Skip to main content

పరిశోధనలకు ప్రోత్సాహం...ఇంప్రెస్, స్పార్క్ పథకాలు

పరిశోధనలు చేయడమే మీ జీవిత లక్ష్యమా... మీ పరిశోధనలతో.. సామాజిక ప్రగతిని ‘ఇంప్రెస్’ చేయాలనుకుంటున్నారా? శాస్త్రసాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలతో మెరుపులు మెరిపించే ‘స్పార్క్’ మీలో ఉందని భావిస్తున్నారా..!?
ఈ ప్రశ్నలకు.. సమాధానం.. ‘అవును’ అయితే.. మిమ్మల్ని ప్రోత్సహించి.. సరికొత్త ఆవిష్కరణల దిశగా నడిపిస్తూ.. ఆర్థిక చేయూత అందిస్తూ.. వెన్నుదన్నుగా నిలిచేందుకు సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అవే.. ఇంప్రెస్ (ఇంపాక్ట్‌ఫుల్ పాలసీ రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్స్); స్పార్క్(స్కీమ్ ఫర్ ప్రొమోషన్ ఆఫ్ అకడెమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్)!! వీటి వివరాలు...

దేశంలో ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయిలో పరిశోధనలు పెరిగేలా చేసి.. వాటిద్వారా సామాజిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేసేలా.. ఔత్సాహికులను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజాగా ఇంప్రెస్, స్పార్క్ పథకాలను ప్రారంభించింది!!

సామాజిక రంగ ఆవిష్కరణలకు.. ‘ఇంప్రెస్’ :
ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం.. సామాజిక ప్రగతికి సంబంధించిన విభాగాల్లో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం.. అందుకోసం యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయిలో పీహెచ్‌డీ చేస్తున్న వారికి ఆర్థిక చేయూతనివ్వడం. పాలిటీ, ఎకానమీ, సొసైటీ, కల్చర్, మీడియా, గవర్నెన్స్, హెల్త్, ఎన్విరాన్‌మెంట్, టెక్నాలజీ, లా తదితర రంగాలపై చెప్పుకోదగ్గ మార్పు కనిపించేలా పరిశోధనలు కొనసాగాలని కేంద్రం భావిస్తోంది. రీసెర్చ్ ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం ప్రాథమికంగా రూ.414 కోట్లు కేటాయించింది.

ఇంప్రెస్ స్కీమ్.. లక్షిత రంగాలు
ఇంప్రెస్ స్కీమ్ పరిధిలో నిర్దిష్టంగా కొన్ని రంగాలను లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. అవి.. - స్టేట్ అండ్ డెమొక్రసీ - అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్ - మీడియా, కల్చర్ అండ్ సొసైటీ - ఎంప్లాయ్‌మెంట్ స్కిల్స్ అండ్ రూరల్ ట్రాన్స్‌ఫార్మేషన్ - గవర్నెన్స్, ఇన్నోవేషన్ అండ్ పబ్లిక్ పాలసీ - గ్రోత్, మాక్రో ట్రేడ్ అండ్ ఎకనామిక్ పాలసీ - అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ - హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్ - సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ - సోషల్ మీడియా అండ్ టెక్నాలజీ - పాలిటిక్స్, లా అండ్ ఎకనామిక్స్.

ఐసీఎస్‌ఎస్‌ఆర్‌కి పర్యవేక్షణ బాధ్యత :
ఇంప్రెస్ పర్యవేక్షణ బాధ్యతను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్(ఐసీఎస్‌ఎస్‌ఆర్)కు అప్పగించారు. దరఖాస్తు దారులు తమ ప్రతిపాదనలను ఐసీఎస్‌ఎస్‌ఆర్‌కే పంపించాలి.

