Skip to main content

సబ్జెక్ట్ పరంగా అత్యుత్తమ డిగ్రీ.. పీహెచ్‌డీ

పీహెచ్‌డీ.. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీకి సంక్షిప్త రూపం.. గ్రీకు భాషలో దీనికి అర్ధం జ్ఞానం పట్ల ప్రేమ (లవ్ ఆఫ్ విజ్‌డమ్).. గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ తర్వాత సంబంధిత సబ్జెక్ట్‌లో నిష్ణాతులుగా మార్చేందుకు పీహెచ్‌డీ కోర్సులు దోహదం చేస్తాయి.. అందుకే వీటిని ఆయా సబ్జెక్ట్‌లలో అత్యుత్తమ డిగ్రీలుగా పేర్కొంటారు..అందుకే ప్రస్తుతం అన్ని రంగాల్లో పీహెచ్‌డీ ప్రాధాన్యం పెరిగింది.. ఈ నేపథ్యంలో పీహెచ్‌డీ కోర్సు చేయడానికి అందుబాటులో ఉన్న మార్గాలు, అర్హతలు, పాటించాల్సిన జాగ్రత్తలు, దీని వల్ల చేకూరే ప్రయోజనాలతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేషన్ తదితర అంశాలపై విశ్లేషణ...

ప్రస్తుతం ఏదో ఒక డిగ్రీ పూర్తి చేయగానే కారణాలేమైనా ఉద్యోగంలో చేరే ధోరణి పెరుగుతోంది.. దాంతో ఉన్నత విద్యవైపు ఆసక్తి చూపే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా ఆయా సబ్జెక్ట్‌లలో బోధించడానికి, పరిశోధనలు నిర్వహించడానికి కావల్సిన నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉండడంలేదు. ఫలితంగా పీహెచ్‌డీ విద్య ప్రాధాన్యతను సంతరించుకుంది.

