Skip to main content

సీఏ ఫౌండేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు మార్గాలు...

ఫౌండేషన్ ఎగ్జామ్స్... భవిష్యత్తులో సీఏలుగా ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించాలనుకునే విద్యార్థులు ఉత్తీర్ణులవ్వాల్సిన పరీక్షలు! ప్రతి ఏటా రెండుసార్లు (మే/ నవంబర్) సీఏ ఫౌండేషన్ పరీక్షలు జరుగుతాయి.
ఏ2019 సంవత్సరానికి సంబంధించి నవంబర్ 9 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. సీఏ ఫౌండేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రిపరేషన్ గెడైన్స్...

ప్రాధాన్యత క్రమం :
సీఏ ఫౌండేషన్ పరీక్షలకు నెల రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి నేర్చుకోవాల్సిన అంశాలను ప్రాధాన్యతా క్రమంలో చదవాలి. నిర్దిష్టంగా టైమ్ టేబుల్ రూపొందించుకొని.. ఏ సమయంలో, ఏ సబ్జెక్ట్ ప్రిపేరవ్వాలో స్పష్టత తెచ్చుకోవాలి.

కష్టమైన సబ్జెక్ట్‌కు ఎక్కువ సమయం..
ప్రిపరేషన్ సమయంలో కష్టం అనుకున్న సబ్జెక్ట్‌ను ఎక్కువసేపు చదవడం మేలు. అలాకాకుండా సులువైన సబ్జెక్ట్‌నే ఎక్కువసార్లు చదువుతూపోతే.. కఠినమైన సబ్జెక్ట్‌ను చదవడానికి సమయం సరిపోదు. ఇక్కడ పరీక్ష ఉత్తీర్ణత నిబంధనలను కూడా గుర్తు పెట్టుకోవాలి. సీఏ ఫౌండేషన్‌లోని మొత్తం నాలుగు సబ్జెక్ట్‌లలో ప్రతి సబ్జెక్ట్‌లో తప్పనిసరిగా కనీసం 40 శాతం మార్కులు; మొత్తం నాలుగు సబ్జెక్ట్‌లకు కలిపి 50 శాతం మార్కులు సాధించాలి. రెండు పేపర్లలో 60 కంటే ఎక్కువ మార్కుల చొప్పున.. మిగతా రెండు పేపర్లలో కనీసం 40 మార్కుల చొప్పున వచ్చినా ఉత్తీర్ణులైనట్లే!

సందేహాల నివృత్తి :
విద్యార్థులు ప్రిపరేషన్ సమయంలో ఎదురయ్యే సందేహాలను ఒక పుస్తకంలో రాసుకోవాలి. వాటిని ఫ్యాకల్టీని సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. అలాగే ప్రతి 90 నిమిషాల తర్వాత చదివే సబ్జెక్ట్‌ను మార్చాలి. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఒకేసారి అన్ని సబ్జెక్ట్‌లు కాకుండా.. వీలైనంతవరకు సబ్జెక్ట్‌లను రెండు భాగాలుగా విభజించుకొని చదవాలి. ప్రతి భాగంలోనూ రెండు సబ్జెక్ట్‌లు ఉండే విధంగా.. వాటిలో ఒక సబ్జెక్ట్ బాగా వచ్చింది.. మరొకటి కష్టమైన సబ్జెక్టు ఉండేట్లు చూసుకోవాలి. ప్రిపరేషన్ సమయంలో ఒక రోజు ఒక భాగాన్ని.. మరో రోజు రెండో భాగాన్ని చదవాలి.

