Skip to main content

యూజీసీ నెట్ (జూన్)-2019కి సన్నద్ధమవ్వండిలా..!

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్.. సంక్షిప్తంగా యూజీసీ-నెట్! ఈ పరీక్ష.. పీజీ పూర్తయ్యాక పరిశోధనల దిశగా వెళ్లాలనుకునే ప్రతిభావంతులకు సరైన మార్గం!! అంతేకాదు.. యూజీసీ నెట్‌తో యూనివర్సిటీలు/కళాశాలల్లో అధ్యాపక వృత్తిలో ప్రవేశించొచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌ల్లో నెట్‌ను నిర్వహిస్తోంది. జూన్-2019కు ఇటీవల షెడ్యూల్ విడుదలైంది. నెట్ పరీక్ష విధానం, సిలబస్‌లోనూ మార్పులకు ఎన్‌టీఏ శ్రీకారం చుట్టింది! ఈ నేపథ్యంలో యూజీసీ నెట్-జూన్ 2019 సమాచారం.. పరీక్ష విధానం.. ప్రయోజనాలు.. ఉత్తీర్ణత సాధించడానికి మార్గాలను తెలుసుకుందాం...
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఆపై భవిష్యత్తు అవకాశాల అన్వేషణ. పరిశోధనల దిశగా అడుగులు వేయాలనే ఆలోచన. అధ్యాపక వృత్తిపైనా ఆసక్తి. ముఖ్యంగా సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్‌లో పరిశోధన ఔత్సాహికులకు, కెరీర్ పరంగా అధ్యాపక వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి బహుళ ప్రయోజనకారి పరీక్ష.. యూజీసీ-నెట్. గత డిసెంబర్ నుంచి ఈ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. జూన్-2019 నిర్వహణకు తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. జూన్ 20 నుంచి 28 వరకు పలు స్లాట్లలో పరీక్ష నిర్వహించనుంది.

నెట్‌తో ప్రయోజనాలు..
  • యూనివర్సిటీలు, కళాశాలల స్థాయిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో అధ్యాపక వృత్తిలో ప్రవేశించొచ్చు.
  • యూజీసీ నిబంధనల ప్రకారం నెట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయాలి. ఇలా ఎంపికైన వారికి ప్రారంభంలోనే నెలకు రూ.40 వేల వేతనం లభించే అవకాశముంది.
  • జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే.. మూడేళ్లపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేయొచ్చు. జేఆర్‌ఎఫ్ విజయవంతంగా పూర్తిచేసిన వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తుంది. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ అభ్యర్థులకు జేఆర్‌ఎఫ్‌కు నెలకు రూ.25 వేలు, ఎస్‌ఆర్‌ఎఫ్‌కు నెలకు రూ.28 వేలు అందే అవకాశముంది. వీటిని త్వరలో సమీక్షించి పెంచే అవకాశముంది.
  • ఇటీవల కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో ఫెలోషిప్ మొత్తాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రకారం జేఆర్‌ఎఫ్ రూ.31 వేలు, ఎస్‌ఆర్‌ఎఫ్ రూ.35 వేలకు పెరిగింది.
  • జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉజ్వల కెరీర్ అవకాశాలు సొంతం చేసుకునే వీలుంది.

మొత్తం 101 సబ్జెక్టులు :
యూజీసీ-నెట్‌ను మొత్తం 101 సబ్జెక్టుల్లో నిర్వహించనున్నారు. వీటిలో కంప్యూటర్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, క్రిమినాలజీ, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ వంటి సైన్స్ సంబంధిత సబ్జెక్ట్‌లతోపాటు ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, లాంగ్వేజెస్ సబ్జెక్ట్‌లు ఉన్నాయి.

అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్‌ఎఫ్ :
యూజీసీ-నెట్‌ను అసిస్టెంట్ ప్రొఫెసర్.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరవుతామనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఉదాహరణకు పరిశోధన ఔత్సాహికులు.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకోవాలి. జేఆర్‌ఎఫ్ ఆసక్తి లేని అభ్యర్థులు, అధ్యాపక వృత్తిలో స్థిరపడాలనుకునే వారు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.

రెండు పేపర్లు.. ఆన్‌లైన్ విధానం :
యూజీసీ-నెట్‌ను ప్రతి సబ్జెక్ట్‌లోనూ రెండు పేపర్లుగా ఆబ్జెక్టివ్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నారు. పేపర్-1 అభ్యర్థులందరికీ కామన్ పేపర్. పేపర్-2 మాత్రం అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్ ఆధారంగా యూజీసీ నెట్‌లో అర్హత ఉన్న సబ్జెక్ట్‌కు సంబంధించిన పరీక్ష. అంటే.. పీజీలో హిస్టరీ పూర్తిచేసిన అభ్యర్థులు పేపర్-2 హిస్టరీకి సంబంధించిందిగా ఉంటుంది.

300 మార్కులు :
రెండు పేపర్లుగా నిర్వహించే యూజీసీ నెట్‌కు గరిష్టంగా నిర్దేశించిన మార్కులు 300. పరీక్షకు లభించే వ్యవధి మూడు గంటలు.