అర్హతలు..
  • ఇంప్రెస్ పథక ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవడానికి దేశంలో.. యూజీసీ గుర్తింపు ఉన్న అన్ని యూనివర్సిటీలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు నిర్దిష్టంగా కొన్ని అర్హత ప్రమాణాలను ఎంహెచ్‌ఆర్‌డీ నిర్దేశించింది. వీటి ప్రకారం ఏదైనా ఒక విభాగానికి సంబంధించి పరిశోధన ప్రతిపాదన పంపాలంటే సదరు విభాగానికి ప్రాజెక్టు డెరైక్టర్ తప్పనిసరిగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగిగా విధులు నిర్వహిస్తుండాలి. అంతేకాకుండా పీహెచ్‌డీ పూర్తిచేసుండాలి. దాంతోపాటు పరిశోధనలపై చక్కటి ఆసక్తి, ప్రతిభ కలిగుండాలి. ప్రాజెక్‌్రకు సంబంధించి కో-డెరైక్టర్లు కూడా ఉండొచ్చు.
  • వ్యక్తిగతంగానూ పీహెచ్‌డీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఒక్కో పీహెచ్‌డీ స్కాలర్ గరిష్టంగా రెండు ప్రాజెక్ట్ ప్రతిపాదనలు పంపొచ్చు. వీటిని ఐసీఎస్‌ఎస్‌ఆర్‌కు చెందిన నిపుణుల కమిటీ పరిశీలించి ఖరారు చేస్తుంది. ఒకవేళ రెండు ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే ఏదో ఒక ప్రాజెక్ట్‌నే అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. ఇన్‌స్టిట్యూట్‌ల కోణంలో ఈ విషయంలో ఎలాంటి పరిమితి లేదు. మౌలిక సదుపాయాలు, వనరుల పరంగా మెరుగ్గా ఉన్న ఇన్‌స్టిట్యూట్స్ ఎన్ని ప్రతిపాదనలనైనా పంపొచ్చు.

ఎంపిక ప్రక్రియ :

స్కాలర్స్, యూనివర్సిటీలు పంపించే ప్రాజెక్ట్ ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో అందజేయాలి. హార్డ్‌కాపీని కూడా ఐసీఎస్‌ఎస్‌ఆర్‌కు పంపాలి. దీంతోపాటు.. నిర్ణీత నమూనాలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు, డెరైక్టర్, కో-డెరైక్టర్, అంచనా వ్యయం వివరాలు తెలియజేయాలి. ఇలా వచ్చిన దరఖాస్తులను ఐసీఎస్‌ఎస్‌ఆర్ నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన వారు తమ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఐసీఎస్‌ఎస్‌ఆర్ కమిటీ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తుది జాబితాలో నిలిచిన ప్రాజెక్ట్‌లకు సంబంధించి నిర్ణీత కాల వ్యవధి విధానాన్ని కూడా ఎంహెచ్‌ఆర్‌డీ నిర్దేశించింది. కనిష్టంగా ఆరు నెలలు, గరిష్టంగా రెండేళ్లుగా ఈ వ్యవధిని పేర్కొంది.

ఆర్థిక చేయూత :
ఒక్కో ప్రాజెక్ట్‌కు.. దాని పరిధి, వ్యవధిని బట్టి ఆర్థిక చేయూత లభించనుంది. మైనర్ ప్రాజెక్ట్స్‌కు రూ.4.99 లక్షలు; మేజర్ ప్రాజెక్ట్స్‌కు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు లభిస్తాయి. అదే విధంగా భారీ స్థాయిలో నిర్వహించే ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ విషయంలో రూ.15 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఆర్థికంగా చేయూత లభించే అవకాశముంది.
సిబ్బందిని నియమించుకునే అవకాశం
  • ఇంప్రెస్ స్కీమ్‌కు ఎంపికైన ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేసుకునేలా అవసరమైన సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు కూడా ఉంది. అందుకోసం రీసెర్చ్ అసోసియేట్‌కు నెలకు రూ.25 వేల వేతనం, రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.20వేల వేతనం, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు నెలకు రూ.15వేల వేతనం అందించొచ్చు.
  • అదే విధంగా స్కాలర్స్, ఇన్‌స్టిట్యూట్స్, తమ ప్రాజెక్ట్‌కు అవసరమైన సెమినార్లు, కాన్ఫరెన్స్‌లను నిర్వహించుకునే వీలుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మరో ప్రతిపాదన పంపించాల్సి ఉంటుంది. వీటికి అనుమతి లభిస్తే సెమినార్ ప్రాధాన్యత, వేదిక ఆధారంగా నిధులు మంజూరవుతాయి.- నేషనల్ సెమినార్లు, వర్క్‌షాప్, కాన్ఫరెన్స్‌లకు రూ.5 లక్షల వరకు; ఇంటర్నేషనల్ సెమినార్లు, వర్క్‌షాప్, కాన్ఫరెన్స్‌లకు రూ.10 లక్షల వరకు; ఇతరులతో కలిసి సంయుక్తంగా నిర్వహించే సెమినార్లకు రూ.10లక్షల వరకు నిధులు మంజూరవుతాయి.
  • ఎంపికైన ప్రాజెక్ట్‌లు, ప్రతిపాదనలు... వాటికి సంబంధించి వాస్తవంగా జరుగుతున్న పరిశోధనలను ఐసీఎస్‌ఎస్‌ఆర్ నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం ఐసీఎస్‌ఎస్‌ఆర్‌కు చెందిన నిపుణుల కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
ఇంప్రెస్ స్కీమ్‌కు ఔత్సాహిక ఇన్‌స్టిట్యూట్‌లు, స్కాలర్స్ నవంబర్ 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

