గ్యారెంటీ కొలువులకు కేరాఫ్... యాక్చూరియల్ సైన్స్
- నలభై ఏళ్ల వ్యక్తి.. పదేళ్ల వ్యవధి గల రూ.5లక్షల జీవిత బీమా తీసుకోవాలనుకుంటే.. ఆ వ్యక్తి చెల్లించాల్సిన ప్రీమియం ఎంత.. గడువు ముగిశాక మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది.. దీనిపై ముందుగానే సంబంధిత బీమా సంస్థ ఏజెంట్ వద్ద సమాచారం ఉంటుంది. ఇదెలా సాధ్యం..
- ఓ ఇన్సూరెన్స్ సంస్థ కొత్త పాలసీని ప్రవేశ పెట్టాలనుకుంది. వినియోగదారుల వయో వర్గం వారీగా చెల్లించాల్సిన ప్రీమియం ఎంత..బీమా పాలసీ ఎంతుండాలి.. పాలసీ ఎక్కువ మందిని ఆకర్షించాలంటే..ఎలాంటి ప్రయోజనాలుండాలి?.. ఎంత బోనస్ ఇవ్వాలి.. ఇవి ఎలా లెక్కించాలి..
- .... ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చేవారే యాక్చూరియల్ నిపుణులు. వీరు సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకొని, మరింత పటిష్టంగా ముందుకు సాగాలంటే.. ఏం చేయాలనే దానిపై దిశానిర్దేశం చేస్తారు. ఈ నైపుణ్యాలను నేర్పించేదే యాక్చూరియల్ సైన్స్ కోర్సు.
భారీ డిమాండ్ :
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ వంటి బీమా సదుపాయాలపై ఆసక్తి చూపుతున్నారు. బీమా సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను తెస్తున్నాయి. వీటిని ప్రవేశపెట్టే ముందే వయోవర్గం వారీగా బీమా, ప్రీమియం, చెల్లించాల్సిన వ్యవధుల(క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, సింగిల్ ప్రీమియం తదితర)పై సమగ్ర సమాచారం సిద్ధం చేసుకోవాలి. ఈ లెక్కలన్నింటినీ గణించే వారే∙యాక్చూరియల్æ నిపుణులు. సంబంధిత నైపుణ్యాలున్న వారికి మన దేశంలోనూ, విదేశాల్లోనూ భారీ డిమాండ్ నెలకొంది.
యాక్చురీల విధులు :
గత అనుభవాలు, వర్తమాన పరిస్థితుల ఆధారంగా అంచనాలను జోడించి.. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను యూక్చూరియల్ నిపుణులు విశ్లేషించాల్సి ఉంటుంది. అలాగే నూతన పాలసీల రూపకల్పన, రిస్క్ మేనేజ్‌మెంట్, సంస్థ ఆర్థిక ప్రణాళికకు సంబంధించి రిస్క్‌ను ముందుగానే అంచనా వేయడం వంటివి వీరి ప్రధాన విధులు. అలాగే ఒక పాలసీని ప్రవేశపెట్టే ముందు సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. సదరు పాలసీ సరైందా.. కాదా.. దీన్ని ప్రవేశ పెట్టొచ్చా.. లేదా.. అనే అంశాలను అధ్యయనం చేసి.. సంస్థకు తగిన సూచనలు చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగ వేదికలు :
లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ, రీ–ఇన్సూరెన్స్ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థల్లో యాక్చూరియల్ ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే అకౌంటింగ్ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ అండ్ హెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, స్టాక్ మార్కెట్లు, సోషల్ సెక్యూరిటీ స్కీంల్లోనూ వీరు కన్సల్టెంట్లుగా పనిచేయొచ్చు. ప్రొడక్ట్ అనలిస్ట్, యాక్చూరియల్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్ హోదాలతో బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, బిజినెస్ కన్సల్టెన్సీలు, ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగా లుంటాయి.
