ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్.. తుది ఎంపికలో మూడు దశలూ కీలకమే..!
జూన్ 28న ఈఎస్ఈ మెయిన్ పరీక్ష జరిగే అవకాశముంది. ప్రిలిమ్స్ను విజయవంతంగా ముగించిన వారు రెండో దశలోనూ సత్తా చాటి.. ఇంటర్వ్యూకు ఎంపికవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా మెయిన్ ప్రిపరేషన్ గైడెన్స్...ఇండియన్ రైల్వేస్, ఇండియన్ స్కిల్ డవలప్మెంట్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ ఆఫ్ ఇంజనీర్స్, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్, బోర్డర్ రోడ్ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో 495 గ్రూప్ ఏ, బీ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్ 25న యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీ రింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిక మ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి మూడంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష జనవరిలో జరిగింది. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఫలితాలు సైతం వెల్లడించింది. తదుపరి దశ మెయిన్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జూన్ 28న జరగాల్సి ఉంది. ప్రిలిమ్స్(500 మార్కులు), మెయిన్(600 మార్కులు), ఇంటర్వ్యూ(200 మార్కులు) మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
మెయిన్ పరీక్ష విధానం…
ప్రిలిమ్స్లో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష ఉంటుంది. ఇది రెండు పేపర్లుగా మొత్తం 600 మార్కులకు జరుగుతుంది. ఒక్కో పేపర్ను 3 గంటల వ్యవధిలో డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
పేపర్ | సబ్జెక్టు | మార్కులు |
పేపర్ 1 | సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ | 300 |
పేపర్ 2 | సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ | 300 |
మొత్తం మార్కులు | 600 |
ప్రత్యేక ప్రణాళిక
కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం విద్యార్థులే కాదు... ప్రపంచమంతా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే అవరోధాలకు నిరుత్సాహ పడకుండా ప్రిపరేషన్ను కొనసాగించిన వారే ఏ పరీక్షలోనైనా విజయతీరాలకు చేరతారు. ఈ దిశగా విద్యార్థులు ప్రత్యేక ప్రిపరేషన్ ప్రణాళికను సిద్ధంచేసుకోవాలి. కోచింగ్కు ప్రత్యామ్నాయ మార్గాలను అందిపుచ్చుకోవాలి. అదే సమయంలో పట్టుదల, కార్యదీక్షలతో అధ్యయనాన్ని కొనసాగిస్తే లక్ష్యం సిద్ధించడం ఖాయం.
ఆ టాపిక్స్ ఇంటి వద్ద ఉండి ప్రిపేరవుతున్నప్పుడే కాదు... తరగతులకు వెళ్తున్నప్పుడు కూడా ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష సిలబస్ను పూర్తి చేయలేకపోతుంటారు. తద్వారా ప్రిపరేషన్ అసంపూర్ణంగా మిగిలిపోయి.. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. కాబట్టి దొరికిన ఈ అదనపు సమయాన్ని ఇప్పటివరకు పూర్తి చేయని టాపిక్స్ కోసం కేటాయించాలి.
అదనంగా…
వాస్తవానికి తరగతి గది బోధన, నేర్చుకున్న అంశాల ద్వారా పరీక్షలో విజయం సాధించొచ్చు. వాటితోపాటు ఇతర అంశాలను కూడా చదివితే పరీక్షలో అదనపు ప్రయోజనం దక్కే అవకాశం ఉంటుంది. ఈ దిశగా ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను రిఫర్ చేయడం, కొత్త కొత్త ప్రశ్నలను సాధించడం వంటివి చేయాలి. ఎన్పీటీఈఎల్ వీడియోలు చూడటం లాభిస్తుంది.
ఆన్లైన్ పరీక్షలు…
పరీక్ష సన్నాహాల్లో ఆన్లైన్ టెస్టులు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి అభ్యర్థులు సాధ్యమైనన్ని ఆన్లైన్ టెస్టులకు హాజరవ్వాలి. తద్వారా స్వీయ సన్నద్ధతపై అవగాహన ఏర్పడుతుంది. అలాగే సబ్జెక్టులోని ఏయే అంశాల్లో వెనుకబడ్డామో తెలుసుకొని వాటిపై దృష్టిపెట్టేందుకు వీలవుతుంది.
ప్రశాంతంగా…
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఓ దీర్ఘకాలిక ప్రక్రియ. ఈ ప్రయాణంలో అనేక అంశాలు అభ్యర్థుల మార్గానికి అడ్డుపడుతుంటాయి. ఇందులో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి.. నిరుత్సాహం కలిగించేవీ ఉంటాయి. కాబట్టి పరీక్షార్థులు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. క్రమంతప్పకుండా యోగా, వ్యాయామం చేస్తూ మానసిక ఉల్లాసం పొందాలి.
కీలక పాయింట్లు….
ఈఎస్ఈ మెయిన్ను విజయవంతంగా ముగించాలంటే.. కింది అంశాలపై దృష్టిపెట్టక తప్పదు. అవి.. –సబ్జెక్టుల కాన్సెప్టులపై అవగాహన, – ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యం, – రైటింగ్ స్కిల్స్, – పాత అంశాలతోపాటు కొత్త అంశాల అధ్యయనం, – ఈఎస్ఈ మెయిన్ పరీక్ష శైలిపై అవగాహన.
సాధారణంగా చేసే పొరపాట్లు..
ఈఎస్ఈ మెయిన్లో విద్యార్థులు సాధారణంగా చేస్తున్న పొరపాట్లు..
- గుడ్డిగా ఇతరులు చెప్పింది అనుసరించడం,
- సిలబస్పై అవగాహన లేమి
- ప్రాక్టీస్ చేయకపోవడం వంటివి.
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మూడు దశల్లో జరుగుతుంది. ఇందులో ప్రిలిమ్స్కు 500, మెయిన్స్కు 600, ఇంటర్వ్యూకి 200 మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్ల్లో కలిపి (500+600=1100) నిర్దిష్ట మార్కులు పొందిన వారినే ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో 200 మార్కులు కలుపుకుంటే.. మొత్తం 1300 మార్కులకు అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా విజేతలను ప్రకటిస్తారు.