మేటి ఇన్‌స్టిట్యూట్స్‌లో బయోటెక్.. దరఖాస్తుకు చివరి తేది..
ఈ పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో బయోటెక్నాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల్లో చేరే అవకాశం లభిస్తుంది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ప్రతీ నెల స్టైఫండ్ సైతం అందుతుంది. కొవిడ్ కారణంగా గతంలో వాయిదా పడ్డ జీఏటీ–బి 2020కు ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రవేశం కల్పించే కోర్సులు.. అర్హతలు.. పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం..
జీఏటీ-బీ పరీక్ష ద్వారా కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మద్దతున్న ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, ఎంవీ ఎస్సీ, ఎంటెక్ బయోటెక్నాలజీ, అనుబంధ విభాగాల్లో ఎమ్మెస్సీలో ప్రవేశాలు కల్పిస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న 62 భాగస్వామ్య విద్యాసంస్థల్లో 1221 సీట్లలో అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. గతంలో కంబైన్డ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ బయోటెక్నాలజీ (సీఈఈబీ)గా పిలిచే ఈ పరీక్షలను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) నిర్వహించేది.
జీఏటీ–బయోటెక్నాలజీ:
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జీవులు,వాటి నిర్మాణక్రమం, కృత్రిమ జీవజాలం వంటి వాటిపై మానవాభివృద్ధికి తోడ్పడే విధంగా పరిశోధనలు చేసే రంగమే.. బయోటెక్నాలజీ. ఇదో మల్టీడిసిప్లినరీ విభాగం. ప్రస్తుతం బయోటెక్నాలజీ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకొంది. కాబట్టి ఈ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసించిన అభ్యర్థులకు మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. ప్రముఖ విద్యాసంస్థల్లో పీజీ బయోటెక్నాలజీ కోర్సుల్లో చేరాలనుకునే వారికి జీఏటీ–బి చక్కటి మార్గం. ఆయా ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రతినెలా స్టూడెంట్‌షిప్ కూడా లభిస్తుంది.
కోర్సులు–అర్హతలు
- ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ అగ్రిక ల్చర్ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు... డిగ్రీ(10+ 2+3) స్థాయిలో బీఎస్సీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్/ అగ్రి బయోటెక్నాలజీ/ ఫారెస్ట్రీ/ బయోఇన్ఫ ర్మాటిక్స్/సెరీకల్చర్/ మైక్రోబయాలజీ/ బయాలజీ) కోర్సుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
- ఎంటెక్ బయోటెక్నాలజీ/దాని అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు బీఈ/బీటెక్ డిగ్రీ 60 శాతం మార్కులతో పూర్తిచేసి ఉండాలి.
- ఎంవీఎస్సీ యానిమల్ బయోటెక్నాలజీ కోర్సులు చేయాలనుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ స్థాయిలో బీవీఎస్సీ అండ్ ఏహెచ్‌ను 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
పరీక్షా విధానం:
జీఏటీ–బి పరీక్షను ఆన్‌లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తారు. రెండు సెక్షన్(ఏ, బీ)లు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా సమయం మూడు గంటలు.
సెక్షన్–ఎ..
ఇందులో 60 తప్పనిసరి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి సంబంధించి ఇంటర్ లేదా తత్సమాన స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ మెటిక్స్, బయాలజీల నుంచి ప్రశ్నలు అడుగు తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. అలాగే సెక్షన్ ఏలో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు.
సెక్షన్–బి..
ఈ విభాగానికి సంబంధించి 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో ఏవైనా 60 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు లభిస్తాయి. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. సెక్షన్ బిలో ప్రశ్నలు డిగ్రీ స్థాయి బేసిక్ బయాలజీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, అనుబంధ విభాగాల నుంచి అడుగుతారు.
స్టూడెంట్‌షిప్..
ఆయా భాగస్వామ్య ఇన్‌స్టిట్యూట్స్‌లో జీఏటీ–బిలో స్కోర్ ఆధారంగా ప్రవేశం పొందిన విధ్యార్థులకు ప్రతినెలా స్టూడెంట్‌షిప్ లభిస్తుంది. ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ, అనుబంధ విభాగాల విద్యార్థులకు నెలకు రూ.5000, ఎమ్మెస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ వారికి నెలకు రూ.7500, ఎంటెక్/ఎంవీఎస్సీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ.12000 స్టూడెంట్‌షిప్‌గా చెల్లిస్తారు. మొదటి ఏడాది చూపించిన ప్రతిభ ఆధారంగానే తదుపరి ఏడాది స్టూడెంట్‌షిప్ కొనసాగింపు ఆధారాపడి ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం:
- దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 30, 2020
- ఎడిట్ ఆప్షన్ : సెప్టెంబర్ 3–5వ తేదీ వరకు
- అడ్మిట్ కార్డ్ : సెప్టెంబర్ 22, 2020 నుంచి అక్టోబర్ 03,2020 వరకు
- పరీక్ష తేదీ : అక్టోబర్ 03, 2020
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : www.rcb.res.in/GATB.