Skip to main content

ఇంజనీరింగ్‌లో ఓపెన్ బుక్ పరీక్ష విధానం..!

ఇంజనీరింగ్ పరీక్షల్లో నూతన విధానం అమల్లోకి వచ్చే అవకాశముంది.
 పుస్తకాలతో కుస్తీపట్టి గుర్తుంచుకుని రాయడానికి బదులుగా.. పుస్తకాలను చూస్తూ సమాధానాలు రాసే సరికొత్త పరీక్ష విధానానికి ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) అనుమతినిచ్చింది. విద్యార్థుల్లో ఆలోచన నైపుణ్యాన్ని, అప్లికేషన్ ఓరియెంటేషన్ (అనువర్తిత దృక్పథం)ను పెంపొందించేందుకు ఓపెన్ బుక్ విధానం ఉపయోగపడుతుందని ఏఐసీటీఈ భావిస్తోంది. ప్రస్తుతం పరీక్షల విధానంలో అనేక బలహీనతలు ఉన్నాయని.. బట్టీ విధానాన్ని ప్రోత్సహిస్తోందని పేర్కొంది. అందుకే విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేలా ఓపెన్ బుక్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యలో ఓపెన్ బుక్ విధానం సాధ్యాసాధ్యాల గురించి విశ్లేషణ...

‘ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్స్(ఓబీఈ)’ విధానంలో విద్యార్థులు పరీక్ష గదిలోకి.. అనుమతించిన పుస్తకాలు, లెక్చర్ నోట్స్, ఇతర మెటీరియల్‌ను తీసుకెళ్లవచ్చు. అంటే.. విద్యార్థులు పుస్తకాల్లో చూసి పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. ఓపెన్ బుక్ విధానాన్ని అమలుచేసే దిశగా ఆలోచన చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ కొద్దిరోజుల క్రితం సూచించింది. విద్యార్థి ప్రతిభను గుర్తించే పలు విధానాల్లో ఓపెన్ బుక్ విధానం కూడా ఒకటని.. దీన్ని ఏ ఏ కోర్సులు, ఏ ఏ సబ్జెక్టులకు అమలు చేయాలో జాగ్రత్తగా ఆలోచించి సొంతంగా నిర్ణయం తీసుకోవాలని.. వర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లకు ఏఐసీటీఈ సూచించింది.

ఓపెన్‌బుక్‌పై భిన్నాభిప్రాయాలు...
ఏఐసీటీఈ పేర్కొన్న ఓపెన్ బుక్ విధానంపై.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గుతుందనే భావన ఒకవైపు వ్యక్తమవుతుంటే.. ఓపెన్ బుక్ పరీక్ష విధానం అమలు అంత సులువు కాదనే వాదన మరోవైపు వినిపిస్తోంది. ఓపెన్ బుక్ విధానం అమలు జరగాలంటే.. సమర్థవంతమైన బోధనా సిబ్బంది అవసరమని నిపుణులు చెబుతున్నారు. అసలే అరకొర ఫ్యాకల్టీతో నెట్టుకొస్తున్న విద్యాసంస్థలు.. ఓపెన్ బుక్ పరీక్ష విధానాన్ని అమలు చేయడం అంత తేలిక కాదని హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఫ్యాకల్టీ ఒకరు అభిప్రాయపడ్డారు.

