Skip to main content

చక్కటి చిక్కటి కెరీర్‌కు... టీ టేస్టర్!

ద్రవ పదార్థాల రంగు, రుచి, వాసన, చిక్కదనాన్ని కచ్చితంగా గుర్తించగల సామర్థ్యం మీ సొంతమా? అయితే, మీలాంటి వారికి సరిగ్గా సరిపోయే అద్భుతమైన నయా కెరీర్.. టీ టేస్టింగ్. తేనీరు లేనిదే తెల్లవారని వారెందరో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తేనీటి ప్రియులకు కొదవే లేదు. ప్రజల అభిరుచులను గుర్తించి, వారికి నచ్చే టీ రుచులను అందించే టీ టేస్టర్‌కు ప్రస్తుతం దేశవిదేశా ల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నవారికి భారీ వేతనాలు, మంచి జీవితం సొంతమవుతున్నాయి. ఇటీవలి కాలంలో హాస్పిటాలిటీ రంగంలో గుర్తింపు పొందుతున్న ట్రెండ్.. టీ టెస్టింగ్.

పార్‌‌టటైమ్, ఫుల్‌టైమ్‌గా అవకాశాలు
టీ అనేది అన్ని దేశాల సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది. పొద్దున తేనీరు సేవిస్తే రోజంతా ఉల్లాసంగా గడిచిపోతుంది. ప్రాచీన కాలం నుంచే వాడుకలో ఉన్న టీకి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది. తోటలో టీ ఆకు ఉత్పత్తి నుంచి అది పొడిగా మారి వినియోగదారుడికి చేరే వరకు మధ్యలో ఎన్నో దశలు ఉంటాయి. ఇందులో కీలకపాత్ర టీ టేస్టర్‌దే. ఆకు నాణ్యతను, అది టీగా మారిన తర్వాత రంగును, రుచిని పరీక్షించి సంతృప్తిచెందిన తర్వాతే మార్కెట్‌లోకి విడుదల చేయాలి. ప్రాంతాలను బట్టి జనం అలవాట్లు, అభిరుచులు మారుతుంటాయి. వాటిని బట్టి టీని ఉత్పత్తి చేయాలి. ప్రపంచంలో టీని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో శ్రీలంక, చైనాలతోపాటు భారత్ కూడా ఉంది. మనదేశంలో అస్సాం, కేరళ రాష్ట్రాల్లో టీ తోటలు అధికంగా ఉన్నాయి. టీ టేస్టర్లకు టీ ఎస్టేట్లలో, ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ టేస్టర్లుగా పనిచేసుకోవచ్చు. వీరు టీ బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతి, దిగుమతి వంటి కార్యకలాపాలను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. గార్డెనర్లతో, పరిశోధకులతో కలిసి పని చేయాలి.

కావాల్సిన లక్షణాలు:
టీ టేస్టర్లకు టీ చరిత్ర, టీ ప్లాంటేషన్, టీలో రకాలు, గ్రేడ్లు వంటి వాటిపై పరిజ్ఞానం ఉండాలి. టీ ప్రాసెసింగ్, ప్రిపరేషన్‌పై తగిన అనుభవం అవసరం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకొనే లక్షణం ఉండాలి. టీ రంగు, రుచిని కచ్చితంగా గుర్తించే నైపుణ్యాలు ఉండాలి. వివిధ రకాల టీల మధ్య తేడాలను విడమరిచి చెప్పగల సామర్థ్యం పెంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా టీ మార్కెట్‌లో వస్తున్న మార్పులను పసిగడుతూ తదనుగుణంగా నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలి. ఎక్కువగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

అర్హతలు:
టీ టేస్టింగ్‌పై మనదేశంలో డిగ్రీ కోర్సులు లేకపోయినా సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైనవారు వీటిలో చేరొచ్చు. టీ టేస్టింగ్‌ను పూర్తిస్థాయి కెరీర్‌గా ఎంచుకోవాలని భావిస్తున్నవారు ఫుడ్ సెన్సైస్, హార్టికల్చర్, అగ్రికల్చరల్ సైన్స్ వంటి సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడం మంచిది. వృక్షశాస్త్రం చదివినవారు ఈ రంగంలో రాణించేందుకు అవకాశం ఉంటుంది.

వేతనాలు:
టీ టేస్టర్లకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. ఫైవ్‌స్టార్ హోటళ్లలో ప్రారంభంలో నెలకు రూ.30 వేల వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, పనితీరును బట్టి నెలకు రూ.50 వేలకు పైగానే పొందొచ్చు. టీ ఎస్టేట్లలో ఇంకా ఎక్కువ వేతనాలు ఉంటాయి.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
 • డార్జిలింగ్ టీ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్
  వెబ్‌సైట్:
  www.nitm.in
 • ఉపాసీ టీ రీసెర్చ్ ఫౌండేషన్
  వెబ్‌సైట్:
  www.upasitearesearch.org
 • బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఫ్యూచరిస్టిక్ స్టడీస్
  వెబ్‌సైట్:
  www.bifsmgmt.org
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్
  వెబ్‌సైట్:
  www.iipmb.edu.in
 • లిప్టన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీ
  వెబ్‌సైట్:
  www.lipton.com.au
 • స్పెషాలిటీ టీ ఇన్‌స్టిట్యూట్-యూఎస్‌ఏ
  వెబ్‌సైట్:
  www.teausa.com
Published date : 03 Sep 2014 03:14PM

Photo Stories