కొత్త పుస్తకాలు వద్దు :
ఇంతకాలం చదివిన పాఠ్యపుస్తకాలు లేదా స్టడీ మెటీరియల్‌నే చదవడం మేలు. ఇప్పుడు కొత్త స్టడీ మెటీరియల్ లేదా కొత్త పాఠ్యపుస్తకాలు చదవడం సరికాదు. దీనివల్ల గందరగోళానికి గురయ్యే ఆస్కారముంది. ఉదాహరణకు బిజినెస్ లా సబ్జెక్ట్‌లోని కేస్ స్టడీస్ రెండు వేర్వేరు పుస్తకాల్లో విభిన్నంగా ఉంటాయి. కాబట్టి ఐసీఏఐ ఇన్‌స్టిట్యూట్ స్టడీ మెటీరియల్‌నే ప్రామాణికంగా తీసుకోవాలి. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఉత్తీర్ణత సాధించడానికి అకౌంట్స్, బిజినెస్ ‘లా’స్ సబ్జెక్ట్‌లు ఎంతోముఖ్యం. కాబట్టి ఈ సబ్జెక్ట్‌లపై పట్టు పెంచుకోవాలి. అందుకోసం ప్రిపరేషన్ సమయంలో వీటికి కొంత ఎక్కువ సమయం కేటాయించాలి.

ఆ ప్రశ్నలన్నీ చదవాలి..
ప్రిపరేషన్ సమయంలో సీఏ ఇన్‌స్టిట్యూట్ స్టడీ మెటీరియల్‌లో పేర్కొన్న అన్ని ప్రశ్నలను చదవాలి. సీఏ ఇన్‌స్టిట్యూట్ ప్రతి పరీక్షకు విడుదల చేసే ఎంటీపీ(మాక్ టెస్ట్ పేపర్లు)స్, ఆర్‌టీపీ(రివిజన్ టెస్ట్ పేపర్)స్‌ను పరిశీలించాలి. ఆర్‌టీపీస్‌లో ప్రతి చాప్టర్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తారు. వీటిని తప్పకుండా సాధన చేయాలి. ఎంటీపీస్ అనేవి మోడల్ పేపర్ల వంటివి. ప్రస్తుతం నవంబర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు.. నవంబర్ 2018; మే 2019 పేపర్లతోపాటు నవంబర్ 2019కి సంబంధించి విడుదల చేసిన ఎంటీపీస్, ఆర్‌టీపీస్‌లను సేకరించుకొని చదవాలి. ఇప్పటివరకు జరిగిన గత మూడు సీఏ ఫౌండేషన్ ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. ప్రాబ్లమ్స్ విషయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థులు కాలిక్యులేటర్ టైపింగ్ ప్రాక్టీస్‌పైనా ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు కాలిక్యులేటర్‌పై ప్రాక్టీస్ చేయాలి.

మోడల్ ఎగ్జామ్స్ :
విద్యార్థులు మోడల్ ఎగ్జామ్స్‌కు హాజరు కావడం మేలు చేస్తుంది. ప్రస్తుత సమయంలో కనీసం రెండు మోడల్ పేపర్లు రాయాలి. మోడల్ పేపర్లకు హాజరయ్యాక వాటి సమాధానాలు, పొరపాట్లను విశ్లేషించుకొని.. తర్వాతి పరీక్షలో పునరావృతం కాకుండా చూసుకోవాలి. సీఏ ఫౌండేషన్ పరీక్షలో ప్రతి సబ్జెక్ట్‌లో 20 నుంచి 30 శాతం కఠినమైన ప్రశ్నలు రావడం సహజం. కాబట్టి ఆందోళన చెందడం అనవసరం. మిగతా80 శాతం ప్రశ్నలకు చక్కగా సమాధానాలు రాయడంపై దృష్టిపెట్టాలి.

సీఏ ఫౌండేషన్ పరీక్ష స్వరూపం :
పేపర్ సబ్జెక్ట్‌లు మార్కులు సమయం (గంటల్లో)
పేపర్-1 ప్రిన్సిపుల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్ 100 3
పేపర్-2 బిజినెస్ ‘లా’స్ (60 మార్కులు) బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్ (40 మార్కులు) 100 3
పేపర్-3 బిజినెస్ మ్యాథమెటిక్స్ (40 మార్కులు) లాజికల్ రీజనింగ్ (20 మార్కులు) స్టాటిస్టిక్స్ (40 మార్కులు) 100 2
పేపర్-4 బిజినెస్ ఎకనామిక్స్(60 మార్కులు) బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్ (40 మార్కులు) 100 2

సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్ ఇలా..

