Skip to main content

జనవరి రెండో వారంలో క్యాట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం.. కటాఫ్ ఇలా..

దేశంలో మేనేజ్‌మెంట్ విద్యకు ప్రసిద్ధి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లలో పీజీ చేసినవారికి ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల్లో ఎంతో డిమాండ్.

అలాంటి ఐఐఎంల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరాలంటే.. ‘కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) స్కోరు తప్పనిసరి. నవంబర్ 29న క్యాట్ ఆన్‌లైన్ టెస్ట్ జరిగింది. డిసెంబర్ 8న కీ సైతం విడుదలైంది. వచ్చే నెల(జనవరి) రెండో వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ), రైటింగ్ ఎబిలిటీ టెస్ట్(ఆర్‌ఏటీ) నిర్వహించి ఐఐఎంలు ప్రవేశాలు కల్పిస్తాయి.

జనవరిలో ఫలితాలు!
కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)-2020ను నవంబర్ 29న ఆన్‌లైన్ విధానంలో ఐఐఎం-ఇండోర్ నిర్వహించింది. రెండు లక్షల 20వేల మందికిపైగా హాజరైనట్లు అంచనా. పరీక్ష మూడు స్లాట్‌ల్లో జరిగింది. అభ్యర్థులు రెండు గంటల్లో మొత్తం 76 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి వచ్చింది. చాలామంది విద్యార్థులు క్యాట్ రాసాక.. ప్రశ్న పత్రం కొంత క్లిష్టంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ టెస్ట్ ఫలితాలు జనవరి రెండో వారంలో వెలువడే అవకాశం ఉంది. ఎలాగైనా ఎంబీఏలో చేరాలని నిర్ణయించుకున్న అభ్యర్థులు.. తమకు ఎంత స్కోర్ వస్తుంది.. తదుపరి దశకు సిద్ధమవ్వాలా.. వద్దా అనే ఆలోచనల్లో నిమగ్నమయ్యారు. స్కోర్ ఎంత వస్తుందో స్పష్టతకు రాకుంటే.. తీరా ఫలితాలు వెలువడ్డాక.. తర్వాతి దశ ఎంపిక ప్రక్రియ గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

కటాఫ్ ఎంత?!

  • ఐఐఎంల్లో తదుపరి దశ ఎంపిక ప్రక్రియకు అవసరమైన కనీస స్కోర్‌నే కటాఫ్‌గా పేర్కొంటారు. ఈ సంవత్సరం 90 శాతం నుంచి 70 శాతం మధ్య పర్సంటైల్ సాధిస్తే కాల్ లెటర్ ఆశించొచ్చు అంటున్నారు నిపుణులు. ఆయా ఇన్‌స్టిట్యూట్, రిజర్వేషన్ వర్గాల ఆధారంగా కటాఫ్ మారుతుంది.
  • క్యాట్-2019 ప్రకారం-బెంగళూరు, కోల్‌కతా, లక్నో, ఇండోర్, కొజికోడ్, రాయ్‌పూర్, కాశీ పూర్, తిరుచ్చి, ఉదయ్‌పూర్, అమృత్‌సర్, విశాఖపట్నంలోని ఐఐఎంల్లో 90 శాతం కటాఫ్ ఉన్నవారికి ప్రవేశాలు లభించాయి.
  • రాంచి, రోహ్‌తక్, జమ్ము, బోధ్‌గయా, నాగ్ పూర్, సంబల్‌పూర్, సిర్‌మౌర్ ఐఐఎంల్లో 85 శాతం కటాఫ్ ఉన్నవారికి కూడా అవకాశం లభించింది.
  • క్యాట్ స్కోర్‌ను ఐఐఎంలతోపాటు ఎఫ్‌ఎంఎస్, ఐఐటీలు, ఎండీఐ, ఎన్‌ఐటీఐఈ ముంబయి, ఐఎంటీ వంటి బీస్కూల్స్ కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
  • ఐఐఎంల తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో 70 పర్సంటైల్ ఉన్నా ప్రవేశం దక్కుతోంది.

 

ఇంకా చదవండి: part 2: ఐఐఎంలో సీటు రావాలంటే క్యాట్ స్కోరుతో పాటు ఇవీ ప్రధానమే..!
Published date : 17 Dec 2020 02:39PM

Photo Stories