Skip to main content

పీఎంఆర్‌ఎఫ్‌–2019 ఎంపికైతే...నెలకు రూ.70వేలపైగానే ఫెలోషిప్‌

ప్రజ్ఞావంతులైన విద్యార్థులను జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్స్‌లో పరిశోధనల దిశగా ప్రోత్సహించేందుకు ప్రైమ్‌ మినిస్టర్స్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(పీఎంఆర్‌ఎఫ్‌) స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పీఎంఆర్‌ఎఫ్‌ ఫెలోషిప్‌కు ఎంపికై పీహెచ్‌డీలో చేరిన అభ్యర్థులకు ఐదేళ్లపాటు అత్యున్నత పరిశోధనా వసతులతోపాటు భారీగా ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. నెలకు రూ.70వేలకుపైగానే ఫెలోషిప్‌ అందుతుంది. తాజాగా పీఎంఆర్‌ఎఫ్‌ డిసెంబర్‌ 2019కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. పీఎంఆర్‌ఎఫ్‌ ఫెలోషిప్‌ ప్రత్యేకతలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియపై ప్రత్యేక కథనం..
పీఎంఆర్‌ఎఫ్‌ ఫెలోషిప్‌ స్కీమ్‌ కింద ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ), బెంగళూరు; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌)లు; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)లు; నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో టాప్‌100లో చోటు దక్కించుకున్న సెంట్రల్‌ వర్సిటీల్లో జాతీయ ప్రాధాన్యాంశాలకు అనుగుణంగా కటింగ్‌ ఎడ్జ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డొమైన్స్‌లో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశంతోపాటు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తారు.

ఫెలోషిప్‌ :
పీఎంఆర్‌ఎఫ్‌కు ఎంపికై నిర్దేశిత ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీలో చేరిన అభ్యర్థులకు∙మొదటి రెండేళ్లు నెలకు రూ.70,000, మూడో సంవత్సరం నెలకు రూ.75,000, నాలుగు, ఐదు సంవత్సరాల్లో నెలకు రూ.80,000 చొప్పున ఫెలోషిప్‌ లభిస్తుంది. దీంతోపాటు అకడెమిక్‌ కంటింజెన్సీ ఖర్చులు, దేశ, విదేశీ పర్యటనల ప్రయాణ ఖర్చుల కోసం ఐదు సంవత్సరాలపాటు ఏటా రెండు లక్షల రూపాయలు రీసెర్చ్‌ గ్రాంట్‌ మంజూరు చేస్తారు. అంటే... ఐదేళ్ల కాలానికి మొత్తం రూ.13లక్షల 75వేల ఆర్థిక సాయం పొందే అవకాశం పీఎంఆర్‌ఎఫ్‌ ఫెలోషిప్‌ ద్వారా లభిస్తుంది.

అర్హతలు..
  • ఐఐఎస్సీ, ఐఐటీలు, ఐఐఎస్‌ఆర్‌లు (ఐసర్‌), ఎన్‌ఐటీలు (నిట్‌), కేంద్ర నిధులతో ఏర్పాటు చేసిన ఐఐఐటీల నుంచి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్ట్రీముల్లో నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ/ఐదేళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌–పోస్టుగ్రాడ్యుయేట్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సులు పూర్తి చేసినవారు, ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులు పీఎంఆర్‌ఎఫ్‌ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దీంతోపాటు అర్హత పరీక్ష కోర్సులో అభ్యర్థి సీజీపీఏ/సీపీఐ 8(10 పాయింట్లకు) పాయింట్లకు తగ్గరాదు. ఐదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ కోర్సుల అభ్యర్థులు యూజీ, పీజీ పార్ట్‌లకు వేర్వేరు సీజీపీఏ/సీపీఐలు కలిగుంటే.. పీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించి యూజీలో పొందిన సీజీపీఏను పరిగణలోకి తీసుకుంటారు.
  • (లేదా) ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌/యూనివర్సిటీ నుంచి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల్లో నాలుగేళ్ల డిగ్రీ /ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ/రెండేళ్ల ఎంఎస్సీ/ఐదేళ్ల యూజీ–పీజీ డుయల్‌ డిగ్రీ కోర్సు పూర్తిచేసుండాలి. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు సీజీపీఏ/సీపీఐ కనీసం 8(10 పాయింట్ల స్కేల్‌) పాయింట్లు పొందడంతోపాటు సంబంధిత సబ్జెక్టులో గేట్‌లో 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌ సాధించాలి.
  • దరఖాస్తు చేసుకుంటున్న సంవత్సరం నుంచి వెనక్కు మూడేళ్ల వ్యవధిలో మాత్రమే∙సంబంధిత అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :
  • సెలక్షన్‌ కమిటీ రాత పరీక్ష/ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. రాత పరీక్ష సిలబస్‌ను నోడల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్ణయిస్తుంది.
  • పీఎంఆర్‌ఎఫ్‌ ఫెలోషిప్‌ ఎంపిక ప్రక్రియలో అభ్యర్థి సామర్థ్యాలను క్షుణ్నంగా పరీక్షిస్తారు. ప్రతి విభాగంలోనూ సమీక్షకులు అభ్యర్థులను వడపోస్తారు. అనంతరం ఆయా విభాగాల (బ్రాడ్‌ స్ట్రీమ్‌) ఎంపిక కమిటీలు అభ్యర్థుల్లోని నైపుణ్యాలు, పోటీతత్వాలను పరిశీలిస్తాయి. రిటెన్‌ టెస్టు, ఇంటర్వ్యూల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని పీఎంఆర్‌ఎఫ్‌కు ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు పేర్కొన్న ఛాయిస్, అకడెమిక్స్, మౌలిక సౌకర్యాల అందుబాటు తదితరాలను పరిగణలోకి తీసుకొని.. హోస్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకదాన్ని అభ్యర్థికి కేటాయిస్తారు.

