీలు, యూనివర్సిటీలు యూజీసీ నిధులకు అర్హత కావాలంటే అక్రెడిటేషన్ స్టేటస్ పొందడం తప్పనిసరిగా మారింది.
వివరాలకు: www.naac.gov.in

నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్‌బీఏ):
నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ)ను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఏర్పాటు చేసింది. దేశంలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, టౌన్ ప్లానింగ్, మేనేజ్‌మెంట్‌కు సంబంధించి డిప్లొమా నుంచి పీజీ స్థాయి వరకు ఇన్‌స్టిట్యూట్‌ల గుణాత్మక పోటీతత్వాన్ని మదింపు చేయడానికి ఎన్‌బీఏను స్థాపించారు. ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన మౌలిక వసతులు, భౌతిక వనరులు, మానవ వనరులు, లైబ్రరీ రీసోర్సెస్, కంప్యూటేషనల్ రీసోర్సెస్, స్టూడెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ వంటి అంశాలను ఎన్‌బీఏ మదింపు చేస్తుంది. ఎన్‌బీఏ కాలేజీ మొత్తానికి అక్రెడిటేషన్ ఇవ్వదు. ప్రోగ్రామ్ స్థాయిలోనే అక్రెడిటేషన్ ఇస్తుంది. ఎన్‌బీఏ అక్రెడిటేషన్ ప్రక్రియ నాణ్యతా ప్రమాణాల ఆధారంగా ఉంటుంది. ఎన్‌బీఏ 1000 పాయింట్ల స్కేల్ విధానం ఆధారంగా అక్రెడిటేషన్ ఇస్తుంది. దేశంలో టెక్నికల్ కోర్సులను నిర్వహిస్తున్న ప్రతి విద్యా సంస్థ ఆరేళ్లకోసారి లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం రెండు బ్యాచ్‌ల పాసవుట్ తర్వాత ఎన్‌బీఏ అక్రె డిటేషన్‌ను తప్పనిసరిగా పొందాలి.
వివరాలకు: www.nbaind.org

ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ):
దేశంలో సాంకేతిక విద్య అభివృద్ధి ప్రణాళిక, ప్రమాణాలు, నిర్వహణ, పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఉన్నత సలహా సంస్థ ఏఐసీటీఈ. దేశంలో సాంకేతిక విద్యాసంస్థలలో డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్‌గ్రాడ్యుయేషన్/ పోస్ట్ డిప్లొమా/ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లామా కోర్సులను నిర్వహించాలంటే ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా ఏఐసీటీఈ నుంచి అనుమతి పొందడం తప్పనిసరి. ఈ క్రమంలో ఇంజనీరింగ్/ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఎంసీఏ, ఆర్కిటెక్చర్, పాలిటెక్నిక్ తదితర ఇన్‌స్టిట్యూట్‌లకు గుర్తింపునిస్తుంది. సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లలో అదనపు కోర్సులను ప్రవేశపెట్టడానికి కూడా ఈ సంస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కోర్సులు, కరిక్యులం, మౌలిక వసతులు, ఫ్యాకల్టీలు- అర్హతలు, నాణ్యత ప్రమాణాలు, అసెస్‌మెంట్, ఎగ్జామినేషన్ వంటి అంశాలకు సంబంధించి నిబంధనలను రూపొందించడం, కొత్తగా టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్ ఏర్పాటుకు, కొత్త కోర్సులను ప్రవేశపెట్టడానికి అనుమతినివ్వడం, ఇన్‌స్టిట్యూట్‌షన్స్‌ను నిరంతరం పర్యవేక్షించడం తదితర వ్యవహారాలను ఏఐసీటీఈ నిర్వర్తిస్తుంది. జాతీయ స్థాయిలో ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న అన్ని రకాల మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్), ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న ఫార్మసీ ఇన్‌స్టిట్యూట్‌లలో పీజీ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)ను కూడా నిర్వహిస్తుంది.
వివరాలకు: www.aicteindia.org

నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ):
దేశంలో ఉపాధ్యాయ విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌సీటీఈ సలహాలు, సూచనలను అందజేస్తుంది. అంతేకాకుండా ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఉపాధ్యాయ విద్య కోర్సులను ఆఫర్ చేస్తున్న కాలేజీలకు గుర్తింపును కూడా ఇస్తుంది.
వివరాలకు: www.ncteindia.org

