Skip to main content

జర్నలిజం...

తపన.. సాహసం.. దూసుకుపోయేతత్వం.. జర్నలిజంలో రాణించడానికి అవసరమైన ఆయుధాలు. అక్షరాలతో ఆలోచింపజేసే ఒకేఒక్క అరుదైన అవకాశం జర్నలిజంలో పనిచేసేవాళ్లకు మాత్రమే లభిస్తుంది. కెరీర్ నిత్యనూతనం. మనమేంటో నిరూపించుకుంటే.. అందనంత ఎత్తుకు ఎదగొచ్చు. చూసే కన్ను.. రాసే పెన్ను ఉన్నవాళ్లెవరైనా జర్నలిజంలో ప్రవేశించొచ్చు. ప్రాంతీయ, జాతీయ పత్రికలు, టీవీ చానెళ్లలో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

భారతదేశ మీడియాలోకి విదేశీ పెట్టుబడులను కేంద్రం అనుమతిస్తుండడంతో ఈ రంగంలోకి అనేక సంస్థలు ప్రవేశిస్తున్నాయి. దాంతో అవకాశాలు విస్తరిస్తున్నాయి. మీడియా మాస్ కమ్యూనికేషన్ అంటే ఒక్క ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియానే కాదు.. సినిమాలు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, రేడియో, నాటకాలు, పరిశ్రమలు, సంస్థల్లో పబ్లిక్ రిలేషన్స్ విభాగం, మీడియా మేనేజ్‌మెంట్, ఎడిటింగ్, స్క్రిప్ట్‌రైటింగ్, మ్యాగజైన్స్.. ఇలా అన్నీ వస్తాయి. వీటన్నింటిలో అత్యంత శక్తివంతమైన సాధనం పత్రికలు, టీవీలు. అందుకే గత ఐదేళ్లలో భారతదేశంలో ఈ రంగం విస్తృతంగా వృద్ధి చెందింది. నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. ప్రస్తుతం భారత్‌లో మీడియా ఏటా 12.5 శాతం వృద్ధితో శరవేగంగా దూసుకెళ్తోంది.

దేశంలో జర్నలిజంలో శిక్షణిచ్చే ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో ఉన్నాయి. కొన్ని విశ్వ విద్యాలయాలు మీడియా, మాస్ కమ్యూనికేషన్ పేరుతో రెండేళ్ల కోర్సు నిర్వహిస్తూ అందులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. మీడియాలో పోటీ నెలకొనడంతో దేశవ్యాప్తంగా అనేక పత్రికలు, టీవీ చానెళ్లు సొంతంగా జర్నలిజంలో శిక్షణ ఇస్తూ నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. మన రాష్ట్రంలో తెలుగు దినపత్రికలకు, దేశంలోని ప్రధాన ఆంగ్ల దినపత్రికలకు సొంతంగా జర్నలిజం స్కూళ్లు ఉన్నాయి. ఆయా పత్రికల్లో సిబ్బంది అవసరాన్ని బట్టి అవి ప్రకటన విడుదల చేసి రాత పరీక్ష, బృంద చర్చ, మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థులకు ప్రవేశం కల్పిస్తాయి. అంతేకాకుండా.. ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా నెలనెలా స్టైపెండ్ కూడా అందిస్తున్నాయి. ఏడాది శిక్షణ తర్వాత పత్రికల్లోనైతే ట్రైనీ సబ్ ఎడిటర్/రిపోర్టర్, చానెళ్లలో ట్రైనీ కాపీ ఎడిటర్/రిపోర్టర్‌గా విధుల్లోకి చేర్చుకుంటున్నాయి. ఏడాది గడిచిన తర్వాత పూర్తిస్థాయి సబ్ ఎడిటర్/ రిపోర్టర్, కాపీఎడిటర్/రిపోర్టర్‌గా కొనసాగుతారు. ఆ తర్వాత సామర్థ్యం, అవసరాన్ని బట్టి సీనియర్ సబ్ ఎడిటర్, చీఫ్ సబ్ ఎడిటర్, న్యూస్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్, అసోసియేట్ ఎడిటర్...లాంటి హోదాలతో ప్రమోషన్లు లభిస్తాయి. రిపోర్టింగ్‌లో ఉన్నవాళ్లకు రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్, చీఫ్ రిపోర్టర్, బ్యూరో ఇన్‌చార్జ్, నెట్‌వర్క్ ఇన్‌చార్జ్...లాంటి హోదాలుంటాయి.

