Skip to main content

టీఎస్ ఐసెట్-2019కౌన్సెలింగ్ ప్రక్రియ ఇలా...

టీఎస్ ఐసెట్ 2019.. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష.
టీఎస్ ఐసెట్ 2019 కౌన్సెలింగ్‌కు తెలంగాణ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐసెట్ లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు ఆగస్టు 6వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్, ధ్రువపత్రాల పరిశీలన, సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో... టీఎస్ ఐసెట్ 2019 కౌన్సెలింగ్ సమగ్ర సమాచారం...

అర్హతలు...
  • టీఎస్ ఐసెట్(తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)- 2019లో అర్హత సాధించాలి.
  • ఎంబీఏలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు మూడేళ్ల డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ఎంసీఏలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు మూడేళ్ల డిగ్రీ కోర్సుతోపాటు 10+2 స్థాయిలో మ్యాథమెటిక్స్ తప్పనిసరిగా చదవాలి.
  • అర్హత పరీక్ష డిగ్రీలో ఓసీలకు కనీసం 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు రావాలి.
  • తుది దశ ముగిశాక మైనారిటీ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లలో ఐసెట్-2019లో అర్హత సాధించని మైనారిటీ(ముస్లిం, క్రిస్టియన్) అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. డిగ్రీలో ఓసీలు కనీసం 50 శాతం మార్కులు, ఇతరులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. అయితే ఈ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం వర్తించదు.

కౌన్సెలింగ్ ప్రక్రియ ఇలా..
  • కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకొని, స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
  • ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఆగస్టు 12వ తేదీ వరకు కాలేజీలకు సంబంధించిన ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఆగస్టు 14వ తేదీన సీట్ల కేటాయింపు ప్రక్రియ. సీట్ల కేటాయింపు జరిగిన అభ్యర్థులు ఆగస్టు 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు :
అభ్యర్థులు ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్ tsicet.nic.in లోకి లాగిన్ అయి.. పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు అనే లింక్‌పై క్లిక్ చేయాలి. దాంట్లో టీఎస్‌ఐసెట్ 2019, రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టిక్కెట్ నంబర్ ను, పుట్టిన తేదీ(పదో తరగతి మెమోలో ఉన్నదాని ప్రకారం) ఎంటర్ చేయాలి. ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, మీ సేవ ద్వారా జారీచేసిన కుల, ఆదాయ ధ్రువపత్రాల అప్లికేషన్ నంబర్‌లు ఎంటర్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ.1200లను ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించని అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు అనుమతించరు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాక తమకు సమీపంలోని హెల్ప్‌లైన్ సెంటర్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు నిర్దేశిత తేదీలో హాజరయ్యేందుకు స్లాట్ బుక్ చేసుకోవాలి.

నాలుగు దశల్లో..
టీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది.
అవి..
  1. ధ్రువపత్రాల పరీశీలన
  2. ఆప్షన్‌ల నమోదు
  3. సీట్ల కేటాయింపు
  4. ఫీజు చెల్లింపు, కాలేజీలో రిపోర్టు చేయడం.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ :
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రతి సెంటర్‌లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తారు. అలాగే ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు. కౌన్సెలింగ్ హాజరయ్యే అభ్యర్థులు ఈ కింద తెలిపిన ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను కూడా త మ వె ంట తీసుకెళ్లాలి.
  1. టీఎస్ ఐసెట్-2019 ర్యాంకు కార్డు.
  2. టీఎస్ ఐసెట్-2019 హాల్‌టికెట్.
  3. ఆధార్ కార్డు.
  4. పదో తరగతి మెమో.
  5. ఇంటర్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్
  6. డిగ్రీ మార్కుల మెమో, ప్రొవిజినల్ పాస్ సర్టిఫికేట్.
  7. స్టడీ లేదా బోనఫైడ్ 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు.
  8. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్. హాకులధ్రువీకరణ పత్రం.
  9. ఆదాయ ధ్రువీకరణ పత్రం (2019 జనవరి 1 తర్వాత జారీచేసింది)
  10. నివాస ధ్రువీకరణ పత్రం(వర్తించే అభ్యర్థులు).
  11. దివ్యాంగ, స్పోర్ట్స్ కోటా, మైనారిటీ అభ్యర్థులు సంబంధిత అధికా రులు జారీ చేసిన ధృవీకరణ పత్రాలు తమ వెంట తీసుకవెళ్లాలి.

ఆప్షన్ల నమోదు :
ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో కాలేజీలకు సంబంధించిన ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన వెంటనే అభ్యర్థి రిజస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు లాగిన్ ఐడీ పంపిస్తారు. ఓటీపీతో సహా అన్ని వివరాలను అభ్యర్థి ఫోన్ నెంబర్‌కు పంపిస్తారు. ఇంటినుంచి కాని, హెల్ప్‌లైన్ సెంటర్ నుంచి కాని, ఇంటర్నెట్ కేఫ్ ద్వారా కాని అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు సిద్ధమైన విద్యార్థులు వెబ్‌సైట్‌లో క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి... పాస్‌వర్డ్ జనరేట్ చేసుకోవాలి. పాస్‌వర్డ్ జనరేట్ చేసుకున్నాక క్యాండిటేట్ లాగిన్ లింక్‌పై క్లిక్ చేసి.. మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఇప్పటికే సిద్ధం చేసుకున్న మ్యానువల్ ఆప్షన్ ఎంట్రీ సాయంతో సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలి.

సీట్ల కేటాయింపు :
మెరిట్, రిజర్వేషన్, స్థానికత ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. 14.08.2019న ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్‌ను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత అభ్యర్థులు సంబంధిత వివరాలు ఎంటర్‌చేసి ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ట్యూషన్ ఫీజు చెల్లింపు :
అలాట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న విధంగా నిర్ధేశిత గడువులోపు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు చెల్లించిన అభ్యర్థులకు అడ్మిషన్ నంబర్ వస్తుంది. సీట్ల కేటాయింపు ధ్రువీకరణపత్రంతో సహా అడ్మిషన్ నంబర్‌ను ప్రింట్ తీసుకొని సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

మళ్లీ అవకాశం..
ఐసెట్ కౌన్సెలింగ్ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశ కౌన్సెలింగ్ లో సీటు లభించని విద్యార్థులు రెండో దశ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే వీలుంది. అభ్యర్థి ట్యూషన్ ఫీజు చెల్లించిన తర్వాత తన సీటును రద్దు చేసుకోవాలనుకుంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌లో సూచించిన విధంగా కటాఫ్ తేదీ లోపు రద్దు చేసుకోవాలి. అప్పుడు ట్యూషన్ ఫీజు రిఫండ్ చేస్తారు.

ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్:
ఆగస్టు 6-8, 2019.
స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన: ఆగస్టు 8-11 తేదీల మధ్య.
వెబ్ ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ: ఆగస్టు 8-12 తేదీల మధ్య.
సీట్ల కేటాయింపు: ఆగస్టు 14, 2019.
ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్ ద్వారా స్వీయ రిపోర్టింగ్: ఆగస్టు 14-17 తేదీల మధ్య.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: tsicet.nic.in
Published date : 06 Aug 2019 12:51PM

Photo Stories