Skip to main content

ఇష్టం లేకుండా చదువుతూ కోర్సు మారాలని ఆలోచించే వారికి గుడ్‌న్యూస్.. నేషనల్ అకడమిక్ క్రెడిట్ బ్యాంక్‌ను ప్రారంభించనున్న యూజీసీ!

ఇష్టం లేని కోర్సులో చేరారా.. ఆ కోర్సు వద్దనుకొని.. మరో కోర్సులో ప్రవేశించాలని భావిస్తున్నారా.. కానీ.. ఇంతకాలం చదివిన సబ్జెక్టులు, సమయం వృథా అవుతుందని ఆందోళన చెందుతున్నారా..?! ఇక ఇలాంటి టెన్షన్‌లకు ఫుల్‌స్టాప్ పెట్టేయొచ్చు.

చేరిన కోర్సు నచ్చకుంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మెచ్చే కోర్సులో చేరిపోవచ్చు. ఇప్పటి వరకూ పొందిన క్రెడిట్స్ కూడా కొత్తగా చేరిన కోర్సులో వచ్చి కలుస్తాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. తాజాగా ప్రతిపాదించిన.. నేషనల్ అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ విధానంతో ఇదంతా సాధ్యం కానుంది! ఈ కొత్త విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. యూజీసీ అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ విధివిధానాలు.. విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు.. క్రెడిట్స్ ట్రాన్స్‌ఫర్స్.. ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు అనుసరించాల్సిన విధానాలపై విశ్లేషణ..

  1. రమేశ్... తనకు ఆసక్తి లేకపోయినా.. తల్లిదండ్రుల ప్రోద్బలంతో ఇంజనీరింగ్‌లో చేరాడు. కానీ అతనికి బీఎస్సీ అంటే ఆసక్తి. మొదటి ఏడాదిలోనే ఇంజనీరింగ్‌లో రాణించలేను అనే అభిప్రాయానికి వచ్చేశాడు. బీఎస్సీలో చేరాలనే ఆలోచన మదిలో మెదులుతూ ఉంది. కానీ.. అప్పటివరకు బీటెక్‌లో పొందిన క్రెడిట్స్, ఏడాది సమయం వృథా అవుతుందని ఆందోళన చెందుతున్నాడు.
  2. విక్రమ్.. బీకాం కోర్సులో చేరాడు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా.. మధ్యలోనే చదువు మానేసి.. ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు మళ్లీ బీకాం కోర్సు కొనసాగించాలని ఆలోచిస్తున్నాడు. కానీ.. ఇందుకోసం మళ్లీ మొదట్నుంచీ చదవాలి, మూడేళ్లు వెచ్చించాల్సి వస్తుందని వెనుకంజ వేస్తున్నాడు.
  3. నరేశ్.. బీఏ హిస్టరీలో చేరాడు. దీంతోపాటు తనకు ఆసక్తి ఉన్న మ్యూజిక్‌లోనూ నైపుణ్యం పొందాలని భావిస్తున్నాడు. అందుకు అవసరమైన కోర్సులో చేరాలనుకుంటున్నాడు. కానీ.. ప్రస్తుత విద్యావిధానం ప్రకారం-ఇది సాధ్యం కాదని తన ఆసక్తికి స్వస్తి పలికాడు.

... ప్రస్తుతం మన దేశంలో రమేశ్, విక్రమ్, నరేశ్ లాంటి విద్యార్థులెందరో కనిపిస్తారు. తల్లిదండ్రులు లేదా స్నేహితుల సలహాతో ఇష్టం లేని కోర్సుల్లో చేరడం.. వాటిలో రాణించలేకపోవడం.. నిరాశలో మునిగిపోవడం వంటివి సర్వసాధారణంగా మారాయి.

  1. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో.. గతేడాది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా-యూజీసీ నేషనల్ అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా.. ‘ది యూజీసీ(ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ స్కీమ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్) రెగ్యులేషన్స్-2021 పేరుతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది.


మన దేశంలో ఉన్నత విద్య పరంగా చూస్తే.. ఎంతోమంది విద్యార్థులకు తాము చేరిన కోర్సులపై ఆసక్తి లేక.. మరో కోర్సులో చేరాలని కోరుకుంటున్నారు. కాని ఎంతో విలువైన సమయం, చదివిన సబ్జెక్టులు వృథాగా పోతాయని మధనపడుతున్నారు. ఇలాంటి వారికి ప్రయోజనం చేకూరేలా.. యూజీసీ ఈ కొత్త విధానానికి రూపకల్పన చేసింది. దాంతోపాటు విద్యార్థుల్లో మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ పెంపొందించే దిశగా కసరత్తు చేస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా జాతీయ విద్యావిధానం-2020లో పేర్కొన్న సిఫార్సులకు అనుగుణంగా.. డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెటుకొని.. నేషనల్ అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ (న్యాక్-బ్యాంక్) అనే కొత్త విధానానికి తెరతీసింది.. యూజీసీ!

ఇంకా చదవండి: part 2: నేషనల్ అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ అంటే.. ఎంటో తెలుసుకోండిలా..

Published date : 17 Feb 2021 01:53PM

Photo Stories