Skip to main content

ఎస్‌బీఐలో ఆఫీసర్‌ ఇంట‌ర్వూని క్రాక్ చేయండిలా..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. 3850 సర్కిల్‌ »బేస్డ్ ఆఫీసర్‌(సీబీఓ) కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్‌ సర్కిల్‌లో 550 ఖాళీలు ఉన్నాయి. కొవిడ్‌ పరిస్థితుల కారణంగా ఈసారి రాత పరీక్ష నిర్వహించకుండా.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వూలు నిర్వహించనుంది. దాంతో ఇంటర్వూ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ ఇంటర్వూలో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి తెలిపేలా కథనం...
ఖాళీలు...
సర్కిల్‌ ఖాళీలు
అహ్మదాబాద్‌ 750
బెంగళూరు 750
భోపాల్‌ 400
చెన్నై 550
హైదరాబాద్‌ 550
జైపూర్‌ 300
మహారాష్ట్ర(ముంబై మినహా) 550
మొత్తం 3850

అర్హతలు..
  1. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  2. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకు లేదా రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో ఆఫీసర్‌గా కనీసం రెండేళ్లు పనిచేసి ఉండాలి.
  3. వయసు: ఆగస్టు 1 నాటికి 30 ఏళ్లకు మించరాదు. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
  4. వేతనం: ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో రూ.23,700 మూల వేతనం చెల్లిస్తారు. అన్ని అలవెన్సులూ కలుపుకొని నెలకు రూ.40వేలకుపైగా అందుకునే అవకాశం ఉంది. ఆరు నెలల పాటు సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌గా ప్రొబేషన్‌ ఉంటుంది. ఆ తర్వాత జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌–1 లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ..

  1. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  2. ఇంటర్వూలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్టును తయారుచేస్తారు.
  3. మెరిట్‌ లిస్టును రాష్ట్రం, కేటగిరీల వారీగా రూపొందిస్తారు.
  4. ఎంపిక ప్రక్రియకు సంబంధించి రాత పరీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉంది.


ఇంటర్వూ ప్రిపరేషన్‌..

లోతైన అవగాహన..

బ్యాంకు పేర్కొన్న అర్హతల ద్వారా ఇంటర్వూ ఏ అంశంపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తుందో తెలుసుకోవచ్చు. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలనే నిబంధన ద్వారా బ్యాంకు అనుభవజ్ఞులను నియమించుకోవాలని చూస్తోంది. తద్వారా బ్యాంకింగ్‌ రంగంపై లోతైన పరిజ్ఞానం, అవగాహన ఉన్న వారికే కొలువులని చెబుతోంది.కాబట్టి ఔత్సాహికులంతా సంబంధిత డిపార్ట్‌మెంట్‌ పనితీరు గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఇంటర్వూలో జాబ్‌ ఫ్రొఫైల్‌పై కచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఇంటర్వూ ప్యానెల్‌ వద్ద సానుకూల ఫలితాలు రాబట్టాలంటే.. డిపార్ట్‌మెంట్‌ పనితీరుపై అవగాహన తప్పనిసరి.

గ్రాడ్యుయేషన్‌ను పట్టించుకోండి..

బ్యాంకింగ్‌ కెరీర్‌కు మీ గ్రాడ్యుయేషన్‌ కోర్సు ఎలా ఉపయోగపడింది? అనే ప్రశ్న ఇంటర్వూ ప్యానల్‌ నుంచి ఎదురయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్‌ కోర్సుపై అవగాహన ఉన్నప్పుడే.. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలరు. అలాగే డిగ్రీలో చదివిన సబ్జెక్టులపై బేసిక్‌ ప్రశ్నలను కూడా అడగొచ్చు.కాబట్టి ఆయా అంశాలపై దృష్టిపెట్టాలి.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌..
ఇంటర్వూలో విజయానికి చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తప్పనిసరి. ఇంటర్వూ సందర్భంగా అభ్యర్థి సంభాషణ తుది ఫలితాలను ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు పాజిటివ్‌ అంశాన్ని సైతం నెగిటివ్‌ పదాల్లో చెబితే ఫలితం ప్రతికూలంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒక అధికారిగా మంచి సంభాషణ, చక్కటి ప్రవర్తన కలిగుండాలి. కాబట్టి ప్యానల్‌ సభ్యులు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు అభ్యర్థి కూర్చునే విధానం, హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌లను పరిశీలిస్తారు.

కరెంట్‌ అఫైర్స్‌..
పరీక్ష ఏదైనా కరెంట్‌ అఫైర్స్‌ను విస్మరించలేం. ఇంటర్వూలో అభ్యర్థుల ప్రజెన్స్‌ ఆఫ్‌ మైండ్, అంతర్జాతీయ, జాతీయ వ్యవహారాలు, బ్యాంకింగ్‌ రంగంలో తాజా పరిణామాలు, ఆర్‌బీఐ నిర్ణయాలు, బ్యాంకింగ్‌ రంగంలో సమస్యలు, సవాళ్లు తదితర అంశాలపై అవగాహనను పరీక్షిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగంలోని అంశాలపై లోతుగా ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యసమాచారం..

  1. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  2. దరఖాస్తుకు, ఫీజు చెల్లింపునకు చివరితేదీ: ఆగస్టు 16
  3. దరఖాస్తు ఫీజు: రూ.750; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  4. పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers
Published date : 10 Aug 2020 03:25PM

Photo Stories