Skip to main content

నేటి విద్యా రంగంలో...డిజిటల్ విప్లవం

కొన్నేళ్ల క్రితం: తరగతి గది అంటే బ్లాక్ బోర్డ్, చాక్‌పీస్. టీచర్ పాఠం చెప్పాలంటే ఇవే సాధనాలు! బ్లాక్‌బోర్డ్‌పై ఒక పాఠ్యాంశం గురించి ఉపాధ్యాయులు చాక్‌పీస్‌తో రాస్తూ వివరిస్తుంటే.. దాన్ని విద్యార్థులు తమ నోట్‌బుక్స్‌లో రాసుకోవడం!
ప్రస్తుతం: బ్లాక్ బోర్డ్ క్రమేణా కనుమరుగవుతోంది. వీటి స్థానంలో స్మార్ట్‌బోర్డ్‌లు ప్రత్యక్షమవుతున్నాయి. టీచర్లు ఏ మాత్రం కష్టపడకుండా.. ఆడియో, వీడియో టూల్స్ ఆధారంగా బోధన సాగించే టెక్నాలజీ ఆవిష్కృతమవుతోంది. మరోవైపు విద్యార్థులు సైతం.. నోట్ పుస్తకాల బదులు ల్యాప్‌ట్యాప్‌లలో సంబంధిత లెక్చర్స్‌ను వినే సదుపాయం పెరుగుతోంది!
కారణం.. విద్యా రంగంలో విస్తరిస్తున్న డిజిటలైజేషన్!! టెక్నాలజీ అన్ని రంగాల్లో మాదిరిగానే.. ఇప్పుడు విద్యా రంగంలోనూ ప్రవేశించింది. సంప్రదాయ తరగతి గదుల స్థానంలో.. డిజిటల్ క్లాస్ రూమ్స్‌సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది..! ఈనేపథ్యంలో విద్యారంగంలో.. డిజిటల్ క్లాస్‌రూమ్స్‌తో ప్రయోజనాలు.. విద్యార్థులు, ఉపాధ్యాయులు.. డిజిటల్ టెక్నాలజీకి అనుగుణంగా పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాల గురించి తెలుసుకుందాం..

పెరుగుతున్న డిజిటల్ క్లాస్‌రూమ్స్ :
వాస్తవానికి విద్యా రంగంలో సాంకేతిక ధోరణుల పరంగా అయిదారేళ్ల క్రితం నుంచే ఈ-లెర్నింగ్ సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి మూక్స్(మాసివ్‌లీ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్) ఆరంభమని చెప్పొచ్చు. విద్యారంగంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) వినియోగంతో డిజిటిల్ క్లాస్‌రూమ్స్ విస్తృతి పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలు విస్తరించడం, బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాలు అందుతున్న నేపథ్యంలో ఐసీటీ టూల్స్‌ను వినియోగించి బోధన సాగించడం సులభమైంది. సంప్రదాయ తరగతిగదుల స్థానంలో డిజిటల్ క్లాస్‌రూమ్స్.. విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ ప్రయోజనకరంగా ఉండటంతో అంతా అటువైపు మొగ్గుతున్నారు.

ఉన్నత బోధన ఆస్వాదించేలా...
డిజిటల్ క్లాస్‌రూమ్స్ విధానంలో విద్యార్థులు నిష్ణాతులైన అధ్యాపకుల పాఠాలు వినేందుకు వీలుకలుగుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్, పీహెచ్‌పీ ప్రొజెక్టర్‌లు ఉంటే.. ఒక టాపిక్‌కు సంబంధించి నిష్ణాతులైన ప్రొఫెసర్ల బోధనను వినొచ్చు. తద్వారా కొత్త నైపుణ్యాలను తెలుసుకునే వీలుంటోంది. టెక్నాలజీ సాయంతో లైవ్ లెక్చర్స్, వర్చువల్ లెక్చర్స్ వంటి సదుపాయాలు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. మరోవైపు టీచర్లకు కూడా ఇవి ఉపయోగకరమే. అధ్యాపకులు కేవలం పుస్తకాల్లోని అంశాల బోధనకే పరిమితం కాకుండా.. ఆయా రంగంలో తాజా పరిణామాలను, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు అవకాశం లభిస్తోంది. విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందించే వీలు కలుగుతోంది.