మార్గం ఇలా:
పీహెచ్‌డీలో చేరేందుకు మార్గాలు..
  • సీఎస్‌ఐఆర్-నెట్: సైన్స్ స్ట్రీమ్ అభ్యర్థులకు ఉద్దేశించింది. కెమికల్, లైఫ్ సెన్సైస్, మ్యాథమెటికల్, ఫిజికల్, ఇంజనీరింగ్, ఎర్త్, అట్మాస్పియర్, ఓషన్ అండ్ ప్లానెట్రీ సెన్సైస్ సబ్జెక్ట్‌లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అర్హత సంబంధిత సబ్జెక్టులో 55శాతం మార్కులతో బీఎస్ (నాలుగేళ్ల కోర్సు)/బీఈ/బీటెక్/బీఫార్మసీ/ ఎంబీబీఎస్/ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్/ఎంఎస్సీ.
    వెబ్‌సైట్: www.csirhrdg.res.in
  • యూజీసీ-నెట్: హ్యుమానిటీస్ (లాంగ్వేజెస్‌తో కలిపి), ఫోరెన్సిక్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ వంటి దాదాపు 95 సబ్జెక్ట్‌లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమానం. వెబ్‌సైట్: ugcnetonline.in
  • ఎన్‌సీబీఎస్(నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సెన్సైస్), డీబీటీ-బీఈటీ, టిస్, సీఎస్‌డీఎస్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్, ఐసీపీఆర్,ఐసీఎస్‌ఎస్‌ఆర్, ఐసీఎంఆర్ తదితరాలు. అభ్యర్థులు పంపించిన ప్రాజెక్ట్ ప్రపోజల్ ఆధారంగా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ప్రవేశం కల్పిస్తున్నాయి.
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లు క్యాట్ స్కోర్ ఆధారంగానే పీహెచ్‌డీతో సమానమైన ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(ఎఫ్‌పీఎం) కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఎండీఐ, ఐఐటీలు, నిట్‌లు, ఇతర ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ కోర్సుల్లో క్యాట్/ఎక్స్‌ఏటీ/ జీమ్యాట్/ జీఆర్‌ఈ/గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్లు చేపడతాయి.
  • కొన్ని యూనివర్సిటీలు సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా కూడా పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.
  • జాయింట్ స్క్రీనింగ్ ఎంట్రన్స్ టెస్ట్: ఈ పరీక్ష ద్వారా డీఎస్‌టీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఉన్న సంస్థల్లో ఫిజిక్స్ సంబంధిత అంశాల్లో పీహెచ్‌డీ చేయొచ్చు. అర్హత: సంబంధిత కోర్సుల్లో ఎంఎస్సీ.
  • సీఎస్‌ఐఆర్ జేఆర్‌ఎఫ్-గేట్ స్కీమ్: ఈ విధానం ద్వారా ఇంజనీరింగ్/ఫార్మాస్యూటికల్ గ్రాడ్యుయేట్లు సీఎస్‌ఐఆర్ లేబొరేటరీల్లో పీహెచ్‌డీ చేయవచ్చు. ఇందుకోసం ఇంజనీరింగ్ విద్యార్థులు గేట్‌లో, ఫార్మసీ విద్యార్థులు జీప్యాట్‌లో అర్హత సాధించాలి. గేట్/జీప్యాట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు: csirhrdg.res.in/jrfgate.pdf
ప్రోత్సాహకాలు:
సీఎస్‌ఐఆర్-నెట్‌లో జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన వారు ఐఐటీలు, నిట్‌లు, అన్ని పరిశోధనశాలలు, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీలో చేరవచ్చు. దీని ద్వారా ఐదేళ్ల పాటు ఫెలోషిప్ లభిస్తుంది. మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000 చెల్లిస్తారు. ఏడాదికి ఒకసారి కాంటిన్‌జెన్సీ గ్రాంట్‌గా రూ. 20,000 చెల్లిస్తారు. ఆ తర్వాత మూడో సంవత్సరంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్‌ఆర్‌ఎఫ్) హోదా కల్పించి నెలకు రూ. 18,000 చెల్లిస్తారు. అంతేకాకుండా సీఎస్‌ఐఆర్ నెట్ పరీక్షలో మంచి మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ప్రత్యేక ఫెలోషిప్‌ను ఐదేళ్లు అందిస్తారు. దీనిద్వారా మొదటి రెండేళ్లు నెలకు రూ. 20,000 స్టైఫండ్ ఇస్తారు. మూడో ఏడాది నుంచి నెలకు రూ.24,000 ఇవ్వడంతోపాటు ఏడాదికి రూ. 70,000 కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కూడా చెల్లిస్తారు. నెట్‌లో జేఆర్‌ఎఫ్‌నకు ఎంపికైన అభ్యర్థులకు యూజీసీ నిబంధనల మేరకు ఐదేళ్ల పాటు ఫెలోషిప్ లభిస్తుంది.

స్వీయ పరిశీలన:
దేశంలో పీహెచ్‌డీలో చేరిన విద్యార్థుల్లో 50శాతానికిపైగా మాత్రమే తమ థీసిస్‌ను సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు కోర్సులో చేరడానికి మనం ఎంత వరకు సిద్ధంగా ఉన్నామో స్వీయ పరిశీలన చేసుకోవాలి. ఇందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు.. పీహెచ్‌డీ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి తదనుగుణంగా అవసరమైన వనరులు, సమయాన్ని కేటాయించగలమా?లేదా? అనే చూసుకోవాలి. ఎంచుకునే అంశం, సంబంధిత గైడ్ వంటి విషయాల్లో స్పష్టంగా ఉండాలి. పరిశోధన చేయాలనుకుంటున్న అంశంపై నెలకోసారి ఆర్టికల్స్ ప్రచురితమయ్యేట్లు చూసుకుంటే ప్రయోజనకరం. ఎంచుకున్న టాపిక్‌పై సమగ్ర సినాప్సిస్ రాసి, గైడ్‌తో ఫైనలైజ్ చేయించుకోవాలి.

