నీట్ సన్నద్ధతకు నిపుణుల సలహాలు.. ప్రిపరేషన్ టిప్స్ ఇవే..
మార్పులుంటాయా!
నీట్ పరీక్ష విధానంలో ఈ ఏడాది ఏమైనా మార్పులు ఉంటాయా? అనే సందేహం గత కొన్ని నెలలుగా విద్యార్థుల్లో నెలకొంది. కాని నీట్–2021లో ఎలాంటి మార్పులు లేకుండానే.. గతంలో మాదిరిగానే పరీక్ష జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే పరీక్ష ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లోనా..సిలబస్‌లో ఏమైనా తగ్గింపు ఉం టుందా.. అనే సందేహాలకు స్పష్టత లభించింది. పరీక్ష పెన్–పేపర్(ఆఫ్‌లైన్) విధానంలోనే జరుగుతుంది. సిలబస్ కూడా గత సంవత్సరం మాదిరిగానే ఉంటుందని.. మార్పులుచేర్పులు జరిగే అవకాశం లేదని దాదాపు ఖరారైంది.
ప్రాంతీయ భాషల్లో నిర్వహణ..
నీట్–2021ను ఇంగ్లిష్, హిందీతోపాటు పలు ప్రాంతీయ భాషల్లో సైతం నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం పదకొండు భాషల్లో పరీక్ష జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఇప్పటికే ప్రకటించింది. వీటిల్లో తెలుగు కూడా ఉంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచుకుంటే.. ఆ భాషలోనే పరీక్ష పేపర్‌ను అందిస్తారు.
180 ప్రశ్నలు–720 మార్కులు..
నీట్ పరీక్ష ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడు విభాగాల్లో 180 ప్రశ్నలకు ఆబ్జెక్టివ్(బహుళైచ్ఛిక ప్రశ్నలు) విధానంలో జరుగుతుంది. ఫిజిక్స్ 45 ప్రశ్నలు–180 మార్కులకు; కెమిస్ట్రీ 45 ప్రశ్నలు–180 మార్కులకు; బయాలజీ(బోటనీ, జువాలజీ) 90 ప్రశ్నలు–360 మార్కులకు ఉంటుంది. ఇలా మొత్తం 180 ప్రశ్నలు–720 మార్కులకు నీట్ పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కుల విధానం అమలవుతోంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
సమయ పాలన..
నీట్ విద్యార్థులు నిర్దిష్ట వ్యూహంతో, సమయ పాలన పాటిస్తూ.. ప్రిపరేషన్ కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జెక్ట్‌ల వారీగా ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలను గుర్తించి సన్నద్ధమవ్వాలంటున్నారు. విద్యార్థులు మొత్తం నాలుగు సబ్జెక్ట్‌ల(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ)కు ప్రతి రోజు నిర్దిష్టంగా సమయం కేటాయించుకోవాలి. ఆ సమయంలో అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ సాగించాలి. ఒకవేళ ఏదైనా ఒక సబ్జెక్ట్‌పై పరిపూర్ణ అవగాహన ఉందని భావిస్తే..దానికి కొంత తక్కువ సమయం కేటాయించాలి. క్లిష్టంగా ఉండే సబ్జెక్ట్‌కు కొంత ఎక్కువసేపు ప్రిపేర్ అవ్వాలి.
రివిజన్‌కే ప్రాధాన్యం..
నీట్ విద్యార్థులు ఇప్పటికే సిలబస్ అంశాలపై పూర్తి అవగాహన పొంది ఉంటారు. ఇక ఇప్పుడు రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మేలు. అలాగే ప్రాక్టీస్‌పైనా దృష్టిపెట్టాలి. దీనివల్ల పరీక్ష హాల్లో మెరుగైన ప్రతిభ చూపేందుకు దోహదపడుతుంది. ప్రిపరేషన్ సమయంలో క్లిష్టమైనవిగా భావించి వదిలేసిన అంశాలను.. ఇప్పుడు చదవాలనుకోవడం సరికాదు. ఒకవేళ సదరు అంశాలకు పరీక్షలో ప్రాధాన్యం ఉందని గుర్తిస్తే.. వాటి బేసిక్స్‌ను తెలుసుకుంటే సరిపోతుంది.
