Skip to main content

మల్టీ డిసిప్లినరీ విధానంతో అవకాశాల విస్తరణతో కొత్త ఉద్యోగాల సృష్టి..

న్యాయశాస్త్రం చదువుకున్న విద్యార్థి జూనియర్‌ లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయడం లేదా లా కంపెనీల్లో ఉద్యోగం చేసేందుకు అవకాశం ఉంటుంది.

 కానీ మల్టీ డిసిప్లినరీ విధ్యావిధానంలో లా విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న ఫొటోగ్రఫీని, సంగీతాన్ని కూడా ప్రత్యేక కోర్సులుగా చదవచ్చు. దీనివల్ల అతడు న్యాయ వ్యవస్థలో పనిచేయడంతో పాటు తనకు ఇష్టమైన ఫొటోగ్రఫీని ఎంజాయ్‌ చేయొచ్చు. లేదా తాను నేర్చుకున్న సంగీతంలో మ్యూజికల్‌ బ్యాండ్‌ లేదా వెడ్డింగ్‌ ఈవెంట్‌ కంపెనీ స్థాపించవచ్చు. అంటే.. తనకు ఒకేసారి విభిన్న కెరీర్‌ మార్గాలను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. సంప్రదాయ విద్యావిధానంలో ఇలాంటి అవకాశం ఉండదు. విద్యార్థి ఒక సబ్జెక్టులో ప్రావీణ్యం పొందినప్పటికీ.. వారికి ఆసక్తి ఉన్న ఇతర రంగాలలోకి ప్రవేశించడానికి మల్టీ డిసిప్లినరీ విధానంలో వీలుంటుంది.

కొత్త ఉద్యోగాల సృష్టి..
కొన్నేళ్ల క్రితం వరకు వివిధ ప్రాంతాల్లో ప్రయాణించడం ద్వారా ఆదాయం పొందవచ్చని ఎవరైనా ఊహించారా? నిత్యం మనం ఇంట్లో వండుకునే ఆహారం ఆన్‌లైన్‌లో ఆదాయాన్ని తెచ్చి పెడుతుందని అనుకున్నారా? కానీ ఇప్పుడు మాత్రం ట్రావెలింగ్, మామ్స్‌ కిచెన్‌ పేరుతో బ్లాగ్స్‌ వచ్చి కొత్త కెరీర్‌ను సృష్టించాయి. విద్యార్థికి ఆసక్తి ఉన్న రంగమేదైనా.. అందులో నిష్ణాతులుగా తయారయ్యేందుకు మల్టీ డిసిప్లినరీ విధానం అవకాశం కల్పిస్తుంది. మారుతున్న కాలంతోపాటు కొత్త అవకాశాలు తెరపైకి వస్తున్నాయి. మల్టీ డిసిప్లినరీ విధానం ద్వారా విద్యార్థి సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన, సమయ పాలన, కమ్యూనికేషన్, రచన, విశ్లేషణ, పరిశోధన పద్దతులు, టీమ్‌ వర్క్‌ వంటివెన్నో అంశాలపై పట్టు సాధించవచ్చు. పైగా తనకు ఎందులో ఆసక్తి ఉంటే ఆ రంగంలో రాణించేందుకు... పరిస్థితులు, అవసరం, అవకాశాలను బట్టి తన కెరీర్‌ను మార్చుకునేందుకు, విస్తృత అవకాశాలు అందుకునేందుకు ఈ విధానంలో దోహదం చేస్తుంది.

రెండు మూడు సబ్జెక్టులు..
ప్రస్తుతం దేశంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి కోర్సుల్లో... సాధారణంగా ఇంటర్మీడియెట్‌లో చదివిన కనీసం రెండు లేదా మూడు సబ్జెక్టులను అధ్యయనం చేస్తారు. బీఎస్సీ కెమిస్ట్రీ కోర్సును తీసుకుంటే.. కెమిస్ట్రీ మెయిన్‌ సబ్జెక్టు అయినప్పటికీ.. దానితో సమానంగా ఫిజిక్స్, మ్యాథ్స్‌ లేదా బయాలజీ చదువుతారు. బీకామ్‌ అయితే.. కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌ లేదా మ్యాథమెటిక్స్‌ చదువుతారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో.. సైన్స్‌/కామర్స్‌/ఆర్ట్స్‌లో ఒక్క సబ్జెక్టు (డిగ్రీలో చదివిన వాటిలో ఒకటి)ను మాత్రమే అధ్యయనం చేస్తారు. స్టేట్‌ యూనివర్సిటీల్లో విద్యార్థులు మొదట ఏ కోర్సులో చేరితే డిగ్రీ మొత్తం ఆ కోర్సు సబ్జెక్టులనే చదవాల్సి ఉంటుంది. అలాగే పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలోనూ ఎంచుకున్న స్పెషలైజేషన్‌ను చదివే విధానం కొనసాగుతుంది.

ఇంకా చదవండి: part 1: మల్టీ డిసిప్లినరీ బహుళ నైపుణ్యాలతో కొలువు కొట్టడం సులువు.. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అంటే ఎంటో తెలుసా?

Published date : 26 Mar 2021 03:41PM

Photo Stories