మీడియా కోర్సులు-అందించే వర్సిటీలు/సంస్థలు:
ఉస్మానియా యూనివర్సిటీ:
ఎంసీజే కోర్సులను అందిస్తోంది. వ్యవధి రెండేళ్లు. డిగ్రీ ఉత్తీర్ణులు దీనికి అర్హులు.
వెబ్‌సైట్: www.osmania.ac.in

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ:
ఎంఎ కమ్యూనికేషన్ కోర్సు నిర్వహిస్తుంది. దీనిలో ప్రవేశానికి బ్యాచిలర్ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్ లభిస్తుంది. ఇక్కడ ఏడాది కాలవ్యవధితో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్‌లేషన్ టెక్నిక్స్ ఇన్ ఉర్దూ కోర్సు ఉంది. ఏదైనా డిగ్రీ దీనికి విద్యార్హత.
వెబ్‌సైట్: www.uohyd.ernet.in

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం:
రెండేళ్ల ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌తోపాటు ఏడాది వ్యవధి ఉన్న పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సులను ఈ వర్సిటీ ఆఫర్ చేస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in

ఆంధ్రా విశ్వవిద్యాలయం:
డిగ్రీ విద్యార్హతతో ఏంజేఎంసీ (మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్‌కమ్యూనికేషన్) పేరు తో రెండేళ్ల కోర్సు అందిస్తోంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్ లభిస్తుంది.
వెబ్‌సైట్: www.andhrauniversity.info

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం:
రెండేళ్ల కాలవ్యవధితో మాస్టర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కోర్సును ఆఫర్ చేస్తోంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు అర్హులు.
వెబ్‌సైట్: www.teluguuniversity.ac.in

తెలంగాణ విశ్వవిద్యాలయం:
నిజామాబాద్‌లోని ఈ వర్సిటీలో రెండేళ్ల కాలవ్యవధితో ఎంఏ- మాస్ కమ్యూనికేషన్ కోర్సు ఆఫర్ చేస్తున్నారు. దీనికి డిగ్రీ విద్యార్హత.
వెబ్‌సైట్: www.telanganauniversity.ac.in

ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం:
గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం కింద మాస్టర్ ఇన్ జర్నలిజం(ఎంజే), మాస్టర్ ఇన్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్ (ఎంసీఎం) కోర్సులతోపాటు ఆన్‌లైన్ విధానంలో కార్పొరేట్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ రిసోర్సెస్, బిజినెస్ అండ్ ఫైనాన్స్ రిపోర్టింగ్, న్యూస్ అండ్ డెవలప్‌మెంట్ టెక్నిక్స్ వంటి కోర్సులు నిర్వహిస్తోంది.
వెబ్‌సైట్: www.asianmedia.org

టైమ్స్ స్కూల్ ఆఫ్ జర్నలిజం:
ఈ సంస్థ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సు ఆఫర్ చేస్తుంది. ఏైదె నా డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. కోర్సు కాలవ్యవధి ఏడాది.
వెబ్‌సైట్: www.tcms.in

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ:
ఈ వర్సిటీ ఎంఏలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కోర్సు ఆఫర్ చేస్తోంది. ఇది రెండేళ్ల కోర్సు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు కనీసం ఇంటర్ లేదా పదోతరగతి వరకు ఉర్దూ సబ్జెక్టు చదివుండాలి.

విధులిలా...
రిపోర్టర్:
వీరంతా క్షేత్రస్థాయిలో తిరుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీలు, వివిధ స్వచ్చంద సంస్థల నుంచి వార్తలు సేకరిస్తారు. ప్రతిరోజూ సమాజంలో జరిగే అన్ని కీలక పరిణామాలను గమనిస్తూ వార్తలు, వ్యాఖ్యానాలు, కథనాలు, విశ్లేషణలు చేస్తారు. వీరు రాసే కథనాలు, వార్తలు టీవీల్లో ఆరోజే ప్రసారమవుతాయి. పత్రికల్లో మరుసటి రోజు వస్తాయి.

