Skip to main content

యువ‌త ఉపాధికి వెలుగు స్కిల్‌ యూనివర్సిటీ.. అడ్మిష‌న్ పొందండిలా..!

మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ‘ఢిల్లీ స్కిల్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ యూనివర్సిటీ (డీఎస్‌ఈయూ)’ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఢిల్లీ కేంద్రంగా వివిధ క్యాంపస్‌ల్లో ఈ విద్యా సంస్థ 15 డిప్లొమా కోర్సులు, 12 డిగ్రీ కోర్సులు, 6 బీటెక్‌ కోర్సులు, 2 పీజీ స్థాయి కోర్సులను అందిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ స్కిల్‌ యూనివర్సిటీ ప్రత్యేకతలు, అందించే కోర్సులు, అర్హతలు, ప్రవేశ విధానంపై ప్రత్యేక కథనం..

యువతకు నైపుణ్య అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు 2020లో ఢిల్లీలో ఢిల్లీ స్కిల్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు వీలుగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా కోర్సులను రూపొందించారు. మొత్తం సీట్లలో 85 శాతం నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటొరీ(ఎన్‌సీటీ) ఢిల్లీ వారికి, మిగిలిన 15 శాతం సీట్లను ఇతర ప్రాంతాల వారికి కేటాయిస్తారు.

డిగ్రీ స్థాయి కోర్సులు..

 • బీఏ స్పానిష్‌: స్పానిష్‌ భాష తెలిసినవారికి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అందుకే మూడేళ్ల బీఏ స్పానిష్‌ కోర్సును ఢిల్లీ స్కిల్‌ యూనివర్సిటీ అందిస్తోంది. కనీసం 55 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ తత్సమాన అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
 • బీఏ డిజిటల్‌ మీడియా అండ్‌ డిజైన్‌: ప్రస్తుతం డిజిటల్‌ మీడియా రంగం బాగా విస్తరిస్తోంది. ఈ రంగంలో ఉపాధి పొందాలనుకునేవారి కోసం మూడేళ్ల కోర్సును అందుబాటులోకి తెచ్చారు. కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
 • బీఏ ఈస్థటిక్స్‌ అండ్‌ బ్యూటీ థెరపీ: సౌందర్య పోషణ(బ్యూటీ) పరిశ్రమలో నిపుణలను తయారు చేసేందుకు ఉద్దేశించిన కోర్సు ఇది. ఇంటర్‌లో కనీసం 55 శాతం మార్కులు సాధించిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 • బీఎస్సీ డేటా అనలిటిక్స్‌: డేటా అనలిటిక్స్‌ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. అందుకే మూడేళ్ల బీఎస్సీ డేటా అనలిటిక్స్‌ కోర్సును ప్రవేశపెట్టారు. ఇందులో చేరేందుకు కనీసం 55శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులవ్వాలి.
 • బీఎస్సీ మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ: బయాలజీ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌ 55 శాతం మార్కులతో పూర్తి చేసినవారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు.
 • బీకామ్‌ బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌: ఇందులో బిజినెస్‌ విధానాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణపై శిక్షణనిస్తారు. 55శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
 • బీబీఏ ఫెసిలిటీస్‌ అండ్‌ హైజీన్‌ మేనేజ్‌మెంట్‌: డిగ్రీ స్థాయిలో ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అందించడం ఇదే మొదటిసారి. కనీసం 55 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
 • బీబీఏ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌: ఇంటర్‌ 55శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు.
 • బీబీఏ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌Sసర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌: ఆర్థిక రంగంలో పనిచేయాలనుకునేవారి కోసం రూపొందించిన కోర్సు ఇది. ఇంటర్మీడియట్‌లో 55 శాతం మార్కులు సాధించినవారు అర్హులు. వీరు పదోతరగతి మ్యాథమెటిక్స్‌లో 60శాతం మార్కులు స్కోరు చేసి ఉండాలి.
 • బీఎంఎస్‌ ఈ–కామర్స్‌: ఈ–కామర్స్‌ రంగంలో పని చేసేందుకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఈ కామర్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
 • బీఎంఎస్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌: ఈ కోర్సు పూర్తి చేసిన వారు రోడ్డు, రైలు, లాజిస్టిక్స్, వెహికల్‌ టెలిమాటిక్స్, టెర్మినల్‌ మేనేజ్‌మెంట్, రవాణా మార్కెటింగ్‌ వంటి రంగాల్లో ఉపాధి పొందొచ్చు. ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
 • బీటెక్‌ కోర్సులు: ఢిల్లీ స్కిల్‌ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో నాలుగేళ్ల బీటెక్‌ కోర్సు అందిస్తోంది. ఇందులో చేరేందుకు ఇంటర్‌ ఎంపీసీ 60 శాతం మార్కులతోపాటు, జేఈఈ మెయిన్‌–2021(పేపర్‌–1)లో ర్యాంకు సాధించాలి.

పీజీ ప్రోగ్రామ్స్‌..

 • ఎంటెక్ ఇన్‌ టూల్‌ ఇంజనీరింగ్‌: బీటెక్‌/బీఈలో టూల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌/ మెకానికల్‌ అండ్‌ ఆటోమెటేషన్‌/ప్రొడక్షన్‌/ప్రొడ‌క్ష‌న్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌లో 60 శాతం మార్కులు సాధించి, గేట్‌ స్కోరు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
 • మాస్టర్స్ ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌(ఎంసీఏ): బీసీఏ లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు నిమ్‌సెట్‌ స్కోరు ఉన్నవారు రెండేళ్ల ఈ కోర్సులో చేరేందుకు అర్హులు.

డిప్లొమా స్థాయి కోర్సులు..
ఢిల్లీ స్కిల్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ యూనివర్సిటీ.. డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులను సైతం అందిస్తోంది. ముఖ్యంగా ఫుల్‌టైమ్‌/ పార్ట్‌టైమ్‌/లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పిస్తోంది. ఫుల్‌టైమ్‌ కోర్సుల్లో డిప్లొమా ఇన్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌/ఆర్కిటెక్చర్‌/ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌/అప్లయిడ్‌ ఆర్ట్స్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/కాస్మొటాలజీ అండ్‌ హెల్త్‌/ఫ్యాషన్‌ డిజైనింగ్‌/ఇంటీరియర్‌ డిజైనింగ్‌/ఫార్మసీ వంటి కోర్సులు ఉన్నాయి. ఫార్మసీ తప్ప మిగతావాటికి పదో తరగతి ఉత్తీర్ణులైనవారు, ఫార్మసీ కోర్సులకు ఇంటర్‌ బైపీసీ/ఎంపీసీ ఉత్తీర్ణులు అర్హులు.

యూజీ కోర్సులకు ఫ్రీ ఎంట్రన్స్‌..

 • అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం డీఎస్‌ఈయు ప్రత్యేంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. దీన్ని ‘పర్సనాలిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌ మైండ్‌సెట్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌’(పీఈజీ టెస్ట్‌)గా పిలుస్తారు. ఈ పరీక్ష యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ‘ఉచితం’గా రాయవచ్చు. ఈ టెస్ట్‌కు ఎలాంటి ప్రిపరేషన్‌ అవసరం లేదు. కేవలం 40 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.
 • పాలిటెక్నిక్‌ రెగ్యులర్‌ డిప్లొమా కోర్సులకు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సెట్‌) ఉంటుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

ముఖ్యమైన సమాచారం..

 • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 • డిప్లొమా కోర్సుల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 27.07.2021
 • డిగ్రీ కోర్సుల రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 10.08.2021
 • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.dseu.ac.in
Published date : 27 Jul 2021 06:02PM