లోతుగా చదివితేనే..
మన దేశంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. వీరందరికీ నైపుణ్యమున్న ఫ్యాకల్టీ బోధిస్తేనే వారు ఓపెన్ బుక్ విధానంలో రాణించగలరు. ఎందుకంటే... ఓపెన్ బుక్ విధానంలో ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి.. వాటిని అనువర్తిత విధానం అవలంభించడం ద్వారా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అంటే.. సబ్జెక్టుపై లోతైన అవగాహన ఉన్న విద్యార్థులు మాత్రమే పరీక్షల్లో రాణించగలరు. ‘ఓపెన్ బుక్ విధానంలో అడిగే ప్రశ్నలు నేరుగా సమాధానాలు రాసేలా ఉండవు. ప్రతి ప్రశ్న విద్యార్థి తార్కికంగా ఆలోచిస్తూ అప్లికేషన్ ఓరియెంటేషన్‌లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. విద్యార్థికి సదరు సబ్జెక్టుపై సంపూర్ణ పట్టు ఉంటేనే సమాధానాలు రాయగలరు. అలానే, బోధించే ఫ్యాకల్టీ కూడా విద్యార్థులకు పాఠాలను లోతుగా చెప్పాల్సి ఉంటుంది. మన దగ్గర కాలేజీల్లో నాణ్యమైన ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉంది. ఫలితంగా విద్యార్థులు నేర్చుకొనే అవకాశం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మన విద్యావిధానం మొదట్నుంచీ గుర్తించుకునే (మెమరీ బేస్డ్) మోడల్‌లో ఉంది. కాబట్టి విద్యార్థులు కొత్త విధానానికి అలవాటు పడాలంటే చాలా సమయం పడుతుంది. వారికి ఈ విధానం పట్ల అవగాహన కల్గించడం చాలా అవసరం. అందుకోసం ఫ్యాకల్టీకి కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది’ అని హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వివరించారు.

ఒత్తిడి తగ్గుతుంది :
మరో పేరున్న కాలేజీకి చెందిన ప్రొఫెసర్ మాట్లాడుతూ... ఓపెన్ బుక్ విధానం వల్ల పరీక్షల ఒత్తిడి తగ్గి, జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలు తొలగిపోతాయన్నారు. అంతేకాకుండా కాపీయింగ్, స్లిప్స్ పెట్టి పరీక్షలు రాసే అవకాశం, అవసరం విద్యార్థులకు ఉండదని అభిప్రాయపడ్డారు. కొత్త విధానం వల్ల విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరుగుతుందని చెప్పారు.

బట్టీ వద్దు.. పట్టు సాధించాలి :
మన విద్యావ్యవస్థలో ఎక్కువ శాతం బట్టీ విధానాన్ని నమ్ముకుంటున్నారు. పరీక్షలకు ముందు తీవ్రమైన ఒత్తిడిలో చదివి పరీక్షలు రాస్తున్నారు. మార్కులు వస్తున్నాయి. కానీ, విద్యార్థులు తమ తెలివితేటలకు పదును పెట్టాల్సిన అవసరం ఉండటం లేదు. ఫలితంగా వారు ఉద్యోగ అవకాశాలను పొందలేకపోతున్నారు. గుర్తుంచుకొని పరీక్షలు రాసే విధానానికి స్వస్తి చెప్పడంతోపాటు, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతో కొత్త విధానం రూపొందించినట్లు చెబుతున్నారు.

ప్రశ్నలు వినూత్నం :
ఓపెన్ బుక్ విధానంలో పరీక్షల్లో అడిగే ప్రశ్నలను వినూత్నంగా తయారు చేయాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ప్రశ్నలు రియల్ లైఫ్ పరిస్థితులకు అనుగుణంగా అడగాలని పేర్కొంది. సమగ్ర సమాచారంతో సమాధానాలు రాసేలా ప్రశ్నలు రూపొందించాలని సూచించింది. ఓపెన్ బుక్ విధానంలో రాణించేందుకు విద్యార్థుల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్.. నాలెడ్జ్‌ను అన్వయిస్తూ సమాధానాలు రాయడం.. చదివింది రీకాల్ చేసి రాయడానికి బదులు ఆలోచించి జవాబులు రాయడం.. వంటివి పెంపొందించు కోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకోసం ఆయా సబ్జెక్టులకు ప్రామాణిక పుస్తకాలతోపాటు రిఫరెన్సులను కూడా అధ్యయనం చేయడం తప్పనిసరి అవుతుంది. తరగతులకు రెగ్యులర్‌గా హాజరవుతూ పాఠాలను శ్రద్ధగా వినడం, ప్రొఫెసర్లు చెప్పేది విని నోట్స్ రాసుకోవడం వంటివి చేస్తేనే ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు.