'ఇంప్రెస్' ముఖ్యాంశాలు..
  • 2021, మార్చి 31 వరకు పథకం అమలు.
  • 1500 ప్రాజెక్ట్‌లు పూర్తిచేయాలని లక్ష్యం
  • కనిష్టంగా ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు ప్రాజెక్ట్ వ్యవధి
  • ప్రాజెక్ట్‌ను బట్టి కనిష్టంగా రూ.4.99 లక్షలు, గరిష్టంగా రూ.50 లక్షల వరకు ఆర్థిక చేయూత.
  • మొత్తం 11 రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలే లక్ష్యం.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.impress-icssr.res.in/impress

స్కార్క్..
విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లతో జాయింట్ రీసెర్చ్!
పరిశోధనలు, ఆవిష్కరణల పరంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అందిప్చుకునే దిశగా.. ప్రముఖ విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లతో జాయింట్ రీసెర్చ్ కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మరో పథకం.. స్పార్క్ (స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడెమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్).

పర్యవేక్షణ.. ఐఐటీ-ఖరగ్‌పూర్
స్పార్క్ పథకం అమలుకు ఐఐటీ-ఖరగ్‌పూర్‌ను పర్యవేక్షక ఇన్‌స్టిట్యూట్‌గా ఎంహెచ్‌ఆర్‌డీ నియమించింది. ఈ పథకానికి రూ.418 కోట్లు కేటాయించడం విశేషం. 2020 మార్చి నెలాఖరుకు ఆరు వందల ప్రాజెక్ట్‌లను జాయింట్ రీసెర్చ్ విధానంలో పూర్తిచేయాలని లక్ష్యంగా పేర్కొంది.

ఐదు విభాగాలు.. 32 అంశాలు
స్కార్క్ స్కీమ్ ప్రకారం- విదేశీ ఇన్‌స్టిట్యూట్‌ల భాగస్వామ్యంతో ప్రధానంగా అయిదు విభాగాల్లో 32 అంశాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
విభాగాలు: ఫండమెంటల్ రీసెర్చ్, ఎమర్జెంట్ ఏరియాస్ ఆఫ్ ఇంపాక్ట్, కన్వర్జెన్స్, యాక్షన్ ఓరియెంటెడ్ రీసెర్చ్, ఇన్నోవేషన్ డ్రివెన్ రీసెర్చ్.

టాప్ 100 ఇన్‌స్టిట్యూట్‌లకే :
స్పార్క్ స్కీమ్ ప్రకారం విదేశీ యూనివర్సిటీలతో కలిసి జాయింట్ యాక్టివిటీస్‌లో పాల్గొనే క్రమంలో ఇన్‌స్టిట్యూట్‌లను నిర్ణయించడంలో నిర్దిష్ట అర్హత నిబంధనలను రూపొందించడం జరిగింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్)లో మొత్తంమీద లేదా విభాగాల వారీగా టాప్-100లో నిలిచిన భారత ఇన్‌స్టిట్యూట్‌లు దరఖాస్తు చేసుకోవచ్చు.

