జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్‌ల్లో.. విజయం వైపు దూసుకెళ్లండిలా..!
ఈ ఏడాది నాలుగు సెషన్‌లుగా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్– ఏప్రిల్ సెషన్ పరీక్షలు.. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి! దాంతో ఏప్రిల్ సెషన్ విద్యార్థులు తమ ప్రిపరేషన్‌కు మరింతగా పదును పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది! ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో బెస్ట్ స్కోర్ సాధించేందుకు నిపుణుల సలహాలు...
జేఈఈ మెయిన్ ఫిబ్రవరి, మార్చి సెషన్‌ల పరీక్షలు ఇప్పటికే ముగిసి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏప్రిల్ సెషన్ పరీక్షలను 27, 28, 29, 30 తేదీల్లో నిర్వహించనుంది. దాంతో విద్యార్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రివిజన్‌కు ప్రాధా న్యమిస్తూ ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తొలి రెండు సెషన్లలో ఇలా..
జేఈఈ–మెయిన్ ఫిబ్రవరి సెషన్‌లో 6.5 లక్షలకు పైగా, మార్చి సెషన్‌లో దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 80శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 15 శాతం వరకూ ఉండొచ్చని అంచనా. వీరిలోనూ రిపీటర్స్ (మరోసారి హాజరైన) సంఖ్య 75 నుంచి 80 శాతం మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. అంటే..ఫిబ్రవరి సెషన్‌లో ఆశించిన మార్కులు రాలేదనే అభిప్రాయంతో లేదా మరింత మంచి స్కోర్ సాధించాలనే లక్ష్యంతో మార్చి సెషన్‌కు హాజరై ఉంటారు. ఏప్రిల్ సెషన్‌లోనూ.. గత రెండు సెషన్లతో పోల్చితే అభ్యర్థుల సంఖ్య పది శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ సెషన్‌లోనూ రిపీటర్స్ సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.
97–98 పర్సంటైల్..
విద్యార్థులు తమకు నచ్చిన లేదా బెస్ట్ బ్రాంచ్‌లో సీటు సొంతం చేసుకోవాలంటే..జేఈఈ–మెయిన్‌లో కనీసం 97 నుంచి 98 పర్సంటైల్ సాధించాలని నిపుణుల అంచనా. ఈ పర్సంటైల్ రావాలంటే.. మొత్తం 300 మార్కులకు 120 నుంచి 150 మా ర్కుల వరకూ సాధించాల్సి ఉంటుంది. అంటే.. కనీసం 50 శాతం మార్కులు సొంతం చేసుకునే విధంగా కృషిచేయాలి. అప్పుడే జనరల్ కేటగిరీలో ఎన్‌ఐటీల్లో కోరుకున్న బ్రాంచ్‌లో సీటు దక్కే అవకాశం ఉంటుంది. రిజర్వ్‌డ్ కేటగిరీ విద్యార్థులు కోరుకున్న సీటు కోసం 95 నుంచి 96 పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది.
ఒత్తిడి లేకుండా..
ఫిబ్రవరి, మార్చి సెషన్‌లలో ఆశించిన మార్కులు పొందని విద్యా ర్థులు, అదే విధంగా తొలిసారిగా ఏప్రిల్ సెషన్‌లోనే జేఈఈ– మెయిన్‌కు హాజరవుతున్న విద్యార్థులు.. గత రెండు విడతల ఫలితాలను చూసి ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంది. నిర్దిష్ట వ్యూ హంతో అడుగులు వేస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ఏప్రిల్ సెషన్‌కు సన్నద్ధత పొందొచ్చని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఫలి తంగా మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తూ..
ఏప్రిల్ సెషన్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థులు.. ముందుగా.. ఫిబ్ర వరి, మార్చి సెషన్‌ల పరీక్షల ప్రశ్న పత్రాలను, వాటిలో సబ్జెక్ట్‌ల వారీగా వెయిటేజీ ఎక్కువగా ఉన్న అంశాలను పరిశీలించాలి. ఫిబ్ర వరి, మార్చి సెషన్‌లను పరిశీలిస్తే.. అధిక శాతం ప్రశ్నలు కాన్సెప్ట్, ఫార్ములా ఆధారిత ప్రశ్నలే అడిగారు. కాబట్టి ప్రిపరేషన్ సమ యంలో ఆయా టాపిక్స్‌కు సంబంధించి కాన్సెప్ట్‌లపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. ప్రశ్నలను ఫార్ములా ఆధారంగా ప్రాక్టీస్ చేయడం, అప్లికేషన్ అప్రోచ్‌తో సాధించడం చాలా ముఖ్యం.
