Skip to main content

ఇంజనీరింగ్ కాలేజీ, బ్రాంచ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కాలేజీ ముఖ్యమా.. బ్రాంచ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలా?! ఇంజనీరింగ్ ఔత్సాహికుల్లో చాలామందికి ఎదురయ్యే ప్రశ్న ఇది! పేరున్న మంచి కాలేజ్‌లో చేరాలా (లేదా) కాలేజీ ఓ మోస్తరుగా ఉన్నా ఫర్వాలేదుగానీ ఇష్టమైన బ్రాంచ్‌కు ఓటేయాలా..? జేఈఈ, ఎంసెట్ తదితర ఎంట్రెన్స్ టెస్టులు రాసి.. ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటున్న విద్యార్థుల ముందున్న ప్రశ్న! ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. ఎందుకంటే.. ఇప్పుడు తీసుకునే నిర్ణయం రాబోయే నలభై ఏళ్ల కెరీర్‌ను నిర్ణయిస్తుంది.
అందుకే ఇంజనీరింగ్‌లో చేరబోయే విద్యార్థులు కాలేజీ, బ్రాంచ్ ఎంపికలో ఆచితూచి అడుగేయాలంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాలేజీ, బ్రాంచ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం...

కాలేజ్ వర్సెస్ బ్రాంచ్.. వాస్తవానికి రెండూ ముఖ్యమే. కాబట్టి ఈ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఎందుకంటే.. కాలేజీ లేదా బ్రాంచ్ నిర్ణయంతో యావత్ భవిష్యత్తు కెరీర్ ప్రయాణం ముడిపడి ఉంటుంది. అంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టి విద్యార్థులు అనేక ప్రమాణాలను పరిశీలించి, పలువురిని సంప్రదించి తుది నిర్ణయానికి రావాలి. ముందు కాలేజ్, బ్రాంచ్ ఎంపికలో పరిశీలించాల్సిన, ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలపై అవగాహనకు వస్తే... తుది నిర్ణయం తేలికవుతుంది.

కాలేజ్ ఎంపిక.. ఇవెంతో కీలకం!
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిలో అధిక శాతం కాలేజీలు విద్యార్థుల్లో సరైన విషయ పరిజ్ఞానం,సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించకుండానే ఇంజనీరింగ్ డిగ్రీలు అందిస్తున్నాయి. సదరు కాలేజీలన్నీ ఏఐసీటీఈ గుర్తింపు కలిగినవి కావడం గమనార్హం. కాబట్టి కాలేజ్ ఎంపికలో ఏమరపాటు అస్సలు పనికిరాదు.
  • ఇంజనీరింగ్‌లో చేరాలనుకొనే విద్యార్థులు ‘కాలేజ్’ఎంపికకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. మంచి కాలేజీ విద్యార్థులను సరైన దిశలో నడిపిస్తుంది. ఉత్తమ కాలేజీలు అత్యుత్తమ విద్యా, బోధన విధానాలు కలిగుంటాయి. సదరు కాలేజీల్లో చదవడం ద్వారా విషయ పరిజ్ఞానం, పోటీతత్వం పెంపొందుతాయి.
  • ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో చేరడం ద్వారా అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల గెడైన్స్‌లో విద్య అభ్యసించే అవకాశం దక్కుతుంది. సాంకేతిక నైపుణ్యాలతోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో శిక్షణ లభిస్తుంది. ఫలితంగా విద్యార్థులు ఆల్‌రౌండర్లుగా తయారవుతారు.