ప్రభుత్వ, ప్రైవేటు.. అన్నిటా
డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఉన్నత స్థాయి విద్యా సంస్థలకు, ఆధునిక సదుపాయాలున్న ప్రైవేటు సంస్థలకే పరిమితం కాలేదు. ప్రైవేటు విద్యా సంస్థలతోపాటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనూ ఈ సదుపాయం క్రమేణా పెరుగుతోంది. ప్రభుత్వం సైతం ఎన్‌పీటీఈఎల్, స్వయం, ఆర్‌ఎంఎస్‌ఏ వంటి కార్యక్రమాల ద్వారా డిజిటల్ క్లాస్‌రూమ్స్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం ఇస్తోంది.

ప్రైమరీ టు ప్రొఫెషనల్ :
విద్యారంగంలో డిజిటల్ సంస్కృతి రెండు, మూడేళ్ల క్రితం వరకు ప్రొఫెషనల్ కోర్సులకే అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు పాఠశాలల్లోనూ డిజిటల్ క్లాస్‌రూమ్స్ బోధన పెరుగుతోంది. ప్రాథమిక విద్యలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లో ఈ సదుపాయం ఎక్కువ అని చెప్పొచ్చు. పలు సర్వేలు, నివేదికల ప్రకారం ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే నెలకొన్నాయి. వీటికి ఐసీటీ టూల్స్ పూర్తిగా అనుసంధానం కాలేదు. కానీ.. ప్రైవేటు స్కూల్స్.. విద్యారంగంలో పోటీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. విద్యార్థులను ఆకర్షించడానికి, బోధనలో ముందంజలో నిలవడానికి ఐసీటీ టూల్స్‌ను అందిపుచ్చుకుంటున్నాయి.

ఉన్నత విద్య.. విస్తృతంగా
విద్యా రంగంలో డిజిటల్ విప్లవం ఉన్నత విద్య స్థాయిలో మరింత విస్తృతంగా ఉందని పలు సర్వేలు, నివేదికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉన్నత విద్య స్థాయిలోని విద్యార్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉంటుంది. వీరికి స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఆన్‌లైన్ టూల్స్‌పై అవగాహన ఉంటుంది. దాంతో వీరికి డిజిటల్, ఈ-లెర్నింగ్ సాధనాలను సులువుగా అందిపుచ్చుకునే నైపుణ్యం లభిస్తుంది. ఫలితంగా ఉన్నత విద్య స్థాయిలో ప్రధానంగా ప్రొఫెషనల్ కోర్సుల్లో డిజిటల్ క్లాస్‌రూమ్ సంస్కృతి అధికంగా కనిపిస్తోంది. సదరు ఉన్నత విద్యా సంస్థలు తమ విద్యార్థులకు కొత్త నైపుణ్యాలు అందించాలనే ఉద్దేశంతో.. క్లాస్‌రూమ్స్‌లోనే మూక్స్, ఆన్‌లైన్ లెక్చర్స్, వర్చువల్ ల్యాబ్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి.

ఎడ్యుటెక్ స్టార్టప్స్ కూడా కారణమే..
డిజిటల్ క్లాస్‌రూమ్స్ విస్తరించడానికి ఎడ్యుటెక్ స్టార్టప్స్ కూడా మరో ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. ఆన్‌లైన్ విధానంలో లెర్నింగ్ సదుపాయాలు కల్పించే ఈ స్టార్టప్స్.. పాఠశాలలు, కళాశాలలతో ఒప్పందాలు చేసుకొని.. డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. తమ సాంకేతిక సాధనాల ఆధారంగా నేరుగా క్లాస్‌రూమ్స్‌లో విద్యార్థులతో అనుసంధానమయ్యేలా చర్యలు చేపడుతున్నాయి. బోధన పరంగానూ ఆన్‌లైన్‌లోనే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థుల్లో వీటిపై క్రమే ణా ఆసక్తి పెరుగుతోంది. దీన్ని గుర్తించిన విద్యా సంస్థలు సైతం వీటితో అవగాహనకు సిద్ధ మవుతున్నాయి.

