Skip to main content

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధించండిలా..!

ప్రపంచంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవాలనే ఆశలకు కేరాఫ్.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్!! అందుకే బీటెక్ చదువుతున్న ప్రతి విద్యార్థికి వచ్చే కలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ స్వప్నాలే అధికం.
మరోవైపు.. ‘విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు తక్కువ.. ప్రాక్టికల్ అప్రోచ్‌పై దృష్టిపెట్టడం లేదు.. సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా అంతంతమాత్రమే..!’ అంటూ.. ఇండస్ట్రీ వర్గాల ముక్తాయింపు!! ఈ నేపథ్యంలో పరిశ్రమ కోరుకుంటున్న నైపుణ్యాలేంటి.. ప్లేస్‌మెంట్స్‌లో సక్సెస్‌కు, కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు ఎలాంటి స్కిల్స్ అవసరమో తెలుసుకుందాం...

తాము బీటెక్‌లో చేరిన లక్ష్యాన్ని నేరవేర్చుకోవాలని లక్షల మంది విద్యార్థులు కలలు కంటుంటారు. కానీ, విజయం దక్కేది మాత్రం కొందరికే. ఎందుకంటే.. పోస్టులు తక్కువ... పోటీ ఎక్కువ! దాంతో అత్యుత్తమ నైపుణ్యాలున్న వారికే కంపెనీలు జాబ్ ఆఫర్స్ ఇస్తున్నాయి. ఏఐసీటీఈ, సీఐఐ కలిసి నిర్వహించిన సర్వేలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ గతంతో పోల్చితే కొంత మెరుగయ్యాయని నివేదిక పేర్కొంది. అయితే నేటికీ 48 శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లోపం కారణంగా అవకాశాలు అందుకోలేకపోతున్నారని తెలిపింది. దాన్నిబట్టే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయానికి స్కిల్స్ ఎంత అవసరమో చెప్పొచ్చు.

సృజనాత్మకత :
ఏదైనా ఒక పనిని అప్పగిస్తే సీనియర్లను అనుసరిస్తూ మూసగా పూర్తిచేయడం వైపు ఎక్కువ మంది మొగ్గుచూపుతారు. ఇందుకు భిన్నంగా వినూత్న ఆలోచనలతో, సృజనాత్మకత ఉట్టిపడేలా.. తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో అత్యుత్తమ నాణ్యతతో ఒక పనిని పూర్తిచేసే నైపుణ్యం కలిగిన వారికే కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంటే.. విధి నిర్వహణ సమయంలో అభ్యర్థులు తమదైన శైలిలో వినూత్న ఆలోచనలను ఆవిష్కరించాలి. తద్వారా ఉత్తమ పనితీరు కనబరిచేందుకు కృషిచేయాలి. ఈ సృజనాత్మక ఆలోచనా దృక్పథం (ఇన్నోవేషన్ థింకింగ్) పెరగాలంటే.. ప్రాక్టికల్ అప్రోచ్‌పై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

క్రిటికల్ థింకింగ్ :
ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు ప్రతి అంశాన్ని తులనాత్మకంగా పరిశీలించే నైపుణ్యం కలిగి ఉండాలి. ప్రస్తుత పరిస్థితిల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కొలువులు చేజిక్కించుకునేందుకు ఈ స్కిల్ కీలకంగా మారుతోంది. ఒక టాస్క్ నిర్వహణలో డొమైన్ నాలెడ్జ్‌తోపాటు ఆ టాస్క్ ఉద్దేశం.. అందులో ఉన్న సమస్యలేంటి.. ఎలాంటి టెక్నిక్స్‌తో దాన్ని సులువుగా పూర్తిచేయొచ్చు, తప్పొప్పులు విశ్లేషించే నైపుణ్యం పెంచుకోవాలి. దీన్నే క్రిటికల్ థింకింగ్ అని పేర్కొంటున్నారు.

అప్లికేషన్ ఓరియెంటేషన్ :
ఒక అభ్యర్థిలో సబ్జెక్ట్ నాలెడ్జ్ అపారంగా ఉంది. సబ్జెక్ట్‌కు సంబంధించి ఏ ప్రశ్న సంధించినా.. ఠక్కున సమాధానం చెప్పగలడు. అది సర్టిఫికెట్లో జీపీఏ లేదా పర్సంటేజి రూపంలో ప్రతిబింబిస్తుంది. కానీ.. దాన్ని కార్యక్షేత్రంలో అనువర్తించే నైపుణ్యం లేకుంటే నూటికి నూరు శాతం జీపీఏ ఉన్నా.. ఉద్యోగ సాధనలో జీరోగా నిలవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే.. విధి నిర్వహణ అనేది పూర్తిగా అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో సాగుతుంది. మీకున్న సబ్జెక్ట్ నైపుణ్యాన్ని టాస్క్ నిర్వహణకు అన్వయిస్తేనే ఆ పని విజయవంతమవుతుంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు డొమైన్/సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను వాస్తవ పని వాతావరణంలో అనువర్తించే నైపుణ్యం అలవరచుకోవాలి.

ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ :
ఇటీవల కాలంలో కంపెనీలు అభ్యర్థుల నుంచి కోరుకుంటున్న నైపుణ్యాల్లో అత్యంత ప్రధానమైంది.. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్! విధి నిర్వహణ పరంగా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు.. దానికి కారణాలు విశ్లేషించి మీకున్న నైపుణ్యంతో ఆ సమస్యకు పరిష్కార మార్గాలు చూపాలి. సమస్యకు ఉత్తమ పరిష్కారాన్ని కనుగొనడమే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సంస్థలో చేరిన తర్వాత ఎదురయ్యే సమస్యలు.. వాటిని పరిష్కరించే నైపుణ్యాలు అకడమిక్‌గా ఎలా తెలుస్తాయి అనుకుంటే పొరపాటు. దీనికి కూడా మార్గం ఉంది.. అది ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో కూడిన లెర్నింగ్. ఇందుకు ఇంటర్న్‌షిప్స్ దోహదం చేస్తున్నాయి.

నాలెడ్జ్ అప్‌డేషన్ :
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం సాధించాలన్నా.. కెరీర్‌లో మనుగడ సాగించాలన్నా.. అందుకు ముఖ్యమైన సాధనం.. నిరంతరం నాలెడ్జ్‌ను పెంపొందించుకోవడం! ప్లేస్‌మెంట్స్ సమయంలో కంపెనీలు అభ్యర్థిలో జ్ఞానాన్ని పెంపొందించుకునే దృక్పథాన్ని పరిశీలిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు తమ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీ గురించి నిరంతరం తెలుసుకోవాలి. బేసిక్ నైపుణ్యాలను, లేటెస్ట్ స్కిల్స్‌తో పదును పెట్టుకోవాలి. అలా కాకుండా.. ప్రస్తుతం ఉన్న నాలెడ్‌్ తోనే ముందుకు సాగుదామనుకుంటే.. కొలువులో చేరాక పింక్ స్లిప్ ఆందోళన వెంటాడుతూనే ఉంటుంది. నాలెడ్జ్ అప్‌డేషన్‌పై దృష్టి పెట్టకపోవడం వల్ల దాదాపు 30 శాతం మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

ఇండియా స్కిల్ రిపోర్ట్ ప్రకారం :
  • మొత్తం నియామకాల్లో ఫ్రెషర్స్ 26 శాతం
  • బీటెక్ విద్యార్థుల నియామకం 22 శాతం
  • ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థుల నియామకాలు 19 శాతం
  • అనలిటిక్స్ 24 శాతం, ఏఐ 15 శాతం ప్రొఫైల్స్‌లో నియామకాలు.
  • తాజా నియామకాల్లో ఆటోమేషన్ ప్రభావం 69 శాతం.
ఆటోమేషన్ దిశగా..
ప్రస్తుతం కంపెనీలు ఆటోమేషన్ మంత్రం జపిస్తున్నాయి. అన్ని రంగాలను, విభాగాలను ఆటోమేషన్ వేగంగా చుట్టేస్తోంది. కాబట్టి అభ్యర్థులు ఆటోమేషన్ నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు కృషిచేయాలి. ఆటోమేషన్‌తోపాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు కూడా కీలకంగా మారుతున్నాయి. ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, 3-డి డిజైన్ వంటివి అన్ని రంగాలకు విస్తరిస్తున్నాయి. కాబట్టి డొమైన్‌తో సంబంధం లేకుండా.. అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులు ఈ స్కిల్స్‌పై అవగాహన పెంచుకోవడం మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఈ లేటెస్ట్ టెక్నాలజీపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది.

భావోద్వేగ ప్రజ్ఞ :
సబ్జెక్ట్ నాలెడ్జ్, అప్లికేషన్ స్కిల్స్ వంటి కోర్ వర్క్ రిలేటెడ్ స్కిల్స్‌తోపాటు.. ఇటీవల కాలంలో కంపెనీలు ఉద్యోగార్థుల నుంచి ఆశిస్తున్న మరో నైపుణ్యం.. ఎమోషనల్ కోషియెంట్ (భావోద్వేగ ప్రజ్ఞ). కారణం.. టార్గెట్లు, డెడ్‌లైన్లు, విభిన్న సంస్కృతి నేపథ్యాలు కలిగిన సహచరులున్న బృందాల్లో పనిచేయాల్సిన పరిస్థితుల్లో.. అభ్యర్థుల మానసిక ప్రజ్ఞపైనా ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి. ఉద్యోగులు మానసిక సమతౌల్యం కలిగి ఉండాలని.. పని ప్రదేశంలో పరిపక్వత ప్రదర్శించాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. అందుకే ఉద్యోగార్థుల మానసిక ప్రజ్ఞ, ఇతరులతో సమన్వయంగా ఉండగలరా? వ్యక్తిత్వం ఎలాంటిది వంటి వాటిని కూలంకశంగా పరీక్షిస్తున్నాయి. కాబట్టి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు భావోద్వే గాలను నియంత్రించుకునే నైపుణ్యం అలవరచు కోవాలి.

