Skip to main content

యూజీసీ నెట్(డిసెంబర్)-2019 ప్రిపరేషన్ గెడైన్స్..

అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌నకు అర్హతతోపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్)కు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష యూజీసీ నెట్. ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లో ఈ పరీక్ష జరుగుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డిసెంబర్ 2019కు నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయస్థాయిలో నిర్వహించే ఈపరీక్ష ద్వారా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు పోటీపడే అర్హత లభిస్తుంది. అలాగే, మెరిట్‌లిస్టులో టాప్‌లో నిలిచిన విద్యార్థులు జేఆర్‌ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్) ద్వారా దేశంలోని యూనివర్సిటీల్లో, ఇన్‌స్టిట్యూట్స్‌లో పరిశోధనలు చేసేందుకు చక్కటి అవకాశం లభిస్తుంది.
ప్రయోజనాలు అనేకం:
  • నెట్‌లో అత్యుత్తమ ప్రతిభ ద్వారా జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే ప్రతిష్టాత్మక రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లలో పరిశోధన కోర్సుల్లో ప్రవేశం పొందే వీలుంటుంది. నెలకు రూ.31వేల జేఆర్‌ఎఫ్ లభిస్తుంది. దీనితోపాటు హెచ్‌ఆర్‌ఏ ఉంటుంది. పరిశోధన చేసే ప్రాంతాన్ని బట్టి 8 శాతం, 16 శాతం, 24 శాతం వరకు అద్దె ఇంటి అలవెన్సులు చెల్లిస్తారు. అలాగే ఇతర కాంటిజెన్సీ ఫండ్ పేరుతో ఏటా నిర్ణీత మొత్తం కూడా విద్యార్థులు అందుకోవచ్చు.
  • జేఆర్‌ఎఫ్ అందుకున్న రెండేళ్ల తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్‌ఆర్‌ఎఫ్) లభిస్తుంది. ఈ సమయంలో నెలకు రూ.35 వేల ఫెలోషిప్ అందుతుంది. దీనికి అలవెన్సులు అదనం.
  • జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు కూడా అర్హులే.
  • యూజీసీ నెట్‌లో మెరిట్ లిస్ట్‌లో నిలిస్తే దేశంలోని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది.
  • ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణులకు రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలోనూ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది.
  • యూజీసీ నెట్ స్కోర్‌తో ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాలు చేపట్టే అవకాశం ఉంటుంది. పలు పీఎస్‌యూలు ఆర్ అండ్ డీ, మేనేజ్‌మెంట్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో నియామకాలకు యూజీసీ నెట్ ఉత్తీర్ణులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. వీటిల్లో ఉద్యోగాలు పొందితే ఆకర్షణీయమైన వేతనాలు అందుకోవచ్చు.
  • టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ నిర్వహించే లెక్చరర్ పోస్టులకు యూజీసీ నెట్ స్కోర్‌తో పోటీ పడవచ్చు.
అర్హతలు:
మొత్తం 81 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహిస్తున్నారు. హ్యుమానిటీస్(భాషలు సహా), సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ సైన్స్ మొదలైన పలు విభాగాల్లోని సబ్జెక్టులకు ఈ అర్హత పరీక్ష ఉంటుంది. ఆయా సబ్జెక్ట్‌ల్లో పీజీ లేదా తత్సమాన స్థాయిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :
  • 2019 డిసెంబర్1 నాటికి 30 ఏళ్లలోపు వయసు ఉన్న వారు జేఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్), ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యుడీ తదితర రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంది. ఇతర రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపు లభిస్తుంది. ఎల్‌ఎల్‌ఎం విద్యార్థులు మూడేళ్ల సడలింపు పొందొచ్చు.
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.
పరీక్ష విధానం :