క్యూఎస్ టాప్-500 :
ఆయా దేశాల్లో జాయింట్ ప్రోగ్రామ్‌కు అర్హత కలిగిన ఇన్‌స్టిట్యూట్‌ల విషయంలోనూ నిర్దిష్ట నిబంధనలను ఎంహెచ్‌ఆర్‌డీ రూపొందించింది. ఒప్పందం చేసుకుంటున్న సదరు ఇన్‌స్టిట్యూట్‌లు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో టాప్-500 జాబితాలో; సబ్జెక్ట్ వైజ్‌గా టాప్-200 ఇన్‌స్టిట్యూట్స్ జాబితాలో స్థానం పొంది ఉండాలి. అలాంటి విదేశీ ఇన్‌స్టిట్యూట్స్‌తో మాత్రమే ఒప్పందం చేసుకోవాలి. ఇలా ఒప్పందం చేసుకున్న ఇన్‌స్టిట్యూట్‌లతో కలిసి జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న సమస్యల పరిష్కారం దిశగా పరిశోధనలు చేయాలి.

నోడల్ ఇన్‌స్టిట్యూట్స్ :
  • అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 28 దేశాల్లోని టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌తో కలిసి జాయింట్ రీసెర్చ్ చేసే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. వీటిని పర్య వేక్షించేందుకు ఒక్కో దేశానికి నోడల్ ఇన్‌స్టిట్యూట్‌లుగా భారత్‌లోని విద్యాసం స్థలు వ్యవహరించనున్నాయి. ఉదాహరణకు 28 దేశాల జాబితాలో ఉన్న ఆస్ట్రేలియాలోని ఇన్‌స్టిట్యూట్‌లతో మన దేశంలోని ఐఐటీ ఖరగ్‌పూర్ పర్యవేక్షించ నుంది. అదే విధంగా జపాన్‌లోని యూనివర్సిటీలతో జాయింట్ యాక్టివిటీస్‌ను ఐఐటీ హైదరాబాద్ నోడల్ ఇన్‌స్టిట్యూట్‌గా వ్యవహరించనుంది.
  • స్పార్క్ స్కీమ్ ప్రకారం-అనుమతి పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు తప్పనిసరిగా అంతర్గతంగా స్పార్క్ కమిటీ పేరుతో ప్రొఫెసర్ల బృందాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధిత ప్రాజెక్ట్.. దానికి సంబంధించిన సబ్జెక్ట్ హెచ్‌ఓడీ నేతృత్వం వహించాల్సి ఉంటుంది.
25 ప్రాజెక్ట్‌లకు అనుమతి :
ఒక్కో ఇన్‌స్టిట్యూట్ గరిష్టంగా 25 ప్రాజెక్ట్స్‌ను సమర్పించొచ్చు. అదే విధంగా మన దేశంలోని ఒక్కో ఇన్‌స్టిట్యూట్‌కు ఒక దేశం నుంచి పది కంటే ఎక్కువ విద్యాసంస్థలతో జాయింట్ ప్రాజెక్ట్స్ చేసేందుకు వీలు లేదు. ఆ తర్వాత దశలో ప్రాజెక్ట్ ప్రతిపాదనలను ఎంపిక కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయాన్ని అపెక్స్ కమిటీకి సిఫార్సు చేస్తుంది.

ఆర్థిక ప్రోత్సాహకాలు..
జాయింట్ రీసెర్చ్‌లో భాగంగా భారీస్థాయిలో ఆర్థిక ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌లకు మూడు విభాగాలుగా పేర్కొని.. ఆయా కేటగిరీని అనుసరించి రూ.50 లక్షలు, రూ.50 లక్షలు-రూ.75 లక్షలు; రూ.75 లక్షలు-రూ.కోటి వరకు కేటాయించనున్నారు. విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన ఫ్యాకల్టీ భారత్‌లో ఒప్పందం చేసుకున్న విద్యాసంస్థకు వచ్చి ఎక్కువ రోజులు ఉంటే అధిక పారితోషికం లభించనుంది. విదేశీ ఫ్యాకల్టీ నాలుగు నెలలు ఉంటే మొదటి నెల 15 వేల డాలర్లు; ఆ తర్వాత మూడు నెలలు పది వేల డాలర్లు చెల్లించనున్నారు.