పేపర్

అంశం

ప్రశ్నలు

మార్కులు

పేపర్-1

టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్

50

100

పేపర్-2

సబ్జెక్ట్ సంబంధిత పేపర్

100

200

మొత్తం మార్కులు

300


జూన్-2019.. పరీక్ష విధానంలో మార్పు
యూజీసీ-నెట్-2019 నుంచి పరీక్ష విధానంలో మార్పులు చేశారు. దీని ప్రకారం అభ్యర్థులు ఒకే షిఫ్ట్‌లో రెండు పేపర్లకు హాజరు కావాలి. పేపర్-1, పేపర్-2కు మధ్యలో 30 నిమిషాల విరామం ఉంటుంది. గతంలో పేపర్-1 ఉదయం సెషన్‌లో, పేపర్-2 మధ్యాహ్నం సెషన్‌లో ఉండేది. అంతేకాకుండా ఉదయం, మధ్యాహ్నం సెషన్‌లలో రెండు షిఫ్ట్‌లలో పేపర్-1, పేపర్-2 జరిగేది. కానీ.. జూన్-2019 నుంచి ఈ విధానానికి స్వస్తి పలికి.. కేవలం ఒకే సెషన్‌లో రెండు పేపర్లకు మధ్య అరగంట విరామంతో పరీక్ష నిర్వహించనున్నారు.

సిలబస్‌లోనూ మార్పులు :
యూజీసీ నెట్-జూన్ 2019కు సంబంధించి ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌లో మార్పు చేయడం విశేషం. ప్రతి సబ్జెక్ట్‌లోనూ 20 శాతం మేరకు మార్పులు జరిగాయి. ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సులుగా పేర్కొనే మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్, ఇంటర్నేషనల్ అండ్ ఏరియా స్టడీస్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఫోరెన్సిక్ సైన్స్ వంటి సబ్జెక్ట్‌లలో మార్పులు కాస్త ఎక్కువగానే జరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్పులతో కూడిన సిలబస్‌ను యూజీసీ నెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ సబ్జెక్ట్‌కు సంబంధించిన నూతన సిలబస్‌ను వెబ్‌సైట్‌లో పరిశీలించి.. అందుకునుగుణంగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ సాగించొచ్చు.

కనీస మార్కులు తప్పనిసరి :
దేశవ్యాప్తంగా పోటీ తీవ్రంగా ఉన్న యూజీసీ నెట్ తుది జాబితాలో నిలవాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే.. దాదాపు ఏడు లక్షల మంది పరీక్షకు హాజరైతే అందులో జేఆర్‌ఎఫ్ లభించేది కేవలం మూడువేల మందికి మాత్రమే! తుది జాబితా రూపకల్పనకు సంబంధించి నిర్దిష్ట విధానాన్ని అనుసరిస్తూ టాప్‌లో నిలిచిన ఆరు శాతం మందినే ఎంపిక చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో మాత్రం 40 వేల మంది వరకు ఉత్తీర్ణత సాధిస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషషన్ సాగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లు కలిపి కనీసం 40 శాతం మార్కులు; రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. అప్పుడే వారి పేపర్లను తుది జాబితా రూపకల్పనకు పరిగణిస్తారు.

పేపర్-1.. సామాజిక అవగాహన :
అందరికీ ఉమ్మడి పేపర్‌గా నిర్దేశించిన పేపర్-1లో అభ్యర్థుల్లో బోధన, పరిశోధనపై ఉన్న ఆసక్తిని పరిశీలించేలా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పది విభాగాలు (టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్- గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక్కో విభాగంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు.

పేపర్-2.. సబ్జెక్ట్ ప్రశ్నలే :
పేపర్-2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. ఇవి కూడా పీజీ స్థాయిలో అడుగుతారు. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకూ.. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం లాభిస్తుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్ థింకింగ్, అప్లికేషన్ ఓరియెంటేషన్ అవసరం ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ సమయంలోనే అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ముందుకు సాగాలి.

యూజీసీ నెట్-2018 జూలై ఫలితాల వివరాలు :
మొత్తం ఉత్తీర్ణులు:
55872
జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన వారు: 3352

యూజీసీ నెట్-2018 డిసెంబర్ ఫలితాల వివరాలు..
జేఆర్‌ఎఫ్ ఉత్తీర్ణులు:
3883
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉత్తీర్ణులు: 44001

యూజీసీ నెట్-జూన్ 2019 సమాచారం :
    అర్హత: పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు.
  • పీజీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
    వయో పరిమితి: జేఆర్‌ఎఫ్ ఔత్సాహిక అభ్యర్థులకు జూన్1, 2019 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ ఔత్సాహిక అభ్యర్థుల విషయంలో వయో పరిమితి లేదు.
    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు:
మార్చి 1 నుంచి మార్చి 30, 2019.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: మే 15, 2019.
పరీక్ష తేదీలు: జూన్ 20, 21, 24, 25, 26, 27, 28.
ఫలితాల వెల్లడి: జూలై 15, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ugcnetonline.in, https://nta.ac.in
Published date : 18 Feb 2019 06:26PM

Photo Stories