'రియల్' స్కిల్స్.. ఇవిగో మార్గాలు
సంస్థలు రిక్రూట్‌మెంట్ సమయంలో రియల్ టైం స్కిల్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. అవి ఉంటేనే ఉద్యోగ సాధనలో ముందంజ! మరి వీటిని అందుకునేందుకు మార్గం ఏమిటి.. అంటే... ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్ట్ వర్క్ అని ఠక్కున సమాధానం చెప్పొచ్చు.
ఇంటర్న్‌షిప్స్ :
రియల్ టైం ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ అప్‌డేషన్, స్కిల్స్ అడాప్టబిలిటీ, ప్రాక్టికల్ ఓరియెంటేషన్.. ఇలాంటి నైపుణ్యాల సాధనకు సరైన మార్గం ఇంటర్న్‌షిప్ పూర్తిచేయడం. కోర్సు చదువుతున్నప్పుడే ఏదైనా ఒక సంస్థలో కొద్దికాలం పాటు పనిచేయడమే.. ఇంటర్న్‌షిప్. ఈ సమయంలో విద్యార్థులు సంస్థలో వాస్తవ పనివాతావరణంలో నిజమైన ఉద్యోగిగానే పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్న్ ట్రైనీగా చేసే టాస్క్‌లు, సమస్య పరిష్కారం కోసం సదరు టీమ్ సభ్యులు (సంస్థ ఉద్యోగులు) అనుసరిస్తున్న విధానాలు, వ్యూహాల గురించి తెలుసుకోవడానికి ఆస్కారం లభిస్తుంది. సంబంధిత రంగంలో కొత్త టెక్నాలజీలు, వ్యూహాలపైనా అవగాహన ఏర్పడుతుంది. ఫలితంగా రియల్ టైం నైపుణ్యాలు లభిస్తాయి. ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారు పోటీలో ఒకడుగు ముందున్నట్లే అని గుర్తుంచుకోవాలి.
ప్రాజెక్ట్ వర్క్ :
అకడమిక్‌గా రియల్ టైం నైపుణ్యాలను కల్పించే మరో సాధనం.. ప్రాజెక్ట్ వర్క్. వాస్తవానికి ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చివరి సంవత్సరంలో చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్‌పై చాలామంది విద్యార్థులు పెద్దగా శ్రద్ధ చూపరు. చివరి సంవత్సరంలో అకడమిక్స్ భారం, పరీక్షల్లో మంచి మార్కులు పొందాలనే తపన, ఉన్నత విద్య కోర్సుల ప్రవేశ పరీక్షలకు సిద్ధమవడం తదితర కారణాల వల్ల ప్రాజెక్ట్ వర్క్‌కు ఎక్కువ సమయం కేటాయించరు. అయితే ప్రాజెక్ట్ వర్క్‌ను అంకితభావంతో చేయడం వల్ల వాస్తవ పరిస్థితులపై అవగాహనతోపాటు.. నాలెడ్జ్ అప్‌డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

క్షేత్రస్థాయి నైపుణ్యాలుంటేనే..
సంస్థలు అభ్యర్థుల నుంచి క్షేత్రస్థాయి నైపు ణ్యాలను కోరుకుంటున్నాయనే మాటల్లో నూటికి నూరు శాతం వాస్తవం ఉంది. ఎందుకంటే.. గతంలో మాదిరిగా ఎంపిక చేసుకున్నాక తమ సంస్థ అవసరాలకు తగిన విధంగా శిక్షణ ఇచ్చే విధానాన్ని తగ్గించాయి. అందుకే అకడమిక్‌గానే రియల్ టైమ్ అప్రోచ్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. వీటిని పొందాలంటే.. ఇంటర్న్ షిప్స్, ప్రాజెక్ట్‌వర్క్ వంటి మార్గాలను ఉపయో గించుకోవాలి.
- ప్రొఫెసర్ వై.ప్రదీప్, ప్లేస్‌మెంట్ ఇన్‌ఛార్జ్, ఐఐటీ-హెచ్.
Published date : 06 Oct 2018 03:36PM

Photo Stories