పేపర్-1:
ప్రిన్సిపుల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్ (100 మార్కులు):
ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. ఇందులో రాణించడం ద్వారా తర్వాత దశలో ఇంటర్, ఫైనల్‌లోని డిస్క్రిప్టివ్ పరీక్షలకు ముందుగానే శిక్షణ పొందినట్లవుతుంది. ఇందులో సులువుగా 60 నుంచి 70 మార్కులు పొందొచ్చు. ఇందుకోసం అకౌంట్స్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చదవాలి. లెక్కలను బాగా ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా కాన్సెప్ట్ ఆధారిత ప్రిపరేషన్ లాభిస్తుంది. ఈ సబ్జెక్ట్‌లో జర్నల్ ఎంట్రీస్, థియరీకి సంబంధించి అకౌంటింగ్ యాన్ ఇంట్రడక్షన్, క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్‌పెండీచర్ అండ్ రిసీప్ట్స్, కాంటింజెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యమైన చాప్టర్స్: పార్ట్‌నర్‌షిప్ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్, అకౌంటింగ్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఫైనల్ అకౌంట్స్, కన్‌సైన్‌మెంట్ అకౌంట్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్ఛేంజ్. వీటిలో అకౌంటింగ్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌తోపాటు యావరేజ్ డ్యూ డేట్, అకౌంట్ కరెంట్ చాప్టర్లను కొత్తగా చేర్చారు. వీటిపై ప్రత్యేక దృష్టి కేటాయించాలి.