‘డిజిటల్’పై అవగాహన :
ప్రస్తుతం డిజిటల్ క్లాస్‌రూమ్స్ విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో.. ఉపాధ్యాయులు కూడా సంబంధిత సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ఐసీటీ టూల్స్, కంప్యూటర్ వినియోగంపై అవగాహన వంటి బేసిక్ నైపుణ్యాలు తప్పనిసరి. ఉపాధ్యాయులు సైతం డిజిటల్ నైపుణ్యాలు సొంతం చేసుకున్నప్పుడే విద్యార్థులకు స్మార్ట్ టీచింగ్‌ను సమర్థంగా అందించగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్థాయి తరగతుల్లో ఇప్పుడు పలు ఎడ్యుటెక్ స్టార్టప్స్ ఆన్‌లైన్‌లోనే ఫన్ గేమ్స్, పజిల్స్ వంటి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ సాధనాలు కల్పిస్తున్నాయి. వీటిని ఉపాధ్యాయులు కూడా అందిపుచ్చుకుంటే.. విద్యార్థుల్లోనూ వీటిపై ఆసక్తి కలిగించగలరు. ఉదాహరణకు ఇటీవల మైక్రోసాఫ్ట్ సంస్థ.. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు, టీచర్లకు కంప్యూటర్ నైపుణ్యాలు పెంపొందించేలా ఇమేజిన్ అకాడమీ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వినియోగం, కంప్యూటర్ సైన్స్ వంటి అంశాల్లో నైపుణ్యం లభించేలా రూపొందించిన ఈ కరిక్యులం ఇటు టీచర్లకు, అటు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా నిలిచింది.

జేఎన్‌వీలే నిదర్శనం :
ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కారణంగా డిజిటల్ క్లాస్‌రూమ్స్, లెర్నింగ్ కొంత వెనుకంజలో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జవహర్ నవోదయ విద్యాలయాల్లో మాత్రం డిజిటల్ క్లాస్ రూమ్స్ విస్తృతి అధికంగా ఉంది. గత విద్యా సంవత్సరంలో దేశంలోని మొత్తం 500 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2.5 లక్షల మంది విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్ ద్వారా నైపుణ్యాలు సొంతం చేసుకున్నారు. వీరు కేవలం సబ్జెక్ట్ నైపుణ్యాలే కాకుండా.. టెక్నాలజీపైనా కూడా అవగాహన పెంచుకోవడం, మొబైల్ యాప్స్‌ను రూపొందిస్తుండటం విశేషం. ఇలాంటి విధానాన్నే రాష్ట్రాల్లోని పాఠశాలల్లోనూ అమల్లోకి తేవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అవగాహన పెరగాలి..
డిజిటల్ క్లాస్‌రూమ్స్ సంబంధిత టెక్నాలజీపై మరింత అవగాహన పెరగాలి. ప్రస్తుతం డిజిటల్ క్లాస్‌రూమ్స్ వినియోగం ఉన్నత విద్యలోనే ఎక్కువగా ఉంది. వీటిని ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు అందుబాటులోకి తెస్తే లెర్నింగ్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్నప్పటి నుంచే టెక్నాలజీ వినియోగంపైనా అవగాహన ఏర్పడుతుంది.
- బోరా శంకర్, సీఓఓ, ఏఈఓఎన్ లెర్నింగ్.
Published date : 31 Oct 2018 01:13PM

Photo Stories