సొంతంగా పరిశోధనలు:
పీహెచ్‌డీ కోర్సుల ముఖ్య ఉద్దేశం.. నూతన జ్ఞానాన్ని పెంపొందించడం. నిబద్ధత, అంకితం, పట్టుదల ఈ మూడు గుణాలు ఉంటేనే పీహెచ్‌డీ కోర్సును విజయవంతంగా పూర్తిగా చేయగలం. పీహెచ్‌డీ అంటే తన సంబంధిత సబ్జెక్ట్‌లో స్వతంత్రంగా పరిశోధనలు నిర్వహించే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడం. ఇందుకోసం సబ్జెక్ట్‌పై విస్తృతంగా అధ్యయనం చేయాలి. సంబంధిత సబ్జెక్టులో అప్పటికే పరిపూర్ణ నైపుణ్యం సాధించిన ప్రొఫెసర్/గైడ్ పర్యవేక్షణలో పరిశోధన కొనసాగించాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పీహెచ్‌డీ అనేది అనేది స్వతాహాగా ప్రేరణ పొందుతూ పూర్తి చేయాల్సిన కోర్సు. గైడ్ ఉన్నప్పటికీ..అతని పాత్ర పరిమితంగానే ఉంటుంది. కాబట్టి సొంతంగా నేర్చుకోవడంపైనే పూర్తిగా దృష్టిసారించాలి.

కీలకం:
పీహెచ్‌డీ చేసే క్రమంలో మూడు దశలు కీలకం. అవి.. సమస్యను గుర్తించడం (పరిశోధనకు తగిన అంశాన్ని ఎన్నుకోవడం),దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం, దాన్ని సమర్ధవంతంగా ప్రెజెంట్ చేయడం. ఒక కొత్త ఆలోచన ద్వారా మాత్రమే ఒక అంశాన్ని ఎన్నుకోవడం సాధ్యమవుతుంది. అదే క్రమంలో దాన్ని పరిష్కారించడానికి విస్తృత అధ్యయనం, పరిశోధనలు చేయాలి. వాటి ఆధారంగా వచ్చిన ఫలితాలను ప్రభావవంతంగా ప్రెజెంట్ చేసే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఈ క్రమంలో కనీసం ఐదు నుంచి ఏడు అసైన్‌మెంట్లు చేపట్టాలి (సబ్జెక్ట్‌ను బట్టి మారుతు ఉండొచ్చు). ఇందులో కనీసం ఒక సెమినార్ లేదా రీసెర్చ్ పేపర్ అయిన ఉండాలి. ఏ సబ్జెక్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసినా సంబంధిత థిసిస్‌ను మాత్రం ఇంగ్లిష్‌లోనే సమర్పించాలి. ఈ మేరకు యూజీసీ నిబంధనలను తప్పనిసరి చేసింది.

ఎన్నో రకాలు:
పీహెచ్‌డీకి సంబంధించి పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంటిగ్రేటెడ్-పీహెచ్‌డీ, పార్ట్‌టైమ్ పీహెచ్‌డీ కోర్సులుగా వ్యవహరిస్తారు. డిగ్రీ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్‌డీ చేసే అవకాశాన్ని కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు క ల్పిస్తున్నాయి. ఈ కోర్సులనే ఇంటిగ్రెటెడ్ పీహెచ్‌డీలుగా పేర్కొంటారు. ఐఐఎస్సీ- బెంగళూరు, జేఎన్‌సీఏఎస్‌ఆర్-బెంగళూరు,ఐఐఏ, ఐఐటీలు ఈ తరహా కోర్సులను అందిస్తున్నాయి. పని చేస్తూ పీహెచ్‌డీ చేయాలనుకునే వారి కోసం కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు పీహెచ్‌డీ కోర్సులను ప్రత్యేకంగా అందిస్తున్నాయి. వీటిని పార్ట్‌టైమ్ పీహెచ్‌డీలుగా వ్యవహరిస్తారు. ఫుల్‌టైమ్ పీహెచ్‌డీని 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలో, పార్ట్‌టైమ్ పీహెచ్‌డీ 4-7 ఏళ్లలో పూర్తిచేయాలి.ఐఐటీలు, బిట్స్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఈ తరహా కోర్సులను అందిస్తున్నాయి. ఐఐఎం, పలు బిజినెస్ స్కూల్స్ నిర్వహిస్తున్న ఎఫ్‌పీఎం, పీహెచ్‌డీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. ఎంబీఏకు పీజీడీఎంకు మధ్య ఉన్న తేడానే ఈ రెండు కోర్సుల మధ్య ఉంటుంది.

