రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. 10/10 జీపీఏ సాధించండిలా!
అంతేకాకుండా ఆయా సబ్జెక్ట్‌లలో వచ్చిన మార్కుల ఆధారంగానే.. ఉన్నత విద్యలో ఏ కోర్సులు ఎంచుకోవచ్చు అనేదానిపై ఒక అంచనాకు వస్తుంటారు. ఇంతటి కీలకమైన పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి.. ఈ ఏడాది(2021) తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ షెడ్యూల్ ఖరారైంది. కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాస్‌లు,సిలబస్ కుదింపునకు అనుగుణంగా పరీక్షల విధానంలో పలు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షల నూతన విధానం.. 10/10 జీపీఏ సాధించేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం..
మే 17, జూన్ 7 నుంచి పరీక్షలు
రెండు రాష్ట్రాల బోర్డ్‌లు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం -ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 7వ తేదీ నుంచి, తెలంగాణలో మే 17వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు.. అన్ని సబ్జెక్ట్‌లలోనూ కుదించిన సిలబస్‌ను సమగ్రంగా అవగాహన చేసుకొని.. పరీక్ష విధానం, అడగనున్న ప్రశ్నల శైలిపై స్పష్టత పెంచుకొని.. నిర్దిష్ట ప్రణాళికతో చదివితే 10/10 జీపీఏ సాధించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
ఏపీలో ఏడు, తెలంగాణలో ఆరు పేపర్లు...
పదో తరగతి వార్షిక పరీక్షల విషయంలో ఈ సంవత్సరం అత్యంత ప్రధానమైన మార్పు.. పరీక్ష పేపర్ల సంఖ్యను తగ్గించడం. గతేడాది కాలంగా నెలకొన్న కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. రెండు రాష్ట్రాల ఎస్‌ఎస్‌సీ బోర్డ్‌లు పేపర్ల సంఖ్యను తగ్గించాయి. తెలంగాణలో ఆరు పేపర్లలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఏడు పేపర్లలో పరీక్షలు జరగనున్నాయి. వాస్తవానికి పదోతరగతిలో హిందీ మినహా మిగతా అన్ని సబ్జెక్ట్‌లోనూ పేపర్-1, పేపర్-2 పేరుతో ఒక్కో పేపర్‌కు 50 మార్కులు చొప్పున మొత్తం 11 పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారని తెలిసిందే. ఈ ఏడాది మాత్రం పేపర్-1, పేపర్-2 రెండింటినీ కలిపేసి ఒకే పేపర్‌గా ప్రతి సబ్జెక్ట్‌లోనూ వంద మార్కులకు పరీక్షలు జరపనున్నారు. ఏపీలో.. సైన్స్ సబ్జెక్ట్‌లో మాత్రం రెండు పేపర్లలో పరీక్ష ఉంటుంది. ఫిజికల్ సెన్సైస్‌ను సైన్స్ పేపర్-1గా 50మార్కులకు; బయలాజికల్ సెన్సైస్ (ఎన్‌ఎస్)ను పేపర్-2గా 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఇంటర్నల్స్‌కు 20 మార్కులు కేటాయిస్తారు. అయితే మూల్యాంకన సమయంలో మొత్తం వంద మార్కులకు విద్యార్థి సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఫలితాలు ప్రకటించనున్నారు.
పరీక్షల స్వరూపం..
- తెలంగాణలో పదో తరగతి పరీక్షల స్వరూపం: ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్‌కు, 80 మార్కులకు రాత పరీక్ష జరుగుతుంది. ఈ రాత పరీక్షలో 20 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు; 60 మార్కులకు స్వల్ప, అతిస్వల్ప, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో 50 శాతం ఛాయిస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
- ఏపీ పదో తరగతి పరీక్షల స్వరూపం: మొత్తం వంద మార్కులకు రాత పరీక్ష జరుగుతుంది. ఇందులో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు 12-12 మార్కులకు; అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 8-16 మార్కులకు; స్వల్ప సమాధాన ప్రశ్నలు 8-32 మార్కులకు; వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 5-40 మార్కులకు ఉంటాయి.
- పశ్న పత్రాల స్వరూపాన్ని పరిశీలిస్తే.. విద్యార్థులు ఒత్తిడికి, ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాసేలా ప్రశ్నల సంఖ్యను పెంచడం, చాయిస్ ఉండేలా చూడటం వంటి చర్యలు తీసుకున్నారని సబ్జెక్ట్ టీచర్లు చెబుతున్నారు.
ఏపీ పదో తరగతి .. వార్షిక పరీక్షలు(2021) తేదీలు
- జూన్ 7- తెలుగు (ఫస్ట్ లాంగ్వేజ్)
- జూన్ 8 - సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
- జూన్ 9 - ఇంగ్లిష్
- జూన్ 10- మ్యాథమెటిక్స్
- జూన్ 11- భౌతిక శాస్త్రం
- జూన్ 12 - జీవశాస్త్రం
- జూన్ 14 - సాంఘిక శాస్త్రం.
టీఎస్ పదో తరగతి.. వార్షిక పరీక్షలు(2021) తేదీలు
- మే 17 - తెలుగు
- మే 18 - హిందీ
- మే 19 - ఇంగ్లిష్
- మే 20 - మ్యాథమెటిక్స్
- మే 21 - జనరల్ సైన్స్
- మే 22- సోషల్ స్టడీస్
ఇంకా చదవండి: part 2: పదో తరగతిలో తెలుగులో మంచి స్కోరు సాధించే మార్గాలివే..