రోజు వారీ ప్రణాళిక..
ప్రస్తుతం ఏప్రిల్ సెషన్‌కు అందుబాటులో ఉన్న సమయంలో విద్యార్థులు తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని బేరీజు వేసుకొని.. రోజు వారీ ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రతి రోజు మూడు సబ్జెక్ట్‌లకు సమాన సమయాన్ని కేటాయించుకోవాలి. సులభంగా ఉండే సబ్జెక్ట్‌కు కొంత తక్కువ సమయం వెచ్చిస్తూ.. క్లిష్టంగా భావించే సబ్జెక్ట్‌కు కొంత ఎక్కువసేపు చదువుకోవాలి. ప్రస్తుత సమయంలో క్లిష్టంగా ఉండే అంశాల కోసం ఎక్కువ సమయం కేటాయించడం కంటే.. సులభంగా ఉండే అంశాలపై మరింత పట్టు సాధించడం మేలు. కష్టమైన అంశాల కాన్సెప్ట్‌లను, ఫార్ములాలను అభ్యసించడం మర్చిపోవద్దు.
రివిజన్‌కు ప్రాధాన్యం..
ప్రస్తుత సమయంలో విద్యార్థులు మూడు సబ్జెక్ట్‌లకు సంబంధించి రివిజన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిరోజు ఆయా అంశాలను చదువుతూనే.. అప్పటివరకు చదివిన టాపిక్స్‌ను కూడా ప్రతిరోజు రివిజన్ చేసుకోవాలి. రివిజన్ సమయంలోనూ షార్ట్ నోట్స్, రెడీ రెకనర్స్‌ను అనుసరించాలి. తద్వారా రివిజన్ మరింత సమర్థంగా పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది.
లోపాలు సరిదిద్దుకుంటూ..
ఫిబ్రవరి, మార్చి సెషన్‌లలో ఆశించిన ఫలితం రాక.. ఏప్రిల్ సెషన్‌కు హాజరవుతున్న విద్యార్థులు.. తొలి రెండు సెషన్‌ల పరీక్షల ఫలితాలను విశ్లేషించుకోవాలి. తాము ఏఏ అంశాల్లో పొరపాట్లు చేశామో గుర్తించాలి. సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు లేకపోవడం వల్ల పొరపాట్లు చేశామా? లేదా పరీక్ష ఒత్తిడితో తప్పులు చేశామా.. అనే కోణంలో విశ్లేషించుకోవాలి. సబ్జెక్ట్‌పై అవగాహనలేమితో పొర పాట్లు చేసుంటే.. ఇప్పుడు ఆయా అంశాలపై పూర్తిస్థాయి సన్నద్ధత సాధించేందుకు కృషి చేయాలి. సబ్జెక్ట్‌లోని టాపిక్స్‌కు పరీక్షలో ఉన్న ప్రాధాన్యం ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి.
మాక్ టెస్ట్‌లు..
విద్యార్థులు మాక్ టెస్ట్‌లు, వీక్లీ టెస్ట్‌లకు హాజరు కావడం చాలా ముఖ్యమని గుర్తించాలి. పరీక్షకు వారం రోజుల ముందు వరకు మాక్‌టెస్టులు రాసేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. వీటి ఫలితాలను విశ్లేషించుకొని..మరింతగా రాణించాల్సిన అంశాలను గుర్తిస్తూ వాటి ప్రిపరేషన్‌పై దృష్టిసారించాలి.
చివరి వారం..