ఓపెన్‌కు నో:
యూజీసీ-2009 మార్గదర్శకాల మేరకు ఎంఫిల్/పీహెచ్‌డీ కోర్సులను ఓపెన్ విధానంలో పూర్తి చేయడానికి వీలు లేదు. యూజీసీ-2009 మార్గదర్శకాలు, నిబంధనలకు లోబడి కొన్ని ఓపెన్ యూనివ ర్సిటీలకు మాత్రం పీహెచ్‌డీ/ఎంఫిల్ కోర్సులను దూర విద్యా విధానంలో నిర్వహించేందుకు అనుమతిస్తారు. ఈ క్రమంలో పీహెచ్‌డీ చేసే విద్యార్థి ప్రిన్సిపల్ గైడ్ అదే ఓపెన్ యూనివర్సిటీకి చెంది ఉండాలి. అవసరమైన పక్షంలో జాయింట్ గైడ్ వేరే యూనివర్సిటీ నుంచి ఉండొచ్చు.

ప్రయోజనం
తనకిష్టమైన రంగంలో విస్తృత పరిశోధనల చేయడం ద్వారా సంబంధిత సబ్జెక్ట్‌లో నిష్ణాతులుగా మారొచ్చు. పీహెచ్‌డీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఆయా విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తించవచ్చు. విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, నిట్‌లు వంటి ఉన్నత విద్యా సంస్థల్లో మెరుగైన వేతనంతో ఉద్యోగాల్లో స్థిరపడొచ్చు. జూనియర్ సైంటిస్ట్‌గా సీనియర్ శాస్త్రవేత్తల వద్ద పనిచేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం చాలా కంపెనీలకు సొంతంగా ఆర్ అండ్ డీ విభాగాలున్నాయి. పీహెచ్‌డీ చేసిన వారికి వీటిలో అవకాశాలు లభిస్తాయి. సొంతంగా పరిశోధన ప్రాజెక్టులు చేపట్టొచ్చు. సంస్థలను ఏర్పాటు చేయొచ్చు. పీహెచ్‌డీతో కెరీర్‌ను ప్రారంభిస్తే నెలకు రూ.35 వేలకు తగ్గకుండా వేతనం లభిస్తుంది.

ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేషన్:
అర్హత:
సంబంధిత సబ్జెక్ట్‌లో 55శాతం మార్కులతో పీజీ.
ప్రవేశం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా (సీఎస్‌ఐఆర్-నెట్, యూజీసీ-నెట్,ఐసీఎంఆర్, ఐసీఏఆర్, డీబీటీ-జేఆర్‌ఎఫ్,ఇన్‌స్పైర్ ఫెలోషిప్, టీచర్ ఫెలోషిప్, ఏపీసెట్, జెస్ట్‌లలో అర్హత సాధించిన/ రెగ్యులర్‌గా ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంఫిల్ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు) ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10, 2014 (రూ. 400 లేట్ ఫీజుతో ఆగస్టు 20)
వివరాలకు: ouadmissions.com
గమనించాల్సినవి:
  • యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి.
  • పీహెచ్‌డీ కోర్సును పర్యవేక్షించడానికి అనుభవ వజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారా? కావల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయో? లేవో పరిశీలించాలి.
  • అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీలో సభ్యత్వం ఉందో లేదో తెలుసుకోవాలి.
  • పీహెచ్‌డీ, పరిశోధనలకు సంబంధించి యూనివర్సిటీ గత రికార్డును పరిశీలించాలి.
Bavitha పీహెచ్‌డీని కేవలం పేరు ముందు డాక్టర్ అనే మూడక్షరాలను పెట్టుకునేందుకు మార్గంగా భావించకూడదు. నిజమైన ఆసక్తితో పీహెచ్‌డీలో అడుగు పెట్టాలి. అప్పుడు వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి కారకులవుతారు. ఒక అంశాన్ని ఎంచుకునే ముందు.. సదరు అంశంపై ఇదివరకు ఏమైనా పరిశోధనలు జరిగాయా? లేదా? అని గుర్తించి అప్పుడు మాత్రమే ఆ అంశాన్ని ఎంచుకోవాలి. సదరు అంశంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యను గుర్తించాలి. సదరు అంశానికి పరిష్కారం నిర్దిష్ట కనీస వ్యవధిలో పూర్తవగలదా? లేదా? అని గుర్తించడం. ముఖ్యంగా టెక్నికల్, ఇంజనీరింగ్, సైన్స్ సబ్జెక్ట్‌లలో ఇది ఎంతో అవసరం. ఈ విషయంలో ‘గైడ్’ పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంటుంది. కాబట్టి సరైన గైడ్‌ను ఎంపిక చేసుకోవాలి. పీహెచ్‌డీలో భాగంగా ఒక సమస్య పరిష్కారానికి సంబంధించి కొత్త పద్ధతులను ఆవిష్కరించే విధంగా కదలాలి. ఉదాహరణకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లలో డిజైన్ అనాలిసిస్, సిమ్యులేషన్, ప్రాక్టికల్ అప్లికేషన్ వంటి సాధనాల ద్వారా తమ పరిశోధనకు వాస్తవికతను అందించొచ్చు. అంతేకాకుండా లైబ్రరీ, లేబొరేటరీ, ఇంటర్నెట్ సమాచారాన్ని వినియోగించుకోవాలి. ప్రతి నెల ఒక పేపర్ పబ్లిష్ అయ్యేలా చూసుకోవాలి. కాన్ఫరెన్స్‌లు, సెమినార్లకు నిరంతరం హాజరవుతూ.. ఆ రంగంలోని నూతన ఆవిష్కరణలు, వాటి నేపథ్యం వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. ఇలా చేస్తేనే నిర్దిష్ట సమయంలో పీహెచ్‌డీ పూర్తి చేసి థీసిస్ సబ్మిట్ చేయడానికి మార్గం సుగమం అవుతుంది. థీసిస్ రిపోర్ట్‌ను అంతకుముందు పీహెచ్‌డీ స్కాలర్స్ రూపొందించిన అంశాలనే కాపీ-పేస్ట్ పద్ధతిలో రూపొందిస్తే అనర్హత వేటుకు గురయ్యే ప్రమాదం ఉంది. కాపీ-పేస్ట్‌కు సంబంధించి ఇటీవల ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌కు కూడా రూపకల్పన జరిగింది. దీని ప్రకారం ఏదైనా ఒక థీసిస్ రిపోర్ట్‌ను అంతకుముందు రిపోర్ట్‌ల నుంచి కాపీ చేస్తే సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి అభ్యర్థులు సొంతగా థీసిస్ రిపోర్ట్ రూపొందించాలి. అప్పుడు మాత్రమే డాక్టరేట్ డిగ్రీ సొంతమవుతుంది.
Published date : 18 Jul 2014 05:50PM

Photo Stories