Skip to main content

క్రీడల కోర్సులకుకేరాఫ్...‘ఎన్‌ఎస్‌యూ’

దేశంలో ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, ఏరోస్పేస్ వంటి కోర్సులకు సంబంధిత విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్స్ కోర్సులు అందిస్తున్నాయి.
కానీ, స్పోర్ట్స్ విభాగంలో కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీలు లేవనే చెప్పొచ్చు. ఈ లోటును భర్తీచేసేందుకు కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2018లో మణిపూర్‌లోని ఇంఫాల్‌లో దేశంలోనే తొలి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటైంది. ఈ వర్సిటీ ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో కొనసాగుతోంది. మరోవైపు 325 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్ నిర్మాణం జరుగుతోంది. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 2019-20 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలో నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రత్యేకతలు.. అందిస్తున్న కోర్సులు.. ప్రవేశ ప్రక్రియ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కథనం...

ఎన్‌ఎస్‌యూ ప్రత్యేకత:
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ(ఎన్‌ఎస్‌యూ) అకడెమిక్స్, రీసెర్చ్, అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్, ఇతర సేవలపై ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తోంది. అకడెమిక్స్‌లో భాగంగా స్పోర్ట్స్ కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. స్పోర్ట్స్ కోచింగ్, అథ్లెట్ల ప్రతిభను మెరుగుపరిచేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశ, విదేశీ పరిశోధకులతో కలిసి పనిచేస్తోంది.

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు...
బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ :

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
సీట్లు: 50.
అర్హత: 10+2 లేదా తత్సమానం.
స్పోర్ట్స్: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్‌బాల్, షూటింగ్, స్విమ్మింగ్, వె యిట్ లిఫ్టింగ్.
కోర్సు స్వరూపం: కోర్సులో భాగంగా కోచింగ్ పద్ధతులు, స్పోర్ట్స్ టెక్నిక్స్, ఎక్సర్‌సైజ్ ఫిజియాలజీ, టీచింగ్ మెథడ్స్‌కు సంబంధించిన అంశాల్లో శిక్షణ ఇస్తారు. దీన్ని పూర్తిచేసిన వారికి స్పోర్ట్స్ కోచింగ్‌కు సంబంధించి అత్యుత్తమ పరిజ్ఞానం, నైపుణ్యం సొంతమవుతుంది.

బీపీఈఎస్ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్):
సీట్లు: 50.
కోర్సు వ్యవధి: మూడేళ్లు.
అర్హత: 10+2 తత్సమానం.
కోర్సు స్వరూపం: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ అండ్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌ను ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్‌లో ప్రత్యేక నైపుణ్యాలు అందించేలా రూపొదించారు. దీన్ని పూర్తిచేసిన వారికి స్పోర్ట్స్, ఫిట్‌నెస్, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్, ఫిట్‌నెస్ హెల్త్‌క్లబ్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ రంగంలో ఉపాధి అవకాశాలు ఉంటాయి.

పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు..
ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ :
స్పోర్ట్స్: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
సీట్లు: 30
అర్హతలు: సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ.
కోర్సు స్వరూపం: ఈ ప్రోగ్రామ్ ద్వారా స్పోర్ట్స్ కోచింగ్ సిద్ధాంతాలు, పద్ధతులు, పని-పరిశోధనలు, విలువలకు సంబంధించిన అంశాల్లో శిక్షణ ఇస్తారు. దీన్ని పూర్తిచేయడం ద్వారా ప్రపంచస్థాయి స్పోర్ట్స్ కోచింగ్ స్కిల్స్ అలవడతాయి. అన్ని క్రీడా విభాగాల్లో అర్హత, వినూత్నత కలిగిన శిక్షకులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ డిమాండ్ నెలకొంది.

ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ :
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
సీట్లు: 20.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
కోర్సు స్వరూపం: మనసు మానవ ప్రవర్తనపై ఎలా ప్రభావం చూపుతుంది.. స్పోర్ట్స్‌లో ప్రదర్శనపై దాని ప్రభావంపై తదితర అంశాల గురించి ఈ కోర్సులో భాగంగా శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా వేర్వేరు క్రీడల్లో మానసిక ప్రభావాలను అంచనా వేసేలా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి టీచింగ్, రీసెర్చర్, కౌన్సెలర్, థెరఫిస్టుగా కెరీర్ అవకాశాలు లభిస్తాయి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు ఖరారు చేస్తారు.

ప్లేస్‌మెంట్ సెల్ :
సంప్రదాయ యూనివర్సిటీల తరహాలో స్పోర్ట్స్ యూనివర్సిటీ సైతం ప్లేస్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేసింది. ఇది వివిధ పరిశ్రమలు, స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్, స్పోర్ట్స్ క్లబ్స్, స్పోర్ట్స్ లీగ్స్, గవర్న్‌మెంట్, నాన్ గవర్న్‌మెంట్ ఆర్గనైజేషన్స్-స్కూల్స్‌తో యూనివర్సిటీని అనుసంధానించి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్ అవకాశాలు అందించేందుకు కృషిచేస్తోంది.

ముఖ్య తేదీలు :
యూజీ కోర్సులకు ప్రవేశ పరీక్ష తేదీ: జూలై 4, 5, 6.
పీజీ కోర్సులకు ప్రవేశ పరీక్ష తేదీ: జూలై 8, 9
పూర్తి వివరాలకువెబ్‌సైట్: www.nsu.ac.in
Published date : 29 Jun 2019 08:04PM

Photo Stories