విద్యార్థులు తమ పరీక్ష తేదీకి ముందు వారం రోజులపాటు పూర్తిగా రివిజన్‌కే సమయం కేటాయించాలి. రాసుకున్న షార్ ్టనోట్స్, ముఖ్యమైన ఫార్ములాల జాబితాను అనుసరిస్తూ.. సంబంధిత∙టాపిక్స్‌ను రివిజన్ చేసుకోవాలి. రివిజన్ సమయంలో విద్యార్థులకు ఒక్కోసారి అంతకుముందు చదివిన అంశాలు జ్ఞప్తికి రాకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురి కాకుండా.. ఆయా టాపిక్స్‌కు సంబంధించిన కాన్సెప్ట్స్, సిద్ధాంతాలు, అప్లికేషన్స్‌ను మరోసారి అవలోకనం చేసుకోవాలి.
పరీక్ష రోజు ఇలా..
- ఎన్ని రోజులు ప్రిపరేషన్ సాగించినా.. పరీక్ష హాల్లో లభించే మూడు గంటల సమయంలో చూపే ప్రతిభపైనే తుది ఫలితం ఆధారపడి ఉంటుంది.
- విద్యార్థులు పరీక్ష రోజున అప్రమత్తంగా వ్యవహరిస్తూనే.. మానసిక ప్రశాంతతో అడుగులు వేయాలి.
- ముందుగా ఆన్‌లైన్‌లో ప్రశ్న పత్రం మొత్తాన్ని పరిశీలించాలి. ఇందుకోసం పది నిమిషాల సమయం కేటాయించేందుకు కూడా సందేహించొద్దు.
- ప్రశ్న పత్రం మొత్తం చూసిన తర్వాత ముందుగా తమకు సులభంగా అనిపించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం ప్రారంభించాలి.
- ఆ తర్వాత ఓ మోస్తరు క్లిష్టత ఉన్న ప్రశ్నలను, చివరగా బాగా క్లిష్టంగా భావించిన ప్రశ్నలవైపు వెళ్లాలి.
- అన్ని ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేశాక.. వాటిని ఒకసారి రివ్యూ చేసుకోవాలి.
- పరీక్ష వ్యవధిలోపు సమాధానాలు మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రివ్యూ ఆప్షన్ ఫలితంగా తాము ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం తప్పుగా రాశామని భావిస్తే..వాటిని మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఛాయిస్ విధానం.. సద్వినియోగం..
ఈ ఏడాది జేఈఈ–మెయిన్ పరీక్ష విషయంలో విద్యార్థులకు కలిసొచ్చే అంశం.. కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన ఛాయిస్ విధానం. సెక్షన్–బిలో పది ప్రశ్నలకుగాను అయిదు ప్రశ్నలకు సమాధానలు ఇస్తే సరిపోతుంది. ఈ ఛాయిస్‌ను ఎంచుకునే విషయంలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మొత్తం ప్రశ్నలను పరిశీలించి తమకు సమాధానం కచ్చితంగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించాలి.
సబ్జెక్ట్ వారీగా.. ఇలా
విద్యార్థులు ఏప్రిల్ సెషన్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో.. సబ్జెక్ట్ వారీగా దృష్టి పెట్టాల్సిన ముఖ్యాంశాలు:
- మ్యాథమెటిక్స్: కోఆర్డినేట్ జామెట్రీ,డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, వెక్టార్స్, ఫంక్షన్స్, ప్రాబబిలిటీ, ఇంటిగ్రేషన్స్.
- కెమిస్ట్రీ: కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హాలైడ్; ఆల్కహాల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌడ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ.
- ఫిజిక్స్: ఎలక్ట్రోడైనమిక్స్; మెకానిక్స్; హీట్ అండ్ థర్మోడైన మిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిజం, సెమీ కండక్టర్స్, అయ స్కాంతత్వం తదితరాలు.
అరవై శాతం మార్కులు తెచ్చుకునేలా..
విద్యార్థులు నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమ పడుతుంటారు. అరవై శాతం మార్కులు సాధించేలా కృషి చేస్తే బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో, బెస్ట్ బ్రాంచ్‌లో సీటు సొంతం చేసుకునే అవకాశం ఉంది. గత ఫలితాలు, ర్యాంకులు, మార్కులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి ఆందోళనకు గురి కాకుండా పరీక్షకు సన్నద్ధమవ్వాలి.
– ఆర్.కేదారేశ్వర్, నిపుణులు