సబ్‌ఎడిటర్ , కాపీ ఎడిటర్:
పత్రికల్లో పనిచేసే వారిని సబ్ ఎడిటర్లని, టీవీల్లో పనిచేసే వాళ్లను కాపీ ఎడిటర్ అని పిలుస్తారు. రిపోర్టర్లు తీసుకొచ్చిన వార్తలను సబ్ ఎడిటర్లు పరిశీలించి సమగ్రంగా తీర్చిదిద్దుతారు. టీవీల్లో పనిచేసే కాపీ ఎడిటర్లు విలేకరి తీసుకువచ్చిన వార్తల చిత్రాలను క్లుప్తీకరించి వీక్షకులకు తక్షణం అర్థమయ్యేలా రూపొందిస్తారు.

డెస్కు:
పత్రికలు, టీవీల్లో పనిచేసే సబ్‌ఎడిటర్లు, కాపీ ఎడిటర్లు కలిసి గ్రూపుగా ఏర్పడి విధులు నిర్వహించే ప్రదేశాన్నే డెస్కు అంటారు. వీరంతా విలేకరులు తీసుకొచ్చిన వార్తలను పని విభజన ద్వారా పత్రికలు, టీవీల్లో వచ్చేలా చేస్తారు. ప్రతి డెస్క్‌కూ ఒక ఇన్‌చార్జ్ ఉంటారు. సాధారణంగా సీనియర్‌ని ఇన్‌చార్జ్‌గా నియమిస్తారు.

న్యూస్ రీడర్:
టీవీల్లో వార్తలను చదివేవారిని న్యూస్‌రీడర్లు అంటారు. కనీస అర్హత డిగ్రీ ఉంటేనే ఆయా చానళ్లు తీసుకుంటాయి. మంచి మాటతీరు, ఆకర్షణీయ రూపం ఉన్నవాళ్లను ప్రవేశపరీక్ష ద్వారా ఎంచుకుని ఆయా సంస్థలు శిక్షణ ఇచ్చి న్యూస్‌రీడర్ ఉద్యోగాలు కేటాయిస్తాయి. ప్రతిభను బట్టి వీళ్లు కూడా సీనియర్ న్యూస్ రీడర్ లాంటి హోదాలు పొందొచ్చు. జర్నలిజంలో ప్రావీణ్యం ఉంటే సొంతంగా స్టోరీలు చేసి కెరీర్‌లో ఉన్నతస్థాయికి ఎదగొచ్చు.

మీడియా.. కెరీర్ స్కోప్:
మీడియా సంస్థల్లో జర్నలిస్టులు ముఖ్యంగా రిపోర్టర్, సబ్‌ఎడిటర్ ఆపై హోదాల్లో పనిచేస్తారు. జర్నలిస్టులు కావాలనుకునే వ్యక్తులను రాష్ట్రంలో పలు పత్రికలు, టీవీ చానెళ్లు సొంతంగా జర్నలిజం స్కూలు ద్వారా ఎంపిక చేసుకుని వారికి ఏడాది శిక్షణతో జర్నలిస్టులుగా తయారుచేస్తున్నాయి. శిక్షణ దశలో వీరికి వేతనాలు రూ.8 వేల వరకు లభిస్తాయి. తర్వాత ఏడాది రూ.12 వేల నుంచి 15 వేల వరకు వేతనం లభిస్తుంది.

దేశంలో టాప్ జర్నలిజం కాలేజీలు
  • ఐఐఎంసీ న్యూఢిల్లీ
  • సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (పుణే)
  • ముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యునికేషన్స్
  • ఏజే కిద్వాయ్ మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్ జామియా (న్యూఢిల్లీ)
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం అండ్ న్యూ మీడియా (బెంగళూరు)
  • జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ (ముంబై)
  • ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం (చెన్నై)
  • ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణే)
  • మనోరమ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ (కొట్టాయం, కేరళ)
  • టైమ్స్ స్కూల్ ఆఫ్ జర్నలిజం (న్యూఢిల్లీ)
Published date : 18 Jun 2012 02:00PM

Photo Stories