నైపుణ్యాలు :
యాక్చూరియల్ స్పెషలిస్ట్‌గా రాణించేందుకు పలు నైపుణ్యాలు తప్పనిసరి. అవి...
- మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌పై పట్టు
- అనలిటికల్ స్కిల్స్
- డేటావిశ్లేషణ సామర్థ్యాలు
- కాలిక్యులేషన్ స్కిల్స్
- రిపోర్ట్ రైటింగ్ నైపుణ్యాలు
- కమ్యూనికేషన్ స్కిల్స్.
విద్యార్హతలు : ఇంటర్మీడియట్(10+2) లేదా తత్సమాన అర్హత ఉన్న వారు యాక్చూరియల్ సైన్స్ కోర్సులో చేరొచ్చు. ఈ విభాగంలో నిర్వహించాల్సిన విధులన్నీ గణాంకాలు, నిధుల విశ్లేషణకు సంబంధించినవి. కాబట్టి ఇది ఇంటర్‌లో కామర్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లు చదివిన వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. డిగ్రీ స్థాయిలో బీకాం, బీఎస్సీ, బీటెక్ చదివిన వారు... పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా యూక్చూరియల్ కోర్సుల్లో చేరొచ్చు.
అంతర్జాతీయ అవకాశాలు :
యాక్చూరియల్ సైన్స్‌కు సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చూరియస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) అందించే కోర్సులు పూర్తి చేసుకుంటే.. బీమా రంగంలో అంతర్జాతీయ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. సీఏ, ఐసీడబ్లు్యఏ మాదిరిగానే ఐఏఐ కూడా మూడు స్థాయిల్లో పరీక్షలు నిర్వహించి సదరు స్థాయికి అనుగుణంగా మెంబర్‌షిప్ హోదా కల్పిస్తుంది.
అవి..
1. స్టూడెంట్ మెంబర్
2. అసోసియేట్ మెంబర్
3. ఫెలో మెంబర్.
స్టూడెంట్ మెంబర్‌షిప్ వయా ఏసీఈటీ :
ఐఏఐ అందించే మూడు మెంబర్‌షిప్ హోదాల్లో అభ్యర్థులు మొదటగా స్టూడెంట్ మెంబర్‌గా గుర్తింపు పొందాలి. ఇందుకోసం ఈ సంస్థ యాక్చూరియల్æ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏసీఈటీ) నిర్వహిస్తుంది. వంద మార్కులకు ఉండే ఈ పరీక్షను రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. మొదటి విభాగంలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై ప్రశ్నలు అడుగుతారు. రెండో విభాగంలో ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్ అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో కనీసం 50 మార్కులు సాధిస్తే తర్వాతి కోర్ అంశాలకు సంబంధించి నిర్వహించే నాలుగు దశల పరీక్షలకు నమోదు చేసుకునేందుకు అర్హత లభించడంతోపాటు స్టూడెంట్ మెంబర్‌గా గుర్తింపు లభిస్తుంది.
ఏసీఈటీ తర్వాత దశలు :
ఏసీఈటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత.. ఐఏఐ నాలుగు దశల్లో నిర్వహించే పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హత లభిస్తుంది. ఆ నాలుగు దశల వివరాలు..
1. స్టేజ్–1 కోర్ టెక్నికల్: ఇందులో యాక్చూరియల్ స్టాటిస్టిక్స్, యాక్చూరియల్æ మ్యాథమెటిక్స్, యాక్చూరియల్ బిజినెస్ విభాగాల నుంచి తొమ్మిది పేపర్లుంటాయి.
2. స్టేజ్–2 కోర్ అప్లికేషన్: ఈ దశలో యాక్చూరియల్ రిస్క్ మేనేజ్‌మెంట్; మోడల్ డాక్యుమెంటేషన్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్; కమ్యూనికేషన్ ప్రాక్టీస్ పేపర్లలో పరీక్ష రాయాలి.