ప్లేస్‌మెంట్స్..
ఇంజనీరింగ్ విద్యలో అత్యంత కీలకం.. కోర్సు చివర్లో జరిగే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్! కాలేజ్ వర్సెస్ బ్రాంచ్‌లో... కాలేజ్‌ను రెండు మెట్లు పైన నిలిపే అంశమిది. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన కాలేజీలు, నైపుణ్యాల లేమితో బయటకు వస్తున్న విద్యార్థులు... ఫలితంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం పెరిగింది. కాబట్టి బలమైన ఆసక్తి, స్వీయ వ్యక్తిగత దృక్పథాలు ఆ దిశగా ఉంటే తప్ప ఏదో ఒక ప్రత్యేక బ్రాంచ్ కోసం మంచి కాలేజ్‌ను త్యాగం చేయకూడదు అంటున్నారు నిపుణులు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కొన్ని కాలేజీలకే పరిమితవడం తెలిసిందే. కాలేజ్ ఎంపికలో ‘ప్లేస్‌మెంట్స్’అంశానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగా కాలేజీల ప్లేస్‌మెంట్స్ సరళిని పరిశీలించాలి. మంచి కాలేజీలను ఎంపిక చేసుకోవడం ద్వారా ప్లేస్‌మెంట్స్‌తోపాటు ఇంటర్న్‌షిప్ పరంగా విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుంది.

ఫ్యాకల్టీ :
కాలేజీ ఎంపికలో ముందుగా ఫ్యాకల్టీ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. సదరు కాలేజీలో అర్హులైన, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అనేది పరిశీలించాలి. మంచి ఫ్యాకల్టీ ఉండి, బోధన బాగుంటే.. విద్యార్థికి అవసరమైన విజ్ఞానం లభిస్తుందని భావించొచ్చు.

టాప్ కాలేజీలో.. బ్రాంచ్ బాగుందా?
కాలేజీ ఎంపికలో బ్రాంచ్ సైతం కీలకమే. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్ అయినంత మాత్రాన సదరు కాలేజీలోని అన్ని బ్రాంచ్‌ల బోధన బాగుండాలని లేదు. బ్రాంచ్‌ల పరంగా ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లుసైతం వెనుకబడిన పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణకు ఒక కాలేజీలో మెకానికల్, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్‌లు అత్యుత్తమంగా ఉండి..సివిల్ ఇంజనీరింగ్‌లో సరైన పరికరాలు, ఫ్యాకల్టీ ఉండకపోవచ్చు. కేవలం కాలేజీకున్న పేరు చూసి..సదరు కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో చేరితో ఇబ్బంది పడే అవకాశముంది. కాబట్టి విద్యార్థులు బ్రాంచ్‌ల పరంగా తగిన అధ్యయనం చేయాలి. మంచి కాలేజీలో.. సదరు బ్రాంచ్ పరిస్థితి బాగాలేకుంటే నిర్ణయం మార్చుకోవాలి.

మౌలిక వసతులు..
కాలేజీ ఎంపికలో ల్యాబ్‌లు, లైబ్రరీలు, కంప్యూటర్ అందుబాటు, ఇంటర్న్‌షిప్ అవకాశాలను పరిశీలించాలి. దీంతోపాటు కాలేజీ పట్టణంలో ఉందా, లేదా గ్రామీణ ప్రాంతంలోనా అనే విషయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు పట్టణ ప్రాంతంలోని కాలేజీలో చేరడం ఉత్తమం. ఎందుకంటే.. భవిష్యత్‌లో అవసరమైన ఇంటర్న్‌షిప్, ఉద్యోగ అవకాశాలు, సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ పొందడం వంటి వాటికి పట్టణ ప్రాంతం అనువుగా ఉంటుంది.

ఇతర ప్రామాణికాలు..
ఇంటి నుంచి దూరం, కాలేజీకి గుర్తింపు(అక్రిడేషన్), ఫీజులు,స్టూడెంట్-టీచర్ రేషియో, ప్రభుత్వ కాలేజీనా, ప్రైవేటు ఇన్‌స్టిట్యూటా, స్కాలర్‌షిప్ లభించే అవకాశం ఉందా, పరిశ్రమలో కాలేజీకి ఉన్న పేరు, ఆయా సర్వేల్లో సాధించిన ర్యాంకు, కాలేజీ క్యాంపస్ వాతావరణం వంటి అంశాలను విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బ్రాంచ్ ఎంపిక... ఇష్టమే ప్రధానమా?
స్వీయ ఆసక్తి, ఇష్టాల ప్రకారం నడుచుకోవాలి.. బ్రాంచ్ ఎంపికలో తరచూ వినిపించే మాట! ఇది వాస్తవమే... ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎంపికలో వ్యక్తిగత ఆసక్తి, ఇష్టాలకు ప్రాధాన్యమివ్వాలి. కానీ, సదరు స్వీయ ఇష్టాలు.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని పరిశీలించడం కూడా ముఖ్యమే. వ్యక్తిగత ఆసక్తులను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషిస్తే విద్యార్థులకు స్పష్టత లభిస్తుంది.