మన విద్యార్థులకూ చేయూత :
జాయింట్ కొలాబరేషన్‌లో భాగంగా విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లకు వెళ్లే మన దేశానికి చెందిన పీహెచ్‌డీ విద్యార్థులకు సైతం ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు లభించనున్నాయి. రెండు వేల డాలర్ల ప్రయాణ ఖర్చులు, పాకెట్ మనీతోపాటు నెలకు పది వేల డాలర్లు నిధులు లభించనున్నాయి. అంతేకాకుండా గరిష్టంగా రెండు వర్క్‌షాప్‌లు నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది. ఒక్కో వర్క్‌షాప్ నిర్వహణకు రూ.3లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నారు. వీటితోపాటు నిర్దేశిత ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అవసరమైన ఇతర వ్యయాలు కూడా చెల్లిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :
ఔత్సాహిక, అర్హత కలిగిన ఇన్‌స్టిట్యూట్‌లు స్పార్క్ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ప్రాజెక్ట్ వివరాలు, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ వివరాలు తెలియజేయాలి. నవంబర్ 15లోపు ఈ ప్రక్రియ పూర్తిచేయాలి.

ముఖ్య విధి విధానాలు :
  • స్పార్క్ స్కీమ్ ద్వారా విదేశీ యూనివర్సిటీలతో కలిసి జాయింట్ రీసెర్చ్, అకడమిక్ కొలాబరేషన్ చేయాలనుకుంటున్న ఇన్‌స్టిట్యూట్‌లు, ఒక్కో ప్రాజెక్ట్ పరంగా ఉండాల్సిన అభ్యర్థులు, ఫ్యాకల్టీ విషయంలో ఎంహెచ్‌ఆర్‌డీ నిర్దిష్ట విధి విధానాలు రూపొందించింది.
  • ఒక్కో ప్రాజెక్ట్‌కు సంబంధించి.. కనీసం ఇద్దరు విదేశీ ఫ్యాకల్టీ సభ్యులు, మరో ఇద్దరు మన దేశంలోని యూనివర్సిటీ ఫ్యాకల్టీ సభ్యులు ఉండాలి. ప్రతి ప్రాజెక్ట్‌లో ఇద్దరు విదేశీ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ లేదా పోస్ట్ డాక్టోరల్ అభ్యర్థులు, మరో ఇద్దరు భారత పీహెచ్‌డీ లేదా పోస్ట్ డాక్టోరల్ సభ్యులు ఉండటం తప్పనిసరి.
  • సదరు ప్రాజెక్ట్ నిర్వహణ పరంగా ఇరువైపుల ఒక లీడ్ ఇన్‌స్టిట్యూట్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, కో-ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ కూడా ఉండాలి.
ప్రాజెక్ట్‌కు ఆమోదం ఇలా..
స్పార్క్ స్కీమ్ ప్రకారం- ఒక ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపే క్రమంలో నిర్ణీత పద్ధతిని రూపొందించారు.
  • భారత్‌లోని ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఫ్యాకల్టీ(ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్), ఒప్పందం కుదుర్చుకున్న విదేశీ యూనివర్సిటీకి చెందిన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌తో కలిసి ప్రాజెక్ట్ ప్రతిపాదన రూపొందించాలి. దీన్ని తర్వాత దశలో భారత్‌లోని సదరు ఇన్‌స్టిట్యూట్ అంతర్గతంగా సమీక్షించాలి. ఆ తర్వాత స్పార్క్ పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. దీంతోపాటు విదేశీ యూనివర్సిటీకి చెందిన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఆమోదం కూడా తప్పనిసరి. తర్వాత దశలో ఇన్‌స్టిట్యూట్ కో-ఆర్డినేటర్ అనుమతి ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసిన వాటిని నిపుణుల కమిటీ పరిశీలించి సదరు ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చే విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుంది.
ముఖ్యాంశాలు..
  • అమెరికా సహా మొత్తం 28 దేశాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందం చేసుకునే అవకాశం.
  • విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-500; భారత ఇన్‌స్టిట్యూట్‌లు ఎన్‌ఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్-100లో నిలవడం తప్పనిసరి.
  • ఇన్‌స్టిట్యూట్‌లకు మూడు కేటగిరీలుగా బడ్జెట్ కేటాయింపు.
  • కనిష్టంగా రూ. 50 లక్షలు; గరిష్టంగా రూ. కోటి.
  • 2020 మార్చి నెలాఖరుకు 600 జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ పూర్తి చేయడం టార్గెట్.
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 15, 2018.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://sparc.iitkgp.ac.in
Published date : 15 Nov 2018 04:30PM

Photo Stories