3. స్టేజ్–3 స్పెషలిస్ట్ టెక్నీషియన్: ఈ దశలో ఎనిమిది పేపర్లుంటాయి. ఈ ఎనిమిది పేపర్లలో ఏవైనా రెండింటిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
4. స్టేజ్–4 స్పెషలిస్ట్ అప్లికేషన్: యాక్చూరియల్æ సైన్స్‌కు సంబంధించి ఐఏఐ నిర్వహించే చివరి దశ. ఇందులో ఆరు పేపర్లుంటాయి. స్పెషలైజేషన్ ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏదో ఒక పేపర్‌ను ఎంచుకొని అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఐఏఐ యాక్చూరియల్ సైన్స్ కోర్సు పూర్తి చేసినట్లే.
అసోసియేట్ మెంబర్ :
ఏసీఈటీ ఉత్తీర్ణత సాధించి స్టూడెంట్ మెంబర్ హోదాతో తర్వాత నిర్వహించే స్టేజ్–1, స్టేజ్–2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే అసోసియేట్ మెంబర్ హోదా లభిస్తుంది. నాలుగు దశలూ పూర్తి చేసుకొని మూడేళ్ల పని అనుభవం గడిస్తే.. ఫెలో మెంబర్ హోదా సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో యాక్చురీ నిపుణుల కొరత ఎక్కువగా ఉన్నందున.. అసోసియేట్ మెంబర్‌షిప్ సర్టిఫికెట్‌తోనే అవకాశాలు లభిస్తున్నాయి. అర్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులు బీమా రంగ సంస్థల్లో సగటున రూ.8 లక్షల వార్షిక వేతనం అందుకునే అవకాశముంది.
కోర్సులను అందించే ఇన్‌స్టిట్యూట్స్ :
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చూరియస్ ఆఫ్ ఇండియా అందించే స్పెషలైజ్డ్ కోర్సుతోపాటు జాతీయ స్థాయిలో పలు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు యాక్చూరియల్æ సైన్స్‌లో సర్టిఫికెట్ నుంచి పీజీ వరకు కోర్సులను అందిస్తున్నాయి. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు బీఏ, ఎంబీఏ, ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌లలో యాక్చూరియల్æ సైన్స్‌ను స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి.
అవి...
1. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్
2. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
3. నేషనల్ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–బెంగళూరు
4. నార్సీమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్
5. క్రిస్ట్ యూనివర్సిటీ– బెంగళూరు
6. అమిటీ యూనివర్సిటీ
7. కురుక్షేత్ర యూనివర్సిటీ.
యాక్చురీ సైన్స్.. ప్రత్యేకతలు :
- అంతర్జాతీయ స్థాయిలో టాప్–25 ఉద్యోగాల్లో యాక్చూరియస్ ఒకటి.
- మన దేశంలో డిమాండ్ – సప్లయ్ మధ్య భారీ వ్యత్యాసం.
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చూరియస్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం– ప్రస్తుతం పది వేల వరకు స్టూడెంట్ మెంబర్స్, 200 వరకు అసోసియేట్స్, 400 వరకు ఫెలో మెంబర్స్‌గా గుర్తింపు పొందారు.
- అసోసియేట్ మెంబర్స్‌కు ప్రారంభంలోనే సగటున రూ.8 లక్షల వార్షిక వేతనం.
ఏసీఈటీ (ఏసెట్) దరఖాస్తు ప్రక్రియ: యాక్చూరియల్ సైన్స్ విభాగంలో అడుగు పెట్టడానికి తొలి దశగా పేర్కొంటున్న ఏసీఈటీ పరీక్ష–2020కి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షను ఈ ఏడాది ఫిబ్రవరి 29న నిర్వహించనున్నారు.
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 28, 2020
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 29, 2020
ఫలితాల వెల్లడి: మార్చి 7, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.actuariesindia.org