సర్క్యూట్, నాన్ సర్క్యూట్ :
  • విద్యార్థులు బ్రాంచ్ ఎంపికలో సర్క్యూట్, నాన్ సర్క్యూట్ బ్రాంచ్‌ల కోణంలో విశ్లేషించాలి. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితరాలను సర్క్యూట్ బ్రాంచ్‌లుగా పేర్కొంటారు. అలాగే సివిల్, మెకానికల్, ప్రొడక్షన్, కెమికల్, టెక్స్‌టైల్, మైనింగ్‌లను నాన్ సర్క్యూట్ బ్రాంచ్‌లుగా పిలుస్తారు.
  • ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, హైడ్రాలిక్, మ్యాగ్నెటిక్ తదితర సర్క్యూట్‌లు, మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, టెక్నాలజీపై ఆసక్తి ఉన్నవారు సర్క్యూట్ బ్రాంచ్‌లను ఎంచుకోవడం లాభిస్తుంది. సర్క్యూట్ అంశాలపై ఆసక్తి లేని వారు అభిరుచుల మేరకు నాన్ సర్క్యూట్ బ్రాంచ్‌ల వైపు వెళ్లొచ్చు.

ఆ రెండు బ్రాంచ్‌లేనా !
  • ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్‌ఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పట్ల విద్యార్థుల్లో క్రేజ్ నెలకొంది. ఇంజనీరింగ్ ఔత్సాహికులను మీకిష్టమైన బ్రాంచ్ ఏది అని అడిగితే 70 శాతం మంది పెరైండు బ్రాంచ్‌లనే పేర్కొంటారనడంలో సందేహం లేదు. వాటిలో సీటు దక్కకుంటేనే ఇతర బ్రాంచ్‌ల వైపు చూస్తున్నారు. వీరందరికీ నిజంగా కంప్యూటర్ ఇంజనీరింగ్‌పై వాస్తవిక ఆసక్తి ఉందా? రాణించే సామర్థ్యం ఉందా అంటే.. సమాధానం ప్రతికూలమే!
  • జాబ్ మార్కెట్లో కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీలకు క్రేజ్ ఉంది. కాబట్టి సదరు బ్రాంచ్‌లు చదివితే ఆకర్షణీయమైన ప్యాకేజీలను సొంతం చేసుకోవచ్చనే భావన ఉంది. కంప్యూటర్ సైన్సు చదివిన ప్రతి ఒక్కరికీ ఉత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తాయని అనుకోవడం కూడా సరికాదు. ప్రోగ్రామింగ్, కోడింగ్, కంప్యుటేషన్, డేటాస్ట్రక్చర్, అల్గారిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై ఆసక్తి కలిగినవారు కంప్యూటర్ సైన్స్‌ను ఎంచుకోవడం లాభిస్తుంది. ఈ దిశగా నిపుణుల సలహాలు తీసుకోవడంతోపాటు స్వీయ సామర్థ్యాలపై అవగాహనతో నిర్ణయం తీసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.

