Skip to main content

కంప్యూటర్ల చికిత్సకు.. నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్!

కంప్యూటర్.. నేటి ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో కార్యకలాపాలు సజావుగా సాగడానికి కావాల్సిన ప్రధాన సాధనం. ప్రపంచవ్యాప్తంగా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, అన్ని రకాల కమ్యూనికేషన్ దీనిద్వారానే సాగుతున్నాయి. కంప్యూటర్లు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. దీన్నే నెట్‌వర్క్ అంటారు. ఇందులో లోపాలు తలెత్తితే అపారమైన నష్టం జరుగుతుంది. లక్షలాది మంది జీవితాలు ప్రభావితమవుతాయి. కాబట్టి అవి సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. నెట్‌వర్క్‌లో లోపాలు ఏర్పడి కంప్యూటర్లు మొరాయిస్తే సరిచేసే నిపుణులే.. కంప్యూటర్ నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్స్. ప్రస్తుతం దేశవిదేశాల్లో అత్యధికంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్న రంగం ఇదే. కంప్యూటర్లు కనిపించని కార్యాలయమే లేదనడం అతిశయోక్తి కాదు. అందుకనుగుణంగా నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. వీరికి రూ.లక్షల్లో వేతన ప్యాకేజీలు స్వాగతం పలుకుతున్నాయి.

అవకాశాలు.. కోకొల్లలు
నెట్‌వర్క్ నిపుణులు కంప్యూటర్ అప్లికేషన్లను రూపొందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సొంతంగా నెట్‌వర్క్‌ను డిజైన్ చేయాలి. అవసరాన్ని బట్టి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌ను సృష్టించాలి. బ్యాంక్‌లు, మ్యానుఫ్యాక్చరింగ్, మీడియా సంస్థల్లో భారీసంఖ్యలో కంప్యూటర్లుంటాయి. వీటి నెట్‌వర్క్ సక్రమంగా ఉండేలా చూడడానికి నిపుణులను నియమిస్తున్నారు. నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్స్‌కు హెచ్‌సీఎల్, విప్రో వంటి ఔట్‌సోర్సింగ్ కంపెనీల్లో కొలువులున్నాయి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నెట్‌వర్క్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేయొచ్చు. క్వాలిటీ అస్యూరెన్స్/టెస్టింగ్ ఆఫ్ నెట్‌వర్క్ ప్రోటోకాల్స్, రీసెర్చ్ ఇన్ నెట్‌వర్కింగ్‌లో సేవలందించొచ్చు. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ వీరి అవసరం అధికంగా ఉంది. 100 కంప్యూటర్లు ప్రతి ఉన్న కార్యాలయంలో నెట్‌వర్క్ నిపుణులు ఉండడం తప్పనిసరి.

కావాల్సిన స్కిల్స్: కంప్యూటర్ నెట్‌వర్క్ నిపుణులకు శాస్త్రీయ దృక్పథం ఉండాలి. విశ్లేషణాత్మక ఆలోచనా ధోరణి అవసరం. సాంకేతిక సమస్యలను పరిష్కరించే నేర్పు తప్పనిసరి. తమ రంగానికి సంబంధించిన కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపన ఉండాలి. ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి.

అర్హతలు: కంప్యూటర్ నెట్‌వర్క్ నిపుణులుగా మారాలంటే.. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్) కోర్సు చదవాలి. కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారు కూడా కంప్యూటర్ నెట్‌వర్క్ నిపుణుడిగా మారొచ్చు. దీర్ఘకాలంలో ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవాలంటే ఎంటెక్ వంటి కోర్సులు పూర్తిచేయడం మంచిది. కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా, సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఉన్నాయి.

వేతనాలు: ఐఐటీలో విద్యాభ్యాసం పూర్తిచేసిన నెట్‌వర్క్ ప్రొఫెషనల్‌కు ప్రారంభంలో నెలకు రూ.40 వేల వేతనం అందుతుంది. బీసీఏ/బీఎస్సీ చదివి ఏడాదిపాటు నెట్‌వర్క్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ పొందితే ప్రారంభంలో నెలకు రూ.10 వేల వేతనం అందుకోవచ్చు. సర్టిఫైడ్ కోర్సులు చదివితే రూ.20 వేల నుంచి రూ.25 వేల వేతనం లభిస్తుంది. రెండు మూడేళ్ల పని అనుభవం ఉన్న నెట్‌వర్క్ నిపుణులకు బహుళజాతి సంస్థల్లో ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వేతన ప్యాకేజీ దక్కుతుంది. ఈ రంగంలో సీనియారిటీ, పనితీరును బట్టి జీతభత్యాలుంటాయి.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  • ఉస్మానియా యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    www.osmania.ac.in
  • జేఎన్‌టీయూ-హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.jntuh.ac.in
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)-వరంగల్
    వెబ్‌సైట్:
    www.nitw.ac.in
  • బిట్స్-పిలానీ
    వెబ్‌సైట్:
    www.bitspilani.ac.in
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)-బాంబే, ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్
    వెబ్‌సైట్స్:
    www.iitb.ac.in, www.iitd.ac.in, www.iitm.ac.in, www.iitk.ac.in
Published date : 24 Sep 2014 05:13PM

Photo Stories