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ):
దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఉన్నత ప్రమాణాలు పాటించేలా చూడడం, సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌షన్స్‌కు, అర్హతలకు గుర్తింపు ఇవ్వడం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రధాన బాధ్యత. ప్రజలకు సురక్షితమైన ఆరోగ్య సేవలు అందేలా చూడడం, ప్రాక్టీస్‌లో నిర్ణీత ప్రమాణాలు ఉండే విధానంలో భాగంగా డాక్టర్లు అందరూ ఎంసీఐ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. దేశ వ్యాప్తంగా అండర్‌గ్రాడ్యుయేట్, పీజీ స్థాయిలో మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఒకే రకమైన నాణ్యత ప్రమాణాలు ఉండేలా పర్యవేక్షించడం మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌షన్స్‌కు సంబంధించిన మెడికల్ క్వాలిఫికేషన్ గుర్తింపు-రద్దు అంశంలో తగిన సూచనలు ఇవ్వడం, నిర్దేశిత అర్హత ఉన్న డాక్టర్లకు శాశ్వత/తాత్కాలిక ప్రతిపాదిక రిజిస్ట్రేషన్ వంటివి దీని ప్రధాన విధులు.
వివరాలకు: www.mciindia.org

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ):
దేశంలో ఫార్మసీ ఎడ్యుకేషన్, ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఫార్మసీ యాక్ట్ ప్రకారం విధి విధానాలను పీసీఐ పర్యవేక్షిస్తుంది. ప్రొఫెషనల్‌గా ఫార్మసీ ప్రాక్టీస్‌కు సంబంధించి విధివిధానాలను రూపొందిస్తుంది. దేశ వ్యాప్తంగా ఫార్మసీ ఎడ్యుకేషన్‌లో ఒకే రకమైన నాణ్యత ప్రమాణాలు ఉండేలా పర్యవేక్షించడం, ఫార్మసీ కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లకు గుర్తింపు ఇవ్వడం, పీసీఐ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేని ఇన్‌స్టిట్యూట్‌ల గుర్తింపును వెనక్కి తీసుకోవడం, విదేశీ డిగ్రీలకు గుర్తింపు ఇవ్వడం, ఫార్మాసిస్ట్‌కు సంబంధించి సెంట్రల్ రిజిస్టర్‌ను నిర్వహించడం వంటివి పీసీఐ ప్రధాన విధులు.
వివరాలకు: www.pci.nic.in

డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీఐ):
దేశంలో డెంటల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషన్ పరంగా ప్రమాణాలను డీసీఐ నిర్దేశిస్తుంది. దేశ వ్యాప్తంగా డెంటల్ ఎడ్యుకేషన్‌లో ఒకే రకమైన నాణ్యత ప్రమాణాలు ఉండేలా చూడడంతోపాటు, వివిధ యూనివర్సిటీలు అందించే డిగ్రీలకు గుర్తింపునివ్వడం వంటి బాధ్యతలను డీసీఐ నిర్వహిస్తుంది. సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లలో సిలబస్, ఎగ్జామినేషన్, స్టాఫ్, మౌలిక వసతులను కూడా పర్యవేక్షిస్తుంది.
వివరాలకు: www.dciindia.org

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్ (సీసీఐఎం):
ఆయుర్వేద, సిద్ధ, యునానీ, వంటి భారతీయ వైద్య విధానాల్లో పాటించాల్సిన ప్రమాణాలను సీసీఐఎం సూచిస్తుంది. భారతీయ వైద్యానికి సంబంధించి కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు/హాస్పిటల్స్‌ను తనిఖీ చేయడం వాటిలోని సౌకర్యాలను పరిశీలించడం వంటి విధులను నిర్వహించడానికి పర్యవేక్షక కమిటీని నియమిస్తుంది. భారతీయ వైద్యానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌లు/హాస్పిటల్స్ ఆఫర్ చేస్తున్న కోర్సులు, వాటి కాల వ్యవధి, ప్రాక్ట్టికల్ ట్రైనింగ్, ఎగ్జామినేషన్స్, మెడికల్ క్వాలిఫికేషన్ గుర్తింపు కోసం పాటించాల్సిన ప్రమాణాలు, స్టాఫ్ అర్హతలు, ఎక్విప్‌మెంట్, ట్రైనింగ్, ఇతర అంశాలను సీసీఐఎం పర్యవేక్షి స్తుంది.
వివరాలకు: www.ccimindia.org

సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి (సీసీహెచ్):
దేశంలో యూనివర్సిటీ/మెడికల్ ఇన్‌స్టిట్యూట్ హోమియోపతి కోర్సును ఆఫర్ చేయాలంటే సీసీహెచ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లలో కోర్సు, సిలబస్, ఎగ్జామినేషన్, స్టాఫ్, మౌలిక వసతుల విషయంలో పాటించాల్సిన ప్రమాణాలను సూచిస్తుంది. ఇందుకు సంబంధించి తనిఖీ చేసే అధికారాన్ని కూడా సీసీహెచ్ కలిగి ఉంది.
వివరాలకు: www.cchindia.com
Published date : 25 Jul 2014 11:17AM

Photo Stories