బ్రాంచ్ ఏదైనా నైపుణ్యాలుండాలి..
  • ఏదైనా ఒక బ్రాంచ్ పట్ల బలమైన ఆసక్తి (శాస్త్రీయంగా నిర్ధారణ తర్వాత).. చదవాలనే కోరిక ఉన్నవారు... సదరు బ్రాంచ్‌కు సంబంధించి అకడమిక్‌గా పేరున్న కళాశాలలను అన్వేషించాలి. ఇందులో భాగంగా ఆయా కాలేజీలకు ఉన్న గత చరిత్ర, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా జాబితా రూపొందించుకోవాలి. వాటిలో సీటు పొందేందుకు కృషిచేయాలి. ఈ దిశగా సదరు కాలేజీలను ప్రత్యక్షంగా సందర్శించడం లాభిస్తుంది.
  • నిర్దిష్ట బ్రాంచ్‌ల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండి.. మంచి కాలేజీల్లో సదరు బ్రాంచ్‌ల్లో సీటు లభించకుంటే ఓ మోస్తరు కాలేజీలోనైనా ఇష్టమైన బ్రాంచ్‌లో చేరడం ఉత్తమం. ఎందుకంటే.. ఉద్యోగాల పరంగా ప్రతి బ్రాంచ్‌కు జాబ్ మార్కెట్లో అవకాశం ఉంది. కొన్ని బ్రాంచ్‌లు కొంత ముందుండొచ్చు. మరికొన్ని బ్రాంచ్‌లు కాస్త వెనకుండొచ్చు. కానీ, నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం పెంపొందించుకున్న అభ్యర్థులు బ్రాంచ్‌లకు అతీతంగా అవకాశాలు అందుకోవడంలో ముందుంటారు అనేది నిస్సందేహం.

రెండూ ప్రధానమే..
నచ్చిన బ్రాంచ్‌లో చేరడం ఎంత ముఖ్యమో.. మంచి కాలేజ్‌లో చేరడం కూడా అంతే ప్రధానం! మంచి కాలేజీలో చదవడం ద్వారా విద్యార్థిలో విజ్ఞానం, పోటీతత్వం పెరుగుతుంది. అలాగే ప్లేస్‌మెంట్స్ పరంగానూ కాలేజీకి ఉన్న మంచి పేరు లాభిస్తుంది. బ్రాంచ్ ఎంపికలో ఆసక్తికి తప్పక ప్రాధాన్యమివ్వాలి. ఏ బ్రాంచ్‌లో చేరినా.. తొలి పది మందిలో ఉండేలా కృషిచేయాలి. అప్పుడే సక్సెస్ సాధిస్తారు. కాబట్టి విద్యార్థులు అన్ని అంశాలను పరిశీలించుకొని ఒక నిర్ణయానికి రావడం మంచిది.
- డా. ఎం.కుమార్, ప్రిన్సిపల్, ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్.

క్రేజ్‌లో పడొద్దు..
బ్రాంచ్, కాలేజ్... రెండిట్లో ఏది ప్రధానమనే ప్రశ్నకు నేరుగా సమాధానం లభించదు. ఎంతటి టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా..అన్ని బ్రాంచ్‌లు ఒకే స్థాయిలో ఉండవు. దీనికి ఐఐటీలు సైతం అతీతం కాదు. ఐఐటీ రూర్కీనే తీసుకుంటే..సివిల్ ఇంజనీరింగ్ అత్యుత్తమంగా ఉంటుంది. మిగిలిన బ్రాంచ్‌లు సివిల్ స్థాయిలో ఉండవు. ఐఐటీ ధన్‌బాద్‌లో మైనింగ్ బాగుంటుంది. కంప్యూటర్ సైన్స్ ఆ స్థాయిలో ఉండదు. బ్రాంచ్‌ల విషయంలో యువత క్రేజ్ మాయలో కొట్టుకుపోతోంది. అందరూ కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచ్‌ల్లో చేరాలనుకోవడం మంచిది కాదు. ప్రోగ్రామింగ్, కోడింగ్, సీ, సీ++ లాంగ్వేజెస్, డేటా స్ట్రక్చర్స్, అనలిటికల్ థింకింగ్, ఇంప్లిమెంటేషన్, ఇన్నోవేషన్, కరిక్యులంతోపాటు స్వీయ మార్గాల్లో నాలెడ్జ్ పొందే స్వభావం ఉన్నవారికి కంప్యూటర్ సైన్స్ సరితూగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్‌ల్లో చేరడం ఉత్తమం. మెకానికల్‌కు జర్మనీ వంటి దేశాల్లో మంచి ఆదరణ ఉంది.
- ప్రొఫెసర్ పి.ఎస్.అవధాని, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.
Published date : 15 May 2019 08:43PM

Photo Stories