Skip to main content

సైనిక స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్..సీటు సాధించండిలా..

త్రివిధ దళాలకు అవసరమైన సైనిక అధికారులను పాఠశాల స్థాయి నుంచే తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థాపించినవే సైనిక్ స్కూల్స్. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 33 సైనిక స్కూళ్లలో ప్రవేశాల కోసం ప్రతీ ఏటా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)కు నోటిఫికేషన్ విడుదలవుతుంది.
ఎంపికైన విద్యార్థులకు సైనిక ఆధారిత నాణ్యమైన శిక్షణతో కూడిన ఉచిత విద్యను అందిస్తారు. ఇటీవల 2021-22 విద్యాసంవత్సరానికి ఏఐఎస్‌ఎస్‌ఈఈ నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశాలు.. పరీక్ష విధానం గురించి సమగ్ర సమాచారం..

ఏఐఎస్‌ఎస్‌ఈఈ:
సైనిక స్కూళ్లల్లో ప్రవేశాల కోసం దేశ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల మేరకు ఎన్‌టీఏ.. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్( ఈఈ)ను నిర్వహిస్తోంది. ఏడాదికి ఒకసారి జరిపే ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 33 సైనిక స్కూళ్లల్లో 6,9 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థుల ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా..అందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తారు. సైనిక పాఠశాలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సంబంధిత తరగతి పాఠాలతోపాటు క్రమశిక్షణ, దేశ భక్తి, త్రివిధ దళాల్లో పనిచేయడానికి కావాల్సిన నైపుణ్య శిక్షణను అందిస్తారు. ఇంగ్లిష్ మీడియంలో సీబీఎస్‌ఈ బోధన ఉంటుంది.

అర్హతలు ఇవే..:
  • 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 5వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. మార్చి 31, 2021 నాటికి 10-12 ఏళ్ల మధ్య వయసు కలిగిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
  • 9వ తరగతిలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే మార్చి 31, 2021 నాటికి 13-15 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారై ఉండాలి.
 
ఎంపిక విధానం ఇలా :
సైనిక పాఠశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించే ఏఐఎస్‌ఎస్‌ఈఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. దీంట్లో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఆరోతరగతి విద్యార్థులకు హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మరికొన్ని స్థానిక భాషల్లో పరీక్ష రాసే వెసులుబాటు ఉంది. తొమ్మిదో తరగతి ప్రవేశాల కోసం పరీక్ష రాసే విద్యా ర్థులు మాత్రం ఇంగ్లిష్‌లో రాయాల్సి ఉంటుంది.

పరీక్ష సిలబస్ ఇలా.. :
  • 6వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు సీబీఎస్‌ఈ 5వ తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అలాగే 9వ తరగతి కోసం పరీక్షలు రాసే వారికి సీబీఎస్‌ఈ 8వ తరగతి స్థాయి ప్రశ్నలను అడుగుతారు.
  • 6వ తరగతి పరీక్షలో మ్యాథమెటిక్స్‌కు సంబం దించి అడిషన్, సబ్‌ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, నంబర్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ సహా ఇతర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. అలాగే ఇంగ్లిష్ నుంచి కాంపొజిషన్, టెన్సెస్, సినానిమ్స్, ఆంటోనిమ్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
  • 9వ తరగతికి సంబంధించి మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, సైన్స్, హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీల నుంచి ప్రశ్నలుంటాయి
కటాఫ్ మార్కులు :
ఈ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 25శాతం మార్కులను సాధించాలి. అలాగే అన్ని సబ్జెక్టులు కలిపి కనీసం 40శాతం మార్కులు స్కోర్ చేయాలి. దీనిలో అర్హత సాధించిన వారికి మాత్రమే మెడికల్ టెస్ట్‌లు నిర్వహించి ఆయా తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

సీట్ల కేటాయింపు :
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న సైనిక స్కూళ్లలో స్థానిక విద్యార్థులకు 67 శాతం సీట్లు లోకల్ కోటా కింద కేటాయిస్తారు. మిగతా 33 శాతం సీట్లకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడవచ్చు. అదేవిధంగా ఎస్సీ-15శాతం, ఎస్టీ- 7.5శాతం.. అలాగే 25 శాతం సీట్లను సర్వీస్ మెన్/ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు కేటాయించారు.

పరీక్ష ఫీజు :
జనరల్/ఓబీసీ విద్యార్థులు రూ.550, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.400లను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

6వ తరగతి.. పరీక్షా విధానం:
ఆరోతరగతిలో ప్రవేశాల కోసం 125 ప్రశ్నలకుగాను మొత్తం 300 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు(150 నిమిషాలు).
సబ్జెక్ట్ ప్రశ్నలు,మార్కులు మొత్తం మార్కులు పరీక్షామయం(నిమిషాల్లో)
మ్యాథ్స్ 50x3 150 60
జనరల్ నాలెడ్జ్ 25x2 50 30
లాంగ్వేజ్ 25x2 50 30
ఇంటెలిజెన్స్ 25x2 50 30
మొత్తం 125 ప్రశ్నలు 300 150

9వ తరగతి.. పరీక్షా విధానం :
తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు 150 ప్రశ్నలకు గాను మొత్తం 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు.
సబ్జెక్ట్ {పశ్నలు,మార్కులు మొత్తం మార్కులు పరీక్షామయం(నిమిషాల్లో)
మ్యాథ్స్ 50 x4 200 60
ఇంగ్లిష్ 25x2 50 30
ఇంటెలిజెన్స్ 25x2 50 30
జనరల్ సైన్స్ 25x2 50 30
సోషల్ స్టడీస్ 25x2 50 30
మొత్తం 150 ప్రశ్నలు 400 మార్కులు 180 నిమిషాలు

ముఖ్యమైన సమాచారం:
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తులకు చివరి తేదీ : 19.11.2020
 ఎడిట్ ఆప్షన్ : 23-29 నవంబర్ 2020
 అడ్మిట్ కార్డ్ : 23.12.2020
 పరీక్ష తేది : 10.01.2021
 మెరిట్ లిస్ట్ : జనవరి చివరి వారం
 ఫైనల్ మెరిట్ లిస్ట్ : మార్చి మూడో వారం
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://aissee.nta.nic.in/
Published date : 31 Oct 2020 01:14PM

Photo Stories