ప్రాక్టీస్, మోడల్ టెస్ట్‌లు..
ప్రస్తుత సమయంలో రివిజన్‌తోపాటు ప్రాక్టీస్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు కూడా హాజరుకావడం మంచిది. దీనివల్ల తమ ప్రతిభ స్థాయిని తెలుసుకునేందుకు, పొరపాట్లు విశ్లేషించుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా బలహీనంగా ఉన్న అంశాలపై పట్టు సాధించేందుకు వీలవుతుంది.
పరీక్షకు వారం ముందు..
పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా.. ఆయా సబ్జెక్ట్‌లలోని టాపిక్స్‌కు సంబంధించిన బేసిక్స్, కాన్సెప్ట్స్, ఫార్ములాలను అవలోకనం చేసుకునేందుకు కేటాయించుకోవాలి. అందుకోసం ప్రిపరేషన్ సమయంలో రాసుకున్న నోట్స్‌ను వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నీట్.. సక్సెస్ టిప్స్
సిలబస్, వెయిటేజీకి అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌కు టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి.
ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి.
ప్రస్తుతం ఎక్కువ సమయం రివిజన్ చేయడం మేలు.
మాక్ టెస్టులకు హాజరవడంతోపాటు మోడల్ కొశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి.
సబ్జెక్ట్ పరంగా బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
ఇన్ డైరెక్ట్ కొశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి.
ప్రిపరేషన్ సమయంలో రాసుకున్న షార్ట్ నోట్స్ రివిజన్‌కు ఉపయుక్తం.
నీట్–యూజీ (2021) ముఖ్య సమాచారం..
పరీక్ష తేదీ: ఆగస్ట్ 1, 2021న జరిగే అవకాశం.
పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్–పేపర్ విధానం).
అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 17ఏళ్ల నుంచి 25ఏళ్లు మధ్య ఉండాలి.
ఫిజిక్స్..
ఫిజిక్స్‌లో ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. గత రెండేళ్ల ప్రశ్నల సరళిని పరిగణనలోకి తీసుకొని.. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలి.
–ఎన్.నరసింహమూర్తి, సబ్జెక్ట్ నిపుణులు
కెమిస్ట్రీ..
జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్‌లు, బయోమాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్ కెమిస్ట్రీపై విద్యార్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలు, చర్యలు, సమీకరణాలను పునశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. మూలకాలు,వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో.. ఫార్ములాలతో సొంత నోట్స్ రాసుకోవాలి. పీరియాడిక్ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. రివిజన్ చేస్తూ మాదిరి ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్షకు కావాల్సిన సన్నద్ధత లభిస్తుంది.
– విజయ్ కిశోర్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు
బయాలజీ..
బయాలజీలో రాణించాలంటే.. ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్,సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్ పాఠ్యాంశాలు కూడా ముఖ్యమే. ప్లాంట్ ఫిజియాలజీలో.. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్‌పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్‌స్కిప్ష్రన్, ట్రాన్స్‌లేషన్, రెగ్యులేషన్‌లపై దృష్టిపెట్టాలి. నీట్‌లో ఉండి.. ఇంటర్ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి.
–బి.రాజేంద్ర, బోటని సబ్జెక్ట్ నిపుణులు
జువాలజీ..
జువాలజీలో హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రశ్న పత్రాలను, ఇంటర్‌లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. అంతేకాకుండా ఎన్‌సీఈఆర్‌టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఇలా చేస్తే ఆశించిన ర్యాంకు సొంతమవడం ఖాయం.
–కె.శ్రీనివాస్, జువాలజీ సబ్జెక్ట్ నిపుణులు