పేపర్-2:
బిజినెస్ ‘లా’స్, బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్ (100 మార్కులు):
  • డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే.. ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా ప్రజెంటేషన్ స్కిల్స్‌కూడా ముఖ్యం.
  • 60 మార్కులకు అడిగే బిజినెస్ లాలో ఉత్తీర్ణత సాధించాలంటే.. బిజినెస్ చట్టాలపై పట్టు సాధించాలి. ఫ్రీ కన్సంట్, వాయిడ్ అగ్రిమెంట్స్, పార్ట్‌నర్‌షిప్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ చాప్టర్లను బాగా చదవాలి. కొత్తగా చేర్చిన కంపెనీస్ యాక్ట్, లిమిటెడ్ లయబిలిటి పార్ట్‌నర్‌షిప్ చాప్టర్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
  • పేపర్-2లోనే 40 మార్కులకు ఉండే బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్‌కు సంబంధించి భావ వ్యక్తీకరణ ప్రధానం. అదే విధంగా లెటర్ రైటింగ్, నోట్ మేకింగ్, డ్రాఫ్టింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, మెమో రైటింగ్ సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. మీటింగ్స్ అండ్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్, కంప్లైంట్ అండ్ రిప్లై టు కంప్లయింట్ లెటర్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి.
పేపర్-3:
బిజినెస్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ అండ్ స్టాటిస్టిక్స్(100 మార్కులు):
  • ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. ఈ మూడు సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్ ఫార్ములాలపై పట్టు సాధించాలి. అన్ని ఫార్ములాలను ఒక చోట రాసుకొని ప్రతి రోజు కనీసం 15 నిమిషాలు పునశ్చరణ చేయాలి.
  • 40 మార్కులకు ఉండే బిజినెస్ మ్యాథమెటిక్స్‌కు సంబంధించి డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, టైమ్ వాల్యూ ఆఫ్ మనీ, మాత్రికలు ముఖ్యమైనవి. వీటిలో కొత్తగా చేర్చిన టైమ్ వాల్యూ ఆఫ్ మనీ, మాత్రికలపై ప్రత్యేక దృష్టి కేటాయించాలి.
  • 40 మార్కులకు ఉండే స్టాటిస్టిక్స్‌కు సంబంధించి 20 శాతం నుంచి 30 శాతం ప్రశ్నలు థియరీ ఆధారితంగా ఉంటాయి. కాబట్టి వీటి ఆధారంగా ఇచ్చే ఎంసీక్యూలను చదవడం సులభం. ఈ సబ్జెక్ట్‌లో ప్రాబబిలిటీ, థియరాటికల్ డిస్ట్రిబ్యూషన్స్, శ్యాంప్లింగ్, స్టాటిస్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా, టైమ్ సిరీస్ ముఖ్యమైనవి. ఇందులో కొత్తగా చేర్చిన టైమ్ సిరీస్‌పై ప్రత్యేక దృష్టి కేటాయించాలి.
  • 20 మార్కులకు ఉండే లాజికల్ రీజనింగ్ ఉద్దేశం విద్యార్థుల్లోని పరిశీలన, విశ్లేషణ శక్తిని పరీక్షించడం. ఈ విభాగంలో ఏడు చాప్టర్స్‌లోని బేసిక్స్‌పై పట్టు సాధించాలి. నెంబర్ సిరీస్, ఆడ్‌మెన్ ఔట్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, సీటింగ్ అరేంజ్‌మెంట్, డెరైక్షన్స్ వంటి అంశాలను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
పేపర్-4:
బిజినెస్ ఎకనామిక్స్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్ (100 మార్కులు):
  • ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. 60 మార్కులకు ఉండే బిజినెస్ ఎకనామిక్స్‌లో 30 నుంచి 40 మార్కులకు ప్రశ్నలు సులభంగా నేరుగా ఉంటాయి.డయాగ్రమ్స్ కూడా అడుగుతారు. కాబట్టి వాటిపై పట్టు సాధించాలి. ఈ సబ్జెక్ట్‌లో ముఖ్యమైన చాప్టర్స్.. థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్, కాస్ట్ అనాలిసిస్, ప్రొడక్షన్ అనాలిసిస్, ప్రైస్ అండ్ ఔట్ పుట్ డిటర్మినేషన్, బిజినెస్ సైకిల్స్, డిమాండ్ ఫోర్‌క్యాస్టింగ్. ఇందులో కొత్తగా చేర్చిన బిజినెస్ సైకిల్స్, డిమాండ్ ఫోర్ క్యాస్టింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • 40 మార్కులకు అడిగే బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్‌లో బేసిక్స్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశముంది. ఇది ఒక రకంగా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. ఐసీఏఐ మెటీరియల్‌తోపాటు బిజినెస్ టెర్మినాలజీ, టెక్నికల్ వర్డ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా వ్యాపార రంగంలో తాజా మార్పులను గమనిస్తూ ఉండాలి. ఇందుకోసం వాణిజ్య సంబంధిత వార్తలను చదవడం మేలు చేస్తుంది.
నిర్దిష్ట వ్యూహంతో.. కాన్సెప్ట్ ఆధారితంగా
ఫౌండేషన్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు నిర్దిష్ట వ్యూహంతో తమ ప్రిపరేషన్ సాగించాలి. బట్టీ విధానం కాకుండా కాన్సెప్ట్ ఆధారిత ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఎంసీక్యూల విషయంలో బట్టీ విధానం సరికాదు. కనీసం మూడు లేదా నాలుగుసార్లు రివిజన్ చేయాలి. మూడు, నాలుగు పేపర్లలో నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. కాబట్టి కచ్చితంగా తెలిస్తేనే సమాధానం గుర్తించాలి. డిస్క్రిప్టివ్ పేపర్స్ విషయంలో క్విక్ రివిజన్ నోట్స్ రాసుకోవాలి. అందులో కీ పాయింట్స్ పొందుపర్చుకోవాలి. ఫలితంగా తక్కువ సమయంలో సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేసుకునే వీలుంటుంది.
- ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్ మైండ్స్.
Published date : 09 Oct 2019 11:57AM

Photo Stories