సమీక్ష :
  • ఫెలోషిప్‌ పొందిన అభ్యర్థికి ఇన్‌స్టిట్యూట్‌లో చేరే సమయంలోనే ఏటా సాధించాల్సిన∙లక్ష్యాల గురించి వివరిస్తారు. ఆయా లక్ష్యాలను సంబంధిత డిపార్ట్‌మెంట్‌లు నిర్దేశిస్తాయి.
  • హోస్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏటా ఫెలోషిప్‌ పొందిన అభ్యర్థుల పనితీరును సమీక్షిస్తుంది. సమీక్షలో అభ్యర్థి పనితీరు సంతృప్తికరంగా ఉన్నప్పుడే రెండో సంవత్సరానికి ఫెలోషిప్‌ను పొడిగిస్తారు.
  • మంచి ప్రదర్శన కనబరచని అభ్యర్థుల ఫెలోషిప్‌ను ఇన్‌స్టిట్యూషనల్‌ స్థాయికి తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం చేస్తారు.

2019 డిసెంబర్‌కు పోస్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌..
పీఎంఆర్‌ఎఫ్‌ ఫెలోషిప్‌ ద్వారా పోస్ట్‌ డాక్టోరల్‌ స్టడీస్‌ను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు...
1. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ
2. అస్సాం యూనివర్సిటీ
3. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ
4. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పంజాబ్‌
5. ఐఐఎస్సీ బెంగళూరు
6. ఐసర్‌ బెర్హంపూర్‌
7. ఐసర్‌ భోపాల్‌
8. ఐసర్‌ కోల్‌కతా
9. ఐసర్‌ మెహలీ
10. ఐసర్‌ పుణె
11. ఐసర్‌ తిరువనంతపురం
12. ఐసర్‌ తిరుపతి
13. ఐఐటీ భిలాయ్‌
14. ఐఐటీ బీహెచ్‌యూ
15. ఐఐటీ భువనేశ్వర్‌
16. ఐఐటీ బాంబే
17. ఐఐటీ ఢిల్లీ
18. ఐఐటీ ధార్వాడ్‌
19. ఐఐటీ (ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌
20. ఐఐటీ గాంధీనగర్‌
21. ఐఐటీ గోవా
22. ఐఐటీ గువహతి
23. ఐఐటీ హైదరాబాద్‌
24. ఐఐటీ ఇండోర్‌
25. ఐఐటీ జోద్‌పూర్‌
26. ఐఐటీ కాన్పూర్‌
27. ఐఐటీ ఖరగ్‌పూర్‌
28. ఐఐటీ మద్రాస్‌
29. ఐఐటీ మండి
30. ఐఐటీ పాట్నా
31. ఐఐటీ రూర్కీ
32. ఐఐటీ రోపార్‌
33. ఐఐటీ జమ్మూ
34. ఐఐటీ పాలక్కడ్‌
35. ఐఐటీ తిరుపతి
36. జామియా మిలియా ఇస్లామియా(సెంట్రల్‌ వర్సిటీ)
37. జవహర్‌లాల్‌ నెహ్రూ వర్సిటీ
38. మిజోరామ్‌ యూనివర్సిటీ
39. నార్త్‌ ఈస్ట్రన్‌ హిల్‌ యూనివర్సిటీ
40. పాండిచ్చేరి యూనివర్సిటీ
41. రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ
42. తేజ్‌పూర్‌ యూనివర్సిటీ
43. యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ
44. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ » విశ్వభారతి (సెంట్రల్‌ వర్సిటీ).

మఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1500
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 15, 2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://dec2019.pmrf.in
Published date : 07 Oct 2019 03:48PM

Photo Stories