నేర్పుతో రాయాలి..
అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకొని జవాబులు రాసే విధంగా ప్రశ్నపత్రాలు రూపొందించాలని ఏఐసీటీఈ కోరింది. పుస్తకంలో ఉన్న సమాధానం ఎక్కడ ఉందో గుర్తించి రాసే విధంగా ప్రశ్నలు ఉండొద్దని తెలిపింది. విద్యార్థి తన నాలెడ్జ్ ఉపయోగించి, తనకు అందుబాటులో ఉన్న సమాచారంతో, క్రిటికల్ థింకింగ్ నేర్పుతో పరీక్షలు రాసే విధంగా ప్రశ్నలు సిద్ధం చేయాలని సూచించింది. అలానే, ఓపెన్ బుక్ పరీక్ష విధానంలో సమాధానాలు రాయాలంటే.. సమయం ఎక్కువ అవసరమవుతుంది. అందుకు అనుగుణంగా పరీక్ష సమయం పెంచాలని, లేదా ప్రశ్నల సంఖ్య తక్కువగా ఉండే విధంగా చూడాలని ఏఐసీటీఈ పేర్కొంది.

ఓపెన్ బుక్... సవాలే !
ఓపెన్ బుక్ పరీక్ష విధానం వల్ల విద్యార్థులు సబ్జెక్టును బాగా నేర్చుకోగలరు. ఇది స్వయం ప్రతిపత్తి ఉన్న విద్యాసంస్థల్లో, తక్కువ మంది విద్యార్థులు ఉండే కాలేజీల్లో సమర్థంగా అమలు చేయవచ్చు. మన దేశంలో లక్షల్లో ఉండే విద్యార్థులకు మొదటి నుంచి విద్యావిధానం భిన్నంగా ఉంది. కాబట్టి మన విద్యార్థులు తక్షణమే ఓపెన్ బుక్ పరీక్ష విధానానికి అలవాటు పడటం సవాలే. ఓపెన్ బుక్ పరీక్ష విధానంలో ప్రశ్నలకు సమాధానాలు నేరుగా ఉండవు. విద్యార్థి ప్రశ్నలను అర్థం చేసుకొని పుస్తకాలలో క్లూ ఆధారంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అందుకోసం రెగ్యులర్‌గా క్లాసులకు హాజరవుతూ, రెండు, మూడు ప్రామాణిక పుస్తకాలు రిఫర్ చేసి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ముఖ్యం. విద్యార్థులు, ఫ్యాకల్టీల నిష్పత్తి సరిగా లేకపోవడం ఓపెన్ బుక్ పరీక్ష విధానం అమలుకు పెద్ద ఆటంకంగా మారే అవకాశముంది.
- ప్రొఫెసర్ ఎం.కుమార్, ప్రిన్సిపల్,
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ.


ఒత్తిడి తగ్గుతుంది..
ఇంజనీరింగ్‌లో సబ్జెక్టులు, ల్యాబ్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. మధ్యలో ఇంటర్నల్స్, అసైన్‌మెంట్స్, ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయి. సెమిస్టర్‌కు కూడా తక్కువ సమయం ఉంటుంది. క్లాసులో చెప్పే పాఠాలను రివిజన్ చేసుకునే సమయం కూడా లభించదు. అందుకే వన్‌డే చదువులు, ఆల్ ఇన్ వన్‌లు చదివి గుర్తించుకొని పరీక్షలో రాస్తుంటారు. ఓపెన్ బుక్ పరీక్ష విధానం ద్వారా గుర్తుంచుకోవాల్సింది తక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. ఫ్యాకల్టీ చెప్పే పాఠాలను శ్రద్ధగా విని అర్థం చేసుకొని అప్లికేషన్ ఓరియెంటేషన్‌లో పరీక్షలు రాయడం సులువే. ఒక విద్యార్థిగా ఒత్తిడిని కూడా జయించే అవకాశం లభిస్తుంది.
- సాయి, మెకానికల్ ఇంజనీరింగ్.
Published date : 19 Dec 2018 02:33PM

Photo Stories