యూజీసీ నెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి, ప్రతి పేపర్ ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతుంది. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు. పేపర్ల మధ్య ఎటువంటి విరామ సమయం ఉండదు.
పేపర్ ప్రశ్నలు మార్కులు
పేపర్-1 50 100
పేపర్-2 100 200
  • పేపర్ 1 అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో 50 ప్రశ్నలు ఉంటాయి. రీసెర్చ్/టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
  • పేపర్ -2 ప్రశ్నలు అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై ఉంటాయి. 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
  • పేపర్1, పేపర్ 2లోనూ నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.
  • పేపర్-1, 2ల్లో కలిపి కనీసం 40శాతం, రిజర్వేష న్ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు పొందాలి. ఈ రెండు పేపర్లలో సాధించిన మార్కుల ఆధారంగా.. పరీక్షకు హాజరైన వారిలో టాప్ 6 శాతం మందికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు అర్హత లభిస్తుంది. అత్యుత్తమ ప్రతిభ చూపిన అభ్యర్థులను జేఆర్‌ఎఫ్‌కు ఎంపిక చేస్తారు.
ప్రిపరేషన్ పక్కాగా..
  • పేపర్-1లో ఎక్కువగా టీచింగ్ ఆప్టిట్యూట్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, దేశంలో ఉన్నత విద్య-ప్రస్తుత పరిస్థితులు, సమకాలీన విద్యా రంగ సంబంధిత అంశాలపై దృష్టిపెట్టాలి.
  • నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ఇచ్చే ర్యాంకులు, యూనివర్సిటీలకు విశిష్ట గుర్తింపు లభించిన సంఘటనలు గుర్తుంచుకోవాలి.
  • పేపర్1లో రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగం కీలకం. కాబట్టి వేగంగా చదవడం, అర్థం చేసుకోవడం ఇప్పటినుంచే అలవర్చుకోవాలి.
  • టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ కోసం ఏదేని ఒక పుస్తకాన్ని రిఫర్ చేస్తే సరిపోతుంది.
  • డేటాఇంటర్‌ప్రిటేషన్ నుంచి లాజికల్ రీజనింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పరీక్షించే ప్రశ్నలు కూడా అడుగుతారు. అభ్యర్థులు నిర్దిష్ట డేటా నుంచి ముఖ్యాంశాలను గుర్తించే విశ్లేషణ నైపుణ్యం సొంతం చేసుకోవాలి. అందుకోసం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
  • పేపర్ 2 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో సబ్జెక్టుపై పట్టు సాధించాలి. అభ్యర్థులు తమ సబ్జెక్ట్‌కు సంబంధించి పీజీ స్థాయి సిలబస్‌ను పూర్తిగా చదవాలి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నా.. ప్రాథమిక అంశాలపై పట్టు అవసరం. సిలబస్‌లో పేర్కొన్న ప్రతి టాపిక్‌ను విభిన్న కోణాల్లో చదవాలి. మ్యాచింగ్, అనువర్తిత అంశాలపై ప్రశ్నలుంటాయి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలపై డిగ్రీ, పీజీ స్థాయి ప్రామాణిక పుస్తకాలు అధ్యయనం చేయాలి. సొంత నోట్స్ రాసుకొని ప్రిపేరవ్వాలి. అన్ని అంశాలను క్షుణ్నంగా చదవాలి. గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. మాక్ టెస్ట్‌లు రాయాలి. నెగెటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
ముఖ్య సమాచారం :
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 15
దరఖాస్తు రుసుం: జనరల్ అభ్యర్థులకు రూ.1000; ఓబీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ, ట్రాన్స్జండర్లకు రూ. 250
పరీక్ష తేదీలు: డిసెంబర్ 2నుంచి 6 వరకు
ఫలితాల విడుదల: 2019 డిసెంబర్ 31
వెబ్‌సైట్: https://ugcnet.nta.nic.in
సిలబస్ కోసం: www.ugcnetonline.in వెబ్‌సైట్ చూడొచ్చు.
అధికారిక వెబ్‌సైట్లో మాక్‌టెస్ట్ల కోసం: https://ugcnet.nta.nic.in
Published date : 15 Oct 2019 06:23PM

Photo Stories